Sunday, 16 October 2016

|| బుద్ధుణ్ణి, మార్క్స్ ను సమన్వయించిన అంబేద్కర్‌ ||




             డాక్టర్‌ బిఆర్‌ అంబే ద్కర్‌ 1956 అక్టోబరు 14న నాగపూర్‌లో ఐదు లక్షలమందికి ఇచ్చిన బౌద్ధ ధర్మ దీక్ష ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యా యాన్ని ప్రారంభించింది. హిందూ మతం నుంచి బయటపడకుండా భారతదేశంలో కులం, అస్పృశ్యత పోదని అంబేద్కర్‌ తన జీవిత అనుభవం నుంచి, అధ్యయనం నుంచి తెలుసు కున్నాడు. అందుకే భారతదేశాన్ని బౌద్ధ భార తంగా తీర్చిదిద్దాలని ఆయన కంకణబద్ధు డయ్యాడు. భారతదేశంలో ఉన్న తత్వశాస్త్రా లన్నింటినీ, మతాలనూ అధ్యయనం చేశా డు. భారతదేశ మూలాల నుంచి పుట్టింది బౌద్ధం. ఇతర మతాలన్నీ ఇతర ఖండాల నుంచి ఇక్కడ ఆవిర్భవించినవని తెలుసుకున్నాడు. అవన్నీ ఆయుధా లతో పాటు వచ్చిన మతాలని అవగాహన చేసుకున్నాడు. ఆర్యులు వేదాలతో పాటు భారతదేశానికి హిందూమతాన్ని, అరబ్బులు, తురుష్కులు ముస్లిం మతాన్ని, ఫ్రెంచివాళ్ళు, ఇంగ్లీషువాళ్ళు క్రైస్తవ మతాన్ని తెచ్చారని ఆయన పరిశీలనలో తేలింది. బౌద్ధ మతం ఒక్కటే భారత ఉపఖండం నుంచి జనించింది. ఆయుధాన్ని నిషేధించింది. ప్రేమను, కరుణను, ప్రజ్ఞను పెంచింది. త్యాగాన్ని విశ్వవ్యాప్తం చేసింది. వ్యక్తిత్వ నిర్మాణాన్ని బోధించింది. కులం గీతలను చెరిపేసింది. అస్పృశ్యతా మాలిన్యాన్ని కడిగేసింది. ఆత్మీయతా సముద్రా లను పొంగించింది. మనిషిని మహోన్నతుడిగా మలిచింది. మనిషి తోటి మనిషిని ప్రేమించే సౌజన్యతను తెచ్చింది. మానవత్వాన్ని ఆకాశ దీపంగా వెలిగించింది. ఈ బౌద్ధ ధర్మా న్ని భారతీయులు మరీముఖ్యంగా దళితులు, బహుజనులు స్వీకరిస్తే హిందూ మతం వేసిన ఉక్కు సంకెళ్ళను తెంచుకోవచ్చని అంబేద్కర్‌ ఈ మహోన్నతమైన దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రపంచ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టానికి ఆయువు పోశాడు. అంబేద్కర్‌ తన 'బుద్ధుడు, ఆయన ధమ్మం' అనే గ్రంథంలో ధమ్మకు, మతానికి ఉన్న తేడాను చర్చించాడు. మతం విశ్వాసానికి సంబంధించింది. ధమ్మం ఆచరణకు సంబంధించింది. ధమ్మంలో నీతి ఉంది. సామాజికత ఉంది. ధమ్మ ఏకలక్ష్య సౌభ్రాతృత్వాన్ని అలవర్చుకోవడానికి ఇది మార్గమని అంబేద్కర్‌ పేర్కొన్నాడు. 'ఇది విశ్వజన సోదరత్వానికి మరో పేరని, దాని ఇంకో పేరే నీతియని, నీతియే ధమ్మం' అని అంబేద్కర్‌ నొక్కివక్కాణిం చాడు. అంబేద్కర్‌ ఈ ధమ్మను మరింత వివరంగా విశ్లేషించాడు. 'స్వచ్ఛత మూడు రకాలని ఆయన చెప్పాడు. శారీరక స్వచ్ఛత అనగా హత్య చేయకుండా, దొంగతనం చేయకుండా, పాపపంకిలమైన జీవితం గడవకుండా' ఉండాలని, వాక్కులో స్వచ్ఛత అనగా 'అసత్యమాడకుండా ఉండాలని, మానసిక స్వచ్ఛత అనగా సోమరితనం, జడత్వం, ఉద్రిక్తత, దుందుడుకుతనం లేకుండా' పరిశుభ్రంగా జీవించా లని అంబేద్కర్‌ పేర్కొన్నాడు. జీవితంలో పరిపూర్ణత్వాన్ని పొందడమే 'ధమ్మం' అని, శారీరక, మౌఖిక, మానసిక పరిపక్వతలు 'ధమ్మం' వల్లే సాధ్యమని విశ్లేషించాడు. 'వ్యామోహం ధమ్మానికి వ్యతిరేకమని', 'ఈ వ్యామోహమే ధనాశకు ఆస్కారం కలుగజేస్తుందని', 'ధనాశ మానవ పతనానికి దారితీస్తుందని', 'ధనాన్ని పోగుచేయాలనే తాపత్రయమే దురాశకు కూడా హేతువని', 'ఈ దురాశ ఎదుటివాడిని పీడించడానికి మనసును ప్రేరేపిస్తుందని', అందుకే మోహానికి మూలమైన మానసిక దుర్బలత్వాన్ని విడనాడాలని అంబేద్కర్‌ విశ్లేషించాడు. అంబేద్కర్‌ దళితు లను, బహుజనులను హిందూమతం నుంచి బయటపడ వేయడానికి లోతైన అధ్యయనం చేశాడు. ఏ మతమైనా మనిషికి మేలు చేయాలి. కీడు చేసే మతంలో మనం కొనసాగడం వల్ల తరతరాలు మనం మానవ హక్కులను కోల్పోతాం. మన సంకెళ్ళను మనమే బిగించుకొన్నవారం అవుతాం. అందుకు నా జీవితం, మా తాతముత్తాతల జీవితమే చారిత్రక సాక్ష్యాధారాలుగా నిలుస్తాయని ఇలా చెప్పాడు. నా తండ్రి, తాతలు నిబద్ధత గల హిందువులు. కానీ హిందూ మతం విధించిన ఆంక్షల కారణంగా వారు విద్యనభ్య సించలేకపోయారు. ఆ మతం వారిని ఆయుధాలను ధరించనివ్వలేదు. సంపదను కూడబెట్టడం కూడా హిందూ మతంలో సాధ్యం కాదు. ఈ మతానికి కట్టుబడి ఉండటం వల్ల నా తండ్రి ఈ మూడింటినీ సంపాదించలేకపోయాడు. నాకు సంస్కృతం నేర్చుకోవాలని ఉండేది. కానీ హిందూ మతం విధించిన ఆంక్షల కారణంగా నేను సంస్కృతం నేర్చుకోవడం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు విద్యార్జన, సంపద, ఆయుధాలను కలిగి ఉండడం కూడా సాధ్యమైంది. మీ తాతముత్తాతలను హీనమైన జీవితాలను గడిపేందుకు ఒత్తిడి చేసే, అన్ని రకాల అగౌరవాలను వారిపై మోపి, నిరుపేదలుగా, అజ్ఞానులుగా ఉంచే హిందూమతమనే క్రూరమైన తెగలో మీరు ఎందుకు కొనసాగాలి? మీ తాతముత్తాతలలానే హీనమైన, తక్కువ స్థాయిని, అవమా నాన్ని అంగీకరించడాన్ని కొనసాగిస్తే మిమ్మల్ని ద్వేషిస్తూనే ఉంటారు. ఎవరూ మిమ్మల్ని గౌరవించరు, ఎవరూ మీకు సాయపడరు. ఈ కారణాల వల్లనే మతమార్పిడి అనే అంశం మనకు ముఖ్యంగా మారింది. మీరు హిందూ మతంలోనే కొనసాగితే బానిసకన్నా ఉన్నతమైన హోదాను పొందలేరు. వ్యక్తిగతంగా నాకు ఎటువంటి అడ్డంకులూ లేవు. నేను అస్పృశ్యునిగా కొనసాగినా, ఒక హిందువు సాధించిన స్థాయిని, హోదాను నేను సాధించగలను. నేను హిందువుగా కొనసాగుతానా, లేదా అన్నది పెద్దగా సమస్య కాదు. ఎందుకంటే, నేను హైకోర్టు జడ్జిని కాగలను, శాసనసభలో సభ్యుణ్ణి, మంత్రిని కూడా కాగలను. కానీ మీ సాధికారత, పురోగతి కోసం మతమార్పిడి చాలా అవసరమని నాకనిపిస్తోంది. ఈ హీనమైన, అగౌరవనీయమైన ఉనికిని బరగారంగా మార్చుకోవాలంటే మార్పిడి అత్యవసరం. మీ పరిస్థితి మెరుగుపరచుకోవడానికి మీ స్నేహితులు, బాగుకోరేవారి సహకారం, సహాయం తప్పనిసరిగా అందుతా యని ఆశిస్తున్నాను. మీ పరిస్థితిని మెరుగుపరిచేందుకు నేను మతమార్పిడులను ప్రారంభించాలి. నేను నా వ్యక్తిగత ప్రయోజనం లేక పురోగతి గురించి ఆందోళన చెందడం లేదు. ఈ రోజు నేనేదైతే చేస్తున్నానో అది మీ బాగు కోసం, మీ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే. మీరు నన్ను దేవుడిని చూసినట్టు చూస్తున్నారు. కానీ నేను దేవుడిని కాదు. నేనూ మీ అందరిలాగే మనిషిని. మీరు నా నుంచి ఏ రకమైన సహాయాన్ని ఆశించినా అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుత మీ ఈ హీనమైన, నిరాశాజనకమైన పరిస్థితి నుంచి మిమ్మల్ని విముక్తి చేయాలని నిర్ణయించుకున్నాను. నా వ్యక్తిగత లబ్ధి కోసం నేను ఏమీ చేయడం లేదు. మీ ఉన్నతి కోసం, మీ జీవితం మరింత అర్థవంతం, ఉపయోగకరం కావడం కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తాను. మీ బాధ్యతను మీరు గుర్తించి నేను చూపుతున్న మార్గాన్ని మీరు అనుసరించాలి. మీరు నిజాయితీగా దానిని అనుసరిస్తే లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టం కాబోదని ఆయన స్వయంగా పేర్కొన్నారు. హిందూ మతాన్ని, దాని చర్యలను, దాని నిత్యకృత్యాలను అంబేద్కర్‌ నిశితంగానే కాక చారిత్రకంగా కూడా పరిశీలించారు. హిందూమతం భారతదేశ ప్రజల్లో నైతిక శక్తిని దెబ్బతీసింది. బహుభార్యత్వానికి కృష్ణుణ్ణి, భార్యను అనుమానంతో దగ్ధం చేయడాన్ని రాముడి పేరుతో పెద్దఎత్తున ప్రచారంలో పెట్టింది. ధర్మరాజు ద్వారా జూదాన్ని ప్రచారం చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్‌ బౌద్ధధర్మాన్ని ఆచరించడమంటే స్వేచ్ఛగా జీవితాన్ని గడపటమేనని, స్వేచ్ఛ మనస్సులో, వాక్కులో, శరీరంలో ఉండాలంటాడు. సోమరితనానికి, జడత్వానికి, ఉద్రిక్తతకు, దుందుడుకుతనానికి దూరంగా ఉండగలగడమే మానసిక స్వచ్ఛత అని బుద్ధుని ధర్మాన్ని అంబేద్కర్‌ నివేదిస్తాడు. హింసను బలంగా వ్యతిరేకించాడు. బుద్ధుడు కాముకత్వాన్ని, అసత్యమాడడాన్ని, మత్తు పదార్థాలను సేవించి మంద మతిగా జీవించడాన్ని వ్యతిరేకించాడని, బౌద్ధ ధర్మదీక్ష పొందడం వల్ల నీవు పరిపూర్ణ మానవుడవుతావని అంబేద్కర్‌ తన బుద్ధుడు, ఆయన ధమ్మంలో పేర్కొన్నాడు. దురాశ, క్రోధం, భ్రమలను అధిగమించినట్లైతే మానవుడిలో బాధ, వేదనలను జయించవచ్చని, వాంఛలకు బలికాకుండా మాన వుడు జాగ్రదావస్థలో ఉండాలన్నాడు బుద్ధుడు. మానవుడు నిర్వాణమార్గం చేరుకునేందుకు కోరికలు అవరోధమని బుద్ధుడు హెచ్చరించాడు. బుద్ధుని బోధనలను అంబేద్కర్‌ క్రమబద్ధీకరించడమేకాక దానిలోని అంతస్సారాన్ని సులభసా ధ్యంగా నివేదించాడు. నైతికంగాను, మానసికంగాను, దృష్టిపరంగాను విజయం సాధించగలిగినవాడు ధర్మాన్ని నెరవేర్చినట్టేనని బుద్ధుడు చెప్పిన సారాన్ని అంబేద్కర్‌ వివరించాడు. 'పరిపక్వత కూడా మౌఖిక, మానసిక, శారీరకాంశాల నుంచే వస్తుంది. బోధిసత్వుడైనవాడు ఒక ధర్మాన్నే పరిశీలన చేయడు. సకల ధర్మాల మౌఖిక సూత్రాలను, వాటి పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించి నిగ్గుతేలుస్తాడు. ఇతరులు సహితం అలా తారతమ్య పరిశీలన చేసేందుకు తోడ్పడతాడు' అని అంబేద్కర్‌ వివరించాడు. అంబేద్కర్‌ మరొక మహోన్నత విషయాన్ని కూడా సాధించాడు. బుద్ధుని సిద్ధాంతాల్లోనూ, మార్క్స్‌ సిద్ధాంతాల్లోనూ వైరుధ్యాలను, సమన్వయాలను ముందుకు తెచ్చాడు. బుద్ధుడు క్రీస్తుపూర్వం 563లో జన్మించాడు. కారల్‌మార్క్స్‌ 1818లో పుట్టాడు. వీరిరువురికీ మధ్య 2381 సంవత్సరాల తేడా ఉంది. పీడితుల తరపున నిలబడి, ఆచరణాత్మక సిద్ధాంతాలు నిర్మించి పోరాడిన వీరిరువురి గురించి పీడితుల విముక్తికై సిద్ధాంతవేత్తగా, ఆచరణవాదిగా ముందుకు వచ్చిన అంబేద్కర్‌ ప్రపంచానికి ఒక నూత్న సందేశాన్ని అందించడానికి వీరిరువురిలోని ప్రగతిశీల అంశాలను ముందుకు తెచ్చాడు. బుద్ధుణ్ణి గురించి అంబేద్కర్‌ వివరిస్తూ బుద్ధుడు కేవలం అహింసావాది మాత్రమే కాదు. ఆయన మానవ జీవితాన్ని ప్రభావితం చేసి ముందుకు తీసుకుపోదగిన సజీవ సిద్ధాంతాలను రూపొందించారని వివరించాడు. బుద్ధుని సూత్రాలు, ధర్మాలు మానవ పరిణా మానికి ఉపయుక్తంగా ఉండడమే కాక మానవత్వాన్ని మూల కేంద్రంగా కలిగి ఉన్నాయి. బుద్ధుడు దుఃఖాన్ని నివారిం చాలన్నాడు, మార్క్సు దోపిడీని నిర్మూలించాలన్నాడు. దుఃఖం ఎక్కడుంది? దోపిడీలోనే ఉంది! అందుకే ఇద్దరూ చెప్పింది ఒక్కటే. సాధించే మార్గాలు వేరు అన్నాడు అంబేద్కర్‌. మార్క్స్‌ ప్రపంచాన్ని మార్చే సూత్రాలు ప్రవచించాడు. తత్వశాస్త్రం సమాజాన్ని మార్చగలిగి ఉండాలన్నాడు. దేవుడు లేడని నమ్మినప్పుడే తత్వశాస్త్రం మెదడుకు ఎక్కుతుందని మార్క్సు బోధించాడు. అంబేద్కర్‌ కూడా బౌద్ధాన్ని తత్వంగానే స్వీకరించాడు కాని మతంగా కాదు. ఈనాడు బుద్ధుణ్ణి, మార్క్స్‌ను అన్వయించుకోవడం ఒక చారిత్రక సందర్భం. మార్క్సిస్టులు , అంబేద్కరిస్టులు ఈ చారిత్రక సందర్భంలో ఈ కర్తవ్యాన్ని సమన్వయంతో నిర్వహించాలి. అప్పుడే అస్పృశ్యత లేని, కులం లేని సమసమాజ భారతం ఏర్పడుతుంది.  - డాక్టర్‌ కత్తి పద్మారావు

No comments:

Post a Comment