సంప్రదాయ ఛందస్సులో ప్రగతిశీలక భావాలు చెప్పిన కవి జాషువా. మన వర్ణ వ్యవస్థ దళితుల్ని కనీసం మనుషులుగా కూడా గుర్తించలేదు. వర్ణవ్యవస్థకు బలమైన పునాది హిందూమత సంప్రదాయంలో ఉంది. హిందూమతంలోని మూఢాచారాలు అహేతుకమని ప్రశ్నించాడు జాషువా. ఈ దేశంలో దళితుని జీవితాన్ని మార్చలేనప్పుడూ; సృష్టిలో ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ అనే భావన కలిగించింది దేవుడే అయినప్పుడూ; అలాంటి దేవుడు మాకు అక్కరలేదు- అని హేతవాద దృష్టితో, దుష్టశిక్ష్షణ, శిష్టరక్షణార్థం అవతరిస్తానన్న దేవుడ్ని- 'నువ్వు ముందు పుట్టి చేసింది లేదు. ఇక పుడితే నెత్తికెత్తేది లేదు' అని గట్టిగా నిలశాడు జాషువా.
'కనుబడలేదు దైవతముగాని పదార్థములు భారతంబునన్
గనుపడలేదు వర్ణమున కన్న మహాకళ భారతంబునన్
కనుబడలేదు సత్కులము కన్న పిశాచము భారతంబునన్
గనుపడలేదు పంచమునికన్న నీచవు 'జంతు వేదియున్.' అని అన్నారు.
జాషువా గబ్బిలంలో హేతవాద దృష్టి ఉంది. తెలుగు సాహిత్యంలో వేమన, సామినేని ముద్దు నరసింహం, కందుకూరి, గురజాడ, త్రిపురనేని రామస్వామి చౌదరి, జాషువా లాంటివారు హేతువాద భావాల వ్యాప్తికి దోహదం చేశారు.
దళితుల కష్టంతో దైవానికి నైవేద్యం పెట్టి, ఆ కష్టజీవులనే అంటరానివారిగా చూసే సంఘాన్ని జాషువా ప్రశ్నిస్తాడు.
'వాని నైవేద్యమున నంటుపడిననాడు
మూడు మూర్తులకును గూడ గూడులేదు'
దళితుల్ని దారిద్య్రానికి గురి చేయడమే గాక, వారిని అసహ్యించుకోడానికి కారణమైన హిందూమతాన్ని తీవ్రంగా నిరసిస్తాడు.
'ఆ యభాగ్యుని రక్తంబునా హరించి
యినుప గజ్జెలతల్లి జీవనము సేయు
గసరి బుసకొట్టు నాతని గాలిసోక
నాల్గుపడగల హైందవ నాగరాజు'
దళితుల శ్రమదోపిడికి గురికావడాన్ని కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టడం తగదంటాడు.
'కర్మ సిద్ధాంతమున నోరుకట్టివేసి
స్వార్థలోలురు నాభుక్తి ననుభవింత్రు'
బతికి ఉన్నప్పుడు మనిషిని, మనిషిగా చూడకుండా మరణించిన తర్వాత గౌవరం ఒలకబోసే సంప్రదాయం సరికాదంటాడు. హేతువాద భావాల్ని చెప్పిన కవి వేమనను గురించి కూడా తెలియజేశారు.
ఇంతకు ముందు జన్మలెత్తి ధర్మాన్ని స్థాపించిన అవతారమూర్తి అప్పటి అధర్మ, అసమాన సమాజాన్ని ఎందుకు మార్చలేకపోయాడని సూటిగా ప్రశ్నిస్తాడు.
'ధర్మ సంస్థాపనార్థాంబు ధరణిమీద
నవతరించెననె నబ్జభవుని తండ్రి
మునుపు జన్మించి నెత్తికెత్తినది లేదు
నేడు జన్మింపకున్న మున్గినదిలేదు'
పసిపిల్లల్ని బలి ఇవ్వటం, భర్త చనిపోతే భార్యను చితిలో దగ్ధం చేయడం మొదలైన మత దురాచారాల్ని నిశితంగా విమర్శించారు. అందుకే -
'మొక్కుబళ్ళ నెపాన పసిపాప
లెందరు గంగలో నిమిడిరొక్కొ
సహగమనాచార దహన దేవతలెన్ని
చిగురు కొమ్మల బూదిచేసెనొక్కా' అని పలికారు
కరుణను కమ్మగా బోధిస్తూ జాతర పేరిట జంతుబలి చేసే మతవాదులు దుశ్చర్యల్ని అసహించుకున్నారు జాషువా. కాబట్టే
'అరవంగుత్తుకగోసి జంతువుల గర్భాగారముల్ జీల్చినె
త్తురుటేళ్ళన్నటియంచు మూఢతమజాతుల్ జాతరల్ సేయజూ
తురు చూపింతురు ప్రోత్సహింత్రు తతివాదుల్ శాస్త్ర పారంగతుల్
కరుణల్ కమ్మని బోధలోపులు గుటక్కా చీ! హుళుక్కుల్ గదా' అని ప్రకటించారు.
నరుల్ని అస్పృశ్యులని దూరముంచి జంతువులకు పూజలు చేస్తారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇవి వేద రహస్యాలని వీటిని నిమ్నజాతులు ప్రశ్నించరాదని చెప్పే కుటిల నీతిని బట్టబయలు చేశారు కవి ఈ కింది పద్యభాగంలో-
'నరులవ్ ముట్టక నందులంగొలిచి పుణ్యంబెల్ల సాధించున
ప్పరమంబైన రహస్యమున్ శివునితో ప్రస్తావముంజేసితే'
కరుణతో మనిషివైపు చూపి సారించని సంఘం, విగ్రహాలపై భక్తి ప్రదర్శిస్తుంది. 'మానవసేవయే మాధవ సేవ' అని బోధిస్తారు. ఆచరణలో మాత్రం మానవత్వాన్ని విడిచిపెట్టి విగ్రహారాధనతో ఊరేగుతారు. దీన్ని విమర్శించారు జాషువా. అందుకే-
'ప్రతిమల పెండ్లిసేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలవ్
మెతుకు విదల్పదీ భారతమేదిని ముప్పది మూడు కోట్లదే
వతలెగవడ్డ దేశమున భాగ్యవిహీనులక్షుత్తులారునే'
''ఏనాడు మా కావ్య స్పష్టికర్తల జిహ్వ
విశ్వసత్యంబు నాలపింపగలదొ
ఏనాడు మాజాతి దృష్టి మాంద్యమువాసి
చుట్టుపక్కల దేరిచూడగలదొ
ఏనాడు మా బుర్ర జుట్టు తలలేని
పుక్కిటి కథలలో జిక్కువడవొ
ఏనాడు మా విద్య లినుప సంఘమునందు
చిలుముపట్టక ప్రకాశింపగలవొ
తనువు దాచక సామరితనముమాని
యెన్నడీ మఠంబులు చిచ్చమెత్తుకొనవొ
అట్టి శుభవేళకై కొంగుబట్టి నిలిచి
నలిగివాపోవుచున్నది నామనస్సు' అని అశాభావం వ్యక్తం చేశాడు.
కవులు విశ్వసత్యాన్ని పలకాలన్నాడు. భారత జాతి సంకుచిత దృష్టి విడిచి, విశాల దృక్పథాన్ని అలవరచుకోవాలన్నాడు. పుక్కిటి పురాణాల్ని నమ్మవద్దన్నాడు. మూడ నమ్మకాల సంప్రదాయ బంధనాలు తొలగించుకొని వికాసం చెందాలన్నాడు. సోమరితనంతో బిచ్చమెత్తుకునే నైజం పోవాలన్నాడు. జాషువా దూరదృష్టి, వైజ్ఞానిక దృష్టి, సమతా దృష్టి ఇప్పటికీ అనుసరణీయం. ఎప్పటికన్నా ఇప్పుడు మరింత అవసరం కూడా!
(ఈనెల 28న గుర్రం జాషువా జయంతి)
- ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న

No comments:
Post a Comment