Tuesday, 13 September 2016

|| ప్ర‌కృతి అందాల కేర‌ళ‌ ||




                సముద్ర గ‌ర్బా‌న్ని‌ చీల్చుకుని వెలుపలికి వస్తున్నట్లుగా కడిగిన ముత్యంలా ప్రకాశించే సూర్యుని లేలేత కిరణాల హోయలు, పక్షుల కిలకిలరావాలు, మెరిసిపోయే పిల్లకాలువలు.. గాలి తాకిళ్లను తట్టుకుని ముందుకు దూకే పడవలు, పసిపిల్లల కేరింతల్లా చప్పుడు చేసే కొబ్బరాకుల గలగలలు.. ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని తనలో దాచుకున్న అద్భుతమైన ప్ర్రదేశమే కేరళ. కేరళలో ఏ ప్రాంతానికి వెళ్లినా... ప్రకృతి ఒడిలో తేలియాడిన అనుభూతి కలుగుతుంది. కన్యాకుమారి, అలెప్పీ, కోవలం, వెంబనాడ్‌, కుమరకోమ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రాష్ట్రం మొత్తం విహార కేంద్రాలమయం. కేరళ పర్యటన ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

|| హౌస్‌బోట్‌ కేరాఫ్‌ అలెప్పీ ||

'వెనిస్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌'గా పేరుగాంచిన అలెప్పీలోనే ఈ హౌజ్‌ బోట్లు రూపుదిద్దుకుంటాయి. వీటి సైజ్‌ని బట్టి ఇద్దరు లేదా నలుగురు ఉండొచ్చు. అటాచ్డ్‌ బాత్రూంతోపాటు బెడ్‌రూం, హాల్‌, వంటగది... లాంటి సమస్త సౌకర్యాలు కూడా ఉంటాయి. 80 మీటర్ల పొడవుతో ఉండే ఈ పడవల్లో పడవ నడిపేవాళ్లు కాకుండా, అవసరమైతే వండి వడ్డించేందుకు వంటవాళ్లు, గైడ్‌లు కూడా అందుబాటులో ఉంటారు. కొట్టాయం జిల్లాల్లో విస్తరించిన వెంబనాడ్‌ సరస్సు ఈ హౌస్‌ బోటింగ్‌ విహారానికి అనువుగా ఉంటుంది. ఈ సరస్సు కోచి వద్ద సముద్రంలో కలుస్తుంది. అష్టముది సరస్సులో అయితే ఏకంగా ఎనిమిది గంటలపాటు పడవలో ప్రయాణించే సౌకర్యం కలదు. దాదాపు 900 మీటర్ల మేర పర్యటించగలిగే ఈ నిశ్శబ్ద తటాకాల్లో విహారం పర్యాటకుల మనస్సులను సేదదీరుస్తూ హాయినిస్తుంది. ఓనమ్‌ పండుగ సమయంలో మాత్రం ఈ సరస్సులు ఎంతో కోలాహలంగా మారిపోతాయి. స్నేక్‌ బోట్స్‌ అని స్థానికులు ముద్దుగా పిలుచుకునే సన్నటి పడవ పందేలలో యువతరం తలమునకలవుతూ సందడి చేస్తుంటుంది. ఈ రకంగా ఓనమ్‌ సరస్సులకు కూడా సరికొత్త సొబగులను అద్దుతుంది. 

|| ఇలా చేరుకోవాలి ||

హైదరాబాద్‌ నుంచి అలెప్పీకి డైరెక్ట్‌ ట్రైన్‌ సౌకర్యం ఉంది. ప్రయాణ ఖర్చు సుమారు మూడు వేలవుతుంది. విమానంలో అయితే కొచ్చి చేరుకుని అక్కడి నుంచి 75కి.మీ రోడ్డు మార్గం ద్వారా ట్యాక్సీలో చేరుకోవచ్చు. ప్రయాణ ఖర్చు సుమారు ఐదు వేలు అవుతుంది. బస్‌ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ పర్యటన ముగింపుకొని ఆ తర్వాత దగ్గర్లోని ముహమ్మా టౌన్‌లో కుమరకోమ్‌కు వెళ్లే పడవలెక్కితే కుమరకోమ్‌ను కూడా పర్యటించొచ్చు.

|| కేరళ ప్రకృతికాంత.. వాయనాడ్‌ ||

వాయనాడ్‌ ప్రకృతి సౌందర్యానికి మీరు మైమరచిపోయి ఉండకపోతే, మీ కళ్లలో గానీ, మనసులో గానీ, స్పందనలో గానీ ఏదో లోపం ఉందనుకోవాల్సిందే! వాయినాడ్‌ పశ్చిమ కనుమల్లోగల హిల్‌స్టేషన్లలో అపారమైన వృక్ష సంపద, వన్యప్రాణులు ప్రతివారినీ ఆకట్టుకుంటుంటాయి. అట్టప్పడి, ఇడుక్కి, పక్షిపాతాళం, పీరుమేడు, సైలెంట్‌ వ్యాలీ, వాగమాన్‌ దేవీకులం, నెల్లియంపత్తి, పొన్ముడి ఇలా హిల్‌స్టేషన్ల పేర్లు చెప్పుకుంటూ పోతే ఆ జాబితా అనంతం. మంచి సుగంధ ద్రవ్యాల నుంచి వెలువడే పరిమళాలు, కళ్లను కట్టిపడేసే పచ్చదనపు సౌరభాలు, మెరుస్తూ ప్రవహించే నదులు, భౌగోళికంగా కనపడే ఎత్తుపల్లాలు, 'యూ' ఆకారంలోని మలుపుల గుండా డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్తే ఆ అనుభూతులు ఇవన్నీ కలిపి మనసుకు ఎక్కడలేని ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలబోసి మరీ అందిస్తాయి. 
విస్తారమైన కాఫీ తోటలు, తేయాకు తోటలు, యాలకులు, మిరియాలు, వెనీలా తోటలను చూస్తుంటే మైమరిచిపోతాం. 14 కిలోమీటర్ల పొడవున్న కొండదారిని తమరస్సెరీ చురమ్‌ అంటారు. ఇదే వాయనాడ్‌కు స్వాగతద్వారం. అన్నింటికంటే పైన ఉండేది లక్కిడి హిల్‌ స్టేషన్‌. చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఎడక్కల్‌ గుహలు మనకు కనిపిస్తాయి. ఇక్కడి పూర్వయుగం నాటి రాతి కట్టడాలు చాలా ప్రసిద్ధి. అంతేకాదు, ఎన్నో చూడదగ్గ ప్రదేశాలూ ఉన్నాయి. వాటిలో చెంపారా శిఖరం, బాణాసుర సాగర్‌ డ్యాం, కురువు ద్వీపం, సూచిపార, పంతపార మీన్ముట్టి జలపాతాలు, ఫాంటమ్‌ రాక్‌, పూకోట్‌ లేక్‌, సూచిప్పర జలపాతాలు, వయనాడ్‌ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురి, చైన్‌ ట్రీ, చెండర శిఖరం, బ్రహ్మగిరి పర్వత పాదాల్లో ఉన్న తిరునెల్లి దేవాలయం.. ఇవన్నీ ఈ ప్రాంతంలో పర్యటించేవారికి విభిన్న అనుభూతులను అందిస్తాయి. 

|| ఇలా చేరుకోవాలి || 

హైదరాబాద్‌ నుంచి వాయనాడ్‌కు వెళ్లాలనుకుంటే ట్రైన్‌లో కాలికట్‌ చేరుకొని అక్కడ నుంచి వాయనాడ్‌ 71కి.మీ రోడ్‌ మార్గం ద్వారా అంటే బస్‌ లేదా ట్యాక్సీలో చేరుకోవచ్చు. ప్రయాణ ఖర్చు సుమారుగా 7వేలు అవుతుంది. ఎలాంటి విమాన సర్వీసులు లేవు. 

|| కేరళ ధాన్యాగారం.. కుమరకోమ్‌ ||

కేరళ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన కుట్టనాడ్‌ ప్రాంతంలో వెంబనాడ్‌ సరస్సు పరీవాహక ప్రాంతంలో ఈ కుమరకోమ్‌ కొలువై ఉంది. కుమారకోమ్‌.. కేరళలోని ప్రసిద్ధ విహార కేంద్రం. ఈ ప్రదేశంలో సింహభాగం నీటితో నిండి ఉంటుంది. ఎటుచూసినా.. సరస్సులు, సెలయేళ్లే. ఈ సరస్సు నుండి పిల్లకాలువలు విస్తరించి, మధ్య లంకలన్నీ గుబురైన కొబ్బరి చెట్లతో పచ్చగా, చల్లగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది. ఇక్కడ రోడ్లకంటే.. నదీ పాయలే ఎక్కువ. ఇక్కడి చుట్టు పక్కల గ్రామాలకు.. గృహావసరాలకు కావలసిన ఏ వస్తువైనా లాంచీల్లో రావాల్సిందే. పల్లెలను, పట్టణాలను కలిపే ఈ నదీమార్గాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఇక్కడి గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పడవలలో ప్రయాణం ఎన్నటికీ మరపురానిది.
కుమరకోమ్‌ పక్షుల రక్షిత ప్రాంతం కూడా. ఇక్కడ ఉండే చిన్న చిన్న లంకలలో 14 ఎకరాలలో విస్తరించి ఉన్న పక్షుల రక్షిత ప్రదేశం పక్షుల వీక్షకులకు చక్కని అనుభూతిని కలుగజేస్తుంది. కోయిలలు, హంసలు, వలస పక్షులు, లొట్టిపిట్టలు, సైబీరియన్‌ స్టార్క్‌ వంటి అనేక జాతుల పక్షులకు ఇది ఆవాస ప్రదేశం. ముఖ్యంగా హౌస్‌బోట్‌లో ప్రయాణం వర్ణనాతీతమైన అనుభవం. 

|| ఇలా చేరుకోవాలి || 

హైదరాబాద్‌ నుంచి కుమరకోమ్‌కు వెళ్లాలనుకుంటే విమానంలో కొచ్చి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు ద్వారా కుమరకోమ్‌ చేరుకోవచ్చు. ప్రయాణ ఖర్చు సుమారు ఏడు వేలు. ట్రైన్‌లో వెళ్లాలనుకుంటే కొట్టాయం రైల్వేస్టేషన్‌లో దిగాలి. అక్కడ నుంచి కుమరకోమ్‌ 16 కి.మీ ఉంటుంది. టాక్సీలో లేదా క్యాబ్‌లలో చేరుకోవచ్చు. ప్రయాణ ఖర్చు సుమారుగా 5వేలు అవుతుంది. హౌస్‌బోట్‌లో ప్రయాణించాలనుకుంటే.. అలెప్పీ వరకు ట్రైన్‌లో వెళ్లి అక్కడ నుంచి దగ్గర్లోని ముహమ్మా టౌన్‌లో కుమరకోమ్‌కు వెళ్లే పడవలుంటాయి. వాటిలో ప్రయాణించవచ్చు.

No comments:

Post a Comment