Sunday, 18 September 2016

|| గురజాడ- జాషువ తరంలో వేరు- సారంలో ఒకరు ||




గురజాడ, జాషువల జీవిత నేపథ్యాలలో తేడాలున్నాయి. తాత్విక, సామాజిక చింతనలో సాదృశ్యాలున్నాయి. తేడాలు వాళ్ళు కోరుకున్నవి కావు. సాదృశ్యాలు మాత్రం వాళ్ళు సాధించినవి. గురజాడ నిచ్చెన మెట్ల సమాజంలో పైమెట్టుకు చెందినవాడు కాగా, జాషువ అడుగుమెట్టుకు చెందిన వాడు. అయినా ఇద్దరూ ఈ నిచ్చెనమెట్ల సమాజాన్ని కూల్చడానికే సాహిత్య రచన చేశారు. 


ఇన్నాళ్ళు మనం గురజాడ అప్పారావును (1862-1915), గుర్రం జాషువను (1895-1971) విడివిడిగా చదువుకుంటూ వస్తున్నాం. ఈ చదువు అవసరమే అయినా, దీని వల్ల ఇద్దరు కవులపట్ల కొన్ని అపోహలు కలగడానికి అవకాశం వచ్చింది. ఆ అపోహలు తొలగాలంటే ఇద్దరు కవులను తులనాత్మకంగా అధ్యయనం చేయవలసి ఉంది. ఆ ప్రయత్నం చేద్దాం.

గురజాడ, జాషువల జీవిత నేపథ్యాలలో తేడాలున్నాయి. తాత్విక, సామాజిక చింతనలో సాదృశ్యాలున్నాయి. తేడాలు వాళ్ళు కోరుకున్నవి కావు. సాదృశ్యాలు మాత్రం వాళ్ళు సాధించినవి. గురజాడ, జాషువ- ఇద్దరూ 19వ శతాబ్దంలోనే జన్మించినా, జాషువ గురజాడకు ఒక తరం తర్వాత పుట్టిన కవి. గురజాడ పుట్టిన 33ఏళ్ళ తర్వాత పుట్టిన జాషువ, గురజాడ మరణించినాక 56ఏళ్లు బతికాడు. గురజాడ 53ఏళ్ళు మాత్రమే బతికితే, జాషువ 76ఏళ్ళు బతికాడు. జాషువ సాహిత్య జీవితమే గురజాడ జీవిత కాలమంత ఉంది. వీళ్ళ సాహిత్యాలలో ఈ జీవిత కాలాల సామాజిక పరిణామాలు ప్రతిబింబిస్తాయి.

గురజాడ ఉత్తరాంధ్ర బ్రాహ్మణుడు, విజయనగరవాసి. జాషువ మధ్యాంధ్ర దళితుడు, వినుకొండవాసి. ఇద్దరూ ఆర్థికంగా సంపన్నులు కారు. గురజాడ నిచ్చెన మెట్ల సమాజంలో పైమెట్టుకు చెందినవాడు కాగా, జాషువ అడుగుమెట్టుకు చెందిన వాడు. అయినా ఇద్దరూ ఈ నిచ్చెనమెట్ల సమాజాన్ని కూల్చడానికే సాహిత్య రచన చేశారు. అస్పృశ్యత, వివక్ష, అణచివేత గురజాడకు అనుభవంలో లేనివి. అవి జాషువ అనుభవంలోనివి. మాటవరుసకైనా- గురజాడ హిందువు. జాషువ క్రైస్తవుడు. అయినా ఇద్దరూ ఈ హద్దులు దాటి రచనలు చేశారు.

గురజాడది సంప్రదాయ సాంస్కృతిక వారసత్వమయితే, జాషువది జానపద సాంస్కృతిక వారసత్వం. ఇద్దరూ అధ్యాపకులుగా పనిచేశారు గాని, జాషువ జీవితం గురజాడ జీవితమంత స్థిరమైనది కాదు. గురజాడకు ఆనంద గజపతి ఆశ్రయం లభించినట్లుగా, జాషువకు ఒక ఆశ్రయం లభించలేదు. ఆయన అనేకమందిని ఆశ్రయించాల్సి వచ్చింది. గురజాడకు బిరుదులు, సన్మానాలు వంటివాటితో సంబంధం లేదు. జాషువ జీవితంలో అవి దండిగా ఉన్నాయి. ఈ ఇద్దరికీ కందుకూరి వీరేశలింగం పంతులుతో పరిచయాలున్నాయి. ఈ ఇద్దరూ ఉద్యమ రచయితలేగాని, కందుకూరిలాగా ఉద్యమకారులు కారు.

ఇద్దరూ కవులు, నాటక రచయితలు. గురజాడ కథానికలు రాశాడు. నవలా రచనా ప్రయత్నం చేశాడు. జాషువ కథానికలు రాయలేదు. నవల రాశాడు. గురజాడ పద్యాలు రాసినా గేయకవిగా స్థిరపడ్డాడు. జాషువ గేయాలు రాసినా పద్యకవిగా స్థిరపడ్డాడు. గురజాడ 1940 దాకా బతికుంటే వచన కవితను ఆమోదించేవాడేమో! జాషువ మాత్రం 1971 దాకా బతికినా వచన కవితను ఆమోదించలేదు. పైగా దానిని ఉత్తబిత్తల కవితగా నిర్వచించాడు. ఇద్దరూ దేశభక్తులైన రచయితలే. అయినా వీళ్ళ దేశభక్తిలో పోలికలు తేడాలు ఉన్నాయి. ఇద్దరూ విమర్శనాత్మక దేశభక్తులే. గురజాడ గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చే సమయంలో కన్ను మూశాడు. మరికొంతకాలం బతికుండి, గాంధీ ఉద్యమాన్ని పరిశీలించి ఉంటే ఎలా అర్థం చేసుకునేవాడో గాని, జాషువ మాత్రం ‘గబ్బిలం’ కాలం నుంచి మరణించే దాకా గాంధీ సంకీర్తన చేశాడు. 1908లో మద్రాసులో జరిగిన కాంగ్రెస్‌ సభలకు గురజాడ హాజరయ్యాడు. దాని మీద ‘‘మద్రాస్‌ కాంగ్రెస్‌’’ అనే వ్యంగ్య కవితను ఆంగ్లంలో రాశాడు. ‘‘కన్యాశుల్కం’’లో కాంగ్రెస్‌ మీద చురకలున్నాయి.

జాషువకు గాంధీ నుండి ఇందిరాగాంధీ దాకా అనేకమంది జాతీయ నాయకులను చూచే, పరిశీలించే వీలు కలిగింది. వాళ్ళను ప్రశంసిస్తూ పద్యాలు రాశాడు. అయితే ఆయన స్వాతంత్ర్యానంతర భారతీయ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థి తులను విమర్శనాత్మకంగా కవిత్వీక రించడంలో వెనుకబడలేదు.

గురజాడ, జాషువ ఇద్దరూ విశ్వ మానవవాదులు. తెలుగు నేలలో పుట్టిన భారతీయులైనా ఇద్దరిలోనూ విశ్వమానవస్పృహ ఉండడం విశేషం. ఇద్దరికీ కులమత ప్రసక్తిలేని, సౌభ్రాతృ త్వంతో కూడిన విశ్వజనీన సమాజం ఒక కలగా ఉండింది. ‘‘ఎల్లలోకమువొక్కయిల్లు’’ కావాలని, మతాలు వేరైనా మనసులొకటై మనుషులుండాలని గురజాడ ఆకాంక్షిం చాడు. జాషువ- ‘‘కోటానుకోట్ల నరులొక/ మేటి జగన్మాతృసుతులు మిత్రులని మదిం/ చాటింపు మీసువార్తన్‌/ జాటింపుము జీవితంబు సార్థక్యమగున్‌’’ అని ప్రబోధించాడు. అంతేకాదు ‘‘విశ్వైక్యత, విశ్వసోదరత, విశ్వాప్రాజ్య జాతీయతల్‌ వెలయంగావలె’’ అన్నది ఆయన ఆకాంక్ష. ఫ్రెంచి విప్లవం ద్వారా విశ్వమంతా విస్తరించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భావనల్ని గురజాడ విజయనగరం నుండి, జాషువ వినుకొండ నుండి వినిపించారు. ఈ ఆకాంక్షకు భిన్నమైన సకలాంశాలను ఇద్దరూ ప్రతిఘటించారు. ‘‘మనం మూర్తీభవింపజేయవలసిన ప్రేమ విశ్వమానవ ప్రేమ’’ అన్న గురజాడ భావనను జాషువ మరింత విస్తృత పరిచాడు.

విశ్వమానవ స్వాప్నికులైన ఈ ఇద్దరూ గౌతమ బుద్ధుని, ఏసుక్రీస్తును స్మరించుకున్నారు. ‘‘ఆదర్శ పూరితం చెయ్యడానికి అర్హత ఉన్న నిజమైన ప్రేమ మానవుల పట్ల ప్రేమ. ఏసుక్రీస్తు ఉపదేశించినదీ లేదా తన పరిమితులతో ఉపదేశించినట్లుగా కానవచ్చేదీ, షెల్లీ కవితావిహారంగా ఉపదేశించినదీ, సజీవమైన విశ్వాసంగా బుద్ధుడు ఉపదేశించినదీ నిజమైన ప్రేమ, మానవుని పట్ల ప్రేమ’’ అన్నాడు గురజాడ. జాషువ అనేక పర్యాయాలు బుద్ధుని క్రీస్తును స్మరించుకున్నాడు. ‘‘నేనును బుద్ధబోధ తలనిల్పినవాడన’’, ‘‘ఊరకపోదు బుద్ధుని మృదూక్తి పటుత్వము’’, ‘‘క్రీస్తు ప్రేమతత్వాన నొకింత బుద్ధి కదపంబడి యూగినవాడనే సఖా’’వంటి అనేక వాక్యాలిందుకు ఉదాహరణలు. గురజాడ అయితే ‘‘బౌద్ధం అణగదొక్కబడినప్పుడు భారతదేశం మతపరంగా ఆత్మహత్య చేసుకుంది’’ అనడానికి సంకోచించలేదు. 
సమాజాన్ని ప్రజాస్వామీకరించడంలో భౌతికవాద ఆలోచనలది ప్రధాన పాత్ర. అజ్ఞానం, భయం పునాదుల మీద వెలసిన మానవాతీత శక్తిపైన విశ్వాసం నుండి ప్రజలను విముక్తులను చేయందే సామాజిక మార్పు సులభతరం కాదు. గురజాడ, జాషువ తెలుగు ప్రజలను మతసంబంధమైన బానిస భావజాలం నుండి విముక్తి చేయడానికి ప్రయత్నించారు. గురజాడ ‘‘మత విశ్వాసాలనేవి ఆచరణకు అసాధ్య మైనవి. గుదిబండలవంటివి. మానవుని ప్రేమించడమన్నది అతి సాధారణ జీవిత సూత్రం’’ అని సిద్ధాంతం చేశాడు. ఆయన రాసిన ‘మనిషి’ ఆయన భౌతిక, మానవ వాదానికి అక్షర రూపం:

‘‘మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగిమొక్కుతు 
మనుషులంటే రాయిరప్పల కన్నహీనంగాను, చూస్తావేలబేలా 
దేవుడెకడో దాగెనంటూ కొండకోనల వెతుకులాడేవేలా 
యెరిగికోరిన కరిగియీడో ముక్తి’’ 
జాషువ కూడా విగ్రహ వ్యవస్థను విమర్శించి అవతార భావనను ప్రతిఘటించాడు. 
‘‘నిన్ను చూపమని నేనర్చకుని వేడ 
చూడుమంచు గుడిని జూపినాడు 
గుడికి పోయిచూడ గుండ్రాయివైనాడ 
వెందుకిట్టులైతి’’

భారతదేశ కుల వ్యవస్థలో కనిపించే మానవ క్రౌర్యానికి పరాకాష్ఠ అంటరానితనం. ఇది భారతదేశం సిగ్గుతో తలవంచుకోవలసిన అంశం. గురజాడ అస్పృశ్యతను తీవ్రంగా విమర్శించాడు. ‘లవణరాజుకల’లో రాజుకు మాలమ్మాయికి ప్రేమ వివాహం జరిపించాడు. ఆ సమయంలో అస్పృశ్యత మీద ఆయన రాసిన అయిదారు ఖండికలు ఒక న్యాయమూర్తి వర్ణవ్యవస్థ మీద ఇచ్చిన తీర్పును తలపిస్తాయి. ‘‘వర్ణధర్మమధర్మ ధర్మంబే’’ అన్నది గురజాడ తీర్పు. ఒక బ్రాహ్మణ కవి తనను తాను అవరీ ్ణకరించుకొని రాసిన కవిత ఇది. జాషువ ‘అనాధ’ కావ్యం నుండి తన సాహిత్యమంతా అస్పృశ్యతా నిరసనను వినిపిస్తూ వచ్చాడు. నోటికొచ్చిన అక్షరాలను కవిత్వంగా చెప్పడానికి కూడా కులం అడ్డుగా నిలవడాన్ని ‘‘నా కవితా వధూటి వదనమ్ము నెగాదిగ జూచి’’ అనే పద్యంలో వివరించి ‘‘వచింపసిగ్గగున్‌’’ అని ఛీత్కరించాడు. ‘‘కారుణ్యంబున నంటరానితనమున్‌ ఖండింపవా’’ అని ‘బాష్ప సందేశం’లో కోరాడు. ‘‘చక్కని కవితకు కులమే/ యెక్కువ తక్కువలు నిర్ణయించిన నిం/ కెక్కడి ధర్మము తల్లి’’ అని ప్రశ్నించాడు. ‘‘చెండింపు మస్పృశ్యతన్‌’’ అని ‘హిందూరమ’లో పిలుపు నిచ్చాడు.

గురజాడ, జాషువ- ఇద్దరూ స్త్రీ, పురుష సమానత్వాన్ని ఆకాంక్షించారు. పురుషాధిక్యతను ఖండించారు. ‘‘మగడు వేల్పన పాతమాటది/ ప్రాణమిత్రుడ నీకు’’ అని గురజాడ భర్తతోనే భార్యకు చెప్పించాడు. ఈ విషయంలో జాషువ వెనుకబడలేదు. 
‘‘సీ్త్ర కంటెంబురుషుండు శ్రేష్ఠుడనుచున్‌ సిద్ధాంతముల్‌ జేసితా 
టాకుల్‌ కంఠములెత్తి సీ్త్ర జగతి కన్యాయంబు గావించెనోయే 
కాలంబున పుట్టినింటయిన లేవేనాటి స్వాతంత్య్రముల్‌ 
స్త్రీ కీమారు సమాన గౌరవ విభూతిన్‌ గాంతకుంగూర్పుమా!’’ 
- అని కోరాడు. గురజాడ జాషువాలిద్దరూ సమకాలీన జీవిత వాస్తవి కతను వస్తువుగా తీసుకొని సాహిత్య సృష్టి చేయకుండా పాత పురాణ కథలనే మళ్లీ మళ్లీ రాయడాన్ని విమర్శించారు. ఇద్దరూ ప్రజల జీవితంపైన, పురోహిత వర్గ ఆధిపత్యం మీద నిరసన తెలిపారు. ఇద్దరూ మతం భ్రష్టుపట్టి స్వార్థం పెరగడాన్ని అధిక్షేపించారు. గురజాడ ఉపయోగించినంత ప్రజల భాషను పద్యకవిగా జాషువా ఉపయోగించలేకపోయినా, ఆయన కవిత్వం నిండా ప్రజల భాష ఉంది. గురజాడ జాషువాలను కలుపుకొని లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. స్వానుభవమో సానుభూతో ఏదైనా కానీయండి. వాళ్లిద్దరూ ఒకే సమాజాన్ని కోరుకున్నారు:

ఎల్లలోకమువొక్కయిల్లై - వర్ణభేదము లెల్ల కల్లై 
వేలనెరగని ప్రేమబంధము - వేడుకలు కురియ 
మతములన్నియు మాసిపోవును - జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును 
అంతస్వర్గ సుఖంబులన్నవి యవనివిలసిల్లున్‌ (గురజాడ)

కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి
పంజరాన కట్టువడను నేను
నిఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు
తరుగులేదు విశ్వనరుడ నేను (జాషువ) 

 - రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి (ఆంధ్రజ్యోతి నుండి)

No comments:

Post a Comment