ఐక్యరాజ్యసమితి తరువాత ప్రపంచంలో అతి పెద్ద వేదికైన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాలేదు. సెప్టెంబరు 13-18 మధ్య ఈ సమావేశం జరిగిన సమయంలో ఆయన ఆడంబరంగా తన పుట్టిన రోజు పండుగ చేసుకున్నారు. ఆయన స్వరాష్ట్రమైన గుజరాత్ పండుగ వన్నె, ఆడంబరం విషయంలో ప్రపంచానికే వెలుగు జిలుగులు నింపటానికి ఏ కొరతా లేకుండా చూసుకుంది. ప్రపంచంలోనే ఎవ్వరూ చేయనంత పెద్ద పుట్టిన రోజు కేకు కట్ చేసి గిన్నిస్ బుక్లో పేరు నమోదు చేయించుకునే ఏర్పాటు కూడా చేయటం జరిగింది. కానీ మోడీ పొరపాటున కూడా అలీనోద్యమ సమావేశం గురించి ఉచ్ఛరించలేదు. ప్రపంచంలో 120 దేశాలు సభ్యులుగా ఉన్న, భారత్ ప్రధాన వ్యవస్థాపక సభ్యుల్లో ఒకటిగా ఉన్న అలీనోద్యమ వేదిక 17వ శిఖరాగ్ర సమావేశంలో భారత దేశ ప్రధాని లేరు. అవకాశం దొరికితే చాలు విదేశాలకు పరుగులు తీసే, ఒక్కొక్క దేశాన్ని రెండు, మూడు సార్లు సందర్శించటానికి కూడా ఇబ్బంది లేని, విదేశాల సందర్శనంలో ఇప్పటికే ఇంతకు ముందున్న ప్రధానులందరినీ వెనక్కి నెట్టేసిన, స్వదేశం కన్నా విదేశాల్లోనే ఎక్కువ ఉత్సాహంగా, ఉల్లాసంగా కనబడే మోడీగారు అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాకుండా ప్రపంచానికి ఏమి సందేశం పంపారు?
దేశం లోపల, బయట మోడీగారికి అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి హజరు కాలేనంత ప్రత్యేకమైన కీలకమైన ఏ కార్యక్రమం లేదు. ఆయన ఎందుకు వెళ్ళ లేదో ప్రభుత్వం తరపున కారణమేమీ చెప్పటం జరగలేదు. అలాగే వెళ్ళాలని అనిపించలేదు అనేలాంటి విషయం కాదిది. 1951లో ఏర్పడిన తరువాత మొత్తం 16 శిఖరాగ్ర సమావేశాల్లో ఒకటి తప్ప అన్నింటిలో భారత ప్రధానులు హాజరయ్యారు. హాజరు కావటమే కాదు, ఏకంగా నాయకత్వమే వహించారు. ఈ సారి వెనిజులాలో జరిగిన 17వ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రతినిధి హాజరయినా ప్రధాని లేరు. సహజంగానే భారత్ పేరుప్రతిష్టల ప్రస్తావన అక్కడ రాలేదు.
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో ఏర్పడిన దగ్గర నుంచి అలీనోద్యమానికి భారత్ నాయకత్వ స్థానంలో ఉంది. తను పోషించిన పాత్ర ఆధారంగానే 120 దేశాల వేదికలో ముందు పీఠికి రాగలిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు, ఫాసిజం పరాజయం తరువాత ప్రపంచమంతటా స్వాతంత్య్ర పోరాటాలు ఊపందుకుని వలస పాలన, దోపిడీని ఛిన్నాభిన్నం చేసి ఒకటి తరువాత ఒకటి దేశాలు స్వాతంత్య్రం పొందుతున్న తరుణంలో జన్మించింది అలీనోద్యమం. అమెరికా సామ్రాజ్యవాదం, సోవియట్ సోషలిజం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పుడే స్వాతంత్య్రం పొందుతున్న దేశాలకు వేరే వేదిక ఏర్పాటు చేసుకోవటమే ఈ అలీనోద్యమం అసలు ఉద్దేశం. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాకు చెందిన ఈ దేశాలే ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. వాస్తవానికి ఈ దేశాలతోనే తృతీయ ప్రపంచం ఆవిర్భవించింది. అలీనోద్యమం అన్నిటి కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన అంశాలు జాతీయ స్వాతంత్య్రం, సార్వభౌమత్వ పరిరక్షణ, ఎటువంటి సామ్రాజ్యవాద కూటమికైనా వెలుపల ఉండటం, విదేశాల్లో సైనిక స్థావరాలు నిర్మించటాన్ని నిషేధించటం, ప్రజల స్వపరిపాలన హక్కును ప్రతిష్టింపజేయటం, ప్రపంచ శాంతి లక్ష్యంతో నిరాయుధీకరణ.
ఈ లక్ష్యాలు, ఉద్దేశాలను ముందుంచుకునే అలీనోద్యమంలో భారత్ నాయకత్వం ప్రతిష్టించబడింది. తృతీయ ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవమర్యాదలు పెరిగాయి. సోవియట్ కూలిపోవటం, నయా ఉదారవాద ఆర్థిక విధానాలు మొదలైన తరువాత అలీనోద్యమం విషయంలో భారత్ ఉత్సాహం కొంత తగ్గినా మూల వైఖరిలో పెద్దగా మార్పు లేదు. మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నీ వేగంగా మారటం మొదలైంది. హిందూత్వవాద బిజెపి నాయకత్వంలో ఉన్న మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం కాదు. సామ్రాజ్యవాదానికి దగ్గరగా ఉన్న మిత్రశక్తిగా ఎదగాలనే తహతహలాడుతున్నది. అందుకే అలీనోద్యమం నుంచి దూరం పెంచటం జరుగుతోంది. విదేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై మోడీకి అభ్యంతరం లేదు. వీలైతే తను కూడా ఒకటీఅరా స్థావరాలు ఏర్పర్చుకోవాలనే ఆశ ఉన్నవారే. నిరాయుధీకరణకు బదులు ఆయుధ పోటీ సల్పటానికి, పెద్ద సైనిక శక్తిగా ఎదగటానికి కంకణం కట్టుకున్నారు. అంటే సామ్రాజ్యవాద అమెరికా చేయి పట్టుకుని అమెరికా ప్రయోజనాల్లోనే భారత ప్రయోజనాలను విలీనం చేయాలనుకుంటు న్నారు. ఇలాంటి పరిస్థితిలో అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి హాజరయితే అమెరికా కరుణా కటాక్షానికి అంతరాయం ఏర్పడవచ్చు. అది కూడా వెనిజులాలో జరగడం కూడా ఒక కారణం. అమెరికా ఆ దేశపు వామపక్ష భావాలున్న ప్రభుత్వాన్ని కూలదోయటానికి అన్ని రకాల కుట్రలు పన్నుతున్నది. అందుకు 120 దేశాలు, వాటి ప్రజల హక్కుల పరిరక్షణ పోరాటంలో పాలుపంచుకునే కన్నా అమెరికా దృష్టిలో మంచిగా ఉండటమే మేలు. ఇదే మోడీ ప్రభుత్వ కవి హృదయం. - వేదుల రామకృష్ణ

No comments:
Post a Comment