Friday, 2 September 2016

|| ప్రజా విశ్వాసమే కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం ||

           జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు మరోమారు తీవ్ర రూపం దాల్చాయి. భద్రతా దళాల కాల్పులతో 66 మంది మరణించారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఘర్షణ ప్రాంతంలో 50 రోజులుగా కర్ఫ్యూ అమల్లో ఉండడంతో వైద్య సహాయం పొందడంలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవాల్సి వచ్చింది. చివరికి మీడియా పైనా ఆంక్షలు విధించబడ్డాయి. వేర్పాటువాద శక్తులు, మతతత్వ శక్తులు ఏకమై పోలీసులపైనా, భద్రతా దళాలపైనా దాడులకు దిగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాశ్మీరులో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రజలు, ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. కొత్త వ్యూహంతో పాకిస్తాన్‌ యుద్ధం ప్రకటించిందని కేంద్ర చెబుతోంది. కాశ్మీర్‌లో శాంతిభద్రతల రక్షణకు పుష్కర కాలం తర్వాత సరిహద్దు భద్రతా దళాలను పంపింది. అక్కడ ఏడు దశాబ్దాలుగా నడుస్తున్న చరిత్ర అది. పాకిస్తాన్‌ సరిహద్దులో కీలక రాష్ట్రంగా జమ్మూకాశ్మీర్‌లోని ప్రజల ఆశలను నెరవేర్చడంలో, వారి విశ్వాసం పొందడంలో నాటి నుంచి నేటి వరకూ కేంద్ర పాలకులు విఫలమైనందునే రావణకాష్టమైందని తాజా పరిణామాలు మరింత స్పష్టం చేస్తున్నాయి. హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌లో మరణించిన తర్వాత చెలరేగిన అలజడి, నిరసనలు, దాడులు, ఘర్షణలు, సమ్మెలు, బంద్‌లకు దారితీసింది. బుర్హాన్‌ వనీ మరణం తమ విజయంగా సైన్యం భావిస్తుండగా, ప్రజల ముందు హీరోగా నిలిచినట్లయింది. అందుకు కారణం కాశ్మీర్‌లోని భద్రతా దళాలు ప్రజాస్వామ్య హక్కులను, పౌర హక్కులను కాలరాస్తున్నాయి. సాయుధ బలగాల చేతిలో ప్రత్యేకాధికారాలను పెట్టడం వల్ల అనునిత్యం దుర్వినియోగం జరుగు తోంది. ఆ ప్రత్యేక అధికారాలు వికటించిన సమయాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఒప్పందాల అమలు, నిరంతరం చర్చలు వంటి ప్రజాస్వామ్య ప్రక్రియను వదిలేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. దేశ విభజన సమయంలో మత ఉద్రిక్తతల మధ్య కాశ్మీరీయులు ముక్తకంఠంతో భారతదేశంలో విలీనం కావడానికి సిద్ధమైన చరిత్రను మరవలేం. ప్రభుత్వాలు తమ రాజకీయ లబ్ధి కోసం భారతదేశంపై వ్యతిరేకత పెంచే శక్తులను విస్మరించడం, బయట శక్తులకు అవకాశం ఇవ్వడం మూలానే నేటి ఉద్రిక్తతలకు మళ్లీ కారణమైంది. జాతీయ సమైక్యత, సమగ్రత లక్ష్యంగా ఆర్టికల్‌ 370 ద్వారా జమ్మూకాశ్మీర్‌లో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హోదా స్వయంప్రతిపత్తి అమలు గురించి ప్రధాని నరేంద్రమోడీ నోరువిప్పడం లేదు. 370 ఆర్టికల్‌ను రద్దు చేయాలన్నది బిజెపి, దాని అనుబంధ సంస్థల డిమాండ్‌. కాశ్మీర్‌ ప్రజల ఆస్తి హక్కుపై 370 ఆర్టికల్‌ రక్షణ కల్పిస్తోంది. ఆర్టికల్‌ 370 రద్దయితే అక్కడి లౌకికతత్వ పునాదులకు గండిపడుతుంది. బిజెపి రాజకీయ విధానం అదే. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మత ఉద్రిక్తతలు, హత్యలు పెరిగాయి. కేంద్రంలో అధికారం చేపట్టడం, జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వంలో బిజెపి భాగస్వామి కావడంతో అక్కడి ప్రజల్లో అభద్రతాభావం ఎక్కువైంది.
స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో కాశ్మీర్‌ సమస్యపై ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాన్ని బయటకు తీసేందుకు, దాన్ని అంతర్జాతీయ సమస్య చేసేందుకు పాకిస్తాన్‌ నిరంతరం ప్రయత్నిస్తోంది. భారతదేశంలో జమ్మూకాశ్మీర్‌ ఏనాడో అంతర్భాగమైంది. 1947 అక్టోబర్‌ రెండో తేదీన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో కాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేసేందుకు నిర్ణయ మైంది. ఆ నిర్ణయం పాకిస్తాన్‌కు మింగుడు పడలేదు. ఆ సమయంలోనే పాకిస్తాన్‌ ప్రజలను రెచ్చగొట్టి, ఉత్తర కాశ్మీర్‌లోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకొంది. భారత్‌లో విలీనమైన కాశ్మీరీయుల్లో విశ్వాసం పెంచేందుకు ప్రత్యేక హోదా, రక్షణ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టికల్‌ 370ను తీసుకొచ్చింది. అయినా ఆక్రమిత కాశ్మీర్‌ సమస్య నేటికీ వివాదంగానే మిగిలిపోయింది. భారత్‌తో జతకలిసిన కాశ్మీర్‌కు ఆర్టికల్‌ 370 ద్వారా పూర్తి రక్షణ కల్పించలేని పరిస్థితిని చూస్తు న్నాం. 70 శాతం ముస్లింలున్న జమ్మూకాశ్మీర్‌లో మెజార్టీ ప్రజలు భారతదేశంలోనే ఉండాలని ఇప్పటికీ కోరుకుంటున్నారు. నేడు బిజెపి నేతలు భుజానికెత్తుకున్న నాటి హోంమంత్రి వల్లభభారు పటేల్‌ మాత్రం కాశ్మీరీయులకు రాజ్యాంగం కల్పించిన ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు వర్తించవని చెప్పిన చరిత్రను మరిచిపోలేం.
జమ్మూకాశ్మీర్‌ విలీనంపై 1952లో అంగీకారం కుదిరింది. దాని ప్రకారం రక్షణ, విదేశాంగ వ్యవహారం, కమ్యూనికేషన్లపైనే భారత ప్రభుత్వానికి అధికారం ఉంది. కాశ్మీర్‌కు స్వతంత్ర పాలనకు ఇచ్చిన అధికారాలను రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ వచ్చింది. 1957లో జమ్మూకాశ్మీర్‌కు 75వ రాజ్యాంగ సవరణ ద్వారా కాశ్మీర్‌ మంత్రిమండలి అధికారాలను తొలగించడమైంది. ఆ తర్వాత రాష్ట్రపతి మరో ఉత్తర్వు జారీ చేశారు. ఇతర రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులన్నీ జమ్మూకాశ్మీర్‌కు వర్తింపజేశారు. 1958లో మళ్లీ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 312 సవరణ ద్వారా అఖిల భారత సర్వీసుల్లో ఇతర రాష్ట్రాలతో పాటు జమ్మూకాశ్మీర్‌కూ వర్తింపజేయడమైంది. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తి జమ్మూకాశ్మీర్‌ విషయంలో కనిపించని సందర్భాలున్నాయి. ఆ నేపథ్యంలోనే 1975లో నాటి ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, ప్రధాని ఇందిరాగాంధీ మధ్య ఒప్పందం కుదిరింది. జమ్మూకాశ్మీర్‌ను భారతదేశంలో ఒక భాగంగా చేర్చారు. దేశ సమగ్రతకు సంబంధించిన ఏ సమస్యపైనైనా చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు వచ్చింది. నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ అమలు చర్చనీయాంశం కావడం చూస్తున్నాం. దేశంలో కాశ్మీర్‌ విలీనం సమయంలో అక్కడి ప్రజల అభీష్టం మేరకు ప్రత్యేక హోదా కల్పించినా, అమల్లో ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించలేదు. అక్కడి ప్రజల అశాంతికి అదే మూల కారణమైంది. ఆ అశాంతినే పాకిస్తాన్‌ ఆయుధంగా చేసుకుంది. రెండుసార్లు యుద్ధానికి సిద్ధమైంది. నేడు ఉగ్రవాదుల చొరబాటుకు కారణమవుతోంది. రాజకీయ ఆటలే తప్ప, అభివృద్ధి దిశలో పాలన సాగలేదు. ప్రకృతి రమణీయ పర్యాటక కాశ్మీరం ఉగ్రవాదుల అడ్డాగా మారింది. గతంలో ప్రజాస్వామ్య ఎన్నికలు తక్కువ. ఎన్నికైన ప్రభుత్వాలను నిలువనీయలేదు. నాటి ప్రధానమంత్రి విపి సింగ్‌కు తెలియకుండానే గవర్నర్‌ జగన్మోహన్‌ కాశ్మీర్‌ శాసనసభను రద్దు చేసి రాష్ట్రపతి పాలన తెచ్చిన చరిత్ర ఉంది. గవర్నర్‌ నియామకాన్ని విభేదించి నాటి ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా తన పదవికి రాజీనామా చేశారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి తోడు ఇలాంటి చర్యలన్నీ శాంతిభద్రతల విచ్ఛిన్నానికి పునాదులు వేశాయి. కాశ్మీర్‌కు ప్రత్యేక హక్కులను కల్పించిన ఆర్టికల్‌ 370 అమలు నేటికీ ప్రతిష్టంభనగానే ఉండిపోయింది. ఉగ్రవాదం తలెత్తడానికి కారణమైంది. భారత్‌, పాక్‌ సంబంధాలు పలు సందర్భాల్లో ఘర్షణపూరిత వైఖరికి దారితీస్తున్నాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కాశ్మీరీయులకు స్వయంప్రతిపత్తి కల్పించే విషయంలో వచ్చిన ఆర్టికల్‌ 370పై బిజెపి తన వైఖరిని స్పష్టం చేయాలి. ముందుగా జమ్మూకాశ్మీర్‌ ప్రజల్లో కేంద్రంపై విశ్వాసం పెంచే చర్యలు మొదలుకావాలి. కాశ్మీర్‌ సమస్యను రాజకీయంగా పరిష్కరించుకోవాలని తాజాగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ నిర్ణయంలో భాగంగానే ఆర్టికల్‌ 370 అమలు చేయాల్సి ఉంది. కాశ్మీర్‌ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడానికి అదే తొలిమెట్టు అవుతుంది. బిజెపి తన రాజకీయ విధానాన్ని మార్చుకునేంత వరకూ కాశ్మీర్‌ కల్లోలం దేశ సమగ్రతకు సమస్యగానే మిగిలి ఉంటుంది. కాశ్మీరీయుల్లో విశ్వాసం కల్పించే వరకూ ఈ సమస్యకు ముగింపు ఉండదు.
- సత్తారు భాస్కరరావు

No comments:

Post a Comment