Thursday, 6 October 2016

# చరిత్రకు అడ్డుకట్ట #


ప్రముఖ చరిత్ర కారుడు బిపన్‌చంద్ర నేడు జీవించి ఉండకపోవచ్చు, కానీ మతతత్వం, స్వాతంత్య్ర పోరా టంపై ఆయన ముక్కుసూటి గా వెల్లడించిన భావాల వల్ల అసౌకర్యంగా ఉన్న వారిని ఆయన ప్రాణం వెంటాడుతూనే ఉంటుంది. తాజా సమస్య ఏమంటే బిపన్‌చంద్ర రచించిన ''మతతత్వం- ప్రాథమిక వాస్తవాలు'' అనే పుస్తకం హిందీ అనువాద ప్రచురణను నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ అధికారికంగా రద్దుచేసింది.

''మతతత్వాన్ని తరచుగా మత ఛాందసవాదంతో సమానం చేస్తుంటారు. అయితే వాస్తవానికి అది ఒక సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. దాన్ని విజయవంతంగా ఎదుర్కోవాలంటే మతతత్వ ఆలోచనలను ప్రజల మనస్సుల నుంచి పూర్తిగా తొలగించివేయాలి. శతాబ్ద కాలంగా ఒక వారసత్వంగా ప్రజలకు ఉపదేశించిన, విస్తరింపజేసిన మతతత్వాన్ని మతతత్వ వ్యతిరేక పోరాటం ముందుగా గుర్తించాల్సి ఉంటుంది. ఒక్కసారి మతతత్వ సైద్ధాంతిక స్వభావాన్ని గుర్తించిన తరువాత దానితో పోరాడేందుకు ద్విముఖ వ్యూహం అంటే రాజకీయ, సైద్ధాంతిక వ్యూహం అవసరం'' అని ఆ పుస్తకంలో బిపన్‌చంద్ర వాదించారు. ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) సభ్యులను తీవ్ర మతతత్వవాదులుగా అభివర్ణించారు. ఆ పుస్తక పునర్ముద్రణ నిలిపివేయడం 'పరిపాటిగా' ఎప్పుడూ జరిగే క్రమమేనని నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ పేర్కొంది. అయితే దేశంలోని చరిత్రకారులు ఒక రాతపూర్వక ప్రకటనలో బుక్‌ట్రస్ట్‌ చర్యను బహిరంగంగా నిరసించారు. ''బిపన్‌చంద్ర దేశంలోని అగ్రగణ్యులైన ప్రముఖ చరిత్రకారులలో ఒకరిగానే కాక లౌకిక, ప్రజాస్వామిక విలువల రక్షకులలో ఎలాంటి రాజీలేకుండా ఉన్నవారిలో ఒకరు'' అని ఆ ప్రకటన అభివర్ణించింది. దానిపై ఇర్ఫాన్‌ హబీబ్‌, రోమిల్లా థాపర్‌, కెఎన్‌ ఫణిక్కర్‌, ప్రభాత్‌ పట్నాయక్‌, శిరీన్‌ మూస్వీ, వివన్‌ సుందరం, ఆదిత్య ముఖర్జీ, మృదులా ముఖర్జీతో సహా 150 మందికిపైగా విద్యావేత్తలు, కళాకారులు సంతకాలు చేశారు.
''ఎంతో కాలం నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌కు అధ్యక్షునిగా పనిచేసిన బిపన్‌చంద్ర రచించిన ''మతతత్వం-ప్రాథమిక వాస్తవాలు'' అనే పుస్తక హిందీ అనువాద పునర్ముద్రణను ఆ సంస్థ నిలిపివేసిందని తెలిసి విస్మయం చెందాం. ఆంగ్ల, ఉర్దూ భాషలో ప్రచురితమైన పుస్తకాలను కూడా ఉపసంహ రించుకోబోతున్నారని తెలిసింది. నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ చేపట్టిన ఈ చర్య భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉల్లంఘించడమే. బిపన్‌చంద్ర పుస్తకం పట్ల నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ వ్యవహరించిన తీరు నిరంకుశ పాలనను రుద్దుతున్నదనే అనుమానాన్ని కల్గిస్తున్నదని విద్యావేత్తలుగా, దేశ పౌరులుగా మేము భయపడుతున్నాము. అందువల్ల నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ ''మత తత్వం-ప్రాథమిక వాస్తవాలు'' అనే గ్రంథం పునర్ముద్రణ రద్దును వెనక్కు తీసుకొని తిరిగి దానిని ప్రచురించాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం''.
ఆదిత్య ముఖర్జీ, మృదులా ముఖర్జీ, కెఎన్‌ ఫణిక్కర్‌, సుచేతా మహాజన్‌తో కలిసి బిపన్‌చంద్ర రచించిన 'భారత స్వాతంత్య్ర పోరాటం' హిందీ అనువాద గ్రంథం అమ్మకం, పంపిణీని నిషేధిస్తూ ఢిల్లీ యూనివర్శిటీ నిర్ణయం తీసుకున్న సమయంలోనే నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ ఈ చర్యకు పూనుకుంది. 1987 నుంచి చరిత్ర విద్యార్థులకు ఒక పాఠ్య పుస్తకం మాదిరిగా ఉన్న ఈ గ్రంథాన్ని యూనివర్శిటీ హిందీ భాషలో ప్రచురించింది. ''మతతత్వంపై రచించబడిన గ్రంథాలను మతతత్వవాదులు నిషేధిస్తారు'' అని డిఎన్‌ ఝా ఆన్‌లైన్‌లో క్లుప్తంగా సందేశమిచ్చారు. ''మతతత్వం ఇప్పుడు దేశ అధి కారిక సిద్ధాంతంగా తయారైంది'' అని ఈ చర్య వెల్లడిస్తోందని ప్రముఖ చరిత్రకారుడు శిరీన్‌ మూస్వీ అభిప్రాయపడ్డారు. 
నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో తమ రచనలకు కూడా ఇదే గతి పడుతుందేమోనని ఇతర విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. భగత్‌సింగ్‌ చరిత్రపై మంచి పట్టున్న వ్యక్తి చమన్‌లాల్‌ ఈ చర్యను సందేహాత్మక మైనదిగానూ, అవమానకరమైనదిగానూ పేర్కొంటూ ఈ విధంగా పేర్కొన్నారు: ''బిపన్‌చంద్ర గ్రంథ పునర్ముద్రణ నిలిపివేత నిర్ణయం చాలా తీవ్రమైనది. బిపన్‌చంద్ర బుక్‌ ట్రస్ట్‌కు చాలా సుదీర్ఘకాలం పాటు అంటే ఎనిమిది సంవత్స రాలు చైర్మన్‌గా ఉన్నారు. ఆ కాలంలోనే 'స్వాతంత్య్ర పోరా టం', 'జాతీయవాదం' అంశాలపై వందకు పైగా పుస్తకాలు అనేక భారతీయ భాషలలో ప్రచురించబడి, చాలా చౌక ధరలకు అందించబడ్డాయి. బిపన్‌చంద్ర ఆంగ్లంలో రచించిన ఆ పుస్తకాన్ని ఎన్‌బిటి ఇంకా ముద్రిస్తూనే ఉంది. తన ప్రకట నల్లో దాన్ని తన ప్రధానమైన ప్రచురణగా పేర్కొంటూనే ఉంది. ఈ సందర్భంలో అర్థంకాని విషయం ఏమంటే బిపన్‌చంద్ర గ్రంథం హిందీ అనువాదాన్ని ఎన్‌బిటి స్టోర్స్‌ నుంచి, అమ్మకపు కేంద్రాల నుంచి తొలగించడానికి నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ ప్రస్తుత చైర్మన్‌ ఎందుకు అంగీకరించారు లేదా పరిస్థితి ఎలా ఉంటుందో పరీక్షించేందుకు ఒక రాయి విసిరారా? పరిస్థితిని బట్టి భగత్‌సింగ్‌పైనా, గదర్‌పార్టీ వీరుడు కర్తార్‌ సింగ్‌ శరభపై నేను రచించిన రెండు గ్రంథాలతో సహా బిపన్‌చంద్ర పదవీకాలంలో జాతీయ వాదానికి సంబంధించి ముద్రించిన అన్ని ప్రచురణలనూ ఉపసంహరించగలమనుకుంటున్నారా''.
బుక్‌ట్రస్ట్‌ చర్య వాస్తవాలకు అద్దంపట్టే చరిత్రకారుల గొంతుకలు వినిపించకుండా మూతికి చిక్కాలు కట్టడం లాంటిది. ఉదారవాద, వామపక్ష చరిత్రకారుల రచనలను ఏరిపారవేయడానికి బాగా ఆలోచించి వేసిన పథకంలో భాగమే బిపన్‌చంద్ర రచన 'మతతత్వం:ప్రాథమిక వాస్తవాలు'పై చర్యగా ఆయన పేర్కొన్నారు. ''భారత స్వాతంత్య్ర పోరాటం'' రచనలో బిపన్‌చంద్ర సహ రచయిత ఆదిత్య ముఖర్జీ ఈ విధంగా పేర్కొన్నారు. ''ప్రస్తుతం అసహనం అనే నమూనా ఉనికిలో ఉన్నది. ఒకప్పుడు మనం ఏ దేశాలను చూసి అపహాస్యంగా నవ్వామో, ఇప్పుడు ఆ దేశాల వైపు వేగంగా కదిలిపోతున్నాం. ఉదాహరణకు పాకిస్తాన్‌. ఒక ఆధునిక, ఉదారవాద ప్రజాస్వామ్యం పని చేయాల్సింది ఇలా కాదు. చివరికి వాజ్‌పేయి పాలనలో కూడా మాకు ఈ విధమైన అనుభవాలు ఎదురుకాలేదు. ఎందుకంటే ఆనాడున్నది మితవాదం వైపు మొగ్గే పాలన అయినప్పటికీ మనది ప్రజాస్వామ్య దేశంగానే ఉంది. నేడు మన దేశం భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే దేశాలను అనుసరిస్తున్నది. బుక్‌ట్రస్ట్‌ చర్య అంతకంటే హీనమైనదిగా కన్పిస్తోంది. నేటి పాలకులు రాజ్య వ్యవస్థలను ఉపయోగిం చడం మాత్రమే గాక తమకు అసౌకర్యం కల్గించే చారిత్రక వాస్తవాలను కూడా వదిలించుకోవడానికి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా ఆ వైపుగా తిప్పుతున్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం గ్రంథాన్ని తొలగించడానికి వారు నీచమైన సాకులు చూపించారు. 'మతతత్వం-ప్రాథమిక వాస్తవాలు' గ్రంథానికి ఏ కారణం చూపలేదు. భగత్‌సింగ్‌ను 'విప్లవాత్మక తీవ్రవాది'గా పేర్కొన్నందుకు అకస్మాత్తుగా 'భారత స్వాతంత్య్ర పోరాటం'పై రచించబడిన గ్రంథం వారి ఆగ్రహానికి గురయింది.

|| విప్లవ తీవ్రవాదం-తీవ్రవాదం ||

''బిపన్‌చంద్ర తాను తీవ్రవాది, విప్లవ తీవ్రవాదం అనే పదాలను ఉపయోగించిన ఉద్దేశాన్ని వివరించారు. విప్లవకర తీవ్రవాదం అనే పదానికి ఒక గౌరవం ఉంది. ఎందుకంటే దానికి నిస్వార్థమైన, త్యాగపూరితమైన చర్యలు అనే అర్థం ఉంది కాబట్టి దానికి తగిన గౌరవం ఉంది. ఉగ్రవాదం అనే పదాన్ని బ్రిటిష్‌వారు లేక వలసవాద శక్తులు ఉపయోగించాయి. కానీ 'విప్లవకర తీవ్రవాదం' అనే పదాన్ని ఆసియా, ఆఫ్రికా ఖండాలలో వలసవాద వ్యతిరేక పోరాట కాలంలో దేశభక్తులు, జాతీయవాద రచయితలు, చరిత్ర కారులు ఉపయోగించారు. 1990 తరువాత ఇస్లాం రాజ్యాలు, ఇతర ఉగ్రవాద సంస్థల ఆవిర్భావంతో విప్లవకర తీవ్రవాదం అపఖ్యాతి పాలయింది. ఈ పుస్తకం ఆంగ్లంలో పెంగ్విన్‌ పబ్లికేషన్‌, హిందీలో ఢిల్లీ యూనివర్శిటీ వారు ప్రచురించినప్పుడు ఆ పదానికి వ్యతిరేకార్థం ఏదీ రాలేదు. ఈ రచయితలు/చరిత్రకారులు మార్క్సిస్ట్‌/ఉదారవాద లేక జాతీయవాద భావాలకు చెందినవారు అయినందున కొన్ని స్వార్థ ప్రయోజనకర శక్తులు అనవసరంగా రాజకీయ కారణాలతో ఈ పుస్తకంపై దాడి చేస్తున్నాయి'' అని చమన్‌లాల్‌ పేర్కొన్నారు.
''మేము ఆ పదం స్థానంలో 'విప్లవకర జాతీయ వాదులు' అనే పదాన్ని చేర్చాము. కానీ ఆ పుస్తకంలో మతతత్వంపై అనేక అధ్యాయాలుండటం వల్లనే దాన్ని ఉపసంహరించారు. భగత్‌సింగ్‌ మాత్రం దానికి మినహా యింపు. అయితే వారేమీ భగత్‌సింగ్‌ ప్రేమికులు కాదు. స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఎలాంటి ప్రస్తావన ఉన్నా వారికి అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్‌ఎస్‌ ఎస్‌ స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్రా పోషించలేదని వారికి తెలుసు'' అని ఆదిత్య ముఖర్జీ వివరించారు. శిరీన్‌ మూస్వీ ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. ''వాస్తవానికి స్వాతంత్య్ర పోరాటాన్ని బలహీనపర్చడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ అన్ని విధాలా కృషి చేసింది. కాబట్టి, అది (ఆర్‌ఎస్‌ఎస్‌) జాతీయ పోరాట చరిత్రకు సంబంధించిన సందేశాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థులకు అందించే పాఠ్యాంశాల విషయంలో ఎప్పుడూ జాగ్రత్త పడుతూ వచ్చింది.'' దాడికి గురౌతున్న చరిత్రకారు లెవరూ వెనుకకు తగ్గడానికి సిద్ధంగా లేరు. ''వ్యక్తులుగా చరిత్రకారులకు ప్రభుత్వ అంగీకారం లేదా అనంగీకారం అవసరం లేదు. ప్రభుత్వం తమ సలహాలు కోరడానికి పిలుస్తుందని ఏ ఒక్కరూ ఆశించడం లేదు. కానీ ప్రభుత్వం చారిత్రక లేక పురాతత్వశాస్త్ర పరిశోధనలకన్నా, దేనిలోనూ పరిశోధనలు, ప్రచురణలు చేయనటువంటి వ్యక్తులతో 'ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌'ని నింపడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌కు అవసరమైన సరంజామాను సమ కూరుస్తూ, దాని ప్రణాళికలను పెంచి పోషించడానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నది. సహేతుకమైన వాదన లేక భావ స్వాతంత్య్రం పట్ల ఎలాంటి గౌరవం లేనివారు సాధారణంగా ఈ రకమైన దుర్వినియోగానికి, బెదిరింపులకు పాల్పడతారు'' అని శిరీన్‌ మూస్వీ పేర్కొన్నారు.
''కొందరు స్వతంత్ర చరిత్రకారులు, వారు మిత వాదులా, మధ్యేవాదులా లేక వామపక్ష సంస్థలకు చెందిన వారా, లేక వారికి రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అనేది ఇక్కడ సమస్య కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారికి ఇబ్బంది కరంగా ఉన్నది ఏదంటే మితవాద భావాలున్న జిఆర్‌ భండా ర్కర్‌, ఆర్‌సి మజుందార్‌ లేక డిసి సర్కార్‌ లాంటివారు ఆవిష్క రించిన భారతదేశ చరిత్ర. ఎందుకంటే ఈ దేశ ప్రజలు పచ్చి కల్పితాలను నమ్మాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుకుంటోంది'' అని శిరీన్‌ మూస్వీ వివరించారు.
''చరిత్రకారులు అలాంటి దాడులకూ భయపడరు. జర్మనీలో హిట్లర్‌ నాయకత్వంలో ఏం జరిగిందో వారికి (చరిత్రకారులు) తెలుసు'' అని డిఎన్‌ ఝా ముగించారు.
('ఫ్రంట్‌లైన్‌' )

No comments:

Post a Comment