Thursday, 8 September 2016

|| మతం - శాస్త్రీయ ధృక్పథం ||



వినాయక చవితి, బక్రీదు, శ్రీరామ నవమి, రంజాన్‌, క్రిస్మస్‌, ఓనం, దసరా వంటి పండుగల్లో ప్రజలు కోటానుకోట్ల మంది పాల్గొంటున్నారు. మత భావాలను ప్రోత్సహించింది, పదిలపర్చింది, కొనసాగించింది విజ్ఞాన శాస్త్రంగానీ, శాస్త్రవేత్తలుగానీ కాదు. పనిగట్టుకొని కొందరు వ్యక్తులు కూడా చేస్తున్న కార్యకలాపం కాదు. అది వర్గ సమాజపు ధోరణి. మోసగించబడ్తున్న ప్రజలు తాము మోసానికి లోనవుతున్నామని గమనించకుండా వుండాలన్నా, మనస్ఫూర్తిగా, ఐచ్ఛికంగా మోసపోవడానికి సింసిద్ధతను వ్యక్తం చేయాలన్నా ఓ తీపి, నొప్పిలేని మత్తుమందును ప్రజలకు దోపిడీ సమాజం ఒనగూర్చుతుంది. ప్రకృతి రీత్యా ఎన్నో అద్భుతాలకు జవాబులు తెలీని రోజుల్లో పైవాడెవడో ప్రతిదీ నడిపిస్తున్నాడన్న భావనతో ప్రతి ఘటనకు ఓ అద్భుత శక్తిని కారణంగా భావించారు. ఇక అద్భుతాల వెనకాలేకాదు.. కష్టాల వెనక కూడా అదే పైవాడున్నట్లు ఆచరణలోకి వచ్చింది. పాప పుణ్యాలు, స్వర్గ నరకాలు భావనకు, నమ్మకానికి చేరువయ్యాయి. తమ కష్టాల్ని పోగొట్టే సమాధానం, పరిష్కారం వర్తమాన, నిజ జీవతంలో ఉండగా వేదనకు ఔషధాన్ని మిధ్యా ప్రపంచంలో వేడుకొనేలా వర్గ సమాజం ప్రజల్ని ప్రేరేపించింది. Critique of Hegels Philosophy of Right అన్న రచనలో ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్త, దార్శనికుడు కార్ల్‌మార్క్స్‌ మతానికి, ప్రజా జీవనానికి ఉన్న విడదీయలేని సంబంధాన్ని అద్భుతంగా చెప్పాడు. 

''బాధను, బాధపట్ల నిరసనను ఏకకాలంలో వ్యక్తీకరించే భావనే మతం. దయాగుణ మేమీలేని నిర్దయలోకానికి చిరునామా మతం. మానవత్వం యిసుమంతైనా లేని అమానుషత్వ పరిసరమే మతం. అయినా బాధితుడికదే బాధను దిగమింగించే నిట్టూర్పు. అందుకే అది ప్రజలపాలిట మత్తుమందు.
ఇలాంటి దయారహిత, దుర్గుణభరిత మతాన్ని సమాజాన్నించి పారదోలడమంటే అర్థం ప్రజలకు తాత్కాలికంగా మిథ్యానందాన్ని యిచ్చే పరిస్థితుల్ని పారద్రోలి వారికి నిజమైన ఆనందాన్ని, విముక్తిని కలిగించే సామాజిక పరిస్థితుల్ని ఆవిష్కరించాలనడమే!
మతం సమకూర్చే అవాస్తవిక ఆనందాన్ని ప్రజలు త్యజించేలా ప్రేరేపించడం అంటే అర్థం... ఆ అవాస్తవిక ఆనందాన్ని అగత్యం చేస్తున్న పరిస్థితుల్ని త్యజించ డమని అర్థం. మతాన్ని విమర్శించడమంటే అర్థం పేద ప్రజల కంట కారుతున్న కన్నీటిధారకు మౌలికంగా మాత్రమే ఊటగా వుందని అర్థం.
మత విమర్శ మనిషికి బిగిసిన శృంఖలాల మీద ఉన్న ఆ కర్షక పుష్పాల్ని తొలగించడంతో ఆగిపోకూడదు. ఆ పుష్పాలు తీసేశామన్న తాత్కాలి కానందాన్ని, పరిమిత సంతృప్తిని కొనసాగించడంతో సంబరపడ ిపోకూడదు. మిధ్యాపుష్పాలంకృతమైన దాస్యశృంఖలాల్ని తెంచుకొనేలా చేసి స్వేచ్ఛాయుత వనంలో వాస్తవ సౌరభ సుగంధ పుష్పాల్ని ఆస్వాదించేలా చేయాలి. అపుడు మనిషి తానే ఓ తేజోవంతమైన సూర్యుడిలాగ ప్రకాశిస్తాడు. కార్యశూరుడవుతాడు, ఆలోచిస్తాడు. కాగా మతం మనిషికి తన చుట్టూ తనను తిరగనివ్వకుండా ఓ మిథ్యాబానుణ్ని మనిషిచుట్టూ పరిభ్రమింపజేస్తోంది''
మతానికి, సమాజానికి, మానవ జీవితానికి మధ్య ఉన్న సజీవ సంబంధానికి ఇంతటి అద్భుతమైన వ్యాఖ్యానం మరే తత్వవేత్త చేయలేదు. అందుకే కార్ల్‌మార్క్స్‌ను రెండవ సహస్రాబ్దపు అత్యున్నత మేధావి (Greatest Intellectual of the Second Milleunim) గా ఇంటర్నెట్‌ ఎన్నికలో పేర్కొన్నారు.
పైన తెలిపిన వాస్తవ, సశాస్త్రీయ వివరణ ప్రకారం సంక్షిప్త రూపం ఏమిటంటే మతాన్ని వాస్తవ సామాజిక స్వరూపం నుంచి విడదీయలేమని. ఒకవేళ మతాన్ని అనవసరం చేయడమంటే దాని అవసరం ఉన్న సామాజిక పరిస్థితిని మార్చి, అది ఏమాత్రం అవసరంలేని నూతన ప్రజాస్వామిక సమసమాజావిష్కరణ కావాలి. అది రాజకీయ మార్గం. జనవిజ్ఞాన వేదిక ప్రజల్ని పరిపూర్ణ వాస్తవానందాన్ని యిచ్చేలా తమ చరిత్రను తాము నిర్దేశించుకొనేలా ప్రేరేపించే ఉత్ప్రేరకం మాత్రమే. జనవిజ్ఞాన వేదిక ఓ రాజకీయ పార్టీ కాదు. అది ఎన్నికలలో నిలబడి రాజ్యాంగ సవరణలు చేసి మిథ్యా నందం స్థానే వాస్తవానందాన్ని యిచ్చే ఆర్థిక వ్యవస్థను ఆవిష్కరించేలా ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకొనెలా ఆశయ స్వరూపం లేదు.
ప్రజలు కోటానుకోట్లుగా మతాన్ని విశ్వసిస్తున్నారు. అందులో అమితానందాన్ని పొందుతున్నారు. ''విగ్రహారాధనను మానండి, దైవభావనను విడనాడండి'' అంటే ఎవరూ వినరు. పైగా మన నుంచి దూరమౌతారు. ప్రజల్ని మార్చాలంటే ప్రజాజీవనమనే నీటిలో చేపల్లాగా సేవాసంస్థలుండాలని మ హనీయుడు మావో జిడాంగ్‌ చెప్పాడు. జనవిజ్ఞాన వేదికలోనే వేలాదిమంది ఏదోఒక మతాన్ని నమ్మేవారున్నారు. పర్యావరణాన్ని విపరీతంగా కలుషితం చేస్తున్న రంగు రంగుల హంగు ఆర్భాటాల వినాయక విగ్రహాల స్థానే మట్టి వినాయక విగ్రహాలను పెట్టుకొని గట్టిగా పర్యావరణాన్ని కాపాడమనే అర్థంలోనే జనవిజ్ఞాన వేదిక ప్రబోధిస్తోంది. ప్రజల్ని మతాన్ని విడనాడండి అని గాని మతాన్ని పట్టుకొని వేలాడండి అనిగానీ కాదు. శాస్త్రీయ దృక్పథాన్ని సముచితంగా, సమృద్ధిగా ప్రజలకు ఇవ్వగలిగితే దేన్ని నమ్మాలో, దేన్ని త్యజించాలో ప్రజలే స్వీయానుభవంతో, స్వయం తార్కిక దృక్కోణ ప్రేరేపణతో నిర్ణయించుకొంటారు. బలవంతాన దేన్నీ సాధించలేము. తాత్కాలిక ఉపశమనం కాకుండా ఏ వ్యాధీలేని సమాజావిష్కరణకు సహకరించడమే జనవిజ్ఞాన వేదిక, తదితర ప్రజాసైన్సు ఉద్యమ సంస్థల సదాశయం.

No comments:

Post a Comment