Saturday, 3 September 2016

|| భౌతికవాద తాత్విక కవి కత్తి పద్మారావు ||


                         మాకు మానవుడే దేవుడు మీకు దేవుడే జీవనం (ఆత్మగౌరవం పు:189)


కత్తి పద్మారావు ప్రపంచ మెరిగిన హేతువాది. ఆయనది భౌతికవాద ప్రాపంచిక దృక్పథం. ఆయన తపనంతా మనిషి గురించే. మనిషికొచ్చే కష్టసుఖాలకు సాటి మనిషే కారణం తప్ప మానవేతర మైనదేదీ కాదని ఆయన అభిప్రాయం. మానవ సమస్యకు మానవ సమాజంలోనే పరిష్కారముందని, పరిష్కారం ఉండాలని ఆయన అవగాహన. మతం కూడా ఆయన దృష్టిలో మనిషి సృష్టే, మనిషి తాను సృష్టించుకున్న దైవభావనకు తానే బానిసై, మతం స్వార్థపరుల తెలివిపరుల చేతిలో చిక్కి, అధిక సంఖ్యాకులను మభ్యపెట్టడానికి, అణచిపెట్టడానికి సాధనంగా మారడంపై ఆయన యుద్ధం ప్రకటించారు. మనిషిని మనిషిగా మననివ్వపోవడానికి స్తబ్ధీకృత భావవిరోధమే కారణం (ఆత్మగౌరవస్వరం పు:93) ఈ అవగాహనతో పద్మారావు భావవాదం సృష్టించిన దైవ భావనను పూర్తిగా తిరస్కరించి నిలదీశారు. 
ప్రజలకు తిండి, నీళ్లు లేకుండా ఉన్న స్థితిలో దేవుళ్లకు రకరకాల కైంకర్యాలు, ప్రజలకు ఉండటానికి గూడు లేకుంటే దేవుళ్లకు అద్భుతమైన భవనాలు, ప్రజలకు కట్టుకోవడానికి గుడ్డలు లేకుంటే విగ్రహాలకు రకరకాల ఆభరణాలు. మనిషిని గుర్తించని దైవ భావన, మనిషిని విస్మరించిన మతం హేతువాది పద్మారావు విమర్శకు గురైంది. అందుకే ఆయన 'మనిషి' కేంద్రంగా ఆలోచించండి (పైది పుట:94) అని విజ్ఞప్తి చేశారు. మనిషి చేసిన రాయి రప్ప ముందు మనిషిని అవమానించడం భౌతిక దృక్పథóంలో వైరుధ్యమే కాదు, విపరీతం కూడా. భౌతికంగా కనిపించే మనిషి అవసరాలను తీర్చకుండా, ఏ అవసరమూ లేని విగ్రహాల అవసరాలకు ప్రాముఖ్యమివ్వడం భౌతికవాది దృష్టిలో అసంబద్ధాలు. అందుకే కవి 'ఒక్కసారి మీ చుట్టుపక్కల నీళ్లు లేని ఊళ్ల గోడు వినండి' అని దేవుళ్ల మీద కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న వారికి ప్రబోధించారు. 
పద్మారావు భావవాదాన్ని జ్ఞానపరంగానే కాదు, సామాజికంగా మానవీయ కోణం నుంచి కూడా నిలదీశారు. దైవం మంత్రాధీనమని, మంత్రం బ్రాహ్మణాధీనమని, మొత్తంలో భగవంతుడు బ్రాహ్మణాధీనమని మంత్రాలు రాసుకొని మనువాదం సామాజిక ధర్మమైన శ్రామిక దళిత కులాలను అవమానిస్తూ, గుడుల్లోకి ప్రవేశాన్ని నిషేధించిన ఘోరం చరిత్రకు తెలిసిందే. ఆమధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లు దళిత వాడల్లోకి వెంకటేశ్వరుని విగ్రహాలను తీసుకుపోయి దళితగోవిందం కార్యక్రమాల్ని నిర్వహించినపుడు దళిత రచయితలు, మేధావుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యింది. భౌతికవాది అయిన పద్మారావు 'యాచకులారా! మావాడల్లోకి రాకండి' అని పిలుపునిచ్చారు. (ఆత్మగౌరవం పు:187-190)
నిర్జీవ ప్రతిమలకు మోకరిల్లే మీరు మమ్మల్ని జంతువుల కంటే హీనంగా ఈసడించిన విషయం గుర్తుంచుకోండి మనిషి సముజ్వలతని మీరు దర్శించలేక అచలరూపాలలో మోకరిల్లారు (పైది పు:188) అని పురోహిత, అర్చక వర్గంలోని అమానుషత్వాన్ని ఎత్తి చూపారు. దళిత గోవిందాన్ని ప్రశ్నలతో ముంచెత్తారు. మీరు ఊరేగిస్తున్న మట్టి ముద్దలు మా ఆకలి తీరుస్తాయా? మాకు అక్షరాలు నేర్పుతాయా? మా తలకు నూనంటుతాయా? (పైది పు:190)
'నన్ను ముట్టుకోకు', మీరేవుట్లు' వంటి అమానుష ఆచరణలకు, ప్రశ్నలకు ప్రాణం పోసిన వాళ్లు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 
పదార్ధంలోంచి పుట్టిన చైతన్యం గుర్తించి ఆ చైతన్యంలోంచే పదార్ధం పుట్టిందని వాస్తవాన్ని తలకిందులు చేసి అజ్ఞానాన్ని జ్ఞానంగా ప్రచారం చేసిన సామాజిక వర్గం ఆధునిక సమాజం వేసే ప్రశ్నలకు సమాధానం చెపుతుందా? ఇంకా ఆ అజ్ఞానమే ఆధునిక మానవుడు సృష్టించిన ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక పరికరాలన్నిటినీ ఉపయోగించుకొని పబ్బం గడుపుకుంటోంది. పద్మారావు మానవవాది గనక మనిషే నిజమని, మనిషినే ప్రేమించమని, చివరి విజయం మనిషిదేనని అనేక పర్యాయాలు ప్రకటించారు. చరిత్రలో మనిషిదే అంతిమ విజయం (ఆత్మగౌరవస్వరం పు94), మనిషే ఈనాటి విజయపతాక మనిషే ఈనాటి ప్రపంచ నేస్తం (పైది పు:268), దేనికైనా ప్రేరణశక్తి మానవుడే (కట్టెలమోపు పు:13), మనుషుల్లేని ప్రపంచం నాకక్కరలేదు నేను మనిషి వేపు ప్రయాణిస్తున్నాను (పైది పు:68), ''నా తర్కం చార్వాకం నతత్వం బౌద్ధం' (భూమి భాష నామాట పు:5)
పద్మారావు కవిత్వమంతా గౌతమబుద్ధుని పాదముద్రలు కనిపిస్తూ ఉంటాయి. ఆయన మాటలనిండా బుద్ధబోధనలు వినిపిస్తూ ఉంటాయి. ప్రపంచానికి ప్రాచీనకాలంలోనే భారతదేశం ఇచ్చిన గొప్ప కానుక బౌద్ధం. ప్రపంచాన్ని భావవాదం నుంచి భౌతికవాదంవైపు మళ్లించింది బౌద్ధం. ప్రజల దృష్టిని దేవుని వైపునుంచి మనిషివైపు మరలించింది బౌద్ధం. అలాంటి బౌద్ధం తాను పుట్టిన గడ్డ నుంచి, పరదేశాలలో తలదాచుకునే స్థితిరావడం భారతదేశ చరిత్రలో విషాదం. తథాగతుని మరణానంతరం అందులోనూ అర్చకత్వం ప్రవేశించి విస్తృత పరిణామాలకు లోనై భూస్వామ్య బ్రాహ్మణీయ మనువాదం దౌర్జన్యానికి గురైపోయింది. విగ్రహారాధనను వ్యతిరేకించిన బుద్ధుని దశావతారాల్లో కలిపే మతం మనువాదుల రసవాద విద్య. 
ఇవాళ బౌద్ధానికి, మార్క్సిజానికి టివి చానెళ్లు లేవు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సిక్కు మతాలకు టివి చానెళ్లున్నాయి. కారణం అవి ప్రజల వైపు, ఇవి పాలకుల వైపు ఉండటమే. హేతువాది, మానవవాది అయిన కత్తి పద్మారావు బౌద్ధంవైపు మొగ్గారు. అది నిరీశ్వర మతం కావడం, భారతదేశంలోని అనేక రుగ్మతలకు బౌద్ధం తనదైన పరిష్కారం చెప్పడం, డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ వారసత్వం ఉండడం, భారత భౌతిక వాదంలో బౌద్ధానిది ప్రధాన భాగస్వామ్యం కావడం వంటివి ఇందుకు కారణాలై ఉండవచ్చు. గత దశాబ్దంలో ఆయన ప్రచురించిన వెయ్యి పుటల కవిత్వం నిండా బౌద్ధ పరిమళాలు పరుచుకొని ఉన్నాయి. అహింసను ప్రచారం చేసిన భారతదేశంలో హింస నిరంతర కృత్యమైన నేపథó్యం కవిని బాధించింది.
స్వార్ధపూరితమైనదేదీ అందరి మేలును కోరదు. బౌద్ధంలో స్వార్థం లేదు, త్యాగం తప్ప. గౌతమ బుద్దుడు పాదయాత్ర చేసి మానవత్వ పరిమళాలు వెదజల్లాడు. బహుజన హితాయ, బహుజన సుఖాయ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. విశ్వమానవ కల్యాణం లక్ష్యంగా ఆయన సిద్ధాంతాలు చేశారు. కత్తిపద్మారావు 'నా గమ్యం విశ్వమానవత' అన్నదిందుకే (భూమిభాష పు:103).
'కక్ష సమాజానికి ఆయుష్షుకాదు' (కట్టెలమోపు పు:7)
అనే విశ్వాసం గల పద్మారావు కవిత్వం నిండా మానవప్రేమ వేయి రేకులుగా వికసించింది. 'మనుష్యులను ప్రేమించండి' (ఆత్మగౌరవస్వరం పు:152) అని అనేకచోట్ల చెప్పారు. 'మనవతా జీవనధారే బుద్ధం శరణం గచ్ఛామి' అని నిర్వచించారు. 
మనిషిని మనిషి చంపడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదే అయినా పుట్టుకను, కులాన్ని బట్టి హత్యాకాండ జరగడం భారతదేశ చరిత్రకు మాయని మచ్చ. కారంచేడు, చుండూరు సంఘటనలు ఈ దుర్మార్గానికి ఇటీవలి ఉదాహరణలు మాత్రమే. ఈ మారణ కాండను హిందూ క్రౌర్యంగా నిర్వచిస్తూ-
హిందూకరవాలం కూడా ఎందరో బౌద్ధుల కంఠాలను తునుమాడింది ఆ నెత్తుటి బిందువుల నుండే బౌద్ధం ప్రపంచమంతా విస్తరించ లేదా! (పైది పుట:84)
అని ప్రశ్నించారు. 'పంచశీల' బోధించిన భూమిగా మన దేశాన్ని బౌద్ధదేశంగా మాటల్లో చాటుకోవడమే గాని, ఆచరణలో మనకు మిగిలింది కుల శీలం, వర్గశీలం మాత్రమే. పద్మారావు 'ఇది వర్ణభారతం' అని భారతదేశాన్ని నిర్వచించి ఏదో మారిపోయినట్లుగా కనిపిస్తున్న మనుషులు 'మీరు ఆధునికులుగా కనిపిస్తున్న ప్రాచీనులు' అని వర్ణ్డించి దీనికి విరుగుడుగా కొత్త మనుషులను ఆహ్వానిస్తున్నారు. వాళ్లు 'తథాగతుడి పంచశీలతో శిల్పించిన' వారని స్తుతించారు. బుద్ధుని సూక్తులను జీర్ణం చేసుకుంటే భారతదేశానికి అస్పృశ్యతా కళంకం పోతుందని భావించారు. (పైది పుట: 78)
గత మూడు దశాబ్దాలలో మార్కి ్సజానికి కాలం చెల్లిపోయిందని పెట్టుబడి పాశ్చాత్య దేశాలు అమెరికా నాయకత్వంలో వర్ధమాన, తృతీయ ప్రపంచ దేశాల మీద దాడులు చేస్తూ ప్రపంచీకరణ అనే మారణాయుధాన్ని ప్రయోగించడాన్ని కూడా పద్మారావు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. భారతదేశం ఆ ప్రపంచీకరణను అతార్కికంగా కౌగిలించుకోవడాన్ని ఆయన ఆమోదించలేదు. మీ ప్రదర్శనలో మీరు తథాగతుణ్ణి మారుస్తున్నంత కాలం మీకు శాంతి ఎక్కడ కలుగుతుంది అందుకే నేను బౌద్ధ భారతం కోసం పిలుపునిస్తున్నాను (పైది పుట:318)
ఏ ప్రజా రచయిత అయినా కోరుకునేది ఒక మంచి సమాజాన్నే. మనం నివసిస్తున్న సమాజం కన్నా భిన్నమైనదీ, మెరుగైనదే ఏ రచయిత అయినా కోరుకునేది. పద్మారావు కూడా అదే కోరుకుంటున్నారు. వ్యక్తులు స్వతంత్రంగా ఎదుగుతూనే ఒక పాలపుంతలో గ్రహాల మధ్య ఒకదానికొకటి ఉండే అవినాభావ సంబంధం కలిగి ఉండటమే సంఘం (పైది పుట: 184). అలాంటి సంఘం బౌద్ధం వల్లనే సాధ్యం అని ఆయన అభిప్రాయం. పద్మారావు జీవితం, ఉద్యమం, సాహిత్యం- ఈ మూడింటిని విడదీసి చూడడం సాధ్యం కాదు. మొదటి నుంచీ ఆయనది ఉద్యమ జీవితం. మొదట హేతువాద ఉద్యమం. ఆ తర్వాత దళిత ఉద్యమం. మధ్యలో మార్క్సిజం అధ్యయనం. సైద్ధాంతిక గ్రంథ రచన, సాహిత్య విమర్శ, కవిత్వ రచన - ఆయన రచనా జీవితానికి మూడు ముఖాలు. కుల వ్యవస్థ విశ్లేషణకు, దాని నిర్మూలనకు, కుల రహిత సమాజ నిర్మాణానికి అవసరమైన జ్ఞానాన్ని అందివ్వడానికి ఆయన సామాజికాంశాల మీద విస్తృతంగా గ్రంథ రచన చేశారు. ఆయన ప్రచురించిన ముళ్ల కిరీటం (2002), భూమి భాష (2004), కట్టెల మోపు (2007), ఆత్మగౌరవ స్వరం (2010) కవిత్వ సంపుటాలు చదివితే గత దశాబ్దాన్ని ఆయన కవిగా తనది చేసుకున్నారా అనిపిస్తుంది. డాక్టర్‌ కత్తి పద్మారావు వేమన, జాషువా తరువాత పేర్కొనదగిన గొప్పకవి. ఆయన కవిత్వంలోని భౌతికవాదాన్ని, తత్త్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా తెలుగు సాహిత్యం విస్తరిస్తుంది.
- డాక్టర్‌ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి

No comments:

Post a Comment