ముస్లిం పురుషులు ఇష్టం లేదనుకుంటే భార్యకు ఏకపక్షంగా విడాకులిచ్చి వీధులపాలు చేసే తలాఖ్ దురాచారాన్ని తక్షణం నిలుపు చేయడం చాలా అవసరం. ఈ దిశలో జరిగే ప్రయత్నాలు ఆహ్వానించదగినవి. ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. భర్త తన ఇష్టానుసారం మూడు సార్లు తలాఖ్ తలాఖ్ తలాఖ్ అంటే భార్యకు విడాకులిచ్చినట్టేనంటున్న ప్రస్తుత ముస్లిం పర్సనల్ లా( వ్యక్తిగత చట్టం)ను తప్పక సవరించాల్సిందే. అఖిలభారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపిఎల్‌బి) మత చాందసత్వంతో ఈ మూడు తలాఖ్‌ల పద్ధతి కొనసాగించాలంటూ అఫిడవిట్ దాఖలుచేయడం దారుణ మైన విషయం.
ముస్లింలు అన్నప్పుడు పురుషులే తప్ప మహిళల మనుగడ భద్రత గౌరవం ఈ బోర్డుకు అసలు పట్టవని తేలిపోయింది. దీనిపై ముస్లిం మహిళలు సంబంధిత బోర్డు కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. మా భావాలు తెలుసుకోకుండానే ఎలా మీరు అభిప్రాయం చెబుతారని నిలదీశారు. నిజానికి మతం పేరు ఉపయోగించడమే గాని అధికార ప్రకటిత ఇస్లామిక్ దేశాల్లోనే ఈ మూడుసార్ల తలాఖ్ పద్ధతి అమలులో లేదు. పాకిస్తాన్‌తో సహా 22 దేశాలు దీన్ని రద్దుచేయడమో లేక బాగా కఠినమైన షరతులతో అమలును అసాధ్యంగా మార్చడమో చేశాయి. . కొందరు ముస్లిం మతపెద్దలు తలాఖ్ ఉద్దేశం ఇది కాదని ఏవో భాష్యాలు చెబుతున్నారు. మూడు నెలల వ్యవధిలో మూడు సార్లు తలాఖ్ అనాలి తప్ప వెంటవెంటనే చెప్పేసి ప్రకటిస్తే చాలదని వారు వివరిస్తున్నారు. ఇలాంటి సన్నాయి నొక్కులతో నిమిత్తం లేకుండా మౌలికంగా ఈ తలాక్ పద్ధతే తప్పు. అమానవీయం. మహిళా వ్యతిరేకం. ఇదే గాకుండా ఇస్లామిక్ సూత్రాల ప్రకారం భర్త నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. భార్య తప్పక ఏక భర్త్రత్వం పాటించవలసిందే. దీనిపై కేరళ హైకోర్టు న్యాయమూర్తి బి.కుమార్ పాషా కొంత కాలం కిందట కేసు విచారిస్తూ స్త్రీలకు మాత్రం ఎందుకు బహుభర్త్రుత్వాన్ని అనుమతించరని తమాషాగా అడగడం దుమారానికి కారణమైంది.ఇంకా అనేక అంశాల్లో ఇస్లామిక్ చట్టాలు షరియ వంటివి స్త్రీల అణచివేతకు కారణమవుతున్నాయి. వారికి ఓటు హక్కు కూడా ఇవ్వని దేశాలున్నాయి. ఇలాంటి వివక్షలు ఎక్కడ ఏ రూపంలో వున్నా పోరాడవలసిందే. నిర్మూలించవలసిందే.|| బిజెపి ఉద్దేశాలు వేరు ||
అయితే హిందూత్వ వాదుల్ల తలాఖ్ చర్చలో స్త్రీల విముక్తికోణం కన్నా ఇస్ల్ాంలోనే దురాచారాలున్నాయని చెప్పే తాపత్రయం చూస్తాం. .దీన్నీ యూనిఫారం సివిల్ కోడ్ (యుసిసి)ను కలిపి చర్చకు తెస్తుంటారు. ఇవి రెండూ వేర్వేరు అంశాలు. భిన్న విశ్వాసాలున్న చోట ఆమోదయోగ్యమైన ఉమ్మడి సివిల్ కోడ్ రావాలంటే సమయం పడుతుందని రాజ్యాంగ నిర్మాతలకు తెలుసు. కనుకనే వారు ఉమ్మడి (కామన్) అనకుండా ఏకరూప(యూనిఫాం) అన్నారు. ఉమ్మడి అన్నప్పుడు అందరికి ఒకటే విధానం అమలు కావాలి. ఏకరూప అంటే ఒక విషయంలో ఒకరికి ఏ సూత్రం పాటిస్తారో దాన్ని ఇతరులకూ అనువర్తింపచేయాలి. కాని ఒకేదేశం-ఒకే ప్రజ- అంటూ ఒకే మతం విశ్వాసాలు అందరూ పాటించాలని చెప్పే హిందూత్వ వాదులు ఉన్న ఫలానా ఉమ్మడి సివిల్ కోడ్ తీసుకురావాలనే రాజకీయ ప్రచార నినాదం ఎత్తుకుంటారు. 1989 లోక్‌సభ ఎన్నికలలోనే వారు మూడు నినాదాలు ముఖ్యంగా తీసుకున్నారు- ఒకటి కామన్ సివిల్ కోడ్, రెండు అయోధ్య రామమందిర నిర్మాణం, మూడు కాశ్మీర్ 370 అధికరణం రద్దు. ఈ మూడింటిలోనూ వున్న మతపరమైన కోణాలు ఎవరికైనా అర్థమయ్యేవే.మళ్లీ . ఈ మూడు నినాదాల్లోనూ అవకాశవాదమే. 370వ అధికరణంపై పట్టుదలగా వుంటే కాశ్మీర్లో పిడిపితో కలసి ప్రభుత్వంలో పాల్గొనే అవకాశమే వుండదు. అయోధ్యకు ఎన్నికలతో సంబంధం లేదనేవారు ఇప్పుడు యుపి ఎన్నికలకోసమే మళ్లీ బయిటకు తీశారు.ఈ క్రమంలోనే వారి మూడవ మౌలిక నినాదమైన ఉమ్మడి సివిల్ కోడ్ కూడా ముందుకు తెచ్చే పరిస్థితులు ఉప యోగించుకుంటున్నారు.
|| షాబానో కేసు రాజీవ్ అవకాశవాదం ||
1985లో షాబానో కేసులో సుప్రీం కోర్టు చాందసానికి వ్యతిరేకంగా మహిళలకు మేలు చేసే తీర్పునిచ్చింది.కాని నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ చాందసుల ఒత్తిడికి లొంగి ఆ తీర్పు స్పూర్తిని దెబ్బతీసే విదంగా ముస్లిం మహిళల భరణం బిల్లు 1986 తీసుకొచ్చారు. ఆ కొనసాగింపుగా హిందూ చాందసులను సంతృప్తిపర్చేందుకు అయోధ్య రామమందిరం/బాబరీమసీదు తలుపులు తెరిపించారు. తర్వాత పరిణామాలు తెలిసినవే. తర్వాత 2002లో షామిర్ అరా అనే మహిళ కేసులో సుప్రీంకోర్టు మరో మంచి తీర్పునిచ్చింది. 2005లో గృహహింస నిరోధ చట్టం వచ్చింది.మహిళల మతంతో సంబంధం లేకుండా రక్షణ కల్పించే చట్టమది. ప్రస్తుతం మహిళా కార్యకర్తలు స్వచ్చంద సంస్థలు ముస్లిములతో సహా ఏమతం మహిళలకోసమైనా గృహ హింసచట్టాన్ని వారి విషయంలో 2002,2005 చట్టాలను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇటీవల సైరాబాను అనే మహిళ తనకు భర్త తలాక్ పోస్టులో పంపించాడంటూ కోర్టులో కేసు వేశారు. ముస్లిం మతంలో పురుషాధిక్యతను సవాలు చేయడమే గాక దేశంలో ముస్లిములందరూ భారత మాతకు జై అనాల్సిందేనని ఆమె టీవీ ఇంటర్వ్యూలలో చెప్పడం బాగా ప్రచారమవుతున్నది.
|| మతాలూ మహిళలు ||
ఈ దేశంలో ముస్లిములకే గాక ఇతర మతాల వారికి కూడా వారి వారి వ్యక్తిగత చట్టాలున్నాయి. కొన్ని విషయాల్లో ఇస్లామిక్ వివాహ వ్యవస్థ కల్పించే రక్షణలు హిందూ వివాహాలలో వుండవు. ఉదాహరణకు పురుషుల బహుభార్యత్వం ఆ మతంలో చట్టబద్దం. తలాక్‌కు చెల్లుబాటవుతుంది. కాని వివాహ సమయంలోనే భార్య పోషణకు సంబంధించిన మొత్తాన్ని మెహర్‌గా ఇవ్వడం వుంటుంది.విడిపోతే బహుభార్యలకు కూడా భరణం వుంటుంది. హిందూ మతం విషయంలో బహుభార్యత్వం చట్టబద్దం కాకున్నా అనుమతి తీసుకునో లేకుండానో చేసుకుంటూనే వుండటం చూస్తాం. అయితే దాని వల్ల నష్టపోయేది మాత్రం ఆ మహిళ. ఏమంటే మొదటి భార్యకు తప్ప రెండవ భార్యకు భరణం చట్టబద్దం కాదు!ఇటీవలే సుప్రీం కోర్టుదీన్ని కూడా సవరించింది. అలాగే విడాకులు తీసుకున్న భార్యపట్ల భర్తకు ఎలాంటి బాధ్యత వుండదు. కాని ఇస్లామిక్ చట్టంలో ఆమెకు భరణం ఇవ్వవలసి వుంటుంది.బాల్య వివాహాల విషయంలో 84 శాతం హిందూ బాలికలు బలవుతున్నారు.ఆస్తిహక్యు వారసత్వం విషయం లో హిందూ స్త్రీలకు హక్కులు చాలా తక్కువ. ఇటీవలనే ఈ విషయంలోనూ సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది గాని అవిభక్త హిందూ కుటుంబం అనే చట్టం వారిని పరాధీనతకు గురి చేస్తూనే వుంటుంది. అన్నిటినీ మించి హిందూత్వ వాదులు అమితంగా పూజించే మనుధర్మశాస్త్రం స్త్రీలను హీనాతి హీనంగా శాసించి అశక్తులుగా నమ్మదగని వారుగా అస్వతంత్రులుగా ప్రకటించింది! కనుక ఇస్లామిక్ చాందసాన్ని ఖండిస్తూనే హిందూ మతం గొప్పగా వుందనుకుంటే పొరబాటే. క్రైస్తవ వివాహాల్లోనూ సమస్యలున్నాయి.
|| ఉమ్మడి కోడ్‌లో సమస్యలు ||
రాజ్యాంగం 44వ అధికరణం అందరి ఆమోదంతో ఏకరూప సివిల్ కోడ్ తీసుకురావాలని మాత్రమే సూచించింది. గోవానుంచి వచ్చిన రక్షణమంత్రి మనోహర్ పరిక్కర్, సీనియర్ మంత్రి వెంకయ్య నాయుడు వంటివారు గోవాలో ఉండే ఉమ్మడి కోడ్ ను ఇందుకు నమూనాగా ప్రస్తావిస్తున్నారు. తమాషా ఏమంటే అక్కడ వున్నది 1939 పోర్చుగీసు సివిల్ కోడ్. ఆ రాష్ట్రాన్ని పోర్చుగీసులు పాలించారంటూ దాన్ని కొనసాగిస్తున్నారు. అది కూడా క్యాథలిక్కులకే. అక్కడ హిందువులకు కొన్నివిషయాల్లో మరో కోడ్ వుంటుంది. ఉత్తర భారత దేశంలో హిందువులలో రక్త సంబంధీకుల వివాహాలు నిషిద్దం.దక్షిణ భారతంలో చెల్లుబాటవుతాయి. నాగాలాండ్ మేఘాలయ మిజోరాం వంటి చోట్ల కూడా భిన్నమైన కోడ్లు వున్నాయి. ఇక కాశ్మీర్లో షరియత్ నిబంధనలు చెల్లవు. ఆ మాటకొస్తే అమెరికా వంటి దేశంలో రాష్ట్రాల వారిగా చట్టాలు నిబంధనలున్నాయే తప్ప ఉమ్మడి సివిల్ కోడ్లు వుండవు. అలాంటిది బలవంతంగా రుద్దడం తగదని 1960వ దశకంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ప్రసిద్ధ న్యాయమూర్తి విఆర్కృష్ణయ్యర్ 2003లో రాసిన ఒక వ్యాసంలో ఈ అంశాలు చాలా వివరంగా చర్చించారు. ఈచర్చ మొదలైన తర్వాత కూడా కె.కన్నన్ అనే మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇది అందుకు సరైన సందర్భం కాదని రాశారు.తలాక్‌ను రద్దు చేయడంతో సహా స్త్రీల కోణంలో ఆలోచించాలి తప్ప హిందూత్వ భావనలతో ఉమ్మడి కోడ్ సమస్యను తెచ్చి కలగాపులగం చేయొద్దని సిపిఎం సూచించింది. బిజెపి కావాలనే ఈ కందిరీగల తుట్టను కదల్చిందని సీనియర్ నాయకుడు ఎం.కరుణానిధి వ్యాఖ్యానించారు. ఉమ్మడి కోడ్ అనే ఆచరణ సాధ్యం కాని అవాంఛనీయ చర్చ బదులు అన్ని మతాల వ్యక్తిగత చట్టాల్లో అవసరమైన మార్పులు చేయాలని బృందాకరత్ సూచించారు. సైరాబాను కేసులో సుప్రీం కోర్టు అంతిమంగా ఏం చెబుతుందనేది ఈ చర్చ భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. అప్పటికైనా ప్రభుత్వం వాస్తవికతతో ఆలోచించకుండా హిందూత్వ వ్యూహమే ప్రధానమనుకుంటే ఈ చర్చ దారితప్పి స్త్రీలకు ఇంకా అన్యాయం జరుగుతుంది.
- తెలకపల్లి రవి

No comments:
Post a Comment