Thursday, 15 September 2016

# 'ఉక్కు' పిడికిలి #




             రాష్ట్ర విభజననాడు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని తుంగలో తొక్కుతున్న వేళ కడప ఉక్కు రాయలసీమ హక్కు అని నినదిస్తూ రాయలసీమ అభివృద్ధి వేదిక (ఆర్‌డిఎఫ్‌) చేపట్టిన మహోద్యమం అభినందనీయం. కుంటిసాకులతో కడపలో ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రంలోని బిజెపి సర్కారు నిరాకరిస్తుండగా, దానితో దోస్తీ కట్టిన ఇక్కడి తెలుగుదేశం ప్రభుత్వం మూగనోము పట్టింది. కడప ఉక్కు సాధనకై ఆర్‌డిఎఫ్‌ కన్వీనర్‌, ఎంఎల్‌సి గేయానంద్‌ బుధవారం ఉదయం నుంచి ముప్పై గంటల నిరాహార దీక్ష చేపట్టగా పదుల సంఖ్యలో ప్రజాసంఘాలు ఆయన వెంట నడిచి సీమ వాసుల డిమాండ్‌ను పాలకుల కళ్లకు కట్టాయి. ప్రతిపక్షాలతోపాటు ఏ పార్టీకీ చెందని సంస్థల ప్రతినిధులు, వ్యక్తులు, మేధావులు, సాహితీవేత్తలు ఆర్‌డిఎఫ్‌ ఆందోళనకు మద్దతు పలికాయి. ఈ అనూహ్య స్పందన నుంచైనా కడప ఉక్కుపై సీమ ప్రజల్లో గూడు కట్టుకున్న ఆకాంక్షను ప్రభుత్వాలు గుర్తించాల్సి ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మోడీ ప్రభుత్వం యూటర్న్‌ తీసుకోవడంతో తక్కిన విభజన హామీల విషయంలో ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. భయపడ్డట్లుగానే ఈ ఏడాది జులైలో కేంద్ర ఉక్కు సహాయ మంత్రి విష్ణుదేవ్‌ రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ సాధ్యం కాదని తేల్చేశారు. సెయిల్‌ అధ్యయన కమిటీ 2004లోనే ఈ విషయాన్ని చెప్పిందని ప్రకటించారు. నిజంగానే దశాబ్దం కిందటే నివేదిక వచ్చి ఉంటే కడపలో ఉక్కు ఫ్యాక్టరీపై విభజన చట్టంలో ఎందుకు పొందుపర్చారు? ముఖ్యమంత్రి చంద్రబాబు, బిజెపి నాయకులు, మంత్రులు ఇంతకాలం ఎందుకు ఈ రహస్యాన్ని దాచారు? మొన్నటికి మొన్న హోదా లేదని జైట్లీ అర్థరాత్రి ప్రకటన చేసిన మరుసటి రోజు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రెస్‌మీట్‌ పెట్టి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని నివేదిక వచ్చిందనీ, తాను స్వయంగా రంగంలోకి దిగి మరో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తున్నామని శెలవిచ్చారు. ఈ నాటకాలన్నీ చూస్తుంటే హోదాకు పట్టిన గతే కడప ఉక్కుకూ పడుతుందన్న భయాందోళనలు అలముకోవడం సహజం.
కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న నివేదికలో శాస్త్రీయత కంటే ఎగ్గొట్టాలన్న దురుద్దేశమే ఉంది. జిల్లాలో ప్రాథమికంగా నిర్వహించిన సర్వేలో భారీ స్థాయిలో ఇనుప ఖనిజ నిల్వలు (ఐరన్‌ ఓర్‌) ఉన్నట్లు రుజువైంది. ఇక్కడి ముడి ఇనుప ఖనిజం చైనాకు ఎగుమతి అవుతోంది. దానితోనే ఉక్కును ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో ఆ దేశం మొదటి స్థానానికి ఎగబాకింది. కడప జిల్లాలో ఉన్న ఖనిజం కొన్నేళ్లకే సరిపోతుందని ఒకవేళ అనుకున్నా రాయలసీమలో తతిమ్మా చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ పక్కనే కర్నాటకలోని బళ్లారి ప్రాంతంలో ఐరన్‌ ఓర్‌ గనులకు కొదవ లేదు. అనంతపురం, బళ్లారి జిల్లాల సరిహద్దులను చెరిపేసి ఐరన్‌ వోర్‌ను అక్రమంగా తవ్వి రూ.వేల కోట్లు గడించిన గాలి జనార్ధన్‌రెడ్డి వ్యవహారం సుపరిచయమే. కాగా ఉక్కు ఫ్యాక్టరీ ఉన్న చోటనే ఇనుప గనులుండాలన్న నిబంధనేదీ లేదు. ప్రతిష్టాత్మక విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీకి వందల కిలోమీటర్ల దూరంలోని చత్తీస్‌గఢ్‌ నుంచి సరఫరా అవుతోంది. ఆ మాటకొస్తే బెంగాల్‌, తదితర ప్రాంతాల్లో నెలకొల్పిన ఉక్కు ఫ్యాక్టరీలకు అతి సమీపంలో ఐరన్‌ ఓర్‌ గనులేమీ లేవు. ఈ వాస్తవాలను కావాలనే కేంద్రం దాచిపెడుతోంది. అర్థం పర్థం లేని కారణాలు చెప్పి కడపలో ఫ్యాక్టరీకి ఎగనామం పెట్టేందుకు సిద్ధమైంది. 
రాయలసీమ అన్ని విధాలా వెనుకబడ్డ ప్రాంతం. వ్యవసాయం, సాగునీటి వసతి స్వల్పం. సీమను నిత్య కరువులు వెంటాడుతున్నాయి. ఉపాధి లేక ప్రజలు ఊళ్లకు ఊళ్లు వలసలు పోతున్నారు. చదువుకున్న నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. మౌలిక వసతులు మృగ్యమైనందున ప్రైవేటు పెట్టుబడులు అటువైపు చూడట్లేదు. ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు రావాలంటే ప్రభుత్వరంగంలో పారిశ్రామికీకరణ జరగాలి. సహజవనరులు, ఖనిజ సంపద కలిగిన సీమలో వాటిని ప్రజల కోసం ఉపయోగించే ప్రయత్నం జరగాలి. అందుకే కడపలో ఉక్కు ఫ్యాక్టరీని అందరూ కోరుతున్నారు. విశాఖలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశాక ఆ ప్రాంతం ఎంతగా అభివృద్ధి చెందిందో తెలిసిందే. వెనకబడ్డ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పితే రాయలసీమ నాలుగు జిల్లాలతోపాటు పక్కనున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. ఇనుప ఖనిజం ఎగుమతికి నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు అందుబాటులో ఉంది. మన నుంచి ఐరన్‌వోర్‌ను దిగుమతి చేసుకొని ఉక్కును ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తూ భారీగా జపాన్‌ లాభపడుతుండగా మన పాలకులు ఆ వైపు ఎందుకు ఆలోచించరో అర్థం కాదు. పదో పరకో విదిలించే ప్యాకేజీలు సీమ సమగ్ర అభివృద్ధికి ఎంతమాత్రం శాశ్వత పరిష్కారం కాదు. బుందేల్‌ఖండ్‌లో, ఒడిశాలోని కె-బి-కె తరహా ప్యాకేజీలు అవినీతిమయం. ఇంకుడు గుంటలు, వాటర్‌షెడ్లు, కాంటూర్‌ కందకాల వంటి కాయకల్ప చికిత్సలకే పరిమితం. ఈ అనుభవాలతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కడపలో ప్రభుత్వరంగంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సిద్ధం కావాలి. పాలకులను సీమ ప్రజలు తమ ఉద్యమాలతో కదిలించాలి. నాటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోరాట స్ఫూర్తితో సంఘిత పోరాటానికి సిద్ధం కావాలి.

No comments:

Post a Comment