కార్మిక శక్తి ఐక్యమై రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ శక్తిగా ఎదగాలి. ఎందుకంటే కేవలం కార్మిక వర్గం మాత్రమే సమస్త వర్గాలకు వర్గ సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ ప్రసాదిస్తుంది. నేటి సమ్మె ఇందుకు మరో ప్రారంభం కావాలి. కార్మిక సంఘాలతో పాటు ప్రజాస్వామికవాదులు, మేధావులు సైతం సమ్మె జయప్రదానికి పూనుకోవాలి.
‘కుడువ ముడువ లేక కూడ బెట్టగ లేక విడువ నడువ లేక విద్యలేక, నడువ నేరని వాని నడపీనుగందురు’ - అంటూ వేమన తన కాలం నాటి అతిపేదలు, శ్రామికులను నడపీనుగలుగా పేర్కొన్నారు. నడపీనుగులు అంటే నడిచే పీనుగులు అని అర్థం. వర్తమానంలో అట్టడుగున ఉన్న పేదలు, శ్రామికుల పరిస్థితి వేమన వర్ణించిన నడపీనుగులకు తీసిపోదు. నేటి సమాజంలో పేద ధనికుల మధ్య ఆర్థికవ్యత్యాసం పెరిగి నాటి తారతమ్యం తారా స్థాయికి చేరుతున్నది. ఈ దూరాన్ని మరింత పెంచేందుకు పాలక వర్గం విధానాలు రూపొందిస్తున్నది. ఉన్న కార్మిక చట్టాలను కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సవరణల పేరుతో సంహరించ పూనుకుంటున్నది. వీటితో ఊపిరాడని కార్మిక వర్గం సెప్టెంబర్ 2 సమ్మెతో తన ‘ఆకలి గోస’ను తెలియపర్చాలనుకుంటున్నది.
2015 సెప్టెంబర్ 2న అఖిల భారత సార్వత్రిక సమ్మె జరిగింది. సుమారు 15 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు రాలేదు. దీనికి వ్యతిరేకంగా 2016 మార్చి 10న కోట్లాది మంది కార్మికులు అఖిల భారత నిరసన దినం జరుపుకున్నారు. 2016 మార్చి 30 న్యూఢిల్లీలో జాతీయ కార్మిక సదస్సు జరిగింది. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏకపక్షంగా నిరంకుశంగా కార్మిక వ్యతిరేక చర్యలను తీసుకుంటున్నది. దీనిని ప్రతిఘటించుటకు కార్మిక సదస్సు 2016 సెప్టెంబర్ 2 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. 2016 జులై 3న హైద్రాబాద్‌లోని గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర స్థాయి కార్మిక, ఉద్యోగ సంఘాల సదస్సు జరిగింది. జాతీయ కార్మికసంఘాల సమ్మె పిలుపును రాష్ట్రంలో జయప్రదం చేయాలని తీర్మానించారు.
1990లో ఆర్థిక సంస్కరణలు భారత భూభాగంలో అడుగిడిన తర్వాతి నుంచి ఏదో రూపంలో కార్మికవర్గంపై దాడి జరుగుతూనే ఉంది. కార్మిక అనుకూల చట్టాలను అమలుకు నోచుకోకుండా చేశారు. ఇది చాలదన్నట్లు యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాల సవరణకు తెగబడ్తున్నారు. ఈ విధానాల విషయంలో యుపీఏ, ఎన్‌డీఏలు బొమ్మాబొరుసులే తప్ప నాణెం ఒక్కటే. ముఖ్యమంత్రి స్థాయిలో ‘‘లేబర్ అధికారులు చీటికీమాటికీ పరిశ్రమల విజిట్ చేయరాదని’’ హుకుం జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ‘‘కార్మిక చట్టాల సవరణను ఆపాలి, వాటిని పకడ్భందీగా అమలు చేయాలనే’’ డిమాండ్ సమ్మెలో భాగమైంది.
నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగటం లేదు. 15వ జాతీయ కార్మిక సదస్సు (ఐ.ఎల్.సి) ప్రకారం ముగ్గురు సభ్యులు గల కుటుంబానికి రోజుకు 2,700 కేలరీలతో కూడిన ఆహారం కావాలి. ఏడాదికి 18 గజాల వస్త్రాలు కలవాలి. ఆహారం మరియు వసా్త్రలపై పెట్టే ఖర్చుపై 10% ఇంటి అద్దెకూ, 20% విద్యుచ్ఛక్తికీ ఇంధనాలకూ కావాలి. సుప్రీమ్ కోర్టు తీర్పు ప్రకారం పైన పేర్కొన్న నాలుగు అంశాలకు 25% అదనంగా జోడించాలి. దేశంలోని 7నగరాలలోని (ఢిల్లీ, ముంబయి, చెన్నై, కలకత్త, బెంగుళూరు, భువనేశ్వర్, తిరువనంతపురం) రిటైల్ ధరల ఆధారంగా 15వ ఐ.ఎల్.సి. మరియు సుప్రీమ్ కోర్టు ఉత్తర్వుల ప్రకారం నైపుణ్యంలేని కార్మికునికి నెలకు రూ.20,861/- చెల్లించాలని అంచనా వేయటం జరిగింది. దీనికి భిన్నంగా 7వ వేతన సంఘం రూ.18000/-లకు సిఫారసు చేసింది. అదికాదని కేంద్ర, కార్మిక మంత్రి మాత్రం నెలకు రూ.6098/- ఖరారు చేశామని 2015 సెప్టెంబర్ 1న కార్మిక సంఘాలకు తెలిపారు. ఇదేమి న్యాయం? కావున ‘‘ధరల పెరుగుదలను నిలువరించాలి. కనీస వేతనం నెలకు రూ.18000/-లు నైపుణ్యం లేనివారికి చెల్లించాలని’’ జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కాంట్రాక్టు కార్మికులే ఎక్కువగా ప్రమాదాల్లో గాయపడ్తున్నది, మరణిస్తున్నది. వీరికి ఉద్యోగ భద్రత లేదు, శ్రమదోపిడీకి గురవుతున్నారు. 1970 కాంట్రాక్టు లేబర్ (నియంత్రణ మరియు రద్దు)చట్టం ప్రకారం రెగ్యులర్ స్వభావం కలిగిన పనుల్లో కాంట్రాక్టు కార్మికులను నియమించరాదు. జరుగుతున్నది పూర్తి విరుద్దం. అందుకే కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలి. ‘‘సమాన పనికి సమాన వేతనాలు’’ కావాలని కార్మికులు కోరుతున్నారు.
దేశంలో సంఘటితరంగం 6%, అసంఘటితరంగం 94% ఉన్నారు. సంఘటిత రంగాన్ని నిర్వీర్యం చేసి క్రమేణా అసంఘటిత రంగంగా మారుస్తున్నారు. ఇది దేశ ప్రగతికి, సామాజిక భద్రతకు ముప్పు. ‘‘అసంఘటిత రంగ కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించటం’’ ద్వారా దీన్ని అధిగమించాలి. సీ్త్ర, శిశు మరణాలను అరికట్టడం, ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకి తీసుకెళ్లటంలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో పని చేస్తున్న సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు కార్మికులు కారు. ఉద్యోగులు కారు. కనీస వేతనం ఉండదు. ‘‘వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుంటే సంక్షేమ రాజ్యానికి అర్థమే’’ ఉండదు.
ప్రభుత్వరంగ సంస్థలలో వాటాలను చవగ్గా అమ్మేస్తున్నారు. రైల్వే, రక్షణ, బ్యాంకు ఇన్సూరెన్స్ లాంటి దేశ ఆర్థిక, సామాజిక భద్రతకు సంబంధించిన వాటిలో ఎఫ్.డి.ఐ.లను అనుమతిస్తున్నారు. దేశ భక్తియుత శ్రామిక వర్గం సమరశీలంగా ప్రతిఘటించాల్సిన అంశమిది. కేంద్ర ప్రభుత్వం టూరిస్టు పర్మిట్ ముసాయిదా, రోడ్ ట్రాన్స్‌పోర్టు - సేఫ్టీ బిల్ 2015, మోటార్ వాహన చట్టం సవరణ బిల్లు 2016 తీసుకొచ్చి రోడ్డు రవాణా రంగాన్ని బహుళ జాతి కంపెనీల వడిలో వేయుటకు సిద్ధపడింది. ఇది లక్షలాది రవాణా రంగ కార్మికులకు, ఉద్యోగులకు ఎసరు పెట్టడమే. దేశాభివృద్ధికి కీలకమైన విద్యుత రంగంలో కూడా ఎలకి్ట్రసిటీ అమెండ్‌మెంట్ బిల్ 2015 కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. దీంతో విద్యుత కార్పొరేట్ శక్తుల చేతిలో స్విచ్ అవుతుంది. షాకు ప్రజలకూ, సోకు క్యాపిటలిస్టులకు దక్కుతుంది. అందుకే, ‘‘రోడ్ ట్రాన్స్‌పోర్టు మరియు విద్యుత్ చట్ట సవరణ బిల్లులను ఉపసంహరించుకునేలా’’ శ్రామికులతో సమస్త ప్రజానీకం కలవాలి.
కార్పొరేట్ శక్తులకు భూమి కావాలి. వారి తాబేదార్లయిన పాలకులు వారికి అనుకూలంగా భూసేకరణ ఆర్డినెన్స్ తెచ్చి చట్టం చేశారు. అభివృద్ధి కొరకే ఇదంతా అని దబాయిస్తున్నారు. నిరాశ్రయులవుతున్న జనం దేశవ్యాప్తంగా భూమి కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. పాలకుల దుర్మార్గాలకు అంతం ప్రజల సంఘటిత శక్తిలో ఉన్నది. ఈ రహస్యం ప్రజలకు అర్థం కాకూడదని పాలకులు నిరంతరం జాగ్రత్త వహిస్తారు. ప్రజలను భావోద్రేకాల వైపు మళ్లించి ఐక్యం కాకుండా చేస్తారు. కార్మిక వర్గం మాత్రమే ఈ సత్యాన్ని మొదట తెలుసుకొని సంఘటితమయ్యే శక్తి. అందుకే కార్మిక సంఘాల రిజిస్ర్టేషన్‌పై ఆంక్షలు విధిస్తున్నారు. రిజిస్ర్టేషన్ చట్టాన్ని సవరించి కార్మిక సంఘాలు రిజిస్ర్టేషన్ కాని సంక్లిష్ట పరిస్థితి ఏర్పరుస్తున్నారు. 45 రోజుల్లోపు కార్మిక సంఘాల రిజిస్ర్టేషన్ పూర్తి చేయాలనే కోరిక సమ్మెలో కాగడై వెలుగుతున్నది. జాతీయ కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండటం కార్మిక ఐక్యతకు ఒక ఆటంకమే. దీనివల్ల కార్మికుల పోరాటాలను పాలకులు రాజకీయ ప్రేరేపితాలు అని ఆరోపించుటకు అవకాశం కలుగుతున్నది. కార్మిక వర్గం బూర్జువా రాజకీయ పార్టీలకు అతీతంగా- చారిత్రక, సైద్ధాంతిక దృక్ఫథం గల రాజకీయ శక్తిగా ఎదగాలి. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ మిత్రపక్షాలుగా ఉన్న పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు ఉదాసీన వైఖరిని అనుసరిస్తాయి. ఇప్పుడు ఎన్‌డీఏ అధికారంలో ఉంది.
నేడు హిందుత్వ భావజాలంతో ఉన్న కార్మిక సంఘాలు సమ్మెకు దూరముంటున్నాయి. జాతీయ కార్మికసంఘాలు సైతం తమ అనుబంధ సంఘాలను భాగస్వాములుగా చేసుకుంటున్నారు. కాని చిన్న సంఘాలను, స్వతంత్ర సంఘాలను కలుపుకొని రావటం లేదు. ఈ వైఖరి ఉద్యమానికి విఘాతం చేస్తుంది. కార్మిక శక్తి ఐక్యమై రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ శక్తిగా ఎదగాలి. ఎందుకంటే కేవలం కార్మిక వర్గం మాత్రమే సమస్త వర్గాలకు వర్గ సంకెళ్ళ నుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. 2016 సెప్టెంబర్ 2 సమ్మె ఇందుకు మరో ప్రారంభం కావాలి. కార్మిక సంఘాలతో పాటు ప్రజాస్వామికవాదులు, మేధావులు సైతం సమ్మె జయప్రదానికి పూనుకోవాలి. (ఆంధ్ర జ్యోతి నుండి)

No comments:
Post a Comment