Thursday, 15 September 2016

|| దళిత ప్రతిఘటన-వామపక్ష పాత్ర ||




                      భారత సామాజిక-ఆర్థిక నిర్మాణ మౌలిక లక్షణం కుల వ్యవస్థ. పుట్టుక, వారసత్వాలు మారని సామాజిక అంతస్తులలో స్థానాన్ని నిర్ధారిస్తాయి. తన దళిత అస్తిత్వం ఒక 'ప్రాణాంతకమైన ప్రమాదం' అని రోహిత్‌ వేముల తాను రాసిన ఉద్విగభరితమైన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. అది నిజం. ఆయనే గనుక మరే ఇతర కులంలో పుట్టివున్నట్టయితే తన తల్లి ఎదుర్కొన్న కులపరమైన అవమానాలను రోహిత్‌ బాల్యం చూచి ఉండకపోయేదే. అలాగే రోహిత్‌, రోహిత్‌ తమ్ముడు రాజా పాఠశాలలో వివక్షను చవిచూడక పోయేవారే. ఒక మంచి విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా తనకు బతకటానికి అవసరమైన స్కాలర్‌షిప్‌ను రద్దు చేసివుండపోయినట్టయితే తను అలాంటి తీవ్ర చర్యకు పాల్పడివుండకపోయేవాడే. ఆ విధంగా రోహిత్‌ సంస్థాగతం గా హత్యచేయబడ్డాడు. ఇక్కడ ప్రశ్నించ వలసింది నిర్దయతో వ్యవహరించిన విశ్వవిద్యాలయాన్నే కాదు. నిజానికి ఇక్కడ కుల వ్యవస్థను ప్రశ్నించాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ సమర్థకులు చెప్పేదానికి భిన్నంగా భారతదేశంలోని కుల వ్యవస్థకు చెందిన వికృతాలను పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు వచ్చే ఆధునికీకరణ లక్షణాలు నిర్మూలించలేక పోయాయి. భారతదేశంలోని పెట్టుబడిదారీ వ్యవస్థ గతి మార్గం భూస్వామ్య, అర్ధ భూస్వామ్య సామాజిక శక్తులతో మమేకమై సాగుతున్నది. అయితే దానికి ఇదొక్కటే అవలక్షణం కాదు. దళితుల శ్రమను, మిగులు విలువను మరింతగా దోచుకోవటానికి పెట్టుబడిదారీ వ్యవస్థ కుల వ్యవస్థను తనలో కలుపుకున్నది. భారతదేశంలోని పెట్టుబడిదారీ వ్యవస్థలో అది అంతర్భాగం. ఈ వాస్తవాన్ని నయా ఉదారవాద విధానాలు తీవ్రతరం చేశాయి.
ఈ మధ్యకాలంలో దళిత ప్రతిఘటనలో మూడు విషయాలు ప్రధానంగా ముందుకొచ్చాయి. ఈ మూడు విషయాలూ వామపక్షానికి చాలా అవసరమైనవి. గుజరాత్‌లోని ఉనా ఉద్యమం ముందుకుతెచ్చిన దళితుల జీవనాధారం. రోహిత్‌ వేముల ఆత్మహత్య ముందుకు తెచ్చిన దళితుల విద్యకు సంబంధించిన సమస్య. హర్యానాలోని సునాపెడ్‌ గ్రామంలో ఇద్దరు దళిత బాలుర సజీవ దహనం ముందుకుతెచ్చిన దళితులపై జరుగుతున్న హింస సమస్య. అయితే ముందుగా మనం ఈ మూడు సమస్యల రాజకీయ, ఆర్థిక సందర్భాన్ని పరిగణనలోకి తీసుకుందాం.

|| హిందూత్వ-కులం ||

                     హిందూత్వకు ప్రాతినిధ్యం వహిస్తున్న శక్తులు అధికారంలోకి వచ్చిన ఒక గుణాత్మక నూతన రాజకీయ పరిస్థితిలో కుల వ్యవస్థను కూలదోసేందుకు పోరాటం జరుగుతున్నది. కుల సమస్యపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) ఎల్లవేళలా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది. ఒకవైపు అది కుల వ్యవస్థను ఆమోదించటమే కాకుండా దానిని కీర్తించే సనాతన ధర్మాన్ని సమర్థిస్తున్నది. మరోవైపు అది 'హిందూ కుటుంబ ఐక్యత' గురించి మాట్లాడుతున్నది. ఆర్‌ఎస్‌ఎస్‌ చారిత్రక అవగాహనను అనుసరించి ఆదిలో ఉన్న కుల వ్యవస్థలో లోపం ఏమీ లేదని, కేవలం మొగల్‌ చక్రవర్తుల పాలనలో కులం ఒక అణచివేత సాధనంగా మారిందని హిందూత్వ వాదులు భావిస్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రగణ్యులలో రెండవవాడైన భయ్యా జోషీ దళితులుపై రాసిన ఒక గ్రంథానికి ఉపోద్ఘాతం రాశాడు. దానిలో ఆయన ఇలా పేర్కొన్నాడు: 'దళితుల పట్ల, శూద్రుల పట్ల హిందూ ధర్మశాస్త్రాలు ఎన్నడూ వివక్ష చూపలేదు. అప్పట్లో అంటరానితనం లేదు. ఈ ఆచారాన్నింటినీ ముస్లిం పాలకులే సృష్టించారు'. అయితే ముస్లిం పాలకులు రావటానికి అనేక శతాబ్దాలకు ముందు కుల వ్యవస్థకు మద్దతు తెలుపటమేకాకుండా దానిని కీర్తించిన మనుస్మృతి, ఇతర హిందూ ధర్మశాస్త్రాల మాటేమిటి? ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆ వాస్తవాలు పట్టవు.
దళితులు చేస్తున్న పాకీ పనిని ప్రజలకు సేవ చేయటానికి ఒక ఆధ్యాత్మిక విధి నిర్వహణగా వారే ఎంచుకున్న 'దైవ కార్యకలాపం' అని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. కర్మయోగ్‌ అనే గ్రంథంలో మోడీ ఇలా రాశారు: 'కేవలం జీవనాధారం కోసం వారు ఈ పని చేస్తున్నారని నేను భావించటం లేదు. అదే నిజమైతే ఇలాంటి పనిని వారు తరతరాలుగా కొనసాగించి ఉండేవారు కాదు'. ఆ తరువాత ఆయన ఇలా రాశారు: 'మొత్తం సమాజాన్ని, దేవుళ్ళను సంతోషపెట్టటానికి ఇది తమ కర్తవ్యమనే భావన ఒకానొక క్షణంలో ఎవరికో వచ్చి ఉంటుంది. దీనిని వారు దైవాదేశంగా భావించి ఉంటారు. అందుకే ఈ శుద్ధి కార్యకలాపం ఒక ఆధ్యాత్మిక కార్యకలాపంగా శతాబ్దాల తరబడి కొనసాగుతున్నది. తరం తరువాత తరం దీనిని కొనసాగించింది. వారి పూర్వీకులకు మరో పనిని ఎంచుకునేందుకు అవకాశం లేకపోయిందనటాన్ని నేను నమ్మను'.
చరిత్ర నుంచి ఎటువంటి పాఠాలనూ మోడీ నేర్చుకోలేదని దీనిని బట్టి తెలుస్తున్నది. హిందూ ధర్మశాస్త్రాలలో మూలాలుగల కుల వ్యవస్థకు సరిగ్గా ఇలాంటి సిగ్గుమాలిన సమర్థనలు చేయటంవల్లనే బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వంటి దళిత నాయకులు బౌద్ధంలోకి మారారు. 'హిందూ కుటుంబం' అనే భావన వైరుధ్యాలమయం. ఆచరణలో అది నిత్యం వంచనతో కూడి ఉంటుంది. దళితులు అట్టడుగున గల నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలనే ఆలోచనే పునాదిగా ఈ భావన ఉన్నది. మతం మారిన దళితులు తిరిగి నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో దళితులుగా రావాలని అంటున్నారు. ఈ విషయం హిందూత్వ వాదుల ఘర్‌ వాపసీ ప్రచారం నడుస్తున్న కాలంలో ముందుకొచ్చింది! ఆర్‌ఎస్‌ఎస్‌ దళితుల హక్కుల గురించి మాట్లాడుతుంది. కానీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగే ప్రతి ప్రగతి నిరోధక ఉద్యమాన్నీ అది సమర్థిస్తుంది. రిజర్వేషన్లను పునస్సమీక్షించాలంటూ రిజర్వేషన్‌ విధానానికి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత బహిరంగంగా మాట్లాడాడు. హిందూత్వ ప్రచారానికి ఆర్‌ఎస్‌ఎస్‌ దళితులను వాడుకుంటోంది. అయోధ్యలో ఒక గుడికి శంకుస్థాపన ఒక దళితుడితో చేయించారు. అయితే అదే సమయంలో అనేక దేవాలయాలలో దళితులకు ప్రవేశం నిషేధం. దేవాలయాలలో దళితుల ప్రవేశాన్ని అమలు చేయటానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి ఉద్యమాలనూ నిర్వహించలేదు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌తో పాటు సుందరయ్య, ఎకె గోపాలన్‌ వంటి కమ్యూనిస్టు నాయకులు ఆ పాత్రను నిర్వహించారు. ఆ వారసత్వాన్ని వామపక్షం నేటికీ కొనసాగిస్తున్నది. దళితులతో సహపంక్తి భోజనం గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ మాట్లాడుతుంటుంది. ఒక దళిత యువకుడు అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నప్పుడు వారికి వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టే ఖాప్‌ పంచాయితీల(కుల పంచాయితీలు) పక్షాన అది నిలుస్తుంది. బిజెపి పాలిత రాష్ట్రాలలో అనేక రూపాలలో కొనసాగుతున్న హింస గురించి కానీ, దళితుల అధమ సామాజిక, ఆర్థిక సూచీల గురించి కానీ ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. గుజరాత్‌ మారణహోమంలో జరిగినట్టుగా దళితులను ముస్లింలపై పోరాడేందుకు ఉపయోగపడే సమరశీల శక్తిగా ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వం అండతో దళితుల విషయంలో అన్ని స్థాయిల్లో పరస్పర విరుద్ధమైన ఎజెండాను అమలు చేస్తున్నది. కాబట్టి సహజంగానే ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి రాజకీయ కూటమితో దళిత ప్రతిఘటనా ఉద్యమాలు తలపడుతున్నాయి.

|| దళితుల స్థాయిని మరింతగా దిగజార్చిన నయా ఉదారవాద విధానాలు ||

అదే సమయంలో బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలో దూకుడుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పరిస్థితిని మరింతగా దిగజార్చాయి. షెడ్యూల్డ్‌ కులాలకు చారిత్రక వారసత్వంగా వచ్చిన అసమానతలను రూపుమాపటంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఘోరంగా విఫలమైందని సామాజిక, ఆర్థిక గణాంకాల నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ తారతమ్యాలు ఇప్పటికీ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా అన్ని కులాలలోనూ పేదల సంఖ్య పెరిగి వారు జనాభాలో సగానికి పైగా ఉండటం పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తున్నది. పేదరికం పెరుగుతున్న పరిస్థితులలో కుల అణచివేత వల్ల దళితులు పేదలందరిలోకల్లా నిరుపేదలయ్యారు. 3,31,00,000 దళిత కుటుంబాలలో 72.58 శాతం కుటుంబాలు 'నిరుపేదలు'గా ఉన్నారు. 55 శాతానికి భూమి అంటూ ఏమీ లేదు. 67.27 శాతం శారీరక శ్రమచేసే క్యాజువల్‌ లేబర్‌. కేవలం 11.29 శాతానికి మాత్రమే పక్కా గృహాలున్నాయి. ఈ గణాంకాలను అనుసరించి ఇతర కులాలతో పోల్చినప్పుడు షెడ్యూల్డ్‌ కులాలు 20 శాతం అదనపు లేమిని అనుభవిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో ప్రచురింపబడిన 'భారతదేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో సామాజిక వెలి-కుల వివక్ష:ఒక విఘటనా విశ్లేషణ'(2016) అనే అధ్యయనం అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. సమాన అర్హతలున్న ఉద్యోగులను పోల్చిచూసినప్పుడు దళిత కులాలకు చెందిన వారు ఇతర సామాజిక గ్రూపుల కంటే ప్రభుత్వ రంగంలో 19.4 శాతం తక్కువ వేతనాలను పొందుతున్నారు. ఈ వ్యత్యాసం ప్రయివేటు రంగంలో 31.7 శాతంగా ఉన్నది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే నయా ఉదారవాదం దేశంలోకి ప్రవేశించిన తరువాత ప్రయివేటు రంగంలో దళితులకు, దళితేతరులకు మధ్య వేతన వ్యత్యాసం మరింతగా పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలలో ఈ వ్యత్యాసం తక్కువగా ఉండటానికి కారణం రిజర్వేషన్లు ఉండటమే. అయినప్పటికీ దాదాపు 20 శాతం ఉన్న ఈ వ్యత్యాసం చాలా ఎక్కువనే చెప్పాలి. 2006లో ఎమ్‌బిఎ పట్టభద్రులపై అహ్మదాబాద్‌ ఐఐఎమ్‌ ఆధ్వర్యంలో అంతకు ముందు చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఎస్‌సి, ఎస్‌టి విభాగానికి చెందిన పట్టభద్రులకు ఇతరుల కంటే 20 నుంచి 35 శాతం దాకా తక్కువ వేతనాలు అందుతున్నాయి.
రాజ్యాంగం నిర్దేశించిన రిజర్వేషన్ల వల్ల దళితుల సామాజిక పురోగతికి అడ్డుగా ఉన్న కులమనే ఉక్కు చట్రం కొంత వరకు బలహీనపడింది. అయితే నయా ఉదారవాద విధానాల ప్రవేశంతో ప్రయివేటీకరణ వేగవంతం అవటమే కాకుండా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ నిలిచిపోయింది. దానితో దళితులకు రావలసిన ఉద్యోగాలలో భారీగా కోతపడింది. ఈ కాలంలో దళితులలోని విద్యావంతులకు అవకాశాలు సన్నగిల్లాయి. దీనితో కుల ఆధారిత వృత్తులలో కొనసాగుతున్న దోపిడీ బలోపేతమయింది. పారిశుద్ధ్యం, ఊడ్చటం, పాకీపని, మురుగు కాల్వలలో అడ్డుపడే చెత్తను తీసివేయటం, చనిపోయిన పశువుల చర్మాన్ని వలవటం వంటి అపరిశుద్ధమైన వృత్తులు కేవలం దళితుల కోసమే 'రిజర్వ్‌' చేయబడ్డాయి. అలాంటి ఉద్యోగాలలో దళితులకు అత్యధిక ప్రాతినిధ్యం ఉన్నది. ప్రభుత్వ రంగంలో పారిశుద్ధ్య పనిని ఈ రోజుల్లో కాంట్రాక్టర్లకు ఔట్‌సోర్స్‌ చేస్తున్నారు. ఇలాంటి ఔట్‌సోర్సింగ్‌ పనులను చేస్తున్నవారిలో 90 శాతం దళితులున్నారు. నయా ఉదారవాద విధానాల శకంలో ప్రభుత్వ రంగంలో ఈ పనులు శాశ్వతంగా అవసరమైనప్పటికీ వాటిని చేసేందుకు కావలసిన నియామకాలను క్రమబద్ధీకరించటం ఆపారు. ఆ విధంగా పెట్టుబడిదారీ రాజ్యం నేతృత్వంలో దళితుల శ్రమను ఆర్థికంగానూ, సామాజికంగానూ దోపిడీ చెయ్యటం జరుగుతున్నది. 
 - బృందా కరత్‌

No comments:

Post a Comment