Monday, 3 October 2016

|| ప్రపంచలోనే అద్భుతాలు కమ్యూనిస్టు చైనా కట్టడాలు ||



ఆకాశం నుంచి వ్యోమగాములు భూమి మీదకు చూస్తే సన్నని గీత మాదిరిగా కనిపిస్తుంది చైనా గోడ. ఎన్నో శతాబ్దాల క్రితమే ఇంత భారీ కట్టడాన్ని నిర్మించిన ఘనత చైనా సొంతం. ఇదే వారసత్వాన్ని ఈ ఆధునిక ప్రపంచంలోనూ ఆ దేశం కొనసాగిస్తోంది. ప్రపంచం అబ్బురపడే కట్టడాలను నిర్మిస్తోంది. రైల్వే లైన్లు, స్టేషన్లు, వంతెనలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, అత్యాధునిక భవనాలు, పరిశోధనా కేంద్రాలు... ఒకటేమిటి, నిర్మాణ రంగంలో తమను తలదన్నే వారే లేరన్నట్లుగా చైనా మున్ముందుకు దూసుకుపోతోంది. ఎక్కడైనా గ్రామాలు, పట్టణాలు సహజంగా ఏర్పడతాయి. కానీ చైనా కొత్తగా వూళ్లకు వూళ్లే నిర్మిస్తోంది. చైనాలో ఇటీవల నిర్మాణం పూర్తయిన, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న దాదాపు 30 కి పైగా ప్రాజెక్టులు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీటిపై చైనా ప్రభుత్వ సంస్థలు 150 బిలియన్‌ డాలర్ల వరకూ (దాదాపు రూ. 10 లక్షల కోట్లు) వెచ్చిస్తున్నాయి.

# పెరల్‌ రివర్‌ డెల్టాలో మహానగరం #

కొత్త వూళ్లు నిర్మించటంలో చైనా ఘనత తెలియనిదేం కాదు. తాజాగా ఒక భారీ నగరాన్ని ఆవిష్కరించే పనిలో ఆ దేశం నిమగ్నమై ఉంది. చైనా దక్షిణ ప్రాంతంలో పెరల్‌ రివర్‌ డెల్టా ప్రాంతంలో దగ్గర దగ్గరగా తొమ్మిది పట్టణాలు ఉన్నాయి. వీటిని కలిపి ఒకే మెగా సిటీగా ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఇందులో భాగంగా ఆయా పట్టణాల మధ్య భాగంలోని ఖాళీ ప్రదేశాల్లో భారీ నిర్మాణాలు చేపట్టారు. ఈ నగరాల్లో ఇప్పుడున్న జనాభా 4.2 కోట్ల మంది కాగా ఈ మెగాసిటీ ఆవిర్భవించే నాటికి జనాభా సంఖ్య 8 కోట్లకు పెరుగుతుందని అంచనా. దీనిపై 322 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తారు. 2030 నాటికి ఇది పూర్తవుతుంది.

# షాంగై సైకోట్రాన్‌ రేడియేషన్‌ ల్యాబరేటరీ #

శాస్త్రసాంకేతిక ఆవిష్కరణలకు చైనా అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకు అవసరమైన ల్యాబరేటరీలు, ఇతర సౌకర్యాల కోసం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోంది. ఇటువంటి షాంగై సైకోట్రాన్‌ రేడియేషన్‌ ల్యాబరేటరీ. దాదాపు 176 మిలియన్‌ డాలర్లు వెచ్చించి నిర్మించి ఈ ల్యాబ్‌లో ఎంతో ప్రధానమైన పరిశోధనా ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. చైనాలో ఎంతో ఖరీదైన పరిశోధనా కేంద్రం కూడా ఇదే.

# బాల్టిక్‌ పెరల్‌ ప్రాజెక్టు #

చైనా ఇతర దేశాల్లో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ సమీపంలో నివాస, వాణిజ్య భవన సముదాయాన్ని బాల్టిక్‌ పెరల్‌ ప్రాజెక్టు అనే పేరుతో నిర్మిస్తోంది. ఇది 1.3 బిలియన్‌ డాలర్ల భారీ ప్రాజెక్టు. దీన్నొక ఇంజనీరింగ్‌ అద్భుతంగా భావిస్తున్నారు.

# 128 అంతస్తుల షాంగై టవర్‌ #

ఆకాశహర్మ్యాలకు అమెరికా, ఐరోపా దేశాలు పెట్టింది పేరు. కానీ చైనా వాటిని అధిగమిస్తోంది. ప్రపంచంలోనే రెండో అతి పొడవైన భవనం షాంగైలో రూపుదిద్దుకుంది. ‘షాంగై టవర్‌’ అనే పేరుతో నిర్మించిన ఈ భవనం పొడవు 2,078 అడుగులు. దీన్లో 128 అంతస్తులు ఉన్నాయి. ఈ భవన నిర్మాణానికి చైనా 2.4 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది.

# జియాంఝౌ బే బ్రిడ్జి #

దాదాపు 26మైళ్ల పొడవు ఉండే జియాంఝౌ బే బ్రిడ్జి నిర్మాణం శరవేగంగా సాగింది. అన్ని హంగులతో దాదాపు సిద్ధమైంది. దీనికి 16 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టారు. ఇది ఒక మారథాన్‌ పరుగుపందెం నిర్వహించటానికి అనువైన రన్నింగ్‌ ట్రాక్‌ మాదిరిగా ఉంటుందనటంలో ఆశ్చర్యం లేదు.

# సు-టాంగ్‌ యాంగ్‌ట్జీ నదిపై  కేబుళ్ల‌తో..#

సు-టాంగ్‌ యాంగ్‌ట్జీ నదిపై ఎంతో ఆకట్టుకునే రీతిలో తీగల వంతెన (కేబుల్‌ బ్రిడ్జి) నిర్మించారు. దీనికి 7.89 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద తీగల వంతెన. 3,600 అడుగుల పొడవు ఉన్న ఈ వంతెన నాన్‌టాంగ్‌- ఛంగ్‌షు నగరాలను కలుపుతుంది. హాంగ్‌కాంగ్‌-ఝుహై- మకావ్‌ ప్రాంతాలను కలుపుతూ 10.6 బిలియన్‌ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న మరొక వంతెన 2017 నాటికి పూర్తవుతుంది.

# వుహాన్‌ రైల్వే స్టేషన్‌ #

వుహాన్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణాన్ని చూస్తే ఇక్కడేదో విమానాశ్రయం నిర్మాణంలో ఉందనిపించకమానదు. ఈ మార్గంలో రైళ్లు గంటకు 186 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి. అందుకే వుహాన్‌ రైల్వే స్టేషన్‌ ను ఎంతో సౌకర్యవంతంగా, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి. 2.12 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తున్నారు.

# బీజింగ్‌-షాంగై హైస్పీడ్‌ రైల్వే #

ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత వేగవంతమైన రైలు మార్గం చైనాలో ఉంది. ఇది బీజింగ్‌, షాంగై నగరాలను కలుపుతుంది. ఈ హైస్పీడ్‌ రైలు మార్గాన్ని 35 బిలియన్‌ డాలర్లతో నిర్మించారు. ఒకే దశలో దీన్ని పూర్తి చేయటం ప్రత్యేకత.

# కాష్‌గర్‌-హోటన్‌ రైలు మార్గం #
కొత్తగా నిర్మిస్తున్న కాష్‌గర్‌-హోటన్‌ రైలు మార్గానికి ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. పర్వత ప్రాంతాల మీదుగా ఎంతో కఠినమైన పరిస్థితుల్లో సాగుతున్న నిర్మాణం ఇది. వాయవ్య చైనాలోని తరీమ్‌ బేసిన్‌ నుంచి కొర్లా, తుర్పాన్‌, ఉరుంఘి నగరాల మీదగా సాగుతోంది. ఇది పూర్తయితే చైనాలో ఒక మూలన నివసిస్తున్న ప్రజలకు ప్రధాన చైనాతో సంబంధాలు మెరుగుపడతాయి.

# బీజింగ్‌ కేపిటల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ #

చైనాలో నిర్మాణం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న విమానాశ్రయాలను చూస్తే... విమానాశ్రయాలను ఇంత అద్భుతంగా నిర్మించవచ్చా... అని అనిపించక మానదు. బీజింగ్‌ కేపిటల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ చైనాలో అతిపెద్దది. దీని టెర్మినల్‌ భవనం ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద భవంతి కావటం ప్రత్యేకత. ఇక ఛెంగ్డు షాంగ్లియు విమానాశ్రయం నుంచి గత ఏడాదిలో 4.2 కోట్ల మంది ప్రయాణించారు. 2012లో ప్రారంభమైన కున్‌మింగ్‌ ఛాంగ్‌షుయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ చైనాలో రెండవ అతిపెద్ద విమానాశ్రయం. దీని ప్రధాన టెర్మినల్‌ 60 లక్షల చదరపు అడుగులు ఉంటుంది.

# రైలు-రోడ్డు వంతెన #

వుహాన్‌ నగరంలో టియాన్‌గ్జింగ్‌ఝౌ యాంగ్‌ట్జీ నది ప్రధాన ఆకర్షణ. దీనిపై సాధారణ వంతెనతో సరిపెట్టుకోకుండా ఎంతో ఆకర్షణీయమైన రీతిలో ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని ఆవిష్కరించారు. దాదాపు 1.7 బిలియన్‌ డాలర్లు వెచ్చించి రైలు- రోడ్డు వంతెన నిర్మించారు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

# క్విన్‌షాన్‌ నూక్లియర్‌ పవర్‌ ప్లాంటు #
క్విన్‌షాన్‌ నూక్లియర్‌ పవర్‌ ప్లాంటు రెండో దశ నిర్మాణాన్ని 2.2 బిలియన్‌ డాలర్లు వెచ్చించి పూర్తిచేశారు. ఒకే ప్రదేశంలో అత్యధిక సంఖ్యలో నూక్లియర్‌ రియాక్టర్లు ఉన్నది ఇక్కడే. దీని మొదటి దశ 2011 లో పూర్తయింది. రెండో దశ నిర్మాణాన్ని ఇటీవల పూర్తిచేశారు.  (ఈనాడు ప్రత్యేక విభాగం)




No comments:

Post a Comment