Tuesday, 4 October 2016

|| యుద్ధం వద్దు ||


కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్ చేస్తున్న తప్పు మనం బలూచిస్తాన్‌ విషయంలో చేయరాదు. పాలకులు, ప్రభుత్వేతర నాయకులు, మాధ్యమాలు ప్రజలను రెచ్చగొట్టరాదు. ఆవేశాలకూ, భావోద్రేకాలకూ గురిచేసి యుద్ధోన్మాదాన్ని ప్రేరేపించరాదు. ప్రతీకార వాంఛలను ప్రోత్సహించరాదు. యుద్ధం వైపు అడుగులెయ్యరాదు.

జంగ్‌ బహుత్‌ కర్లీ. జంగ్‌ కర్కే క్యా పాయా? న జమీన్‌ మిలీ, న జన్నత్‌ పాయా. చాలా యుద్ధాలు చేశాం.’’ (యుద్ధాలు చేసి ఏం సంపాదించాం? భూమి దక్కలేదు. స్వర్గం దొరకలేదు.) నవాజ్‌ షరీఫ్‌ పుట్టిన రోజు వేడుకలకు చెప్పాపెట్టకుండా ఇస్లామాబాద్‌ వెళ్ళినప్పుడు నవాజ్‌ షరీఫ్‌ ఆయన సోదరుడు షహ్‌ బాజ్‌ షరీ్‌ఫల ముందర మోదీ ఇలా పాడారు. షరీఫ్‌ సోదరులు ‘‘వాహ్‌ వాహ్‌’’ అని చప్పట్లు కొట్టారు. యుద్ధాలు భూమి కోసం, స్వర్గ ప్రాప్తి కోసం అని వీరి ఉద్దేశం.

లోక్‌సభలో ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం జమ్మూకశ్మీర్‌ సరిహద్దులలో చొరబాట్లు, ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. బీజేపీ పాలనా సమయంలో ఇవి మరింత పెరిగినట్లు లెక్కలు తెలుపుతున్నాయి. 2013 నుంచి 2016, జూలై 10 వరకు 180 మందికి పైగా మన సైనికులు, 64 మంది ప్రజలు మరణించారు. 182 మంది ప్రజలు, 338 మంది భద్రతాదళ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దాడుల పెరుగుదలకు కారణాలను పాలకులు ఆత్మశుద్ధితో విశ్లేషించుకోవాలి. ఉరీ దాడి దరిమిలా సంఘీయ క్రియాశీలురు సంబంధశుద్ధి, సందర్భశుద్ధి లేకుండా, సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా, దేశ భవిష్యత్తు పట్టకుండా పాకిస్థాన్‌పై భారత్‌ యుద్ధం చేయాలని నినదించారు. కార్పొరేట్‌ మీడియాలో విపరీతంగా చర్చలు జరిపారు. సెప్టెంబర్‌ 28 - 29 రాత్రి భారత ప్రత్యేక సైనిక దళాలు ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థల శిబిరాలపై లక్షిత దాడులు (సర్జికల్‌ సై్ట్రక్స్‌) చేసి 38 మంది ఉగ్రవాదులను, ఇద్దరు పాక్‌ సైనికులను మట్టుపెట్టినట్లు తీవ్ర ప్రచారం జరిగింది.

2001 సెప్టెంబర్‌ 11న అమెరికా ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రవాద దాడి తర్వాత అమెరికా ఉగ్రవాదంపై పోరాటం పేరుతో అనేక యుద్ధాలు చేసింది. వాటికి ఇప్పటిదాకా 3 కోట్ల 30 లక్షల కోట్లు (5 ట్రిలియన్‌ డాలర్లు) ఖర్చు చేసిందని బ్రౌన్‌ విశ్వవిద్యాలయం ఒక నివేదికలో తెలి పింది. ఇప్పటికీ అఫ్ఝానిస్తాన్‌లో అమెరికా సైన్యం తిష్ట వేసి వుంది. ‘‘అమె రికా ప్రధాన శత్రువని అందరూ భావించే అల్‌ ఖైదా అనుబంధ సంస్థలతో కలిసి సిరియాలో అసద్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి స్పెషల్‌ ఆపరేషన్‌ ఫోర్సెస్‌ పేరుతో వేల సంఖ్యలో అమెరికా సైన్యం సిరియాలో మోహరించి ఉంది’’ అని బోస్టన్‌ విశ్వవిద్యాలయ ఆచార్యులు నేటా క్రాఫోర్డ్‌ తన నివేదికలలో పేర్కొన్నారు. 2003లో అమెరికా ఇరాక్‌పై చేసిన దాడిలో 10 లక్షల మంది ఇరాకీలు ప్రాణాలు కోల్పోయారు. అఫ్ఘానిస్తాన్‌, ఇరాక్‌, పాకిస్థాన్‌, సిరియా లలో అమెరికా చేసిన యుద్ధాల వల్ల కోటి 20 లక్షల మంది శరణార్థులుగా మారారు. అప్ఘానిస్తాన్‌, ఇరాక్‌లలో అమెరికా చేసిన యుద్ధాలలో 7 వేల మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 7 వేల మంది కాంట్రాక్టర్లు చనిపోయారు. ఓవర్సీస్‌ కాంటింజెన్సీ ఆపరేషన్స్‌ (ఒ.సి.ఒ.) పేరుతో అమెరికా చేసిన సామ్రాజ్యవాద యుద్ధాలకు కోటి 12 లక్షల 20 వేల కోట్ల రూపాయల (1.7 ట్రిలియన్‌ డాలర్ల) బడ్జెట్‌ను అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించింది. 2001-16 కాలానికి అమెరికా రక్షణ శాఖకు కేటాయించిన 4 కోట్ల, 50 లక్షల కోట్ల రూపాయలకు (6.8 ట్రిలియన్‌ డాలర్లకు) ఇది అదనం.

యుద్ధంతో ఏం ఒరుగుతుంది? యుద్ధంలో ప్రధాన సూత్రధారి, పాత్ర ధారి సైన్యం. కష్టనష్టాలకు గురయ్యేది, ప్రాణాలు పోగొట్టుకునేదీ, పలు రకాల అంగవైకల్యాలకు గురయ్యేది సైన్యమే. అధికంగా ఇబ్బందుల పాల య్యేది వారి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు. కొందరు ప్రజలు చనిపోతారు. ఇందులోనూ పేదలు, స్త్రీ‌లు, పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు పడ తారు. ఇప్పుడు ఖాళీ చేసిన 1,000 గ్రామాలో ప్రజలు తమ పశువులకు, పంటలకు దూరమయ్యారు. అప్పులు మాత్రం తప్పవు. సహాయక శిబిరాల అధికారుల దయాదాక్షిణ్యాల మీద బతకవలసిన స్థితికి నెట్టబడ్డారు. ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రజాధనం బుగ్గిపాలవుతుంది. ఉత్పత్తి ప్రక్రియలు స్తంభించిపోతాయి. మార్కెట్లు పతనమౌతాయి. శరణార్థులు పెరుగుతారు. బహుళజాతిసంస్థల వ్యాపారాలు మూడుపువ్వులు ఆరు కాయలుగా విజృం భిస్తాయి. పెట్టుబడిదారులు, ఆయుధాల బేహారులు ఆస్తిపరులవుతారు.

మోదీ మిత్రుడు ఒబామా, మన వ్యూహాత్మక భాగస్వామి అమెరికా మన ప్రత్యేక దళాలు పాక్‌ ఉగ్రవాద శిబిరాలను ‘‘మట్టుపెట్టినంత’’ వరకూ పాక్‌తో మాట్లాడలేదు. పాక్‌ను హెచ్చరించడం, ఉగ్రవాద దేశంగా ప్రకటించడం, ఆంక్షలు విధించడం జరగలేదు. అంతర్జాతీయ శత్రువు, సామ్రాజ్యవాది, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలకూ, ఉగ్రవాదానికీ కారణమైన అమెరికాకు దగ్గరవడం వల్ల మన పూర్వ మిత్రదేశాలకు దూరమయ్యాం. 

బంగ్లాదేశ్‌ యుద్ధం ద్వారా ఇందిర, కార్గిల్‌ యుద్ధం వలన వాజ్‌పేయి అధికారాన్ని తిరిగిపొందగలిగారు. అధికారపక్షాల నకారాత్మకతలన్నీ యుద్ధాలతో తారుమారవుతాయి. మోదీ కూడా ప్రస్తుత కశ్మీర్‌ కల్లోలాలతో అధికసంఖ్యాక హిందువులను ముస్లిం, పాక్‌ వ్యతిరేక భావాలతో రెచ్చగొట్టి తన చర్యలకు మద్దతు సంపాదించాలనుకుంటున్నారు. అధికార పక్షం ఉద్దేశపూరితంగానే వాగాడంబరతతో, చాణుక్యచతురతతో పావులు కదిపింది. తద్వారా త్వరలో రానున్న ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ ఎన్నికలలోనూ, ఆ తరువాత 2019 పార్లమెంటు ఎన్నికలలోనూ గెలవాలనుకుంటున్నారు. లక్షిత దాడులు, సైనిక మోహరింపులు, యుద్ధ ప్రేరణలూ, ప్రచారాలు అన్నీ అధికార పార్టీ గెలుపు కుట్రలే. దీనికి కార్పొరేట్‌ మీడియా, హిందూత్వ వాదులు, అధికారులు, సంఘీయులు అసందర్భ, అతిశయ ప్రగల్బ ప్రచారాల ఆజ్యం పోస్తున్నారు.

కోజికోడ్‌లో బీజేపీ జాతీయ మండలి సమావేశాలలో మోదీ, ‘‘కశ్మీర్‌ విషయంలో పాక్‌ నాయకులు తమ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పాక్‌ ప్రజలు తమ నాయకులను ప్రశ్నించాలి. ఇక్కడి నుంచి పాక్‌ ప్రజలతో మాట్లాడాలని ఉంది. (విదేశాలలో ప్రవాస భారతీయులతో తప్ప స్వదేశంలో ప్రజలతో ఎప్పుడూ ఈయన మాట్లాడలేదు. ఎన్నికల సభలలో తమ పార్టీ బహిరంగ సభలలో తప్ప.) నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత వంటి సమస్యలపై పాక్‌తో యుద్ధానికి మేం సిద్ధం. ధైర్యముంటే ముందుకు రండి. ఎవరు నెగ్గుతారో తేల్చుకుందాం’’ అన్నారు. మన దేశంలో ప్రశ్నించిన ప్రజలను, మేధావులను తమ సంఘీయులు హింసిస్తుంటే, చంపుతుంటే మాత్రం నోరు మెదపరు. పాక్‌ ప్రజలకు సింధునది జలాలను బంధించడం ద్వారా పాక్‌ ప్రజల, రైతుల జీవితాలు దుర్భరమవుతాయి. భారత ప్రజలతో పాటు, కశ్మీరు జనాలతో పాటు, పాక్‌ ప్రజలూ అసంతృప్తులవుతారు. మోదీని ఎదురు ప్రశ్నలు వేయగలరు. పేదల కోసం మోదీ అసలు యుద్ధం చేయాలి.

పాకిస్థాన్‌తో, కశ్మీర్‌ వేర్పాటువాదులతో, కశ్మీర్‌ ప్రజలతో చర్చించాలి. పూర్వ నిర్ణయాలను గౌరవించాలి. అలీనోద్యమం, సార్క్‌, బ్రిక్స్‌, ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికలను బలోపేతం చేయాలి. సామ్యవాద శిబిరాలను నిర్మించి, నిర్వహించి సామ్రాజ్యవాద శిబిరాలకు అడ్డుకట్ట వేయాలి. కశ్మీర్‌ ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి. రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించాలి. యువతకు విద్యావకాశాలను, ఉపాధి అవకాశాలను మెరుగు పరచాలి. విద్యార్థుల, యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా పథకాలు రచించి అమలుచేయాలి. రాష్ట్రం, కేంద్రం తమ చేతిలోనే ఉన్న సువర్ణావకాశాన్ని సదుపయోగ పరుచుకోవాలి. కశ్మీర్‌లో 50 రోజుల నుంచి బంద్‌ సాగుతోంది. స్థానికుల మద్దతు లేకుండా ప్రజాప్రయోజనాలను కాపాడలేం. పాక్‌ను ఒంటరిని చేయలేం. కశ్మీర్‌లో సైన్యానికి సహాయపడే వారు నెలకు 5, 6 లక్షలు సంపాదిస్తారు. అయినా భారతదేశం పట్ల విశ్వాసంతో ప్రవర్తించరు.

వీరి మోసాల వల్లనే ఉరీలో ఉగ్రవాదులు ప్రవేశించగలిగారు. అందుకే పాలకులు స్థానికుల విశ్వాసం పొందాలి. అమెరికా దాని మిత్రదేశాలను ఏకాకులను చేయాలి. పాకిస్థాన్‌ పట్టు అమెరికా చేతిలో ఉంది. దాన్ని బలహీనం చేయడం ద్వారా మాత్రమే పాకిస్తాన్‌ ‘‘బలం’’ తగ్గి దారికొస్తుంది. ఉగ్రవాదానికి ఉరి వేయగలం.

పాలకులు తమ అధికసంఖ్యాకుల మత కోణంలో మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టరాదు. పాక్‌లో ఈ ప్రక్రియలతో జరిగిన నష్టాలను గుర్తించి గుణపాఠం నేర్చుకోవాలి. ఆ తప్పులు మనం చేయరాదు. కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన చేస్తున్న తప్పు మనం బలూచిస్తాన్‌ విషయంలో చేయరాదు. పాలకులు, ప్రభుత్వేతర నాయకులు, మాధ్యమాలు ప్రజలను రెచ్చగొట్టరాదు. ఆవేశాలకూ, భావోద్రేకాలకూ గురిచేసి యుద్ధోన్మాదాన్ని ప్రేరేపించరాదు. ప్రతీకార వాంఛలను ప్రోత్సహించరాదు. యుద్ధం వైపు అడుగులెయ్యరాదు. రాజకీయ లబ్ధికోసం దేశవినాశనాన్ని తెచ్చిపెట్టరాదు.   - సంగిరెడ్డి హనుమంత రెడ్డి (ఆంధ్ర జ్యోతి)

No comments:

Post a Comment