Wednesday, 21 September 2016

|| పోలవరం నిర్వాసితులు - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అమానుష చర్యలు ||




            రాష్ట్ర విభజన చట్టంలో అత్యంత కీలకాంశంగా పోలవరం ప్రాజెక్టు ముందుకు రాగా, జాతీయ స్థాయి కల్పించి నిర్మాణాన్ని భుజానికెత్తుకున్న కేంద్రం, రిజర్వాయర్‌ను త్వరగా పూర్తి చేయాలన్న తపనలో ఉన్న రాష్ట్రం వెరశి రెండు ప్రభుత్వాలూ లక్షల మంది నిర్వాసితులను గాలికొదిలేయడం అమానవీయం. 2013- భూసేకరణ చట్టంకానీ, దాని వెలుగులో న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులుకానీ ఏదేని ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయి నిరాశ్రయులవుతున్న వారికి సహాయ, పునరావాసం కల్పించిన తర్వాతనే నిర్మాణ పనులు చేపట్టాలని ఘోషిస్తున్నాయి. కానీ మన పాలకులు చట్టాలను, రాజ్యాంగాన్ని, చివరికి కోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతున్నారు. సమైక్య రాష్ట్రంలో ఎప్పటి నుంచో నలుగుతున్న పోలవరం పనులు 2005లో మొదలు కాగా రాష్ట్ర విభజన అనంతరం నేషనల్‌ ప్రాజెక్టుగా ప్రకటించి రెండున్నరేళ్లవుతున్నా నిర్వాసితులు తమకు సహాయ, పునరావాసం కల్పించాలని రోడ్డెక్కడం యావత్‌ పౌర సమాజానికీ దిగ్భ్రాంతి కలిగిస్తుంది. తొలినాటి ప్రాజెక్టు సవివరమైన నివేదికల (డిపిఆర్‌) ప్రకారమే ఎపి, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని 371 జనావాసాలు ముంపునకు గురవుతున్నాయి. వీటిలో అత్యధికం ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మంది జీవితాలపై పోలవరం పెను ప్రభావం చూపుతుంది. అయినాసరే సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ అవసరాల కోసం, గోదావరి, కృష్ణా అనుసంధాన ప్రాజెక్టుగా పోలవరం ప్రతిష్టాత్మకమైంది. ఉమ్మడి రాష్ట్రంలోనే కొన్ని అంతరాలతో 170 కిలోమీటర్ల ప్రధాన కుడికాల్వ నిర్మాణం జరిగిపోయింది. ప్రాజెక్టు కోసం సర్వం అర్పించిన నిర్వాసితుల రోదన మాత్రం చెవిటివాని ముందు శంఖం మాదిరి తయారైంది. ఇస్తామన్న సహాయ పునరావాసం (ఆర్‌ఆర్‌ ప్యాకేజీ) కోసమై చకోర పక్షుల్లా ముంపు బాధితులు ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. పోలవరం స్పిల్‌వే హెడ్‌వర్క్స్‌ మొదలు పెడుతుండటంతో నిర్వాసితుల్లో భయాలు అలముకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు, దీక్షల వంటి ఆందోళనలు ఉదృతమయ్యాయి. ఐటిడిఎ ఎదుట సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వాసితులు 36 గంటల దీక్ష విజయవంతంగా జరిపారు.
ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై ఏళ్లుపూళ్లు నాన్చిన ఎన్‌డిఎ సర్కారు గిరిజనులను ముంచే విషయంలో ఎక్కడలేని ఆత్రం కనబర్చింది. మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక తొలి కేబినెట్‌లోనే తెలంగాణాలోని ఏడు ముంపు మండలాలను ఎపిలో కలిపేందుకు ఆర్డినెన్స్‌ పాస్‌ చేశారు. ఒక్క కలం పోటుతో మండలాలనైతే విలీనం చేశారు, ఆర్‌ఆర్‌ ప్యాకేజీపై నోరు మెదపలేదు. కేంద్రం పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వ తీరు మరొకలా ఉంది. ప్రాజెక్టు కాంట్రాక్టులను తమ వారికి కట్టబెట్టడంపై ఉన్న శ్రద్ధలో గోరంత కూడా నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై లేదు. తమను రక్షించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నందున చేసేదిలేక ముంపు ప్రాంత ప్రజానీకం ఆందోళనబాట పట్టింది. నోరులేని గిరిజనులకు సిపిఐ(ఎం), ఇతర ప్రజాసంఘాలు, సామాజిక సంస్థలు సంఘీభావం తెలుపుతున్నాయి. ఇది రాష్ట్ర సర్కారుకు ఎంతమాత్రం నచ్చట్లేదు. సహాయ పునరావాసం గురించి గొత్తెత్తిన వారిపై పోలవరం వ్యతిరేకులుగా ముద్ర వేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్‌కు పోలవరం జీనధార అంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నిజంగా ప్రాజెక్టు నిర్మాణం సజావుగా సాగాలన్న చిత్తశుద్ధి ఉన్నట్లయితే నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాయి. ఏదొక తకరారు పెట్టి రాజకీయ లబ్ధి పొందడమే బిజెపి, టిడిపిలు పనిగా పెట్టుకున్నట్లు అర్థమవుతుంది.
తాజాగా పోలవరంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనలో ఆర్‌ఆర్‌ ప్యాకేజి గురించి ఒక్కముక్క లేదు. 2005-06 ధరల ప్రకారం అప్పటి ప్రణాళికా సంఘం పోలవరం నిర్మాణ అంచనా రూ.10,141 కోట్లుగా అంచనా వేయగా 2010-11లో కేంద్ర జల వనరుల శాఖ రూ.16 వేల కోట్లుగా పేర్కొంది. ఆ సమయంలో ఆర్‌ఆర్‌ ప్యాకేజీ మహా అయితే రూ. రెండు మూడు వేల కోట్లు ఉంటుంది. భూసేకరణ చట్టం-2013 వచ్చాక పరిహారం పెరుగుతుంది. రాష్ట్రంలో అమరావతి, ఇతర ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు సర్కారు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. అక్కడిదాకా దేనికి, పట్టిసీమ కోసం మధ్య మధ్య ఆగిపోయిన పోలవరం కుడి ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తి చేయడానికి సర్కారు ఎకరానికి రూ.50 లక్షల వరకు చెల్లించింది. ఆ తరహా ప్యాకేజీని తమకూ ఇవ్వాలన్న పోలవరం నిర్వాసితుల డిమాండ్‌ సహేతుకమైంది. భూమికి భూమి, భూమి ఇచ్చిన ప్రాంతంలోనే నివాస కాలనీలు, పోడు భూమికి నష్ట పరిహారం ఇవ్వాలన్న ముంపు ప్రజల కోర్కెల్లో న్యాయం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముంపు ప్రజల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలి. ఆర్‌ఆర్‌ ప్యాకేజీని పూర్తిగా అమలు చేశాకనే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి.

No comments:

Post a Comment