పఠాన్ కోట్ దాడి తరహాలోనే కాశ్మీర్‌లో సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దొంగ దెబ్బతీసి నిద్రలో వున్న 18 మంది జవాన్లను పొట్టనబెట్టుకోవడం అత్యంత హేయమైన చర్య. భద్రతా బలగాలు మట్టుబెట్టిన నల్గురు ముష్కరుల దుస్తులపై ఉన్న గుర్తులను బట్టి పాకిస్తాన్ ప్రభుత్వ లేదా ఆ దేశంలోని భారత వ్యతిరేక శక్తుల పనే ఇది అని స్పష్టమవుతోంది. యురీలో ఆర్మీ క్యాంపుపై జరిగిన ఈ దాడి అతిపెద్ద దాడి. ఉగ్రవాద దాడిలో ఇంత పెద్ద సంఖ్యలో సైనిక జవాన్లు చనిపోవడం గత రెండు దశాబ్దాలలో ఇదే మొదటిసారి. సరిహద్దుల్లో భద్రతా సిబ్బందిని పెద్దయెత్తున మోహరించినప్పటికీ ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని సలామాబాద్, నలా గుండా ఆర్మీ క్యాంప్‌పై దాడికి దిగడాన్ని బట్టి ఇది సీమాంతర ఉగ్రవాదులు పక్కా పథకంతో చేసిన దాడి అని స్పష్టమవుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ తానూ అదే ఉగ్రవాదానికి బలవుతున్నాననే విషయం గ్రహించాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ చర్యలను అంతర్జాతీయ వేదికలపై భారత్ సమర్థవంతంగా ఎండగట్టాలి. వెనిజులాలో నామ్ సమావేశాల్లో ఈ అంశాన్ని భారత్ లేవనెత్తితే పాకిస్తాన్ ఎదురు దాడి చేసింది. రేపు ఐరాస జనరల్ ఆసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తడానికి అది మళ్లీ ప్రయత్నించవచ్చు. దీనికి దీటుగా భారత్ సమాధానమివ్వాలి. ఈ దాడి జరిగిన వెంటనే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ దగ్గర నుంచి బిజెపి నేత రామ్ మాధవ్ దాకా రెచ్చగొట్టే ప్రకటనలు గుప్పిస్తున్నారు. పాకిస్తాన్ వ్యతిరేకతను రెచ్చగొట్టి మత పరంగా ప్రజలను సమీకరించి రానున్న ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. అణు సామర్థ్యం సంతరించుకున్న ఈ రెండు దేశాల మధ్య యుద్ధమంటూ ఒకసారి మొదలైతే అది అనేక అనర్థాలకు దారితీస్తుంది. దాని పర్యవసానాలు చాలా భయంకరంగా వుంటాయి. ఈ ధోరణి చాలా ప్రమాదకరం. ముందు భద్రతపై దృష్టి పెట్టాలి. వాస్తవాధీన రేఖ గుండా చొరబాట్లను ఎందుకు అరికట్టలేకపోతున్నాం? ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడంలో మన సన్నద్ధత ఎంత? కాశ్మీర్ పట్ల ప్రభుత్వ విధానపరమైన ప్రాధాన్యతలేమిటి? వంటి అనేక ప్రశ్నలను యురీ దాడి ముందుకు తెచ్చింది. ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడి చేస్తే దీటుగా ఎదిరించే పరిస్థితి లేదు. భద్రతాపరమైన ఈ లోపాలపై దృష్టి పెట్టకుండా, పాకిస్తాన్‌ను నిందించుకుని కూర్చోవడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు. యురీ దాడిపై హిందూత్వ శక్తులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలను సమర్ధించేలా హోమ్ మంత్రి వ్యాఖ్యలు వున్నాయి. యురీ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని బిజెపి ఆరెస్సెస్ చేస్తున్న ప్రకటనలకు మీడియాలో ఒక సెక్షన్ బాహాటంగా మద్దతు పలకడం శోచనీయం.ఇటువంటి ప్రకటనలు పరిస్థితిని మరింత దిగజార్చుతాయి. అసలే అంతంతమాత్రంగా వున్న ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెడతాయి. భారత్, పాక్ సరిహద్దు సమస్యకు యుద్ధం ఎంతమాత్రమూ పరిష్కారం కాదని గత అనుభవం తెలియజేస్తోంది. యుద్ధనాదాలు ఆపి కాశ్మీర్ సమస్యకు శాశ్విత పరిష్కారం కనుగొనాలి. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక చర్చలు తిరిగి ప్రారంభించాలి. అదే సమయంలో దేశభద్రతకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టేలా భద్రతావ్యవస్థను సన్నద్ధం చేయాలి. ఈ విధమైన ద్విముఖ వ్యూహంతో ఉగ్రవాద, మత ఛాందసవాద శక్తులను ఒంటరిపాటు చేయాలి. అంతకన్నా ముందు గత రెండున్నర మాసాలుగా కాశ్మీర్‌లోయలో కొనసాగుతున్న అశాంతిని తొలగించాలి. కాశ్మీర్‌లోని అన్ని పక్షాలతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ చర్చలు జరపాలి. సరిహద్దుల్లో అక్రమ చొర బాట్లను, ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా అరికట్టాలంటే కాశ్మీరీయుల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి. ఈ దూరదృష్టే కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కొరవడింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరుకు ద్విముఖ వ్యూహం అవలంభించాలి.

No comments:
Post a Comment