దేశంలో ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జెఎన్‌యు), ఢిల్లీ యూనివర్శిటీ(డియు) విద్యార్థి సంఘ ఎన్నికల ప్రచారంలో వేడెక్కాయి. ఈ యూనివర్శిటీల్లో విద్యార్థులు ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. విద్యార్థి సంఘాల కార్యకర్తలు తమ తమ సంఘాల గెలుపు కోసం అహర్నిశలు కష్ట పడతారు. గెలుపే లక్ష్యంగా విద్యార్థి సంఘాలు సమస్యల ఎజెండాలను విద్యార్థి లోకం ముందుకు తెస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. కొన్ని విద్యార్థి సంఘాలు కూటములుగా బరిలోకి దిగితే, కొన్ని ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. రెండు యూనివర్శిటీల్లో ఒకే రోజు సెప్టెంబర్ 9న ఓటింగ్ జరుగుతుంది. 10న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఈ రెండు చారిత్రాత్మక విశ్వ విద్యాలయాల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే విద్యార్థి సంఘాల వ్యూహాలు, ఎత్తుగడలు, ఎన్నికల ఎజెండాలు, ఎన్నికలు జరిగే తీరు, రాజకీయ చర్చలు భిన్నంగా ఉంటాయి. జెఎన్‌యు ఎన్నికలు పూర్తిగా సైద్ధాంతిక దృక్పథంలో జరుగుతాయి. సైద్ధాంతిక చర్చలు, ప్రభుత్వాల తీరు, రాజకీయ పార్టీల పంథాలు, దేశంలో పెరుగుతున్న వివక్షత, రుగ్మతలు, సామాజిక దాడులు ఎన్నికల ఎజెండాగా ముందుకు వస్తాయి. అదే డియులో అయితే సమస్యల ప్రాతిపదికగా జరుగుతాయి. విద్యార్థుల స్థానిక సమస్యలతో పాటు అనేక ఇతర అంశాలు చర్చలోకి వస్తాయి. దేశంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన, జెఎన్‌యుపై కేంద్ర ప్రభుత్వ మనువాద దాడి, జెఎన్‌యు విద్యార్థి అధ్యక్షుడు కన్నయ్యను జైల్‌కు పంపడం, జాతీయ వ్యతిరేక ముద్ర తదితర అంశాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించ నున్నాయి. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ ఘటనలు దేశంలో అనేక సెంట్రల్ యూనివర్శిటీల్లో జరుగుతున్న విద్యార్థి సంఘ ఎన్నికల్లో చర్చనీయాంశమయి నాయి. ఇటీవలి రాజస్థాన్‌లో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో కూడా ఈ రెండు ఘటనలు అత్యంత కీలక పాత్ర పోషించాయి. అక్కడ బిజెపి ప్రభుత్వానికి చెమటలు పట్టించాయి. బిజెపి అనుబంధ ఎబివిపికి చుక్కలు చూపించాయి. ఎబివిపి కొద్ది మేర గెలిచినా, తొలిసారి ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక జిల్లాల్లో తమ ప్రాబల్యాన్ని నిరూపించుకున్నాయి. అనేక కాలేజిల్లో, యూనివర్శిటీల్లో సీట్లను గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో అక్కడ విద్యార్థి లోకం హిందూత్వ బిజెపి ప్రభుత్వానికి, మనువాద సిద్ధాంతానికి దిమ్మతిరిగే సమాధానాన్ని ఇచ్చింది. అంతేకాదు కేరళలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ స్కూల్ స్థాయి నుంచి యూనివర్శిటీ స్థాయి వరకు అన్ని సంస్థల్లో అఖండ విజయం సాధించింది. ఇలా దేశంలో విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎక్కడ జరిగినా, మనుస్మృతి సిద్ధాంతాన్ని పుణికి పుచ్చుకున్న ఎబివిపికి గట్టి ఎదురు దెబ్బలు తగులు తున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న జెఎన్‌యు, డియు యూనివర్శిటీల విద్యార్థి సంఘ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. జెఎన్‌యు, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ఎన్నికల భిన్న ధృవాలుగా జరగనున్నాయి.
|| ఎన్నికల ప్రచారస్త్రాలు ||
దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గద్దెనెక్కిన తరువాత విద్యా రంగంపై దాడి తీవ్రతరమైంది. సెంట్రల్ యూనివర్శిటీల్లో వైస్ ఛాన్స్‌లర్స్‌్‌గా ఆరెస్సెస్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల్ని నియమించడం. రాష్ట్ర యూనివర్శిటీలకు ఛాన్స్‌లర్‌గా వ్యవహారించే ఆయా రాష్ట్రాల గవర్నర్లను మార్చి, బిజెపి నాయకులను నియమించడం, వివిధ కేంద్ర పరిశోధన, విద్యా సంస్థలకు ఛైర్మన్లు, డైరెక్టర్లగా మనువాద సిద్ధాంతాన్ని పుణికి పుచ్చుకున్న వ్యక్తులను నియమించడం, ప్రాథమిక స్థాయి నుంచే పాఠ్య పుస్తకాల్లో హిందూత్వ భావజాలాన్ని జొప్పించడం, ఐఐటి చెన్నైలో అంబేద్కర్ పెరియార్ స్టడీ సర్కిల్‌ను రద్దు చేయడం, ఎఫ్‌టిఐఐ(పుణే), గోవా సెంట్రల్ యూనివర్శిటీ, అలాహాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, జెఎన్‌యు, ఢిల్లీ యూనివర్శిటీ, హెచ్‌సియు, జోధాపూర్ యూనివర్శిటీ, అలిఘడ్ ముస్లీం యూనివర్శిటీలపై ఒక దాని తరువాత ఒకటిగా దాడి చేసుకుంటూ రావడం జరిగాయి. ఈ దాడిలో ప్రధాన భూమిక కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పోషించింది. ఇవన్నీ విద్యార్థి రాజకీయాలను అణచివేయడానికి, ప్రాథమిక స్థాయి నుంచి హిందూత్వ సిద్ధాంతాన్ని రుద్దడానికి, విద్యా కాషాయికరణ చేయడానికి తీసుకున్న నిర్ణయాలే. ఈ ఘటనలన్ని జెఎన్‌యు, డియు విద్యార్థి సంఘ ఎన్నికల్లో ప్రచారస్త్రాలుగా ఉన్నాయి.
|| జెఎన్‌యు ఎన్నికలు ||
దేశంలోనే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ చారిత్రాత్మకమైనది. దేశ, విదేశాల్లో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలకు భోదకుల్ని అందించిన విద్యా సంస్థ. ఇక్కడ విద్యా కుసుమాలు దేశ అభివృద్ధికి అటంకంగా ఉన్న అనేక రుగ్మతులపై పరిశోధన చేసి, తమ పరిశోధనల్లో వెల్లడైన కీలక అంశాల ద్వారా పరిష్కార మార్గాల ను సమాజానికి తెలియజేస్తారు. నూతన సమాజ స్థాపన ద్వేయంగా విద్యా విధానాన్ని అందించే అధ్యాపక బృందం ఉంది. విద్యా విధానంలో మార్పులు, రాజకీయ చర్చలు, రాజకీయ పార్టీల పంథాలు, జాతీయ, అంతర్జాతీయ మార్పులపై నిరంతరం చర్చ జరిగే స్వచ్ఛమైన రాజకీయ విద్యాలయమిది. విద్యార్థి దశ నుంచే రాజకీయాల అవసరం ఏమిటో తెలియజెప్పుతోంది జెఎన్‌యు. జెఎన్‌యులో డబ్బు ప్రభావానికి తావు లేని స్వచ్ఛమైన ఎన్నికలు జరుగుతాయి. అక్కడ 13 స్కూల్స్ నుంచి 8,300 మంది విద్యార్థి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్ కూటమిగా పోటీ చేయగా, ఎఐఎస్‌ఎ, ఎబివిపి, ఎన్‌ఎస్‌యుఐ సంఘాలు ఒంటరిగానే బరిలోకి దిగాయి. ఆ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ-ఎఐఎస్‌ఎఫ్ కూటమి అధ్యక్ష పదవిని, సోషల్ సైన్స్ కౌన్సలర్లను కైవసం చేసుకుంది. ఎఐఎస్‌ఎ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కొన్ని కౌన్సలర్ల పదవులను సొంతం చేసుకుంది. ఎబివిపి తొలిసారి సంయుక్త కార్యదర్శి పదవిని గెలుచుకుంది. ఎన్‌ఎస్‌యుఐ ఒక్క స్థానం కూడా గెలవలేదు. ఈ ఏడాది కాలంలో దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ముఖ్యంగా విద్యా రంగం పూర్తిగా కాషాయికరణ దిశగా మారడం, ఎమ్‌ఫిల్, పిహెచ్‌డి చేస్తున్న పరిశోధకులకు వచ్చే ఫెలోషిప్ రద్దు చేయడం, వర్శిటీలపై మనువాద దాడి వంటి విద్యా సంబంధిత మార్పు, సామాజిక వివక్షత వంటి సామాజిక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ అంశాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఫెలోషిప్స్ రద్దుకు వ్యతిరేకంగా దాదాపు రెండు నెలల పాటు ఆక్యుపై యుజిసి ఆందోళన జరిగింది. హెచ్‌సియు రోహిత్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి సామాజిక వివక్ష రూపుమాపడానికి రోహిత్ చట్టం తీసుకురావాలని దాదాపు రెండు నెలల పాటు ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో బిజెపి అనుబంధ విద్యార్థిసంఘం మచ్చుకైనా ఎక్కడా పాల్గొన లేదు. పైగా ఈ ఉద్యమాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ఎబివిపి గత ఏడాది గెలిచిన ఒక్క స్థానం కూడా ఈ సారి గెలిచే అవకాశం లేదు. ప్రస్తుత ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ- ఎఐఎస్‌ఎ వామపక్ష కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేయగా, ఎఐఎస్‌ఎ అధ్యక్ష, సంయుక్త కార్యదర్శి పదవులకు పోటీ చేస్తోంది. ఎబివిపి, ఎన్‌ఎస్‌యుఐ ఒంటరి గానే పోటీ చేస్తున్నాయి. డిఎస్‌ఒ ఒక్క సంయుక్త కార్యదర్శి పదవికి మాత్రమే పోటీ చేయగా, ఎఐఎస్‌ఎఫ్ ఈ ఎన్నికల నుంచి తప్పుకుంది.
|| ఢిల్లీ వర్శిటీ విద్యార్థి ఎన్నికల తీరు..||
ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘ ఎన్నికలంటేనే...ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా జరుగుతాయి. ఎన్నికల ప్రచార శైలి దగ్గర నుంచి ఓట్లు లెక్కింపు వరకు దాదాపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఉంటాయి. ఎబివిపి, ఎన్‌ఎస్‌యుఐ వంటి విద్యార్థి సంఘాల అభ్యర్థుల ఎంపిక అమిత్ షా, రాహుల్ గాంధీల సమక్షంలో జరుగుతుందటేనే ఈ ఎన్నికల ప్రాధాన్యత అర్థమౌవుతుంది. ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలో ఎబివిపి, ఎన్‌ఎస్‌యుఐ సంఘాలకు గట్టి పట్టు ఉంది. గెలుపు కోసం ఆ రెండు సంఘాలు భారీగా డబ్బులు ఖర్చు బెడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ నగరంలో భారీ హోర్డింగ్‌లు, రెస్టారెంట్ పార్టీలు, లంచ్, డిన్నర్ పార్టీలతో లక్షల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. వీటితో విద్యార్థి సంఘాల మధ్య సంఘర్షణలు తలెత్తుతున్నాయి. జెఎన్‌యులో సైద్ధాంతిక సంఘర్షణ జరిగితే, ఢిల్లీ యూనివర్శిటీలో భౌతిక దాడులు చేసుకుంటున్నాయి. విద్యార్థి సమస్యల ఎజెండాగా జరిగే ఈ ఎన్నికల్లో తొలిసారి దేశ భక్తులు-దేశ ద్రోహులు అనే అంశాన్ని ఎబివిపి తెరపైకి తీసుకొచ్చింది. ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలో 55 కాలేజిల్లో దాదాపు లక్ష మంది విద్యార్థిలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. గత ఎన్నికల్లో ఎబివిపి గెలిచింది. ఎన్‌ఎస్‌యుఐ, ఎఐఎస్‌ఎ, ఆమ్‌ఆద్మీ పార్టీ విద్యార్థి సంఘం స్వతంత్రంగానే పోటీ చేశాయి. ఎస్‌ఎఫ్‌ఐ-ఎఐఎస్‌ఎఫ్-ఎఐడిఎస్‌ఓ సంఘాలు వామపక్ష కూటమిగా ఎన్నికల బరిలోకి వెళ్లాయి. తొలిసారి బరిలోకి దిగిన ఆప్ విద్యార్థి సంఘానికి ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రస్తుత ఎన్నికల్లో ఎబివిపి, ఎన్‌ఎస్‌యుఐ, ఎఐఎస్‌ఎ ఒంటరిగా బరిలోకి దిగగా, ఎస్‌ఎఫ్‌ఐ- ఎఐఎస్‌ఎఫ్- ఎఐడిఎస్‌ఒ సంఘాలు వామపక్ష కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, సంయుక్త కార్యదర్శి స్థానాలకు పోటీ చేయగా, ఎఐఎస్‌ఎఫ్ ఉపాధ్యక్ష స్థానానికి పోటీ చేస్తుంది. ఎఐడిఎస్‌ఒ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తుంది. ఈ సారి ఎన్నికల్లో ఆప్ విద్యార్థి సంఘం పోటీ చేయటం లేదు. వచ్చే ఏడాది నాలుగు రాష్ట్రాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో ఆప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఢిల్లీ యూనివర్శిటీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే, పంజాబ్‌లో దాని ప్రభావం చూపుతుందని ఆప్ అంచనా. అందుకనే ఈ సారి ఢిల్లీ యూనివర్శిటీ ఎన్నికల్లోనే పోటీ చేయకూడదని ఆప్ నిర్ణయించింది. డబ్బు ప్రేరేపిత ఎన్నికలుగా ఎబివిపి, ఎన్‌ఎస్‌యుఐలు చేశాయని, అందుకనే తమ విద్యార్థి సంఘం పోటీ చేయటం లేదని ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దేశ భక్తులు-దేశ ద్రోహుల మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఎబివిపి ప్రచారం చేస్తుంది. వామపక్ష విద్యార్థి కూటమి లౌకిక వాదం-మతోన్మాదానికి మధ్య జరుగుతున్న విద్యార్థి రెఫరెండం అని ప్రకటించాయి. దీంతోపాటు హాస్టల్ సీట్ల కొరత, ఖాళీ పోస్టుల భర్తీ, ఫీజులు తగ్గింపు తదితర అంశాలను వామపక్ష విద్యార్థి కూటమి ఎజెండాలో చేర్చింది. ఆక్యుపై యూజిసి, రోహిత్ చట్టం, సిబిసిఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యమంలో వామపక్ష విద్యార్థి కూటమి ఆగ్రభాగాన నిలిచింది. ఈ అంశాలనే ఎన్నికల ప్రచారంలో ముందుకు తీసుకొస్తుంది. ఇప్పటికే అధికారంలో ఉండే ఎబివిపి విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసిందని ప్రచారం విద్యార్థులో జరుగుతోంది. - జె జగదీష్

No comments:
Post a Comment