Wednesday, 21 September 2016

|| వెంకయ్య వంకర ప్రేలాపనలు ||



           చాలా పకడ్బందీగా బిజెపి సర్కారు సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతిని వ్యూహం ప్రకారం నడిపింది. ఆరోజున అన్ని నగరాలలో ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ, లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ల ఆధ్వర్యంలో స్టార్‌ హోటళ్లలో కార్మిక సంఘాల సమక్షంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దేశ ప్రధాని నుంచి అనేక మంది మంత్రులు, బిఎంఎస్‌ (బిజెపి అనుబంధ కార్మిక సంస్థ) నాయకుల ఉపన్యాసాన్ని ఇరికించారు. స్వయానా ప్రధాని బలియాలో ఉపన్యసిస్తూ ''పరిస్థితి ఎంతో మారింది. సుదీర్ఘంగా ప్రపంచ కార్మికులారా ఏకం కండు అన్న నినాదం పనికిరాదు. శ్రామికులారా ప్రపంచాన్ని ఐక్యం చేయండన్న నినాదం ఇవ్వాల్సి ఉంది'' అని సెలవిచ్చారు. ఇక మంత్రి వెంకయ్యనాయుడు అయితే ఎర్రజెండాల మీద, కార్మికసంఘాల మీద, కమ్యూనిష్టుల మీద చిందులే చిందులు. కార్మిక సమస్యలపై కమ్యూనిస్టులు, వామపక్ష భావజాల పార్టీలు మాత్రమే దృష్టి సారిస్తాయన్నది తప్పు అన్నారు. సిఐటియులో 32 లక్షల మంది సభ్యులుంటే దత్తోపంత్‌ స్థాపించిన బిఎంఎస్‌లో కోటి మందికిపైగా సభ్యులున్నారు. కమ్యూనిష్టులు పంపిణీ కోసమే పట్టుపడుతుంటారని, అయితే ఉత్పత్తి లేకుండా పంపిణీ ఉండదని బల్లగుద్ది వాదించారు. బిఎంఎస్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి త్రిజేష్‌ ఉపాధ్యాయ మేడే భారతదేశ పరిస్థితులకు సరిపోదని, అది వామపక్షాల జాడ్యం అన్నారు. దీన్ని భారతదేశం నుంచి పెకలించివేయాలన్నారు. అంతేకాదు ''మేడేని బిఎంఎస్‌ గుర్తించదు. అందువల్ల మేడే ఉత్సవాలు జరపదు. మేడే కార్మికులకు మంచి సందేశం ఇవ్వదు. దానికి భిన్నంగా మేము సెప్టెంబర్‌ 17న విశ్వకర్మ జయంతినాడు భారత కార్మిక దినంగా జరుపుకుంటాము'' అన్నారు. అంతేకాదు మేడే అనేది రక్తపాతానికి, హింసకు సంకేతమని, అటువంటి బాధాకర సంఘటనలు తాము గుర్తుచేసుకోమని, మావోయిజం, మార్క్సిజం, అనార్కిజం వంటివి మాత్రమే ఆ పనిని గొప్పగా పొగుడుతాయని, ఇది కార్మికుల మధ్య భేదభావాలను రెచ్చగొడతాయన్నారు. అంతేకాదు ప్రపంచంలో ఎక్కడా మేడే జరపటం లేదు అని కూడా ఈ పెద్దల ఉవాచ.

|| ప్రేలాపనల నేపథ్యం ||

సెప్టెంబరు 2 అఖిల భారత కార్మిక సమ్మె దిగ్విజయంగా జరిగింది. కనీసం 12 కోట్ల మంది ఉద్యోగ, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. బిఎంఎస్‌ మాత్రమే ఈ సమ్మెలో పాల్గొనలేదు. ఈ సమ్మెను నిలువరించడానికి, అది కుదరక విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పడరాని పాట్లు పడింది. కార్మికవర్గం ఈ ఎత్తులన్నింటినీ ఐక్యంగా చిత్తు చేసింది. దాంతో ఇప్పుడు తాజాగా బిఎంఎస్‌ను రంగం మీదికి తెచ్చింది. పచ్చి అబద్ధాలలో ప్రచార కార్యక్రమాన్ని నిస్సిగ్గుగా నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో కాషాయదళ పెద్దలు రంగంలోకి దిగారు. విశ్వకర్మ జయంతిని ఆసరాగా చేసుకుని పైకి కమ్యూనిస్టులపై దాడిలా కనబడుతున్నా మొత్తం కార్మికవర్గంపైన, సంఘటిత కార్మికోద్యమంపైన విష ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వాస్తవానికి విశ్వకర్మ జయంతిని చాలాకాలంగా కొన్ని రాష్ట్రాలలో జరుపుకుంటున్నారు. కానీ, ఈసారి ఈ విశ్వకర్మ జయంతిని ఆక్రమించుకుని తమ ఫాసిస్టు భావజాలాన్ని కార్మికవర్గంపై వెదజల్లే చర్యలు ప్రారంభించారు.

|| అబద్ధాలు ఫాసిజం ఊపిరి ||

బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది మొదలు దశాబ్దాల ఆర్‌ఎస్‌ఎస్‌ కరుడుగట్టిన మతోన్మాద సిద్ధాంతానికి ఊపిరులూదటం చూస్తున్నాము. ఘర్‌వాపసి, గొడ్డుమాంసం, కాశ్మీర్‌ సమస్య వంటి నినాదాలతో కష్టజీవుల ఐకత్యను విచ్ఛిన్నం చేయటానికి కాషాయ కూటమి శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు ప్రత్యక్షంగా కార్మికవర్గ ఐక్యత మీద, కార్మికోద్యమం మీద, కార్మికవర్గ సిద్ధాంతమైన మార్క్సిజం మీద దాడి ప్రారంభించింది. ఫాసిజానికి ఉండే సాధారణ లక్షణం చరిత్రను వక్రీకరించడం, పుక్కిటి పురాణాలను చరిత్రగా నమ్మించటం, అందుకు పచ్చి అబద్ధాలను ప్రచారం చేయటం. వెంకయ్యనాయుడు, బిఎంఎస్‌ నాయకులు మేడే ప్రారంభమైన అమెరికాలోనే మేడే జరగడం లేదని, అభివృద్ధి చెందిన దేశాలలో మేడే జరపటం ఆపేశారని, అది కేవలం కమ్యూనిస్టుల సంప్రదాయం మాత్రమేనని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవానికి ఈ సంవత్సరం మేడే అమెరికా, ఐరోపా ఖండాలలో అన్ని నగరాలలో భారీగా జరిగిందని లాస్‌ఏంజెల్స్‌, మన్‌హట్టన్‌, పారిస్‌, ఇస్తాంబుల్‌, వంటి నగరాలలో హింసాత్మక ఘటనలు కూడా జరిగాయని పత్రికలలో వార్తలు ప్రముఖంగా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 2008 నుంచి నడుస్తున్న పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం కనుచూపు మేరలో కనబడడం లేదని, దారిద్య్రం, నిరుద్యోగం, ఉద్యోగ భద్రత, పొదుపు చర్యలు తమ జీవితాలను కుంగదీస్తున్నాయని కార్మికవర్గం పోరుబాట పట్టింది. దాదాపు ఆ అంశాల మీదే మన దేశంలో కూడా ఐక్య కార్మిక ఉద్యమం సెప్టెంబరు 2 సమ్మెను పట్టుదలగా నిర్వహించింది. అందుకే అధికార బిజెపి అధినేతలు కార్మికవర్గంపై తన అక్కసును వెళ్ళగక్కుకుంటున్నారు. బిఎంఎస్‌ సమ్మె అనంతరం ప్రభుత్వం తమతో చర్చలు జరిపిందని, చర్చలు ఫలప్రదం అయ్యాయని, దేశవ్యాప్తంగా విజయోత్సవ సభలు జరపమని పిలుపునిచ్చింది. సమ్మెలో పాల్గొనని బిఎంఎస్‌తో సమ్మె అనంతరం బిజెపి ప్రభుత్వం చర్చలు జరపడమే ఒక విచిత్రం. అంతకు మించి సమ్మె కోర్కెలలో ముఖ్యమైనవాటన్నింటినీ ప్రభుత్వం అంగీకరించిందని ప్రకటించడం మరీ విచిత్రం. ఉదాహరణకు ఐక్య కార్మికోద్యమం తన 12 కోర్కెల్లో కనీసం వేతనం రూ.18 వేలు చేయమని డిమాండ్‌ చేసింది. బిఎంఎస్‌ కూడా అదే కోరింది. కానీ ప్రభుత్వం కనీస వేతన సలహా బోర్డు ప్రకటించిన రోజుకు రూ.350ని ఆమోదించినట్లు ప్రకటించింది. ఇప్పుడు బిఎంఎస్‌ ఇది ఒక పెద్ద విజయమని ప్రచారం చేస్తున్నది. ఇంత అబద్ధాన్ని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి ప్రకటించడం పచ్చి దుర్మార్గం. అలాగే ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని సమ్మెలో లేని బిఎంఎస్‌ ప్రభుత్వంతో జరిగిన చర్చలలో నాలుగు కోర్కెలు వదులుకున్నామని ప్రకటిం చింది. అవేమంటే ధరల నియంత్రణ, కార్మిక వ్యతిరేక చట్టాల సవరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అడ్డగోలుగా ఆహ్వానించడం, ప్రభుత్వరంగ వాటాలను అమ్మడం. భారత కార్మికవర్గం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న పోరాటంలో ఈ నాలుగు కోర్కెలూ అత్యంత కీలకమైనవి. సమ్మెలో లేని బిఎంఎస్‌ ఐక్యకార్మికో ద్యమం సమ్మె సందర్భంగా ప్రభుత్వం ముందుంచిన ఈ కోర్కెలను ఏ నైతికతతో ఉపసంహరించుకుంటుంది. ఈ నాటకం మొత్తం బట్టబయలు కాక తప్పదు. ఈ విధంగా అబద్ధాలతో కార్మికోద్యమాన్ని బలహీనపర్చటం తేలికైన పనికాదు.

|| విశ్వకర్మకు, మేడేకు పోటీ ||

ఫాసిజపు మరో పోకడ ఏమంటే జాతి, జాతీయవాదాన్ని, అంతర్జాతీయ వాదంతో పోటీ పెట్టడం, తద్వారా జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టడం, విశ్వకర్మ జయంతికి, ప్రపంచకార్మిక దీక్షా దినం 'మేడే'కు ముడిపెట్టటంలో కాషాయ దళం అసలు ఉద్దేశం అర్థం చేసుకోవటం కష్టంకాదు. 1886 అమెరికాలోని హే మార్కెట్‌లో జరిగిన ఘటనకు కారణం 8 గంటల పనిదినం, అలాగే కార్మిక సమస్యల పరిష్కారం. అందుకే ఆనాటి భయంకర హింసాకాండ సాగించిన పెట్టుబడిదారీ వర్గంపై ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గం పోరాటం నడిపింది. ఫలితంగా 8 గంటల పనిదినం, దరిమిలా అనేక హక్కులను కార్మికవర్గం సాధించుకున్నది. విశ్వకర్మ జయంతికి ఆ రకమైన ప్రాధాన్యత లేదు. విశ్వకర్మ ఒక గొప్పశిల్పి అని, ఆయన ద్వారకా నగరం, పాండవుల మయసభ వంటివి నిర్మించా డని, ఇంద్రుడికి వజ్రాయుధం తయారుచేసి ఇచ్చాడని, అసురుల మీద యుద్ధానికి దేవతలకు ఆయుధాలు సరఫరా చేసేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన జయంతినాడు పరిశ్రమాధిపతులు, వృత్తిదారులు పండుగ చేసుకోవడం కొన్ని ప్రాంతాలలో ఆనవాయితీగా వస్తున్నది. అయితే, మేడే అనేది వెంకయ్యనాయుడి మిత్రులైన అంబానీ, అదానీలపై ద్వేషానికి వ్యతిరేకంగా కార్మికవర్గం రక్తతర్పణతో పోరాడి సాధించుకున్న హక్కుల దినోత్సవం. దీనికి, దానికి పోటీ పెట్టటం ఏ మాత్రం సరికాదు. అలాగే వెంకయ్య కార్మికవర్గానికి పంచడం గురించే కాదు, ఉత్పత్తి గురించి కూడా పట్టాలి అంటున్నారు. కార్మికోద్యమం తాము చేస్తున్న ఉత్పత్తి ఫలితం సక్రమంగా పంపిణీ కావాలన్నదే కీలకమైన వాదన. కార్మికులకు ఉత్పత్తి పట్టకపోతే మరే వర్గానికీ పట్టనట్లే. ఉత్పత్తి చేసే కార్మికుడు ఫలితాల్లో తన వాటాను అడిగి, అడిగి చివరకు సమ్మె కడతాడు. ఈ విషయం వెంకయ్యనాయుడుకు తెలియక కాదు.

|| ఐక్యకార్మికోద్యమమే శరణ్యం ||

నేడు దేశంలో చెలరేగుతున్న మతోన్మాద వికృత చేష్టలకు అడ్డుకట్టవేయ గలిగిన శక్తి, వేయాల్సిన చారిత్రక బాధ్యత భారత కార్మికోద్యమానిదే. ఆ శక్తి కార్మికవర్గానికి ప్రాథమికంగా అంతర్జాతీయ దృక్పథం నుంచి వస్తుంది. నేడు భారత పాలకవర్గాలు ప్రత్యేకించి బడాపెట్టుబడిదారీ వర్గం అత్యంత ప్రగతి నిరోధక భావజాలాన్ని వివిధ రూపాలలో ప్రచారం చేస్తున్నది. కాశ్మీరు విషయంలో గానీ, ఈశాన్య రాష్ట్రాలలో సైన్యానికి ప్రత్యేక ఆయుధాల హక్కుల చట్టాన్ని రద్దుచేయటం వంటి ముఖ్యమైన ప్రజాస్వామ్య కోర్కెల నుంచి అణగారిన ప్రజల ఆహారమైన గొడ్డుమాంసం నిషేధం వరకు ప్రతి విషయానికీ మతం రంగు పులిమి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నది కాషాయకూటమి. ముస్లిం, క్రైస్తవ మైనారిటీలపై దాడి క్రమం గా పెరిగి హేతువాదుల మీద, లౌకికవాదుల మీద దాడిచేసే స్థాయికి పరిస్థితులు దిగజారాయి. దీనికి ప్రతిగా ముస్లిములలో వేర్పాటువాదం, ఉగ్రవాదా లు రెచ్చగొట్ట బడుతున్నాయి. వీటి చాటున పాలకవర్గాలు జాలీగా ఉదారవాద ఆర్థిక విధానాలను అమలు చేసుకుపోతున్నాయి. అందువల్ల ఉదారవాద ఆర్థిక విధానాలను వెనక్కి కొట్టగలిగే సత్తా కలిగిన భారత కార్మికోద్యమం ఆ విధానాలను అమలు చేయడానికి అండగా ఉన్న ఫాసిస్టు తరహా మతోన్మాద శక్తులను శాశ్వతంగా ఓడించగలవు.   - ఆర్‌ రఘు

No comments:

Post a Comment