దేశంలోనే ప్రతిష్టాత్మక మైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు)లో గుర్తింపు విద్యార్థి సంఘాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తాజా ఎన్నికల్లో యునైటెడ్ ఫ్రంట్ ఫర్ సోషల్ జస్టిస్ (యుఎఫ్‌ఎస్‌జె) కూటమి ఘన విజయం సాధించడం సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. వామపక్ష, సామాజిక శక్తులన్నీ ఒకే తాటిపైకి వచ్చి మతోన్మాదులను మట్టికరిపించడం ఆసక్తికర అంశం. దేశంలో ఇటీవలి కాలంలో జెఎన్‌యు, ఇప్లూ, ఇతర యూనివర్శిటీల్లో మతోన్మాదులు ఓడిపోవడం, అదే క్రమం హెచ్‌సియులో జరిగింది. ప్రస్తుతం ఈ గెలుపు ఇటు విద్యార్థుల్లోనూ, అటు మేధావుల్లోనూ నూతనోత్సాహాన్ని రేకేత్తించింది. యుఎఫ్‌ఎస్‌జె కూటమిలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ), దళిత్ స్టూడెంట్ యూనియన్(డిఎస్‌యు), ట్రైబల్ స్టూడెంట్ ఫోరం(టిఎస్‌ఎఫ్), బహుజన స్టూడెంట్ ఫ్రంట్ (బిఎస్‌ఎఫ్), తెలంగాణ విద్యార్థి వేదిక (టివివి) కూటమి ఐక్యంగా ప్రచారం నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన రోహిత్ వేముల ఆత్మహత్యకు, క్యాంపస్‌లో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న మతోన్మాదులను ఓడించాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఈ కూటమి బరిలోకి దిగి ఘన విజయం సాధించింది.
# పోటీలో ఎవరెవరు? #
యూనివర్సిటీ ఎన్నికల్లో మొత్తం మూడు ప్యానెళ్ళు బరిలో నిలిచాయి. ఎస్‌ఎఫ్‌ఐ, టిఎస్‌ఎఫ్, డిఎస్‌యు, టివివి, బిఎస్‌ఎఫ్‌లు యునైటెడ్ ఫ్రంట్ ఫర్ సోషల్ జస్టిస్ (యుఎఫ్‌ఎస్‌జె) ఒక కూటమిగా ఆవిర్భవించింది. అఖిల భారత విద్యార్థి పరిషత్(ఎబివిపి), అదర్ బ్యాక్‌వర్డ్‌క్లాస్ విద్యార్థి సంఘం(ఒబిసి) ఒక కూటమిగా, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్(ఎఎస్‌ఎ) ఒక అధ్యక్ష పదవికి, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యుఐ) ఉపాధ్యక్షుడు, సహాయకార్యదర్శికి పోటీ చేసింది. ఎన్నికల నియమావళి ప్రకారం బరిలో మూడు ప్యానెళ్ళు నిలిచినప్పటికీ, పోటీ మాత్రం ప్రధానంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలోని లౌకిక, సామాజిక శక్తులు, ఎబివిపి నేతృత్వంలోని మతోన్మాద కూటమి మధ్యే తీవ్రంగా నెలకొన్నది. ఢిల్లీ యూనివర్సిటీలో మాదిరిగా అవకాశవాద రాజకీయాలు చేసి గెలిచేందుకు ఎబివిపి కూటమి తీవ్రంగా ప్రయత్నించింది. గెలుపు కోసం అడ్డమైన దారులూ తొక్కిన పరిస్థితే ప్రతి చోటా ప్రస్ఫుటించింది. ఎస్‌ఎఫ్‌ఐపై విష ప్రచారం భారీ స్థాయిలోనే చేస్తూ వచ్చింది. క్యాంపస్‌లో ఎబివిపి ప్రచారంతో పాటు మతోన్మాద భావాలు కల్గిన విసితో పాటు ప్రొఫెసర్లు, ఇతర ఫ్యాకల్టీ యుఎఫ్‌ఎస్‌జె కూటమిని ఓడించాలనే లక్ష్యంతో విద్యార్థులను బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. కానీ గడిచిన సంవత్సర కాలంగా అనేక సమస్యలపై పనిచేయడమే కాకుండా దేశంలో వస్తున్న మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా ఇక్కడ వామపక్ష సామాజిక సంఘాలు పోరాటాలు చేశాయి. ప్రధానంగా రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలనే పోరాటాల ద్వారా తీవ్రస్థాయిలో ఇక్కడ సంఘాలు కృషి చేశాయి. ఈ కారణాలతో విద్యార్థులు యుఎఫ్‌ఎస్‌జె కూటమిని గెలిపించారు.
అధ్యక్ష పదవితో పాటు కీలకమైన ఎనిమిది పోస్టులను వామపక్ష, సామాజిక కూటమే సొంతం చేసుకున్నది. అధ్యక్షులుగా కులదీప్‌సింగ్ నాగి ఎస్‌ఎఫ్‌ఐ-యుఎఫ్‌ఎస్‌జె (1,406) (గోపీకృష్ణ ఎబివిపి-ఒబిసిఎ (1,354) విజమ్‌కుమార్ ఎఎస్‌ఎ (984)), ప్రధాన కార్యదర్శిగా సుమన్ దామెర డిఎస్‌యు-యుఎఫ్‌ఎస్‌జె (1,842) (ఆనందరావు ఎబివిపి-ఒబిసిఎ (1,503)) ఉపాధ్యక్షులుగా భుక్యా సుందర్ టిఎస్‌ఎఫ్-యుఎఫ్‌ఎస్‌జె (1,701) (ఆదిత్య ఎబివిపి-ఒబిసిఎ (1,405)), సహాయ కార్యదర్శిగా పిల్లి విజరు కుమార్ ఎస్‌ఎఫ్‌ఐ-యుఎఫ్‌ఎస్‌జె (1,557) (అజిత్ ఎబివిపి-ఒబిసిఎ (,1351)) స్పోర్ట్స్ సెక్రెటరీగా ఉస్వినీస్ దాస్ ఎస్‌ఎఫ్‌ఐ-యుఎఫ్‌ఎస్‌జె (1,790) (నంద కుమారి ఎబివిపి-ఒబిసిఎ (1,632)), కల్చరల్ కార్యదర్శిగా నకిరియా దెబ్రామ బిఎస్‌ఎఫ్-యుఎఫ్‌ఎస్‌జె (1823) (శాంతి ఎబివిపి-ఒబిసిఎ (1592)), జిఎస్ క్యాష్ ఇంటిగ్రేటెడ్‌గా తుషారా ఎస్‌ఎఫ్‌ఐ (419), (ఎబిపిపి-ఒబిసిఎ (288)), యుఎఫ్‌ఎస్‌జె కూటమి బలపరిచిన జిఎస్ క్యాష్ పిహెచ్‌డిగా ఫిర్‌దోస్ స్వతంత్ర (679) (ఎబివిపి-ఒబిసిఎ (399)), తదితర పోస్టులన్నీ కూటమి ఖాతాలోనే పడ్డాయి. స్కూల్ కౌన్సిలర్, బోర్డ్ మెంబర్స్‌లో 55 పోస్టులకు గాను ఎస్‌ఎఫ్‌ఐ 27, ఎఎస్‌ఎ 4, ఎబివిపి 8 లభించగా 16 పోస్టులకు ఇంకా ఎన్నిక జరగాల్సి ఉన్నది. ప్రధానంగా అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ (ఎఎస్‌ఎ)కు అధ్యక్ష పదవికి మంచి ఓట్లు రావడం ఒక శుభపరిణామం.
# వామపక్ష, సామాజిక శక్తుల ఐక్యగీతమెందుకు? #
ప్రస్తుత తరుణంలో దేశ రాజకీయాల్లో మరో ప్రశ్న ప్రధానంగా ఉత్పన్నమవుతున్నది. వామపక్ష, సామాజిక శక్తుల కలయిక ఎందుకు, ఆ కూటమి ఏర్పడటానికి ముఖ్యమైన కారణాలేంటి అనే ప్రశ్నలు ప్రధానంగా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో బిజెపి అధికారం చేపట్టిన తర్వాత తిరోగమన చర్యలకే అధిక ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభలో తన మందబలంతో మోడీ ఆర్డినెన్స్‌ల పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం చేస్తున్నారు. దేశంలో బిజెపి తన అధికారదాహాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం ప్రజలు, విద్యార్థుల మధ్య అనైక్యతను తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. ఎక్కడైతే లౌకిక, సామాజిక భావాలున్నాయో అక్కడ వాటిని ఏవిధంగా తుడిచిపెట్టాలనే ఆలోచనలో పడి తన ఇష్టానుసారంగా చేస్తున్నాయి. అందుకు ఉదాహరణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య. వర్శిటీ కేంద్రాల్లో తన వ్యక్తిగత భావాలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. అలా విద్యార్థులు మాట్లాడితే వారిని రెస్టిగేట్ పేరుతో క్యాంపస్ బయటకు పంపిస్తున్నారు. ఇదేకాదు దేశంలో జెఎన్‌యులో దేశభక్తి అనే చర్చ తెచ్చి రాజద్రోహం కేసు పెట్టడం, ఆలీగఢ్ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షునిపై అసత్యప్రచారాలు చేయడం, ఇలా తన ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళేందుకు అబద్ధాలను నిజం చేసే పరిస్థితుల్లో బిజెపి మతోన్మాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి ఉద్దేశం యూనివర్శిటీల్లో వీరి భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏ స్థాయికైనా తీసుకుపోతాము, ఏమైనా చేస్తాం అనే లక్ష్యంగా కనబడుతున్నది. వర్శిటీల్లో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న మతోన్మాదులను కాపాడేందుకు బిజెపి కృషి చేస్తున్నది. దానికి ఉదాహరణ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన విసిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం.
అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో బిజెపి తన విధానాలు మార్చుకోవడం లేదు. అందులో లవ్ జిహాద్, ఘర్‌వాపసీ వంటి మతోన్మాద చర్యలతో ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నదీ బిజెపి సర్కారు. ఇక విద్యారంగంలో పూర్తిగా కాషాయీకరణను జొప్పించేందుకు చేయని ప్రయత్నం లేదు. వేదాల్లోనే విమానం(పుష్పక విమానం) నడిచిందని, వినాయకుడి తలను అతికించడాన్ని అప్పటికే ప్లాస్టిక్ సర్జరీ ఉందని చెబుతూ అబద్ధాలాడారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రకమైన అశాస్త్రీయమైన వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ భారతంలో తొలిసారి. దీనిపై పౌరసమాజం తీవ్రంగా స్పందించింది. ప్రశ్నించిన వారిపై హిందూత్వ మతోన్మాదులు దాడులకు తెగబడుతున్నారు. గుజరాత్‌ను మోడల్‌గా చూపెడుతూ ఎలాంటి విద్యనైతే ప్రచారం చేశారో, అదే కాషాయీకరణ విద్యను నూతన విద్యా విధానం-2016 పేరుతో దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సైద్ధాంతికవేత్తలను యూనివర్సిటీ, విద్యా సంబంధిత సెంటర్లలోని కీలక పదవుల్లో కూర్చోబెడుతున్నారు. విద్య విషయంలో లౌకిక భావాలున్న వ్యక్తులకు ప్రాధాన్యమివ్వాలన్న కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నదీ ప్రభుత్వం. మేధావులకు కేంద్ర బిందువులైన యూనివర్సిటీలను తమ కబంద హస్తాల్లోకి తీసుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నది. కేంద్రీకరణ పేరుతో ఎన్డీయే ప్రభుత్వం యూనివర్సిటీలను తమ చేతుల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నది. క్యాంపస్ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. వర్శిటీలను పోలీస్ కేంద్రాలుగా మారుస్తూ ఉద్యమాలు చేసిన వారిపై కేసులు బనాయిస్తున్నది. మరోవైపు మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దాడులు చేయడం, అవసరమైతే చంపేయడం అత్యంత బాధాకరం. ఇటీవలి కాలంలో గుజరాత్‌లోని ఉనా ప్రాంతంలో చనిపోయిన ఆవును దళితులు తోలు వలుస్తుంటే మతోన్మాద మూకలు ఆ దళితులను తీవ్రంగా కొట్టడం దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. ఇలాంటి ఘటనలకు నాయకుడైన మోడీ హైదరాబాద్ వచ్చి దళితులపై దాడిచేసే ముందు తనపై దాడి చేయండంటూ మొసలి కన్నీరు కార్చారు. అంత ప్రేమ దళితులపై ఉంటే తన సొంత రాష్ట్రంలో ఉనా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా, బాధితులను పరామర్శించకుండా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జిగేష్‌ను అరెస్టు చేయడంలోనే బిజెపి రాజకీయం అర్థమౌతున్నది.
మతోన్మాదులు పేట్రేగుతున్న తరుణంలో వామపక్ష, సామాజిక, లౌకికవాదులు కలసి ఎదుర్కొవాలి. ఎన్నికల రాజకీయాలైనా, పోరాట రాజకీయాలైనా అందుకు అతీతం కాకూడదు. హెచ్‌సియులో జరిగిన పరిణామం పాఠం ఇదే చెబుతున్నదన్నది స్పష్టం. ఫాసిస్టు విధానాలను వ్యతిరేకించేందుకు విద్యార్థులు ఏకమైతేనే గెలుపు సొంతమైంది. ఇక రాజకీయ క్షేత్రంలో వామపక్ష, లౌకిక, సామాజిక శక్తులు సంఘటితమైతే మనుధర్మశాస్త్ర పుత్రులు, మిత్రులుగా చెప్పుకొంటున్న మతోన్మాదులను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. - బీరెడ్డి సాంబశివ

No comments:
Post a Comment