మాంసం కోసం పశువులను వధించడం వల్ల పశు జనాభా తగ్గకపోగా వాటి పునరుత్పత్తికి ఆలంబన అవుతుందనే సత్యం పశు వైద్యులుగా, జంతు శాస్త్రవేత్తలుగా మాకు తెలుసు. పశు వధపై నిషేధాలు నిజానికి పశువుల పెంపకంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనడానికి అనేకానేక రుజువులు వున్నాయి.
దేశవ్యాప్తంగా పశు వ్యాపారులు, గొడ్డు మాంసం వినియోగదారులు, మాంసం విక్రయదారులపై గో సంరక్షణ నిఘా బృందాల దాడులు నిత్యకృత్యమైపోయాయి. గుజరాత్లో ఊనా ఘటన, పశు కళేబరాలను తీసుకువెళుతున్న దళితులపై గోరక్షకుల దురాగతం - అనంతరం ఈ దాడులు మరింతగా పెరిగాయి. పశువుల కళేబరాలను పారవేయడమనే కుల పరమైన నిర్బంధ శ్రమను తమపై రుద్దడాన్ని దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గుజరాత్ లో, ఆ అమానుష వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న దళితులు ‘మీ ఆవు తోక, చర్మం, ఎముకలు మీరే ఉంచుకోండి, మా భూమి మాకు ఇవ్వండి’ అని నినదిస్తున్నారు. చర్మ ఉత్పత్తులను ఉపయోగిస్తున్న వారిపైన కూడా గో సంరక్షకులు ఇటీవల దాడులు చేయడం ప్రారంభించారు.
పశు వధ, గొడ్డు మాంసం వినియోగంపై పర్యవేక్షణ, నిఘా (మానిటరింగ్ అండ్ సర్వేయిలన్స్) నెట్‌వర్క్స్‌లో హర్యానాలోని లాలా లజ్పతరాయ్ యూనివర్శిటీ ఆఫ్ వెటెరినరీ అండ్ ఏనిమల్ సైన్సెస్ (ఈ విశ్వవిద్యాలయంలోనే నేను పశువైద్య శాస్త్రవేత్తగా శిక్షణపొందాను) కూడా చేరింది. మేవాట్ బిర్యానీ నుంచి సేకరించిన మాంసం ముక్కలపై లాలాలజ్పతరాయ్ విశ్వవిద్యాలయ ప్రయోగశాల ఒకటి జరిపిన పరీక్షలలో అది ‘ఆవు మాంసం’ అని నిర్ధారణ అయిందని ఈ నెల 9న ఒక వార్త వెలువడింది. మహారాష్ట్ర ననుసరించి హర్యానా గత ఏడాది మార్చి 16న గోవంశ్ సంరక్షణ్ అండ్ గో సంవర్ధన్ చట్టంను తీసుకొచ్చింది. పశువుల వధను ఈ చట్టం పూర్తిగా నిషేధించింది. అంతేకాక ఏ పశువునైనా వధిస్తూ లేదా కబేళాకు పశువులను పంపిస్తూ లేదా కబేళాకు పంపించడానికై పశువిక్రయాలు జరుపుతూ పట్టుబడిన వ్యక్తి లేదా వ్యక్తులకు విధించే జరిమానాను ఈ చట్టం భారీగా పెంచింది. ఈ చట్టం ప్రకారం గొడ్డు మాంసంను కలిగివుండడం కూడా నేరమే. ఈ అపరాధులకు సైతం భారీ జరిమానా విధిస్తారు 1955నాటి పంజాబ్ గో వధ నిషేధ చట్టం వలే ఈ హర్యానా చట్టం కూడా తమ అమాయకత్వాన్ని నిరూపించుకునే భారాన్ని నిందితుడిపైనే మోపింది. మహారాష్ట్ర చట్టంలో కూడా ఇవే నిబంధనలు వున్నాయి.
సరే, తెలంగాణ విషయానికి వద్దాం. ఇటీవల బక్రీద్ వేడుకలకు గాను ఎద్దులు, దున్నపోతులు మొదలైన పశువులను చట్టబద్ధంగా రవాణాచేస్తున్న పశు వ్యాపారులకు అధికారుల నుంచి వేధింపులను నిరోధించాలని పలువురు చేసిన విజ్ఞప్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించనే లేదు. పశు వధకు సంబంధించిన రాష్ట్ర చట్టాలేవీ పశువుల క్రయ విక్రయ వ్యాపారాన్ని నిషేధించలేదు. ‘వధకు అర్హమైన’వని సంబంధిత అధికారులు ధ్రువీకరించిన పశువులు వేటినైనా సరే వధించవచ్చని ఆంధ్రప్రదేశ్ గో వధ నిరోధం, జంతువుల సంరక్షణ చట్టం-1977 స్పష్టం చేసింది. అయితే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఒక బహిరంగ ప్రకటన ద్వారా గోరక్షకులకు వ్యూహాత్మకంగా మద్దతునిచ్చింది. గో వధ విషయంలో అప్రమత్తంగా వుండాలని తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ నెల 16న ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బక్రీద్ సందర్భంగా మాంసం వినియోగం అధికంగా ఉంటుంది గనుక గోవధ విషయంలో ప్రజలు జాగరూకత వహించాలని ఆ ప్రకటన పేర్కొంది.
ఇక్కడ చర్చ మాంసం నమూనాలపై జరిపిన పరీక్షల ఫలితాలు ఎలా వున్నాయి, లేదా ‘గో వధ’ జరుగుతున్నదా జరగడంలేదా అన్న అంశం గురించి గానీ కాదు. ఆహార సంస్కృతులను, జీవనాధారాలను నేరమయమైనవిగా చేయడంలో ప్రభుత్వ ఉద్దేశం (ప్రస్తుత సందర్భంలో గొడ్డు మాంసం, సంబంధిత జీవనాధారాలు); అలా చేయడం ద్వారా మన దేశ జనాభాలో యాభై శాతంగా ఉన్న సామాజిక వర్గాలను పూర్తిగా నేరపూరితమైనవిగా చేయడం గురించే ఈ చర్చ. ఆవులకు, వాటి సంతతికి, దేశవాళీ పశుజాతులకు, ఆవుకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలకు రక్షణ, భద్రత కల్పించడానికి చట్టాన్ని ఉద్దేశించామని రాజ్య వ్యవస్థ చెబుతోంది. అలా చెప్పడం ద్వారా భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక ప్రాబల్య భావనను సమర్థించే సంకల్పాన్ని దాచి పెడుతున్నదనేదే అసలు వాస్తవం.
మాంసం కోసం పశువులను వధించడం వల్ల పశు జనాభా తగ్గిపోదని, తగ్గకపోగా వాటి పునరుత్పత్తికి ఆలంబన అవుతుందనే సత్యం పశు వైద్యులుగా, జంతు శాస్త్రవేత్తలుగా మాకు తెలుసు. భారతీయ గేదెలు, దున్నపోతుల విషయంలో ఇది ఒక నిదర్శనంగా ఉన్నది. పశు వధపై నిషేధాలు నిజానికి పశువుల పెంపకంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనడానికి అనేకానేక రుజువులు వున్నాయి. పాలివ్వని గోవులు, అనుత్పాదక ఎద్దులు, చిన్న ఎద్దులు మొదలైన వాటిని విక్రయించేది రైతులేగాని, పశువ్యాపారులు కాదు. పశువుల యజమానుల నుంచి వాటిని తస్కరించడం లేక నిర్బంధంగా కొనుగోలుచేయడమే వ్యాపారులకు పరిపాటి. దేశ గ్రామీణజనాభాలో 80శాతంగా వున్న చిన్న రైతులు, సన్నకారు రైతులు, దేశంలోని 1900 లక్షల పశువులు, 1080 లక్షల గేదెలలో 70శాతాన్ని కలిగి వున్నారు. కరువు కాటకాలు, పాడి ఉత్పత్తులకు సరైన ధరలు లేకపోవడం మొదలైన కారణాల వల్ల గోవులు, గేదెలు, ఎద్దులు మొదలైన పశువులను రైతులు సరైనవిధంగా పోషించలేకపోతున్నారు.
పశుగ్రాసం లభించకపోవడం వల్ల, నీటికరవు వల్ల రైతులకు తమ పశువులను విక్రయించక తప్పడం లేదు. అయితే తోటి రైతు ఎవరైనా వాటిని కొను గోలు చేసినప్పుడు వాటికి ఆకలిదప్పుల నుంచి కనీసం కొంతకాలమైనా ఉపశమనం లభిస్తుంది, అయితే పశు వ్యాపారులు కొనుగోలు చేసినప్పుడు అవి అంతిమంగా కబేళాలకు పంపబడుతున్నాయి. తమ పశువులను విక్రయించుకోవడమనేది రైతుల హక్కు. జీవనాధారాల సుస్థిరతకు, పశుగణాల కేంద్రిత ఆర్థిక వ్యవస్థ వర్ధిల్లడానికి రైతులకు గల ఈ హక్కు చాలా కీలకమైనది.
గో వధపై నిషేధం గోవులను రక్షించకపోగా, రైతులు విక్రయించిన అనంతరం గో సంబంధిత ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అవరోధమవుతోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇప్పటికే అదృశ్యమవుతున్న పశు కేంద్ర ఆర్థికతకు ఆ నిషేధం చావు దెబ్బవుతోంది. మన ఆహార సంస్కృతులలో గొడ్డు మాంసం చాలా ముఖ్యమైనది. అత్యధిక సంఖ్యాకులకు అది చౌకగా లభించే బలవర్థక ఆహారం. 1100 కోట్ల డాలర్ల విలువైన భారతదేశ చర్మోత్పత్తుల పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు అంటే పశు చర్మాలు సమకూరుతున్నాయి. అంతేగాక మన పాదరక్షల అవసరాలలో 95 శాతం మన పశుగణాల ద్వారానే తీరుతున్నాయి. ఇంకా ఔషధ తయారీ, వస్తూత్పత్తి పరిశ్రమలకు కూడా పశుగణాల నుంచి విశేష సేవలందుతున్నాయి. ఈ కారణాల వల్ల అనుత్పాదక పశువులు, అవి ఆడవైనా, మగవైనా మంచి మార్కెట్ విలువ కలిగివుండి రైతులకు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి.
ఎద్దులు, చిన్న ఎద్దుల వధపై నిషేధం వల్ల వాటి పునర్ విక్రయ విలువ గణనీయంగా పడిపోయిందని మహారాష్ట్ర రైతులు ఆరోపిస్తున్నారు. ఎద్దుల ధరలు 40 నుంచి 60 శాతం మేరకు తగ్గిపోవడంతో రైతులు తమ పశువులను విడిచిపెట్టక తప్పడం లేదు. దీనివల్ల కరువుకాటకాలు మొదలైన దురవస్థల్లో పశువుల ద్వారా లభించే ఆదాయాన్ని చాలా మంది రైతులు కోల్పోతున్నారు. 2015లో నెలకొన్న దుర్భిక్షంవల్ల రైతులు తమ తాగునీటిని సైతం కొనుక్కోవల్సివచ్చింది. ఇటువంటి దుస్థితిలో పడ్డ రైతులు తమ పశువులకు కూడా తాగునీటిని ఎలా కొనగలుగుతారు? దుర్భిక్ష పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్న కారణంగా వారు ఆ దుస్థితి నుంచి ఇంకా బయటపడలేదు. తమ అనుత్పాదక పశువులను సైతం విక్రయించుకోలేని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందుకు రైతులు ఎంతో విచారిస్తున్నారు. గోశాలల ఏర్పాటునకు, అనుత్పాదక గోవులు, పశువులకు ఆశ్రయం కల్పించడానికి ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలని పశు/గో వధపై నిషేధాలు అమల్లో వున్న రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్నాయి. దేశంలోని పశుగణాలలో మూడోవంతు అనుత్పాదకమైనవి అనుకుంటే వాటిని పోషించడానికి ప్రభుత్వానికి రూ.6,36,300కోట్ల వ్యయమవుతుంది!
గో/పశు వధ నిషేధించాలని కోరుతున్న సంస్కృతి, రాజ్యవ్యవస్థలు ఒక వాస్తవంపై మౌనం వహిస్తున్నాయి. చనిపోయిన ఆవులు, ఇతర పశువుల కళేబరాలను తొలగించడం, పారవేయడం మొదలైన పనులు చేసేవారు దాదా పుగా అందరూ అట్టడుగువర్గాల వారే కదా. దళితులు, ఆదివాసీలు, ముస్లింలు మినహా మరే కులంవారు కూడా మృత గోవుల, పశువుల కళేబరాలను పారవేయడానికి అంగీకరించరు. మృత గోవులు, పశువులకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనే 25లక్షల మందిలో 45శాతం మంది దళితులు కాగా, 55శాతం మంది ముస్లింలు. వీరు మాత్రమే పశు కళేబరాలను తొలగించడం, పారవేయడం, వాటి చర్మాలను ఒలవడం, శుద్ధిచేయడం మొదలైన పనులు చేస్తారు. ఇటువంటి పనుల్లో పాల్గొనేవారి ఆదాయం అతితక్కువ కాగా భారతదేశపు విస్తరిస్తున్న చర్మోత్పత్తులు, మాంసోత్పత్తుల పరిశ్రమల నుంచి అపరిమిత లాభాలనార్జిస్తున్న వారందరూ అగ్రకులాలవారే కావడం భారతీయ సమాజంలో ఒక బాధాకర వైరుధ్యం. -డాక్టర్ సాగరి ఆర్ రామ్‌దాస్, పశు వైద్య శాస్త్రవేత్త. (ఆంధ్ర జ్యోతి)

No comments:
Post a Comment