Friday, 9 September 2016

# నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా తిరస్కరణ న్యాయమా? #




                   పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సులు నూతనంగా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అడ్డుపడుతున్నాయని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తదితరులు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నికర పన్నుల మొత్తాన్ని రాష్ట్రాలకు ఏ మేరకు, ఏ విధంగా పంచాలో సిఫార్సులు చేయటమే ఆర్థిక సంఘం కర్తవ్యం. సంఘం చేసిన సిఫార్సులను సలహాలుగా మాత్రమే తప్ప కేంద్రం ఆమోదించ వచ్చు లేక మార్పులు చేయవచ్చు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ప్రణాళికా సంఘం సభ్యులు (ఇప్పుడు నీతి ఆయోగ్‌ సభ్యు లు), ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యులుగా ఉండే జాతీయ అభివృద్ధి మండలికి ఉంటుంది. ఎ) ప్రత్యేక ప్రాంతం, బి) తక్కువ జనాభా సాంద్రత లేక గిరిజన జనాభా శాతం గణనీయంగా ఉండే సి)పక్క దేశాలతో సరిహద్దు ఉండే డి) ఆర్థిక, మౌలిక వసతుల వెనుక బాటుతనం, ఇ) రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు గడ్డుగా ఉండే అటువంటి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా రాష్ట్రాల జాబితాలో చేర్చటం జరుగుతుంది. ఇప్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది.
నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తే కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా డిమాండు చేస్తాయని కేంద్రమంత్రులు పదేపదే మాట్లాడుతూ వస్తున్నారు. నవ్యాంధ్రకు రాజధాని లేదు. వందలాది కేంద్ర, రాష్ట్ర సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు ఉన్న హైదరాబాద్‌ నగరాన్ని వదులుకోవలసి వచ్చిన కారణంగా నవ్యాంధ్రలో పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 2014-15లో ఉన్న సుమారు రూ. 16.000 కోట్ల లోటు రానున్న దీర్ఘకాలంలో కూడా ఆర్థిక లోటు కొనసాగుతూనే ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు, రాయలసీమ- కరువు సీమలో నాలుగు జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని కేంద్రమే అంగీకరిస్త్తోంది. ఇన్ని కారణాల వల్లనే ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలపాటు ఉంటుందని పార్లమెంటులో హామీ ఇవ్వటం, అందుకనుగుణంగా కేంద్రమంత్రివర్గంలో తీర్మానం చేసి తదుపరి చర్యల కొరకు ప్రణాళికా సంఘానికి పంపడం జరిగింది.
ఇలాంటి నేపథ్యంలో నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా తిరస్కరించటం ఎంతమాత్రం న్యాయం కాదు. ప్రత్యేక హోదా పొందేందుకు అవసరమయ్యే అంశాలు ఒడిషా, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మున్నగు రాష్ట్రాలకు కూడా వర్తిస్తాయి. ఉదాహరణకు ఒడిషా రాష్ట్రంలో 40 శాతం ప్రజలు ఎస్‌సి, ఎస్‌టి కేటగిరీలకు చెందినవారు. మొత్తం 314 బ్లాకులలో 118 గిరిజనులు మెజారిటీగా ఉన్నవే. మొత్తం 30 జిల్లాలలో 20 జిల్లాలకు మావోయిస్టు ప్రభావం ఉన్నది. ఏడు జిల్లాలలో రైల్వే వ్యవస్థ లేనేలేదు. అలాగే బీహార్‌ రాష్ట్రంలో 41 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. చిన్న రాష్ట్రమైనా గుజరాత్‌లో సంఘటిత రంగంలో 19 లక్షల మంది ఉపాధి పొందుతూ ఉండగా దేశంలో రెండవ పెద్ద రాష్ట్రమైన బీహార్‌లో 4.3 లక్షల మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభించాయి. దుర్భర దారిద్య్రం వల్ల బిహారీలు దేశంలో పలు ప్రాంతాలలో వివిధ రంగాలలో కూలీలుగా పనిచేసుకుంటూ ఉన్న వాస్తవం ఉంది. అలాగే ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలలో గిరిజనుల జనాభా చాలా ఎక్కువగా ఉండటమే గాక మావోయిస్టు ప్రభా వం కూడా చాలా తీవ్రంగా ఉన్న యదార్థం ఎవరూ కాదనలేము. దేశం స్వాతంత్య్రం పొంది 70 సంవత్సరాలు కావస్తున్నా కొన్ని రాష్ట్రాలలో ఇటువంటి దయనీయ, ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతూ ఉండడం బాధాకరం. కావున కేంద్ర ప్రభు త్వం ఇటువంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌లో సహా సత్వరంగా సర్వతోముఖాభి వృద్ధిని సాధించేందుకు తోడ్పడవలసింది పోయి ఇప్పుడు ఆ హోదా కల్గి ఉన్న 11 రాష్ట్రాలకు కూడా హోదా రద్దుచేయబోతున్నామని చెప్పటం ఏమాత్రం తగదు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి జాతీయ అభివృద్ధి మండలిలో నవ్యాంధ్రతోపాటు ఒడిషా, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మున్నగు రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా కొనసాగించుటకు చర్యలు తీసుకోవలసి ఉంటుంది.

# ప్రత్యేక హోదా కోసం ఎందుకు పట్టుపట్టాలి? # 

ప్రత్యేక హోదా కల రాష్ట్రాలలో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధి కొరకు వంద శాతం ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు, వంద శాతం ఆదాయపన్ను మినహాయింపు, 30 శాతం క్యాపిటల్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ, వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ, వంద శాతం ఇన్సూరెన్సు ప్రీమియం రీయింబర్స్‌మెంట్‌, ముడిసరుకులు, తయారైన సరుకుల రవాణా ఛార్జీలలో 90 శాతం రవాణా రాయితీ మున్నగు ప్రోత్సహకాలు లభిస్తాయి. అందువల్లనే ప్రత్యేక హోదా రాష్ట్రాలలో నూతన పరిశ్రమలు అధిక సంఖ్యలో స్థాపించబడతాయి. నవ్యాంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధి సాధించబడాలంటే ఇటువంటి ప్రోత్సాహకాల ఆవశ్యకత ఎంతగానో ఉంది. ఇందుకు బదులుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నవ్యాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తానంటున్నది. ప్రత్యేక హోదా వల్ల ఒనగూడే ప్రయోజనాలకు మించిన ప్రయోజనాలు చేకూరుతాయని నమ్మబలు కుతూ ఉంది. తాజాగా ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అర్థరాత్రి ప్రకటన ఇందులోని డొల్లతనాన్ని బహిరంగపరుస్తూ ఉంది. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు విషయ మే చూస్తే విభజన చట్టంలో అవసరమైన అన్ని అనుమతులను ఇవ్వడమే కాక ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా కేంద్రమే చేపడుతుందని చాలా స్పష్టంగా పేర్కొన్నది. దాదాపు రూ.30 వేల కోట్లపైన ఖర్చుకాగల ఈ ప్రాజెక్టుకు విభజన అనంతరం కేంద్రం నుంచి రూ.835 కోట్లు మాత్రమే వచ్చాయి. జాతీయ హోదా ప్రాజెక్టునకు కేంద్రం 90 శాతం నిధులు అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో 10 శాతం కూడా తానే భరింస్తానని హామీ ఇస్తూనే ఉంది.
బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి రూ.7,200 కోట్లు, ఒడిషాలో కోరాపుట్‌- బోలంగిరి-కలహండి జిల్లాలకు ఏటా దాదాపు జిల్లాకు రూ.250 కోట్లు ఇచ్చిన కేంద్రం, నవ్యాంధ్రలో వెనుకబడిన ఏడు జిల్లాలకు జిల్లాకు రూ. 50 కోట్లు చొప్పున కేటాయించటం ఎంతమాత్రం సరికాదు. ఇప్పుడు కూడా ఇదే రీతిలో ఆరు సంవత్సరాలపాటు ఇస్తామని ప్రకటించడాన్ని ఎలా ఆమోదించాలి? ఇక్కడ మరొక ముఖ్య విషయాన్ని గమనించాల్సి ఉంది. గత రెండు సంవత్సరాలలో ఏడు జిల్లాలకు కేంద్రం నుంచి వచ్చిన రూ.700 కోట్లకు గానూ ఆ జిల్లాలలో కేంద్రం సూచనలనను సరించి చేపట్టవలసిన కార్యక్రమాలు, సర్టిఫికెట్‌లు పంపబడలేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతా రాహిత్యానికి ఇదొక తార్కాణం. 
రెవిన్యూ లోటు గురించి రాష్ట్ర ప్రభుత్వం పలు పర్యాయాలు కేంద్రంతో మొత్తుకున్నా ఇప్పటికి ఇచ్చినది రూ.4,000 కోట్లు. జైట్లీ 2015-20 కాలవ్యవధిలో రూ.10,000 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించడం రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టటమే. ఎందుకంటే 14వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటు రాష్ట్రాలకు 2015-20 కాలానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.22,113 కోట్లు ''గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌''గా అంద జేయాలని లోగడే సిఫార్సు చేసి ఉన్నది. నవ్యాంధ్ర రాజధానిలో ప్రభుత్వం పరిపాలనకు అత్యంత అవసరమైన రాజ్‌భవన్‌, సెక్రటేరియట్‌, హైకోర్టు, అసెంబ్లీ, కౌన్సిల్‌ భవనాలతో పాటు మంత్రులు, శాసనసభ, మండలి సభ్యులు, అధికారులు మున్నగు వారికి అవసరమైన నివాసాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని కేంద్రం అందించాలని చాలా స్పష్టంగా విభజన చట్టం సెక్షన్‌ 94(3)లో పేర్కొనబడింది. విజయవాడ, గుంటూరు నగరాలలో కొన్ని మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించిన రూ.1,000 కోట్లు కాక రాజధానిలో భవన నిర్మాణాల కొరకు రూ.1,500 కోట్లు అందజేసింది. దాదాపు ఆరు సంవత్స రాలుగా ఛత్తీస్‌గఢ్‌ నూతన రాజధాని నయా రాయపూర్‌ నిర్మాణానికి ఇప్పటి వరకు కేంద్రం అందజేసింది సుమారు రూ.2,000 కోట్లు మాత్రమే. అటువంటిది మన రాష్ట్రంలో రాజధాని నగర నిర్మాణ కార్యక్రమం మొదలు కాకముందే రూ.1,500 కోట్లు ఇచ్చింది. సింగపూర్‌ సంస్థలు అందజేసిన ''సీడ్‌ కేపిటల్‌'' మాష్టర్‌ ప్లాన్‌లో సెక్రటేరియట్‌ భవనం ఎక్కడ వస్తుందో స్పష్టంగా పేర్కొనబడినప్పటికీ రూ.800 కోట్ల వ్యయంతో వెలగపూడి వద్ద తాత్కాలిక సెక్రటేరియట్‌ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుబారా వ్యయానికి మరో తార్కాణం. రాజధానిలో అత్యవసరంగా ఏర్పాటు కావలసినవి ప్రభుత్వ భవనాలు. వాటి విషయంలో త్వరితంగా నిర్ణయాలు తీసుకుని, టెండర్లు పిలిచి ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణ కార్యక్రమం ప్రారంభించకుండానే ''స్విస్‌ ఛాలెంజ్‌'' పద్ధతిలో సింగపూర్‌ సంస్థలతో ప్లాట్ల అమ్మకం, వాణిజ్య, గృహ సముదాయాల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం ఆశ్చర్యకరం! ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వ భవనముల సముదాయానికి సంబంధించిన సవివరమైన ప్రాజెక్టు రిపోర్టును కేంద్రానికి పంపించి కేంద్రం నుంచి నిధులను రాబట్టేందుకు కృషి జరగాలి.
దాదాపు రెండున్నర సంవత్సరాలుగా నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా అంశం కోట్లాది ప్రజల హృదయాలలో సజీవంగా ఉంది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తూ ఉందని, త్వరలో ప్రకటన వస్తుందని చెబుతూ వచ్చారు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంతి అరుణ్‌ జైట్లీ ప్రత్యేక హోదా సాధ్యంకాదని స్పష్టం చేయటం ఐదు కోట్ల మంది నవ్యాంధ్ర ప్రజలను అవమానించటమే. ఈ పరిస్థితిని నవ్యాంధ్ర ప్రజానీకం ఎంతమాత్రం సహించదు. కావున కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఆంధ్రప్రదేశ్‌కు, అవసర మైతే మరికొన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ప్రకటించాలని తెలుగు ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఇటీవల పార్లమెంటులో ఈ అంశం మీద చర్చ జరిగినప్పుడు అశాస్త్రీయంగా, అసంబద్ధంగా ఏర్పాటైన నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా విషయంలో పలు ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించిన వాస్తవాన్ని కేంద్రం మరువరాదు.
- వడ్డే శోభనాద్రీశ్వరరావు

No comments:

Post a Comment