Saturday, 10 September 2016

|| జెఎన్‌యు ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి ఘన విజయం ||



- పదేళ్ల తరువాత ఎస్‌ఎఫ్‌ఐ జయ కేతనం
- చిత్తుగా ఓడిన ఎబివిపి 

                      చారిత్రాత్మక జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎ వామపక్ష ఐక్య కూటమి సంచలనం సృష్టించింది. జెఎన్‌యు విద్యార్థి లోకం వామపక్ష ఐక్య కూటమికి చారిత్రాత్మక విజ యాన్ని అందించింది. ఎబివిపిని వామపక్ష ఐక్య కూటమి చిత్తు చేసింది. నాలుగు ప్రధాన పదవులతో కూడిన ప్యానల్‌ మొత్తాన్ని వామపక్ష ఐక్య కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది. అధ్యక్ష స్థానాన్ని మోహిత్‌ కుమార్‌ పాండ్య (ఎఐఎస్‌ఎ), ఉపాధ్యక్ష స్థానాన్ని పి.పి అమాల్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), ప్రధాన కార్యదర్శి స్థానాన్ని శత్రుపా చక్రవర్తి(ఎస్‌ఎఫ్‌ఐ), సంయుక్త కార్యదర్శి స్థానాన్ని టాబ్రిజ్‌ హసన్‌(ఎఐఎస్‌ఎ) గెెలుచుకున్నారు. వర్శిటీలో వివిధ విభాగాల్లో కౌన్సిలర్ల స్థానాలను కూడా వామపక్ష కూటమి క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం 15 కౌన్సిలర్‌ స్థానాలకు గానూ, 14 కౌన్సిలర్ల స్థానాలను ఎస్‌ఎఫ్‌ఐ- ఎఐఎస్‌ఎ వామపక్ష ఐక్య కూటమి కైవసం చేసుకుంది. ఎబివిపి కేవలం ఒక స్థానానికే పరిమితమయ్యింది. స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌(ఎస్‌ఎస్‌ఎస్‌), స్కూల్‌ ఆఫ్‌ లాంగ్వేజేస్‌ (ఎస్‌ఎల్‌) విభాగాల్లో చెరో ఐదు కౌన్సిలర్ల స్థానాలకు గానూ, మొత్తం పది కౌన్సిలర్ల స్థానాలను వామపక్ష ఐక్య కూటమి సొంత చేసుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది. స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌(ఎస్‌ఐఎస్‌) విభాగంలో ఐదు కౌన్సిలర్‌ స్థానాలకు గానూ, నాలుగు కౌన్సిలర్ల స్థానాలను వామపక్ష ఐక్య కూటమి సొంతం చేసుకోగా, ఒక్క కౌన్సిలర్‌ పదవినే ఎబివిపి గెలుచుకుంది. స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌లో ఐశ్వర్య భట్టాచార్య, ఉపాసన హజారికా, చేతన త్రివేదీ, సుమంత రారు, జయప్రకాశ్‌లు కొత్త కౌన్సిలర్లగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఎబివిపికి గట్టి దెబ్బ తగిలింది. గతంలో గెలిచిన సిట్టింగ్‌ స్థానాల్లో కూడా ఘోర పరాజయం పాలైయింది. 

                 
|| పదేళ్ల తరువాత ఎస్‌ఎఫ్‌ఐ జయకేతనం ||

                  పదేళ్ల తరువాత ఎస్‌ఎఫ్‌ఐ జెండా మళ్లీ రెపరెప లాడింది. స్వాతంత్య్రం ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో, అధ్యయనం-పోరాటం నినాదంతో నిరంతరం విద్యార్థి సమస్యలపై ఉద్యమించే ఎస్‌ఎఫ్‌ఐ జెఎన్‌యులో తొలి నుంచి ప్రతి విద్యార్థి సంఘ ఎన్నికల్లో గెలుపొందేది. పదేళ్ల ముందు ఓటమి పాలైనా ఎస్‌ఎఫ్‌ఐ జెఎన్‌యులో తిరిగి జెండాను ఎగుర వేసింది. విద్యా రంగ పరిరక్షణకై ఉద్యమం, ఆక్యూ పై యుజిసి, వివక్షతను రూపు మాపేందుకు రోహిత్‌ చట్టం ఉద్యమం, జెఎన్‌యుపై దాడి ఖండిస్తూ పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమంలో ఎస్‌ఎఫ్‌ఐ అగ్రభాగాన నిలిచింది. విద్యార్థుల సమస్యల పరిష్కారమే ద్వేయంగా, శాస్త్రీయ విద్యా కై నాటి నుండి నేటి వరకు నిరంతర పోరాట పటిమను కొనసాగిస్తుంది. అందుకనే జెఎన్‌యు విద్యార్థి లోకం మళ్ళీ ఎస్‌ఎఫ్‌ఐను అక్కున చేర్చుకున్నారు. 

|| చారిత్రాత్మక విజయం ||
సురేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జెఎన్‌యు కార్యదర్శి

                   జెఎన్‌యు విద్యార్థి లోకం ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎకు చారిత్రాత్మక విజయాన్ని అందించిందని ఎస్‌ఎఫ్‌ఐ జెఎన్‌యు కార్యదర్శి సురేష్‌ పేర్కొన్నారు. మోడీ ప్రజా, విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జెఎన్‌యు విద్యార్థులు తీర్పు ఇచ్చారని అన్నారు. హిందూత్వ మతోన్మాదనాన్ని సమాధిని ఈ తీర్పు సూచిస్తుందని పేర్కొన్నారు. మోడీ విద్య సంస్థలను హిందూత్వ ఉత్పత్తి శాలలుగా మార్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆ కుట్రలు అమలు చేస్తున్నారని, ప్రాథమిక స్థాయి నుంచే పాఠ్యంశాల్లో హిందూత్వ భావాలను జొప్పిస్తున్నారని మండిపడ్డారు. ఇది లౌకిక స్ఫూర్తికే విఘాతం కలిగిస్తుందని అన్నారు. వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య భావాలతో నిరంతరం దేశ సమస్యలపై చర్చించే విద్యాలయం జెఎన్‌యుపై కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాడికి ఒడిగట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. జెఎన్‌యులో వామపక్ష ఐక్య కూటమి గెలుపు మోడీకి చెంపదెబ్బ అని అన్నారు.

No comments:

Post a Comment