Monday, 3 October 2016

|| ప్రజాఉద్యమాలపై పోలీసు ఉక్కుపాదం ||



నవ్యాంధ్రల తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశ పాలనను పాదుకొల్పుతున్నదనడానికి ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలే రుజువు. చంద్రబాబు సర్కారు వచ్చీ రావడంతోనే నాగార్జున విశ్వవిద్యాలయంలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని గొంతెత్తిన విద్యార్థులపై ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ యాక్టు బనాయిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే బెదిరించారు. టీచర్ల మీటింగ్‌లో మరో అడుగు ముందుకేసి తమ సంఘం అడిగితేనే జీతాలు పెంచుతామన్నారు.
బాబు జమానాలో అంగన్‌వాడీలు, వివిధ రంగాల కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌ సిబ్బంది, స్కీం వర్కర్లు తమ కనీస డిమాండ్లపై రోడ్డెక్కిన ప్రతిసారీ పోలీసుల జులుం తారాస్థాయికి చేరుతోంది. రాజధాని, మచిలీపట్నం పోర్టుల భూసమీకరణలో భూములివ్వని రైతులను సర్కారు ఏ విధంగా భయోత్పాతానికి గురి చేస్తున్నదో నిత్యం కళ్లకు కడుతోంది. కాగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మధుపై పోలీసులు చూపిన క్రౌర్యం ప్రభుత్వ దమన నీతికి నిలువెత్తు సాక్ష్యం. ప్రతిపక్ష రాజకీయపార్టీలు సర్కారీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించినప్పుడు, నిజనిర్ధారణ జరిపేటప్పుడు అరెస్టులు చేయడమే ఇప్పటి వరకు చూశాం. భీమవరంలో మధుపై పోలీసులు జరిపిన భౌతికదాడి అత్యంత హేయం. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే పోలీసులు అత్యంత కిరాతకంగా మధు డొక్కలో తన్ని, కిందపడేసి, ఈడ్చుకుంటూ వ్యానులో ఎత్తేసి, లాకప్‌లో బంధించారని సంఘటన చూసిన వారికెవరికైనా అర్థమవుతుంది. మీడియాతో సైతం మాట్లాడనీయలేదంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య విలువలున్నాయా అన్న అనుమానం కలుగుతుంది. డిజిపి అనుమతి తీసుకొనే భీమవరం వచ్చామని మధు, ఇతర వామపక్ష, ప్రతిపక్ష పార్టీల నేతలు మొత్తుకున్నా కింది స్థాయి పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయలేదంటే ఏమను కోవాలి? ప్రభుత్వానికి ఎందుకింత భయం? 
భీమవరం దగ్గర 56 ఎకరాల్లో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. రూ.800 కోట్లతో నెలకొల్పే ఈ పార్క్‌ 40 గ్రామాల్లో పర్యా వరణానికి, స్థానికుల ఉపాధికి హాని చేస్తుంది. అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కి పార్క్‌ను పెడుతున్నారు. వ్యవసాయం, సంప్రదాయ వృత్తులపై ఆధారపడ్డ వేలాది మంది తమ పొట్ట కొట్టవద్దని రెండేళ్ల నుంచీ పార్క్‌ను వ్యతిరేకిస్తున్నారు. బాధితు లకు బాసటగా సిపిఐ(ఎం), ఇతర వామపక్షాలు, హక్కుల సంఘాలు, పర్యావరణ, స్వచ్ఛంద సంస్థలు, కాంగ్రెస్‌, వైసిపి నిలిచాయి. తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భంలో ఏదేని ప్రజా ప్రభుత్వం వెనక్కి తగ్గాలి. లేదూ బాధితులను ఒప్పించాలి. బాబు సర్కారు ఆపని చేయకుండా ఆందోళనకారులను, వారికి సంఘీభావం తెలుపుతున్నవారిని అణచివేస్తోంది. బాధితుల గోడు వినేందుకు శనివారం అఖిలపక్ష నాయకులు ఫుడ్‌పార్క్‌ ఏర్పాటు చేస్తున్న తుందుర్రు గ్రామాన్ని సందర్శించే ప్రయత్నం చేయగా భారత్‌, పాక్‌ బోర్డర్‌లో వలే పోలీసులను మోహరింపజేసింది. కల్లోలిత ప్రాంతాల్లో మాదిరిగా 144 సెక్షన్‌ వంటి నిషేధాజ్ఞలు విధించి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. వివిధ పార్టీల నేతలను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి దొంగలు, ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులకు మల్లే పోలీస్‌స్టేషన్లకు తిప్పుతూ ప్రజల్లో భయాందోళనలు కలిగించింది. 
ప్రభుత్వంలో ఇంతగా అసహనం కట్టలు తెంచుకుంటున్నదంటే ఆత్మరక్షణలో పడ్డట్టే. ప్రజాందోళనలపైనా, సర్కారు నిర్ణయాలను ప్రశ్నించేవారి పైనా అక్రమ కేసులు రాజ్యం చేయించే అఘాయిత్యాలు. ప్రజాస్వామ్య పాలన అనిపించుకోదు. సింగపూర్‌లో వలే ఇక్కడా ఏకపార్టీ పాలన కావాలని బాబు కోరుకుంటున్నట్లున్నారు. అందుకే తరచు ప్రతిపక్షాలెందుకని తూలనాడు తున్నారు. ప్రభుత్వంలో గూడుకట్టుకున్న ఈ పట్టరాని అసహనం పర్యవసానమే నిరంకుశత్వం. కాకినాడ సమీపంలో కాలకూట విషం చిమ్మే దివీస్‌ ఫార్మాకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేస్తే సర్కారు అణచివేత పద్ధతులన్నీ అవలంబిం చింది. చివరికి హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కర్నూలు, అనంతపురంలో సోలార్‌పార్క్‌ల కోసం బలవంతంగా భూములు గుంజుకొని రైతులకు పరిహారం చెల్లించలేదు. ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు గులాంగిరీ చేయడం తప్ప ప్రజలను, బాధితులను పట్టించుకోవడంలేదు. అందుకే సర్కారీ సంకుచిత పారిశ్రామిక విధానాలపై ప్రజల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదని ఎవ్వరూ చెప్పరు. తయారీ, ఇంజనీరింగ్‌, ఐటి, కాలుష్యరహిత పరిశ్రమలకు బదులు ప్రైవేటుకు లాభం, ప్రజలకు తీరని నష్టం కలిగించే, ఉపాధి రహిత, కాలుష్య కారక ప్రాజెక్టులపైనే అభ్యంతరం. వ్యవసాయం, అనుబంధ రంగాలకు నష్టం. ఆక్వా ఫుడ్‌పార్క్‌, దివీస్‌ ఫార్మా వలన స్థానికులకు కొత్తగా వచ్చే ఉపాధి కంటే ఇప్పటికే సంప్రదాయ వృత్తులు, సేద్యంపై ఆధారపడ్డ కొన్ని రెట్ల మంది ఉపాధికి దెబ్బ తగులుతోంది. ప్రభుత్వం ప్రజానుకూల, అదనపు ఉపాధి కల్పించే పారిశ్రామిక విధానం ప్రకటించి అమలు చేయాలి.

No comments:

Post a Comment