'లెప్ట్కి తోడు దొరికి నట్టేనా' అని ఆంధ్రజ్యోతిలో ఆర్కే వ్యాసం రాశారు. దీన్ని 'కొత్తపలుకు' అన్న వ్యాస పరంపరలో చేర్చారు. కానీ ఇందులో పలికినదంతా పాచిపోయిన పాతపలుకే. ''మేమంతా మీ శ్రేయాభిలాషులం. కానీ మీరు 'మూర్ఖంగా' ఆందోళనలు చేపడుతున్నారు. మీరు అదే తీరు కొనసాగిస్తే మేం మా వైఖరి పునరాలోచించుకుంటాం'' అని మార్కిస్టులకు ఆర్కే హెచ్చరిక చేశారు. కార్మిక సంఘాల నాయకులకు, ప్రజా ఉద్యమాల నాయకులకు ఇదే తరహా హెచ్చరికలు రోజూ యజమానుల నుంచో, పోలీసుల నుంచో వస్తూనే ఉంటాయి. ఈసారి పత్రిక సంపాదకుని నుంచే వచ్చాయి. ఇంతకీ మార్కిస్టులు ఆందోళనలు ఎందుకు చేస్తున్నారో ఆర్కే చెప్పలేదు. మార్క్సిస్టులు బలవంతంగా ప్రజల నుండి భూములు ఊడలాక్కోవద్దని ఆందోళన చేస్తున్నారు. ఆర్కేగారి దృష్టిలో ఇదే మూర్ఖం అయితే ఆయన చెప్పదలచుకున్నది ఏమిటి? బలవంతంగానైనా భూములు లాక్కోవడం సరైనది అనా? కనీసం బతకడానికి సరిపడా జీతాలు కావాలని కార్మికులు సెప్టెంబరు 2న సమ్మె చేశారు. ఆ మోతాదులో జీతాలు యజమానులు ప్రభుత్వంతో సహా ఇవ్వడం లేదు. పదేపదే అడిగి, రాయబారాలు నడిపి విసిగిపోయి సమ్మె చేశారు. ఆర్కేగారి దృష్టిలో ఈ సమ్మె చేయడమూ, దానిని మార్క్సిస్టులు బలపరచడమూ మూర్ఖమేనా? కడుపు నిండా తిండి తినేందుకు కూడా జీతాలు రాకపోయినా సమ్మె చేయకూడదు అనేది నయా ఉదారవాదం చెప్తోంది. ఎందుకంటే అలాచేస్తే 'పెట్టుబడి'కి కోపం వచ్చి ఎక్కడికో వెళ్లిపోతుంది. దానికి కోపం తెప్పించకూడదు. ఇదే ఆర్కే వాదం. ఇంకా మన అమాయక జనాలకు చాలా డిమాండ్లు, ఆశలు ఉన్నాయి ఆర్కేగారూ! మీ చంద్రబాబుగారేమో ఎన్నికల ముందు 'జాబు కావాలంటే బాబు రావాలి' అన్నారు. మీ బోటి చెయ్యితిరిగిన పాత్రికేయుడు ఎవరో ఆ నినాదం రూపొందించారు. బాబు వచ్చి రెండేళ్లు దాటిపోయింది. జాబులేవీ? ఏడు వందల ఉద్యోగాల కోసం ఏడు లక్షల మంది గ్రూప్-2 అభ్యర్థులు సంవత్సరాల తరబడి నిరీక్షిస్తున్నారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడది సాధ్యం కాదని తేల్చేశారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చకపోయినా ఆందోళనలు చెయ్యకూడదంటారా? అలా ఆందోళన చేయడం మూర్ఖత్వమా? ప్రజలకిచ్చిన వాగ్దాన భంగం మాటేమిటి ఆర్కేసార్! అయిన దానికీ, కాని దానికీ ఆందోళనలు చేయడమే కమ్యూనిష్టుల పని అని ఆర్కే సెలవిచ్చారు. మేం చేసిన, చేస్తున్న ఆందోళనలలో కాని దానికి చేసిన ఆందోళన ఏది సార్? చెబితే తెలుసుకుంటాం. మేం పోరాడుతున్న అంశాలన్నీ చంద్రబాబు, వెంకయ్య జమిలిగా గాని, విడివిడిగా గాని ఇచ్చిన హామీల అమలుకే కదా? ''మీ భూములు లాక్కుంటాం. మిమ్మల్ని నిర్వాసితుల్ని చేసి నష్టపరిహారం ఇవ్వకుండానే తరిమేస్తాం'' అని చెప్పి ఓట్లడిగారా చంద్రబాబు? అరచేతిలో వైకుఠం చూపించారు. ఆ చూపించిన స్వర్గం ఏది? అని అడుగుతున్నాం. తప్పెవరిది? మీరు ఎవరిని విమర్శిస్తున్నాను ఆర్కే? పవన్ కళ్యాణ్ కమ్యూనిష్టులతో కలిసి పోరాడతాను అనగానే ఎందుకంత ఉలిక్కిపాటు? అసలు ఒక పాత్రికేయునిగా మీరు ముందు ఎవరిని ప్రశ్నించాలి? రెండున్నర సంవత్సరాల క్రితం ఇదే పవన్ కళ్యాణ్ బిజెపి మిత్రుడిగా, చంద్రబాబుకి ఆప్తుడిగా ప్రజల మధ్యకు వచ్చి రాష్ట్రాన్ని వీరిద్దరూ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారా, లేదా? ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఆ బిజెపినే విమర్శిస్తున్నారు. ఎందుకు? ప్రత్యేక హోదా మీద మాట తప్పినందుకు. తెలుగుదేశం నాయకులను కూడా అదే మోతాదులో గాకపోయినా నిలదీశాడు. ఎందుకు? ప్రత్యేక హోదా విషయంలో మెతకగా వ్యవహరిస్తున్నందుకు. ''మీకు నిన్న మొన్నటి దాకా మిత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఇలా విమర్శించే పరిస్థితిని మీరెందుకు తెచ్చుకున్నారు?'' అని నిజానికి ఆర్కే బిజెపిని, టిడిపిని అడగాలి. ఆంధ్ర ప్రాంతమంతా విభజన వద్దన్నా, విభజనను నేరుగానో, మరో విధంగానో టిడిపి బలపరిచింది. బిజెపి నేరుగానే సమర్థించింది. జనాల్లో ఓట్లు కావాలంటే ఏం చెయ్యాలి? ''అయిందేదో అయిపోయింది. మిమ్మల్ని చీల్చేందుకు మేం సహకరించినా మీరు మమ్మల్ని గెలిపించండి. మేమైతే ప్రత్యేక హోదా తెస్తాం. అలా చేస్తాం. ఇలా చేస్తాం'' అని వెంకయ్యనాయుడుగారు ప్రచారం చేసారు. ''మోడీ, వెంకయ్య, అందరూ నా దగ్గరవాళ్లు, నేను చెప్పింది కాదనరు, కనుక నన్ను గెలిపించండి. ఒక్క ప్రత్యేక హోదా ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మార్చేస్తాను'' అని చంద్రబాబు ప్రచారం చేశారు. ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చిందెవరు? మావల్లే అది సాధ్యం అని చెప్పిందెవరు? ఇప్పుడు మాట మార్చిందెవరు? ఈ విషయాలనే కదా పవన్ కళ్యాణ్ కాని, కమ్యూనిష్టులు గాని, ప్రజలు గాని అడుగుతున్నారు? దానికి ఏది సమాధానం? దాన్ని దాటవేసి ప్రత్యేక హోదానా? ప్యాకేజీనా? అని మెలిక పెట్టి డొంకతిరుగుడుగా జారిపోవడానికి చంద్రబాబు, వెంకయ్య ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావనా వారిదే. కాదన్నదీ వారే. ప్యాకేజీ అన్నదీ వారే. జవాబు మాత్రం మనం చెప్పాలట. ఏం విడ్డూరం! ఈ సంగతి తేల్చండి ఆర్కే!
కమ్యూనిష్టులకి ప్రజలలో పలుకుబడి తగ్గిపోయిందని, కార్యకర్తలకు నీరసం వచ్చిందని, ప్రజలు ఓట్లు వెయ్యడం లేదని ఇలా చాలా చెప్పుకొచ్చారు ఆర్కే. తప్పులు చేయడం కమ్యూనిస్టులకు అలవాటైపోయిందనీ వాపోయారు. ఒక్క కళ ఇంకా పట్టుబడడం లేదు ఆర్కేగారూ! ప్రజలకు చేసిన వాగ్దానాలను భంగం చేసి సింగపూర్‌కు, అదానీకి సేవచెయ్యడం అనే కళ ఉంది చూశారూ! అది మాత్రం మాకు చాతకాదు. రాదు కూడా. అందులో మీ చంద్రబాబే మాస్టారు. ఇంతకీ మీ ఆలోచన ఏమిటీ ఆర్కే? ఒక పక్క వ్యవస్థలో ''సంయమనం, సమతూకం'' ఉండాలంటే కమ్యూనిస్టులు ఉండాలని నమ్ముతారా! ఇంకో పక్క ఆ కమ్యూనిస్టులతో పవన్ కళ్యాణ్ కలిసి పోరాడతానని అంటే మాత్రం పనికి రాదా? 'పోరాడదాం' అని పవన్ కళ్యాణ్ ప్రకటించాక ''ఎలా పోరాడతామో అది కూడా చెప్పవయ్యా, మాటలు కాదు చేతలు కదా ముఖ్యం'' అని రాఘవులు అంటే అదీ ఆక్షేపణీయమైపోతుందా మీకు! ప్రత్యేక హోదా కోసం కమ్యూనిష్టులతో కలిసి పోరాడతా అని పవన్ కళ్యాణ్ అంటే దాన్ని ఉభయ కమ్యూనిష్టు పార్టీల నేతలూ స్వాగతించడమూ మీకు కష్టంగా తోస్తున్నట్టుందే! ప్రత్యేక హోదా మీద వెంకయ్య మాట మార్చడం కష్టంగా తోచలేదా? ''ప్రత్యేక హోదా'' మన హక్కు కాదా?
కూరలో కరివేపాకులా కమ్యూనిష్టులని, అందరూ వాడేసుకుంటున్నారని మీరు వాపోయారు. అటువంటప్పుడు ఈ కరివేపాకు వంటి కమ్యూనిష్టుల మీద సానుభూతి ఉండాలి కదా! కానీ సానుభూతికన్నా అక్కసే మీ 'కొత్తపలుకు'లో వ్యక్తం అయింది. రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని భూములను, ఖనిజసంపదను, అడవులను, నదులను, సముద్రతీరాన్ని, ఏది వీలైతే దాన్ని వ్యాపార సరుకుగా మార్చి అమ్ముకోవాలనే ఎజెండాకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు శక్తి కొద్దీ నిలకడగా, నిజాయితీగా పోరాడుతున్నారు. మాకు ప్రజల్లో బలంలేదని ఒక పక్క అంటూనే ఇంకో పక్క ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా ముందస్తు అరెస్టులు మామీదే ప్రయోగిస్తున్నారు. కేసులు బనాయిస్తున్నారు. దళితుల మీద, మహిళల మీద దాడులు చేస్తున్నవారిని, భూ కబ్జాలు చేస్తున్నవారిని, ఇసుక మాఫియా గ్యాంగుల్ని-అందరినీ వదిలేసి బొత్తిగా బలంలేదని మీరనుకుంటున్న కమ్యూనిష్టుల మీదే ఎందుకు చంద్రబాబు కన్నెర్ర చేస్తున్నారు? ప్రజలకు దూరం అయిపోయారని మీరనుకొంటున్న కమ్యూనిస్టులతో ప్రత్యేక హోదా విషయంలో కలిసి ఉద్యమించడానికి వైఎస్సార్ సిపి, పవన్ కళ్యాణ్ వంటి వారంతా ఎందుకు సుముఖంగా ఉన్నారు? నికరంగా, నిజాయితీగా ప్రజల తరపున నిలబడి నిర్బంధాలను లెక్కచేయకుండా పోరాడుతున్నాం గనకనే మాకు విలువ ఉంది. అది కూడా లేకుండా పోవాలని మీరు కోరుతున్నారా! మొత్తం ఆర్కేగారి 'కొత్తపలుకు' చదివితే సారాంశం ఒక్కటి కనబడుతోంది. ''ఓ కమ్యూనిష్టులారా! మీరు పోరాటాలు మానేసి గమ్ముగుండండి. వాళ్లతో, వీళ్లతో కలిసి పోరాడే బదులు చంద్రబాబును బలపరచండి. ప్రత్యేక హోదా ఊసు ఎత్తకండి. వెంకయ్యనాయుడుగారిని ఇబ్బంది పెట్టకండి'' అన్నదే సారాంశం. సారీ ఆర్కేగారూ! మీరు కోరుకుంటున్నది కమ్యూనిష్టుల నుంచి మీకు లభించదని, అటువంటిది ఆశించవద్దని స్పష్టం చేస్తున్నాం.

good R K Gadiki buddi unte vadi chanal 14 rank lo enduku untundi
ReplyDelete