Friday, 2 September 2016

|| సమ్మె దిగ్విజయం ||




               కార్మికలోకం కదంతొక్కింది. నయా ఉదారవాద విధానాల దూకుడు పెంచిన మోడీ సర్కార్‌పై నింగినంటేలా నిరసనగళం వినిపించింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ సమ్మె దిగ్విజయమైంది. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు చివరి నిమిషం వరకు ప్రభుత్వం సాగించిన కుట్రలను కార్మిక లోకం ఐక్యంగా తిప్పి కొట్టింది. సార్వత్రిక సమ్మెను బ్రహ్మాండంగా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలను ఇక ఎంతమాత్రమూ సహించేది లేదని తిరుగులేని రీతిలో చాటిచెప్పింది. సమ్మెను అపూర్వమైన రీతిలో విజయవతం గావించిన సమస్త కార్మికవర్గానికి జేజేలు. కేంద్ర మంత్రివర్గ అసంబద్ధ ప్రకటనలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ బిఎంఎస్‌ సమ్మెలో పాల్గొనడం లేదని ప్రకటించినా, ఆ యూనియన్‌ వెనక వున్న కార్మికులు మాత్రం సమ్మెలో భాగస్వాములు కావడం కార్మికవర్గ ఐక్యతకు ఒక చక్కటి నిదర్శనం. 1991లో సరళీకరణ శకం ప్రారంభమైన తర్వాత ఇది 17వ సార్వత్రిక సమ్మె. పాతికేళ్ల కాలంలో నయా ఉదారవాద దాడిని నిరసిస్తూ కార్మికులు సాగించిన ప్రతిఘటనకు సమ్మెలు ప్రతిరూపాలు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయవద్దనీ, కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థకు స్వస్తి పలికి ఉపాధి భద్రత కల్పించాలనీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించరాదనే కార్మికవర్గ డిమాండ్లతో పాటు అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న ధరలను అదుపు చేయాలనీ, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టీకరించాలనే సామాన్య ప్రజానీకం సమస్యలనూ ప్రధాన డిమాండ్లగా ముందుకు తేవడంతో శ్రామికవర్గం ప్రజాపక్షపాతిగా నిలిచింది. దేశంలోని అన్ని రంగాలకు చెందిన సంఘటిత, అసంఘటిత, ప్రభుత్వ, ప్రైవేటు రంగ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల, పలు పథకాల కార్మికులు, ఉద్యోగులు దాదాపు 18 కోట్ల మంది సమ్మెలో పాల్గొనడం అమోఘం. మంత్రిత్వ శాఖలు, విభాగాధిపతులు, యాజమాన్యాల బెదిరింపులను సైతం ఖాతరు చేయక బొగ్గు, విద్యుత్‌ ఇంజనీరింగ్‌, పెట్రోలియం, రక్షణ, ఉత్పత్తి, టెలికం, ఆర్థిక రంగాల కార్మికులు కదనోత్సాహంతో సమ్మెలో పాల్గొనడం కార్మికవర్గ నాయకత్వ పటిమకు నిదర్శనం. పశ్చిమ బెంగాల్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, అస్సాం వంటి రాష్ట్రాల్లో పోలీసు బలగాలతో అణచివేత చర్యలకు పాల్పడినా వాటిని వీóరోచితంగా ఎదిరించి సమ్మెను విజయవంతం చేయడం కార్మికవర్గ దీక్షాదక్షతకు ప్రతీక. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ నిరంకుశత్వంతో పాలనసాగిస్తున్న పశ్చిమ బెంగాల్‌లోని మమత సర్కార్‌ ఎప్పటిలాగే ఈ దఫా కూడా సమ్మె చేస్తున్న కార్మికులు, వారికి మద్దతుగా ప్రదర్శన చేపట్టిన యువత, మహిళలు, జర్నలిస్టులపై దాడులు చేయించడం సిగ్గుచేటు. హర్యానా, పంజాబ్‌, తెలంగాణా, కర్నాటక, అస్సాం, ఒడిషా, కేరళ, త్రిపుర తదితర రాష్ట్రాల్లో రోడ్డు రవాణా పూర్తిగా స్తంభించినా ప్రజలు సహకరించారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, కర్నాటక తదితర రాష్ట్రాల్లో ఆటోలు కూడా తిరగలేదు. చాలా చోట్ల బంద్‌ వాతావరణమే కనిపించింది. ఆంధ్రా, అస్సాం, ఢిల్లీ, హర్యానా, ఒడిషా, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణా, యుపి, కర్నాటక రాష్ట్రాల్లో పెద్ద పెద్ద పారిశ్రామిక సముదాయాలు, తయారీ రంగ యూనిట్లు అస్సలు పనిచేయలేదు. కేరళ, త్రిపురల్లో సమ్మె సంపూర్ణంగా జరిగింది. 
శ్రమయేవ జయతే తమ నినాదమంటూ సమ్మె రోజునే మీడియాలో ప్రకటనలు దట్టించిన మోడీ సర్కార్‌ గతేడాది సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మికులు చేసిన డిమాండ్లలో ఏ ఒక్కదానినీ పట్టించుకోలేదంటే మోడీగారి నినాదాల చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే అర్థమైపోతుంది. ఒకవైపు 'మేక్‌ ఇన్‌ ఇండియా' నినాదాల మాటున రక్షణ రంగం సహా అన్ని ప్రధాన రంగాల్లో విదేశీ ప్రతక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరచి కార్పొరేట్ల సేవలో పునీతమౌతూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూనే..మరోవైపు తాము శ్రామికుల పక్షపాతులమని ప్రచారాన్ని హోరెత్తించడం మోడీ ప్రభుత్వ నయవంచనకు పరాకాష్ట.. మేడే పోరాట ధీరుల రక్తంతో ఎర్రపతాకమై ఎగిసిన ఎనిమిది గంటల పని హక్కును సైతం మోడీ సర్కార్‌ కాలరాస్తోంది. 24 గంటలూ దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతిస్తూ దొడ్డిదారిన కార్మికులపై పని భారం మోపే బిల్లును కేంద్రం ఇటీవలే ఆమోదించింది. కళ్లు మూసుకొని పాలు తాగిన పిల్లిలా తనను ఎవ్వరూ గమనించలేదనుకుంటున్న మోడీ సర్కార్‌కు కార్మికవర్గం ఈ సమ్మెద్వారా గట్టి చెంపదెబ్బ కొట్టినట్టయింది. కోర్కెలు సాధించే వరకు శ్రామికవర్గ ఐక్యత మున్ముందు ఇలాగే కొనసాగగలదని ఆశిద్దాం. 

No comments:

Post a Comment