కార్పొరేట్ ఇండియాకు ప్రాణప్రదమైన 'గుజరాత్ నమూనా' కార్పొరేట్ లాభాల ను, దళితుల నిరాశా నిస్పృహలను అత్యంత స్పష్టంగా ప్రతిబింబిస్తున్నది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని ఉనాలో జరిగిన సంఘటనలు ఈ విషయాన్ని ఎత్తిచూపాయి. ఆవు చర్మం వలిచే వృత్తిని వదలేయాలని గోసంరక్షకులని పిలువబడుతున్నవారు దళితులను బెదిరిస్తున్నారని నేను సిపిఐ(ఎం) ప్రతినిధి బృందంలో భాగంగా ఉనా వెళ్ళినప్పుడు మాకు చెప్పారు. తన ఇద్దరు కొడుకులను దారుణంగా కొడుతున్నప్పుడు అడ్డుపడిన తండ్రిని కూడా కొట్టారు. వాస్తవంలో వారికి మరే ఇతర ఉద్యోగాలూ అందుబాటులో లేవని ఆ తండ్రి మాతో చెప్పారు. గుజరాత్ జనాభాలో దళితులు 8 శాతం ఉన్నారు. వీరిలో చాలామందికి భూమి లేదు. గ్రామీణ గుజరాత్లో వారు చాలా వరకు వ్యవసాయ కూలీలుగానూ, కుల నిర్థారిత వృత్తుల్లోనూ కొనసాగుతున్నారు. ఆస్తిపాస్తులు లేకపోవటంతో వారు అంటరానితనానికి, వెలివేతకు లోనవుతున్నారు. ఈ దురాచారాలు ప్రతిచోటా ఉన్నాయి. మేము దర్శించిన గ్రామం బాగా అభివృద్ధి చెందింది. ఆ గ్రామం నుంచి దళితవాడ వేరుచేయబడి ఉన్నది. దళితులు నివసించే ప్రాంతంలో కుళాయి నీరు, పారిశుధ్యం, పాఠశాల లేవు. రోడ్ల నిర్మాణం జరగలేదు. సౌరాష్ట్ర ప్రాంతంలోని గ్రామాలలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉన్నదని వారు మాకు చెప్పారు. ఊట సిద్ధాంత ఆధారిత గుజరాత్ నమూనా సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను తీవ్రతరం చేస్తున్నదనటానికి లెక్కకుమించిన సాక్ష్యాధారాలున్నాయి. నయా ఉదారవాద విధానాలు దళితులను బాగా దెబ్బతీశాయి. ఆవిధంగా ఈ విషయాలను చేపట్టిన దళిత గ్రూపులు, ఉద్యమాలు నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు సహజ మిత్రులు.
|| అస్పృశ్యతా వ్యతిరేక పోరాడటానికి వామపక్ష ప్రత్యామ్నాయ నమూనా ||
ఈ సందర్భంగా భూమి, జీవనాధార సమస్యలపై దళిత అస్మిత, దళిత ఆత్మగౌరవం పేర్లతో గుజరాత్‌లోని దళిత సమాజం ఒక వెల్లువలా ఉద్యమించింది. నీచమైనవిగా భావింపబడుతున్న 'సంప్రదాయ' వృత్తులకు చెందిన పనులను తిరస్కరించాలని ఉద్యమ నేతలు దళితులకు విజ్ఞప్తి చేశారు. ఒక శక్తివంతమైన ప్రతీకాత్మక నిరసనగా దళితులు అనేక మృత పశువుల కళేబరాలను ప్రభుత్వ కార్యాలయాల ముందు పడేశారు. ఉనాలో జరిగిన హింసాత్మక సంఘటనల తరువాత భూ సంస్కరణల కోసం దళిత ప్రతిఘటన డిమాండ్ చేయటానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. 'మీరు ఆవు తోకను ఉంచుకొని మాకు మా భూమిని ఇవ్వండి' అనే నినాదం అత్యంత ప్రజారంజకం అయింది. సామాజిక, రాజకీయ సమీకరణలతోపాటు వివక్ష, అస్పృశ్యతలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భూ సంస్కరణల కోసం డిమాండ్ చేయాలనే వామపక్ష విధానాన్ని ఇది వెలుగులోకి తెచ్చింది.
1970వ దశకంలో బెంగాల్లో ప్రవేశ పెట్టిన వామపక్ష నమూనా ఇక్కడ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. వామపక్ష ప్రభుత్వం 12 లక్షల ఎకరాలను 30 లక్షల మంది గ్రామీణ పేదలకు పంచింది. వీరిలో 37 శాతం దళితులే కావటం గమనార్హం. ఈ పునాదిపైనే గ్రామ పంచాయతీలలో దళితులు పాల్గొని నాయకులుగా ఎదిగారు. గ్రామీణ బెంగాల్లో ఈ భూ సంస్కరణల ప్రక్రియ, స్థానిక స్వపరిపాలన, కులతత్వ ధోరణుల నడ్డి విరిచింది. కులానికి వ్యతిరేకంగా రాజకీయంగా, సామాజికంగా వామపక్షం జోక్యం చేసుకునేందుకు తగిన వాతావరణాన్ని అది సృష్టించింది. బెంగాల్లో కుల వ్యవస్థ నిర్మూలించబడిందని నేను చెప్పటంలేదు. అయితే గుజరాత్ కంటే అది సామాజికంగా చాలా తక్కువ ప్రమాదకరంగా మారిందని కచ్చితంగా చెప్పవచ్చు. ఆ విధంగా గుజరాత్లో జరుగుతున్న దళిత ప్రతిఘటన, దాని నాయకత్వం ఇచ్చే నినాదాలు మరోసారి వామపక్ష ప్రత్యామ్నాయ నమూనా విశిష్టతను వెలుగులోకి తెచ్చాయి.
గుజరాత్ ఉద్యమం బయటకు తెచ్చిన మరో ముఖ్యమైన పార్శ్వం సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి ఆవశ్యకత. మోడీ నాయకత్వంలో గత దశాబ్దంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా వృద్ధి రేట్లను గుజరాత్ సాధించిందని చెబుతుంటారు. అయితే సామాజికంగా చూస్తే కేవలం ధనికులు, అదానీలు, అంబానీల వంటి ఆశ్రిత కార్పొరేట్ పెట్టుబడిదారులు మాత్రమే ఈ తరహా వృద్ధితో లాభపడ్డారు. ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? గుజరాత్ నమూనాలో పెట్టుబడి తీవ్రత అధికంగా ఉన్న పరిశ్రమలలో ఉద్యోగ కల్పన, వేతనాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇలాంటి వృద్ధి వల్ల దళితులు అందరికంటే ఎక్కువగా నష్టపోయారు. ప్రత్యామ్నాయం అంటూ ఏదీ అందుబాటులో లేని స్థితిలో దళితులు సంప్రదాయ కుల ఆధారిత పనులను తిరస్కరిస్తున్నారు. గుజరాత్లో అనేక ప్రభుత్వ శాఖలలో షెడ్యూల్డ్ కులాలకు ఉద్దేశింపబడిన 64,000 ఉద్యోగాలను భర్తీచేయలేదని నవసర్జన్ అనే ప్రముఖ దళిత గ్రూపు చేసిన అధ్యయనంలో తేలింది. ప్రభుత్వం గత సంవత్సరం విడుదల చేసిన సమాచారం దీన్ని నిర్ధారించింది. 'పాకీపని, మృత పశువుల కళేబరాలను తొలగించటం వంటి కుల ఆధారిత వృత్తుల నుంచి బయటకు రాకుండాచేసి తద్వారా వారి సామాజిక అంతస్తు మారకుండా చూసే ఒక దోపిడీ వ్యవస్థ కుట్ర దీనిలో ఇమిడి ఉంది' అని నవసర్జన్ డైరెక్టర్ మార్టిన్ మక్వాన్ పేర్కొన్నారు. అనేక దళిత గ్రూపుల ఆలోచనలలోనూ, విశ్లేషణలలోనూ జీవనాధారం, ఉద్యోగాలు, భూమి, వేతనాలు ముందు కొచ్చాయనే వాస్తవానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. గతంలో సామాజిక అంతస్తుతో వీటికి సంబంధం ఉండేది కాదు. ఆ అవగాహన మారింది. ఇది ఆహ్వానింపదగిన పరిణామం. దీనితో దళిత గ్రూపులు, వామపక్ష ప్రజా సంఘాలు చేయగల సమిష్టి కార్యాచరణలకు ఒక పునాది ఏర్పడింది. ప్రత్యేకంగా చెప్పాలంటే కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఈ మైత్రిని నిర్మించటంలో ప్రధాన పాత్రను నిర్వహించగలుగుతాయి.
|| విద్యార్థులు-విద్యా సంస్థలు ||
నిరసనకు గల రెండవ పార్శ్వం రోహిత్ వేముల ఉదంతంతో వెలుగులోకి వచ్చింది. పాఠశాల తరగతి గది నుంచి సాంకేతిక, వృత్తి సంబంధిత ఉన్నత విద్యా సంస్థలతో సహా అన్ని రకాల విద్యా సంస్థలలో దళితులు ఎదుర్కొంటున్న వివక్ష ఈ ఉదంతంలో ఇమిడి ఉన్నది. విద్యా సంస్థలలోని వివక్షకు చెందిన వివిధ పార్శ్వాలపై స్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ సవివరమైన పరిశోధన చేశారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ హోదాలో ఆయన ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో దళితులు ఎదుర్కొంటున్న వివక్షపై సవివరమైన నివేదికను తయారు చేయించారు. ఆ విద్యా సంస్థలో సమాన అవకాశాల కార్యాలయాన్ని నెలకొల్పటంతో సహా దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షను అధిగమించటానికి అనేక సిఫార్సులు చేశారు. ఈ సిఫార్సులు ఎయిమ్స్‌కే కాకుండా ఉన్నత విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి. అయితే ఈ నివేదిక 2007లో సమర్పించబడినప్పటికీ దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరిగిన సంఘటనలు దేశంలోని అనేక కాలేజీలకు, విశ్వవిద్యా లయాలకు చెందిన విద్యార్థులు సంఘీభావ ఉద్యమాన్ని చేపట్టేలా చేసింది. దళిత విద్యార్థులకు న్యాయం జరగాలంటే రోహిత్ వేముల చట్టం తేవాలనే డిమాండ్ ఈ ఉద్యమంలో ఆవిర్భవించింది. థోరట్ నివేదిక ముందుకు తెచ్చిన సమస్యలను అనేక విద్యాసంస్థలలో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఒక చట్టాన్ని తేవలసిన అవసరం ఉన్నది. అలాంటి చట్టాన్ని తేవాలని చేసే పోరాటానికి సిపిఐ(ఎం) మద్దతు ఉన్నది. హెచ్‌సియు, జెఎన్‌యు, జాదవ్‌పూర్, హిమాచల్ విశ్వవిద్యాలయం వంటి విద్యాసంస్థలలో వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థలలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయటం ముదావహం. అలా విశాల మైత్రి ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది. కొన్నిచోట్ల అది ఆచరణలోకి వచ్చింది.
|| దళితులపై సాగుతున్న హింస ||
నిరసనకు గల మూడవ పార్శ్వం దళితులపై కొనసాగుతున్న హింస. ఈ హింస కేవలం అగ్రకులాలే కాకుండా మండల్ అనంతరం రాజకీయ, సామాజిక ప్రాబల్యం సముపార్జించిన మధ్యస్థ కులాలకు చెందిన కొన్ని వర్గాలు ఈ హింసకు పాల్పడుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ప్రత్యేకంగా గత కొన్ని సంవత్సరాలలో దళితులపై హింస పెరిగింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో గణనను బట్టి తేలిందేమంటే 2013లో దళితులపై జరిగిన హింసాత్మక సంఘటనలు 39,408 ఉంటే 2014లో అవి 47,064కు పెరిగాయి. ఈ ఘటనలు 2012లో 33,655, 2011లో కూడా అదే స్థాయిలో ఉన్నాయి. నిజానికి దళితులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు జాతీయ సగటు కంటే 2013, 2014లో పది రాష్ట్రాలలో ఎక్కువగా పెరిగాయి. దళిత మహిళలపై జరుగుతున్న లైంగిక హింస అనేక సామాజిక కారణాల వల్ల రిపోర్ట్ కావటం లేదు. దళితులపై జరిగిన దాడులకు పడే శిక్షలు కేవలం 3.7 శాతం మాత్రమే.
|| కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట రాజకీయాలు ||
ఒకవైపు ఐక్యత ఆవశ్యకత పట్ల చైతన్యం పెరుగుతున్నప్పటికీ కొన్ని దళిత సంఘాలు, ఎన్జిఓలు రాజకీయ, భావజాల కారణాల వల్ల వామపక్ష ప్రజాసంఘాలకు వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తున్నాయనేది నిజం. వామపక్షాల పట్ల ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలనే విషయంలో దళిత గ్రూపుల మధ్య విభేదాలున్నాయి. వామపక్షాలను ప్రధాన లక్ష్యంగా చేసుకోవాలనీ, సమిష్టి ఉద్యమాలను వ్యతిరేకించాలనీ కొందరు భావిస్తున్నారు. ఈ దృక్పథం మూలాలు అస్తిత్వ రాజకీయాల ఆచరణలో ఉండటమే కాకుండా మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితిలో వచ్చిన గుణాత్మక మార్పును వీరు గ్రహించలేకపోతున్నారు. అయితే వామపక్షం ముఖ్యంగా సిపిఐ(ఎం) ఈ రాగద్వేషాలను అధిగమించి ద్వేషపూరితమైన కుల వ్యవస్థపై పోరాటాలను నిర్మించటానికి సుముఖులుగా ఉన్న వారందరితో కలిసి పనిచేయాలి. ఈ పోరాటంలో మనం మన బలహీనతలను అధిగమించాలి. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మికులను సమీకరించటం భారతదేశంలోని వర్గపోరాటాలకు అవసరమనే మార్క్సిస్టు అవగాహనను సిద్ధాంతంలోనూ, ఆచరణలోనూ బలోపేతం చెయ్యాలి. దళిత కార్మికులు ద్వంద్వ భారాలను మోయవలసి వస్తున్నది. దళిత మహిళా కార్మికులు కుల, లింగ వివక్ష, వర్గ దోపిడీల వల్ల మూడు భారాలను మోయవలసి వస్తున్నది. వీటిని గుర్తించి, పట్టించుకోవలసిన అవసరం ఉన్నది.
కుల వివక్షను పరిష్కరించటంలో పెట్టుబడిదారీ వ్యవస్థ విఫలం కావటం యాదృచ్ఛికం కాదు. దానికి భిన్నంగా పెట్టుబడిదారీ వ్యవస్థ వివిధ దశలలో తన లాభాలను పెంపొందించుకోవటానికి కులాన్ని ఉపయోగించు కోవటమేకాక బలోపేతం చేసింది. చారిత్రకంగా భారత సమాజంలోని కులాలు, వర్గాలు పెనవేసుకుని అభివృద్ధి చెందిన తీరు మనకు తెలియజేసేదేమంటే అంటరానివారి నుంచి, శూద్రుల నుంచి మిగులును మరింతగా దోపిడీ చేసేందుకు కులాన్ని ఉపయోగించటం జరిగింది. మహిళల శ్రమ విలువను మరీ ముఖ్యంగా దళిత మహిళల శ్రమ విలువను తగ్గించటానికి పితృస్వామిక సంస్కృతులను వాడటం జరిగింది. మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న స్థితిలో హిందూత్వ శక్తులు 'హిందువుల ఐక్యత'ను నిర్మించే ప్రయత్నం చేస్తూ మైనారిటీలకు వ్యతిరేకంగా దళితులను సమీకరిస్తున్నారు. దేశంలోని కుల నిర్మాణాల గురించి వామపక్ష మౌలిక సైద్ధాంతిక అవగాహనా చట్రం దళితుల మధ్య వామపక్షాల పనికి, దళిత గ్రూపుల, సంస్థలతోవామపక్షాల సంబంధాలకు, వామపక్షాల సామాజిక మైత్రీ బంధాల నిర్మాణానికి ఆధారమవ్వాలి. కుల వ్యవస్థపై పోరాటం చెయ్యటానికి, న్యాయం కోసం దళితులు చేస్తున్న నేటి పోరాటానికి గల మూడు పార్శ్వాలను చేపట్టటానికి ఒక నూతన సామాజిక, ఆర్థిక ఎజెండాతో ముందుకు సాగాలి. - బృందా కరత్

Whether we like it or not, identity politics are bound to be there as long as social discrimination exists.So we have to recognize them and have alliance with those movements.Let us not forget that we have to be more humble in dealing with those weaker sections because we have to convince them to accept our ideology by giving local examples and taking up local problems.
ReplyDeleteWhether we like it or not, identity politics are bound to be there as long as social discrimination exists.So we have to recognize them and have alliance with those movements.Let us not forget that we have to be more humble in dealing with those weaker sections because we have to convince them to accept our ideology by giving local examples and taking up local problems.
ReplyDelete