|| ప్రత్యేక హోదా - ప్యాకేజి - సహాయం ఏది ప్రయోజనకరం...? ||
బిజెపి, తెలుగు దేశం పార్టీలు ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామన్న కల్లిబొల్లి కబుర్లు చెప్పి గత ఎన్నికలలో లబ్ధి పొందాయి. తీరా గద్దెనెక్కాక 'తూచ్... ప్రత్యేక హోదా కాదు. ప్రత్యేక ప్యాకేజీ' ఇస్తామన్నారు. ఆ తర్వాత అదీ కాదు. 'ప్రత్యేక సహాయం' చేస్తామంటున్నారు. వాగ్దానం చేసిందీ వారే. మాట మార్చుతోందీ వారే. ఇంతకీ ప్రత్యేక హోదా-ప్యాకేజీ-సహాయం అంటే ఏంటి? దేని వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? ఇప్పటికే ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలేవి? హోదా కోరుతున్నవేవి?
# ప్రత్యేక హోదా అంటే? #
ఒక రాష్ట్రానికి లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుంది. దీని ప్రకారం ఆ రాష్ట్రానికి లేదా ప్రాంతానికి కేంద్రం ప్రత్యేక రాయితీలను ఇస్తుంది.
# ప్రత్యేక ప్యాకేజీ అంటే? #
ప్రత్యేక కారణాల వల్ల కేంద్రం రాష్ట్రాలకు, ప్రాంతాలకు డైరెక్ట్‌గా నిధుల సహాయం చేయడమే ప్రత్యేక ప్యాకేజీ. ఉదాహరణకు ఎన్నికల సమయంలో తలెత్తిన రాజకీయ కారణాలు కూడా కావచ్చు. దీని ప్రకారం కేంద్రం ఓ రాష్ట్రానికి నిర్దిష్టమైన నిధులతో కూడిన ప్యాకేజీని కల్పిస్తుంది.
# ప్రత్యేక హోదా ఎవరిస్తారు? #
ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళికా సంఘం సభ్యులు (ఇప్పుడు నీతి ఆయోగ్ సభ్యులు), ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఉండే జాతీయ అభివృద్ధి మండలికి ఉంటుంది. ఒక రాష్ట్రానికి లేదా ప్రాంతానికి ప్రత్యేక హోదా మంజూరును పార్లమెంటులోని ఉభయ సభలు మూడింట రెండు వంతుల ఆధిక్యంతో రాజ్యాంగ సవరణ ద్వారా చేయాలి. ఈ విషయానికి సంబంధించి రాజ్యాంగంలోని 21వ భాగానికి చెందిన ఆర్టికల్స్ 369 నుంచి 392 వరకు కొన్ని ప్రత్యేక అంశాలను పేర్కొనడం జరిగింది. వీటిలో ఆర్టికల్ 370 (జమ్ము, కాశ్మీర్), 371, 371ఎ నుంచి 371ఐ వరకు (మహారాష్ట్ర, గుజరాత్, గోవా, ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అస్సాం, మణిపూర్, సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్) ముఖ్యమైన సవరణలు.
# ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు #
1969లో అయిదవ ఆర్థిక సంఘం సూచనలతో మొదలైన ఈ తరహా ప్రతిపత్తి మొట్టమొదట పొందిన రాష్ట్రాలు జమ్ము కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నూతనంగా ఏర్పడిన ఉత్తరాఖండ్‌లో కలిపి 11 రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాతిపదికన కేంద్ర ఆర్థిక సహాయంలో ప్రాధాన్యం లభిస్తుంది. ఈ హోదా కోరుతున్న రాష్ట్రాలలో కొత్తగా ఏర్పడింది మన రాష్ట్రమే. ఉత్తరాఖండ్ నూతనంగా ఏర్పడి నప్పుడు అధికారంలో వున్న ప్రస్తుత ఎన్.డి.ఎ ఏ విధంగా సాయం చేసిందో, అదే మాదిరిగా నిలువ నీడ లేకుండా పోయిన నూతన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలనేది ప్రజల ఆకాంక్ష.
# కోరుతున్న రాష్ట్రాలు #
అయితే ప్రత్యేక హోదా కోరుతున్న రాష్ట్రాలు ఆంధ్రతో పాటుగా మరికొన్ని వున్నాయి. అందులో బీహార్ రాష్ట్ర అభ్యర్థన ఎప్పటి నుంచో పెండింగ్‌లో వున్నదే. అలాగే రాజస్థాన్, ఒడిషా, జార్ఘండ్ సైతం ఈ ప్రతిపత్తిని డిమాండ్ చేస్తున్నాయి. వీటితోపాటుగా బెంగాల్లో డార్జిలింగ్ ప్రాంత అభివృద్ధికి, బోడోల అభివృద్ధికి, విదర్భ ప్రాంత అభివృద్ధికి, పొరుగున ఉన్న ఉత్తర కర్నాటక ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలన్న అభ్యర్థనలు ఎప్పటి నుంచో వున్నాయి.
# ప్రత్యేక 'హోదా-ప్యాకేజీ-సహాయం' ఏది ప్రయోజనకరం? #
ప్రత్యేక హోదాలో కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇచ్చే నిధులను హోదా లేకుండానే ఇస్తున్నామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెబుతున్నారు (ఈయన రెండేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హో దా ఐదేళ్ళు కాదు పదేళ్లు కావాలని పార్లమెంటులో వరించిన వ్యక్తి) ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి నష్టం అని తెలుగు దేశం తరుపున కేంద్ర మంత్రి పదవి వెలగబెడుతున్న సుజనా చౌదరి చెబుతున్నారు ( ఈయన రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇదిగో ఇచ్చేస్తోంది, అదిగో ఇచ్చేస్తోంది అని నిన్నటి వరకు ఊరించిన వ్యక్తి)
అటు బిజెపి ఇటు తెలుగు దేశం నేతలు మీడియాలో ఒక సెక్షన్ ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ప్రత్యేక సహాయానికి అను కూలంగా ప్రచారం అందుకున్నాయి. కాని వాస్తవానికి ప్రత్యేక హోదా వల్ల వనకూడే లాభాలేంటి? మిగిలిన పేకేజిలకు గల తేడా ఏమిటి? పరిశీలించాలి
# ప్రత్యేక హోదాకు - ప్యాకేజీలకు గల తేడా ఏమిటి? #
'ప్రత్యేక హోదా' వల్ల ఆ ప్రాంతానికి లేదా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. ఉపాధి కలుగుతుంది. మౌలిక వసతులు ఏర్పడతాయి. దాంతో ప్రజల ఆదాయాలు పెరిగి అభివృద్ధికి బాటలు పడతాయి. ఇకపోతే 'ప్రత్యేక ప్యాకేజీ' ఓసారి ముగిసిందీ అంటే ఆ తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందదు. 'ప్రత్యేక సహాయం' అనేది వెనుకబడిన ఒక రంగంలో మాత్రమే కేంద్రం చేసే సాయం. ఆ రంగం అభివృద్ధి చెందే వరకు సాయం చేస్తూనే వున్నప్పటికీ వృద్ధి ఆ రంగానికే పరిమితమౌతుంది. కనక ఇది సంపూర్ణ వృద్ధికి తోడ్పడదు. అందుకే ప్రత్యేక హోదా కల్పిస్తే ప్యాకేజీ, సహాయం అన్నీ అందినట్టే. అందుకే ప్రజల ఆకాంక్షలు కూడా అటువైపే వున్నాయి. పైగా ముందుగా ఇది నేతల తరపు నుంచి వచ్చిన వాగ్దానమన్న విషయాన్ని వారూ విస్మరించకూడదు.
# ప్రత్యేక సహాయం అంటే? #
- ప్రత్యేక సహాయం కొన్ని లక్ష్యాలతో కూడినది. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడమే ప్రత్యేక సహాయం (స్పెషల్ అసిస్టెన్స్ మెజర్) ఉద్దేశ్యం.
- రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకంగా ఒక క్యాటగిరీకి చెందిన వాటికి (వెనుకబడిన జిల్లాలు లేదా పరిశ్రమలు లేదా విద్యా కేంద్రాలు...).కేంద్రం సహాయం చేస్తుంది
- పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్రం పన్ను రాయితీలతో వెసులుబాటు కల్పిస్తుంది.
- సహాయం అనేది ఎన్ని సంవత్సరాలైనా సరే రాష్ట్రం ఆ రంగంలో నిలదొక్కుకునేంత వరకు కేంద్రం సాయం చేస్తూనే వుంటుంది.
- వెనుకబడిన జిల్లాల దగ్గరి నుంచి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన వరకు కేంద్రం అన్నింటా రాష్ట్రానికి సహాయం చేస్తుంది.
- ప్యాకేజీ అమలు తప్పనిసరి ఏమీకాదు. ప్రభుత్వం ఎగ్గొట్టినా చేసేదేమీ వుండదు. దీనికి ఎలాంటి చట్టబద్ధత వుండదు కనుక కేంద్రం దయా దాక్షిణ్యాలపై ఇది ఆధారపడి వుంటుంది అదే ప్రత్యేక హోదా అయితే దానికి చట్టబద్ధత వుంటుంది. అందులో పేర్కొన్న హామీలన్నీ కచ్చితంగా అమలు చేయాల్సి వుంటుంది.
# వుండాల్సిన అర్హతలు #
ఒక రాష్ట్రానికి లేక ప్రాంతానికి ప్రత్యేక హోదా ప్రకటించేందుకు పరిగణనలోకి తీసుకునే కీలక అంశం ఆ ప్రాంత ఆదాయ వనరులు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అభివృద్ధికి తగిన నిధులు సమకూర్చుకొనే అవకాశం, వెసులుబాటు లేని రాష్ట్రాలకు ఈ హోదాను కల్పించవచ్చు. ఆ ప్రత్యేక పరిస్థితులు, లక్షణాలివి. ఎ) ప్రత్యేక ప్రాంతం, బి) తక్కువ జనాభా సాంద్రత లేక గిరిజన జనాభా శాతం గణనీయంగా ఉండే ప్రాంతం, సి) పొరుగు దేశాలతో సరిహద్దు కలిగినటువంటి కీలక ప్రాంతం, డి) ఆర్థిక, మౌలిక వసతుల వెనుకబాటుతనం వున్న రాష్ట్రం ఇ) రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు గడ్డుగా ఉండే అటువంటి రాష్ట్రాలకు 'ప్రత్యేక హోదా' ఇస్తారు.
# హోదా - ప్రయోజనాలు #
- ప్రత్యేక హోదా కల్పించడం వల్ల రాష్ట్రాలకు కింది ప్రయోజనాలు కల్గుతాయి. ప్రణాళికా వ్యయంలో అధిక వాటా. ఇప్పటి వరకు అమలులో వున్న నిబంధనల ప్రకారం కేంద్రం చేసే ప్రణాళికా వ్యయం (సెంట్రల్ ప్లాన్-అవుట్ లే) మొత్తాన్ని ఖర్చు చేసే అంశంలో 30 శాతాన్ని ప్రత్యేక వర్గ హోదా కలిగిన రాష్ట్రాలలో, మిగిలిన 70 శాతాన్ని మిగిలిన అన్ని రాష్ట్రాలకు కలిపి ఖర్చు చేయాలి.
- కేంద్రం అందించే ఆర్థిక సహాయం మొత్తంలో 90 శాతం గ్రాంటుగాను, 10 శాతం రుణంగాను వుంటుంది. అదే మిగిలిన రాష్ట్రాలకు (అంటే ప్రత్యేక వర్గ హోదా లేనటువంటివి) 30 శాతం గ్రాంటుగాను, 70 శాతం రుణంగాను అందుతుంది.
- కేంద్ర ప్రాయోజిత విదేశీ రుణ ఆధారిత ప్రాజెక్టుల నిధుల విషయంలో ఈ తరహా రాష్ట్రాలకు 90 శాతం గ్రాంటుగా లభిస్తాయి.
- ఎక్సైజ్ డ్యూటీ, పన్నుల విధింపులో కొన్ని రాయితీలు లభిస్తాయి. అందువల్ల పారిశ్రామికవేత్తలు ఇటువంటి రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే అవకాశం మెండుగా వుంటుంది.
- కొన్ని ఎంపిక చేసిన కొండ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు లభించే అవకాశం వుంది.
- ఆ ప్రాంత లేదా రాష్ట్ర లోటు బడ్జెట్‌ను కేంద్రం పూడుస్తుంది.

No comments:
Post a Comment