భారతదేశంలో ప్రత్యా మ్నాయ సంస్కృతి ని రూపొందించే క్రమంలో ఎన్నో ఉద్యమాలు ఆవిర్భవించాయి. ఎందరో ప్రవక్తలు ఆవిర్భ వించారు. ముఖ్యంగా బుద్ధుడు, భక్తి కవులు, మహాత్మా ఫూలే, అంబేద్కర్, సాహూ మహరాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణమూర్తి పేర్కొనదగిన వారు. కొందరు మతంలో ఉండి పోరాటం చేస్తే, కొందరు మతం బయట ఉండి పోరాటం చేశారు. ఈ పోరాటాల వల్ల అట్టడుగు ప్రజల్లోకి సామాజిక చైతన్యం, విద్య, సమానతా భావం ముందు కొచ్చాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పెరియార్ ఇవి రామస్వామి నాయకర్, నారాయణ గురు చేసిన పోరాటాలు, ఉద్యమాలు గణనీయమైన మార్పు తెచ్చాయి. నారాయణ గురు కేరళ రాజధాని త్రివేండ్రంలోని చంపజంతి గ్రామంలో 1856లో(మళయాళం కేలండర్ ప్రకారం 1032లో) 'చింగమ్' నెలలో 'చాతయామ్' నక్షత్రంలో జన్మించారు. ఆయన తండ్రి మదన్ అసన్ ఒక రైతు. తల్లి కుట్టి అమ్మ. అయితే ఆయన వాస్తవానికి 1030లో జన్మించినట్లు ఆయన అనుయాయులు కొందరు చెప్పారు. ఆయన 60వ జన్మదినోత్సవాన్ని 1916లో జరపగా నారాయణ గురు నవ్వి 'నా 60వ పుట్టిన రోజు (షష్టిపూర్తి) ఎప్పుడో అయిపోయింది' అని చెప్పారు. ఆయన తండ్రి మదన్ అసన్, తల్లి కుట్టి అమ్మ ఆయనను ప్రేమగా 'నానూ' అని పిలుచుకునేవారు. ఐదవ ఏట ఆయన తన విద్యాభ్యాసాన్ని పాత 'గురుకుల' పద్ధతిలో పొరుగునే ఉన్న పాఠశాలలో ప్రారంభించారు. మదన్ అసన్ కూడా ఉపాధ్యాయుడే. ఆయన సంస్కృతం నేర్చుకున్నారు. ఆయనకు జ్యోతిశ్శాస్త్రంలోనూ, ఆయుర్వేదంలోనూ మంచి ప్రవేశం ఉంది. వయలవరంలోని ఆయన ఇల్లు అత్యున్నత సామాజిక బాధ్యతను, ఆర్థిక హోదాను అనుభవించింది. ఆయనకు నారాయణన్ అనే పేరు పెట్టినా నానూ అనే పిలిచే వారు. నానూకు ముగ్గురు సోదరీమణులున్నారు. ఆరోజుల్లో సమాజం ఉన్నత కులం, తక్కువ కులాలుగా విభజితమై ఉంది. సమాజం పూర్తిగా కుల వ్యవస్థ గుప్పిట్లో ఉంది. ప్రజలు అస్పృశ్యతను పాటించేవారు. పరస్పరం సహకారం అందించుకునేవారు కాదు. నారాయణగురు ఉద్యమంలో ప్రధానమైంది అణగారిన ప్రజలకు విద్య. ఆయన గుడుల్లో బడులు నిర్వహించారు. మానవులందరూ సమానమని పేర్కొన్నారు. ఈనాడు కేరళలో విద్యలో దళితులు, ఈడిగలు ముందుండటానికి, మొత్తం భారతదేశంలో కేరణ విద్య విషయంలో, కదలిక విషయంలో ముందుందనడానికి కారణం నారాయణగురు బోధనలే. ఆయన ప్రతి మనిషీ చదువుకోవాలని, దేవుడు వేరే లేడని, మనలోనే ఉన్నాడని సందేశమిచ్చాడు. నేడు భారతదేశం ప్రాథమిక విద్యలో అడుగంటి ఉండటానికి కారణం నారాయణగురు బోధనలను అనుసరించకపోవడమే. భారతదేశంలో ఇప్పుడు ఆరు కోట్ల మందికి పైగా పిల్లలు సాధారణ విద్యకు దూరంగా ఉంటున్నట్లుగా యునెస్కో తన నివేదికలో తెలిపిరది. కోటీ 11 లక్షల మంది పిల్లలు బడి బయట ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలల్లో చేరలేక దాదాపు నాలుగు కోట్ల 70 లక్షల మంది బాలకార్మికులుగా ఉన్నారు. దీనంతటికీ కారణం నారాయణగురు బోధనలను దేశవ్యాప్తంగా అనుస రించకపోవడం. హక్కుల గురించి పోరాడటం ఎంత ముఖ్యమో, అక్షర విద్యను నేర్పడం, ప్రతి విద్యార్థిని చదువుకునే స్థాయికి తీసుకురావడం ఇంకా ముఖ్యం. నారాయణగురు మహోన్నతమైన ఉద్యమాన్ని కేరళలో నడపబట్టే నేడు భారతదేశానికి ఆదర్శంగా అక్కడ విద్యా వ్యవస్థ వ్యాపించింది. హిందూ మతోన్మాదం ఎక్కడ ఉంటే అక్కడ విద్యార్థులకు విద్య లేదు. ప్రజలకు జ్ఞానం లేదు. మూఢనమ్మకాలతో ప్రజలు విద్యకు దూరంగా, జ్ఞానానికి దూరంగా కొలుపులు, భజనలు, తద్దినాలు, ఆబ్దికాలు వంటి నమ్మకాలతో గడుపుతూ ప్రపంచం అభివృద్ధి జరుగుతున్న దిశ నుంచి పక్కకు ఒరుగుతున్నారు. మహాత్మా ఫూలే, పెరియార్, అంబేద్కర్ ప్రజల్లో విద్యకు చాలా ప్రాధాన్యతనిచ్చారు. మహాత్మా ఫూలే 1827లో మహారాష్ట్రలో పుట్టారు. అంబేద్కర్ 1891లో మహారాష్ట్రలో పుట్టారు. పెరియార్ ఇవి రామస్వామి నాయకర్ 19వ శతాబ్దంలో జన్మించి ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ ఉన్నంత కాలమూ బడుగు వర్గాల ఉన్నతి కోసం పనిచేయాలని కాంగ్రెస్ నాయకులపై ఒత్తిడి తెచ్చిన పెరియార్ వారితో అది సాధ్యం కాక బయటికి వచ్చి దళిత వర్గాల ఆత్మగౌరవం, మూఢనమ్మకాల నిర్మూలన, స్త్రీ విమోచన లక్ష్యాలుగా 1924లో ఆత్మగౌరవ సంఘాన్ని స్థాపించాడు. నాటి నుంచి స్పష్టమైన అవగాహనతో దళితులు, స్త్రీల విముక్తి కోసం ఆయన ఉద్యమించాడు. నారాయణగురు ఉద్యమం కొత్త కోణంలో నడిచింది. నిశ్శబ్దం, కరుణ ఆయన ఉద్యమానికి ప్రధాన సాధనం. నిశ్శబ్దం, ఒక రకమైన కరుణతో నిండిన నిశ్శబ్దం అనే మార్గానికి గురు చేరువగా వచ్చారు. నిశ్శబ్దం, కరుణ అనేవి రెండూ సాదాసీదాగా, ఐకమత్యంతో ఉండటం, కీలకమైన మానవ విలువకు ఉండాల్సిన లక్షణాలు. ఈ విలువ కేవలం తత్వ సంబంధమైనది కాక వాస్తవికంగా సజీవమైనది, ఆచరణ యోగ్యమైనది. వాస్తవానికి మానవ విలువ ద్వంద్వత్వాన్ని, ఫలితంగా వచ్చే వైరుధ్యాలను రూపుమాపవలసి ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా మానవ విలువగా చెప్పబడుతున్న భావనతో అస్తిత్వం, వాస్తవికతలు రాజీ పడ్డాయి. చింతన ద్వారా జీవితంలో అటువంటి సామరస్యాన్ని సాధించడం మన ముందున్న లక్ష్యం. నారాయణగురు చిన్నతనంలోనే సంస్కృతాన్ని అభ్యసించారు. తల్లిదండ్రుల దగ్గర, గురువుల దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఆయుర్వేద విద్యను కూడా ఆయన చిన్నతనంలోనే నేర్చుకున్నారు. ఏ విద్య అయినా ఏ కులానికైనా వస్తుందనేది ఆయన ప్రధాన ఉద్దేశం. ఆయన కుల, మత భేదాలను నిరసించారు. జ్ఞానం అనేది స్వయం సంపార్జితం అని చెప్పారు. బుద్ధుని సూత్రాలు ఎన్నో ఆయన బోధనలో వ్యక్తమవుతాయి. ఆయన బడిలో కేవలం దేవుణ్ణి పూజించటమేకాక బడిని విద్యాలయంగా మార్చారు. ముఖ్యంగా భక్తి కవుల మార్గాన్ని ఆయన తీసుకున్నారు. ఆ రోజుల్లో కేరళలో నంబూద్రిపాదులు, బ్రాహ్మణులు తీవ్రమైన వర్ణ, కుల వ్యవస్థలను పాటిస్తున్నారు. అస్పృశ్యతను పాటిస్తున్నారు. నంబూద్రిపాదులు కరుడుగట్టిన వర్ణతత్వ వాదులు. వీరికి వ్యతిరేకంగా అస్పృశ్యత నివారణ కోసం పెరియార్ రామస్వామి నాయకర్ కూడా పోరాడారు. వైకోమ్ పోరాటంలో ఆయన జైలుకు వెళ్ళారు. వైకోమ్ కేరళలోని అందమైన గ్రామం. 1924 వరకు ఆ గ్రామంలో దేవాలయం ఉన్న వీధిలో క్రింది కులాల వాళ్ళు నడిస్తే దేవాలయం మైలపడిపోతుందని అంటరానివారినెవ్వరినీ ఆ వైపే రానిచ్చేవారు కాదు. దానికి నిరసనగా 1924 మార్చి 30న కాంగ్రెస్ వాదులైన జార్జి జోగిస్, కెపి కేశవ మీనన్ నాయకత్వాన ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమాన్ని బహిరంగంగా సమర్థిస్తూ పెరియార్ రామస్వామి నాయకర్ బహిరంగ లేఖ వ్రాశాడు. ఈ ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు, పెరియార్‌ను ఈ ఉద్యమానికి నాయకత్వం వహించకుండా నిరోధించేందుకు మహాత్మాగాంధీ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అస్పృశ్యతా నిర్మూలనలో భాగంగా సాగుతున్న ఈ ఉద్యమానికి కేరళ బయట నుంచి ఎలాంటి సానుభూతి అందరాదనీ, ఈ సమస్యను హిందువులే పరిష్కరించుకోవాలనీ, బయట నుంచి సహాయం పొందటం ద్వారా ప్రత్యర్థుల మనస్సు మార్చలేమనీ గాంధీ తన 'యంగ్ ఇండియా' పత్రికలో రాశారు. ఒకవైపు ప్రజలు తమపై దుర్మార్గంగా అమలుచేస్తున్న అంటరానితనాన్ని వదిలించుకోవడానికి ఉద్యమిస్తుంటే దానికి నాయకత్వం వహించి ప్రజలను నడిపించాల్సింది పోయి బయటివారెవరూ నాయకత్వం వహించడానికి వీలులేని విధంగా కట్టడి చేసిన గాంధీతో పెరియార్ రామస్వామి నాయకర్‌కు సహజంగానే విభేదాలు వచ్చాయి. ఏప్రిల్ 12 నుంచి పెరియార్ ఉద్యమానికి స్వయంగా నాయకత్వం వహించారు. 1924 ఏప్రిల్ 22న ఆయనను అరెస్ట్ చేసి ఒక నెల జైలు శిక్ష విధించి లక్ష ద్వీపాల్లోని 'తిరులికుత్తి' అనే ద్వీపంలో నిర్బంధించారు. శిక్ష ముగిశాక మళ్ళీ వైకోమ్ వచ్చి ఉద్యమాన్ని కొనసాగించారు. నారాయణగురు తాత్విక దృక్పథం మనకు భక్తికవులను తలపిస్తుంది. భారతదేశంలో భక్తికవుల ఉద్యమం హిందూ సామ్రాజ్యవాదుల మీద తిరుగుబాటు చేసింది. ఆ తరువాత నారాయణగురు భక్తికవుల మార్గంలో విద్యా వికాస ఉద్యమం నడిపారు. నేను కేరళలో ఎన్నో సభలకు వెళ్ళి స్వయంగా ఆ ఉద్యమాన్ని వీక్షించాను. కులం పునాదుల మీద ఆయన దెబ్బకొట్టారు. నిశ్శబ్ద విప్లవం ఆయనది. బడుగుల మెదళ్ళలో అక్షర జ్యోతులు వెలిగించారు. నారాయణగురు అస్పృశ్యతా నివారణ కోసం ఎంతో కృషి చేశారు. దక్షిణ భారతదేశంలో వచ్చిన ఉద్యమ కర్తలందరూ బ్రాహ్మణవాదం మీద తిరుగులేని యుద్ధం చేశారు. నారాయణగురు బడుగు ప్రజల్లో నైతిక ప్రవర్తన గూర్చి బోధించారు. తాగుడు, జూదం, స్త్రీ వ్యామోహానికి దూరంగా ప్రజలు జీవించే ప్రయత్నం చేశారు. ఆయన శుభ్రతను బోధించారు. నారాయణగురు మానవతావాది. సాంస్కృతిక పునరుజ్జీవనం ఆయన బాట. కేరళలో ఈనాడు బడుగు వర్గాల్లోకి విద్యా స్రవంతులు ప్రవహించడానికి ఆయన తాత్విక, ఆథ్యాత్మిక ఉద్యమమే కారణం. తప్పక మనం మహాత్మాఫూలే, అంబేద్కర్, పెరియార్, నారాయణగురు ఉద్యమాలను అధ్యయనం చేయాల్సి ఉంది. మన ఉద్యమాలకు అన్వయించుకోవాల్సి ఉంది. ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా ప్రతి ఊరిలో ప్రతి విద్యార్థిని చదివించే పరిస్థితి రావాలి. బడులకేమో లెట్రిన్లు, ప్రహరీగోడలు, బ్లాక్‌బోర్డులు ఉండవు. దేవాలయాల్లో విగ్రహాలకు బంగారు పూతలు. భార్య గుడికి, భర్తేమో పార్టీ మహాసభలకు, పిల్లలేమో అమెరికాకు. ఈ ఆచరణ లేని జీవితాల వల్ల ఉద్యమాల్లో ఇంకా కులం, అస్పృశ్యతలు మురుగునీరులా ప్రవహిస్తున్నాయి. నారాయణగురు ఉద్యమం ఆచరణాత్మక ఉద్యమం. మనిషిలోని కుల కల్మషాన్ని కడిగివేసి, అస్పృశ్యతా కళంకాన్ని తుడిచివేసి, మనిషిని సంస్కారవంతుణ్ణి చేసి, మనిషిని బుద్ధ జీవిని చేసి, మనిషిని సామాజిక, సాంస్కృతిక విప్లవ కారుడిగా మలిచిన నారాయణగురు ఆదర్శ జీవి, అనుసరణీయుడు. ఆయన దక్షిణ భారతదేశంలో విద్యా విప్లవ జ్యోతి. నారాయణగురు తెచ్చిన విప్లవం అంతరంగికమైంది. ఆచరణీయమైంది. - డాక్టర్ కత్తి పద్మారావు

No comments:
Post a Comment