Wednesday, 2 November 2016

|| చట్టసభలు - పురుషాధిక్య సమాజం ||




              చట్టసభల్లోకి పురుషాధిక్య కొండచిలువలు చొరబడి అసలు స్త్రీల అస్తిత్వాన్నే లేకుండా చేయటం ఆధునిక కాలంలో విస్తరిస్తున్న అత్యంత విచారకర అంశం. చట్టసభలో స్త్రీల ప్రాధాన్యాన్ని తృణీకరించటం ఒకెత్తయితే, అసలు చట్టసభల్లోకే రానీయకుండా ఉండటంతో పాటు, సమాజంలో వారి ప్రాధాన్యాన్ని నిరంతరం కించపర్చటం ద్వారా అసలు మొత్తంగా స్త్రీ సమాజాన్నే వంచనకు గురిచేయటం ఇటీవలి కాలంలో మానవీయ వ్యవస్థల పేరుతో చెల్లుబాటు కావటమే అత్యంత హేయమైన వాస్తవం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్‌ మహిళల జీవితంపై చేస్తున్న దుర్మార్గమైన యాగీ అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మొత్తం అన్ని ఖండాల్లో విస్తరిస్తున్న వైనాన్ని గాజు కళ్లతో టీవీ తెరల్లో కాలక్షేపంగా చూడటమే అత్యంత విచారకర అంశం. నిజానికి ట్రంప్‌ కన్నా మన నేతలు అనేకరెట్లుగా స్త్రీల ఉనికిని అపహాస్యం చేస్తున్నారు. చట్టసభల సాక్షిగా ఈ పరిణామం నిర్వ్యాపకంగా సాగిపోతున్నది. అమెరికా సైన్యం ఏకంగా 26,000 లైంగిక నేరాలకు పాల్పడిందని అక్కడి ప్రభుత్వాల నివేదికలే చెబుతున్నాయి. వాటిల్లో కేవలం 238 కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయి. ఇక మన భారతదేశంలో 'వాకపల్లి'ని మనం ఎప్పుడో మర్చిపోయాం. మహిళలు తమపై అత్యాచారం చేశార్రా నాయనా, దీనికి గుర్తులు ఇవిగో తండ్రీ అంటూ కోర్టుల్లో బట్టలెత్తి చూపి ఏడ్చినా మన కరకు గుండె కరగలేదంటే ఎంతగా మనం జడిపాయం అయిపోతున్నామో అర్థం చేసుకోవాలి. స్త్రీల మీద ట్రంప్‌ దుర్మార్గ భాషను మించి మన దేశంలో రాజకీయ నాయకులు స్త్రీలపై ప్రయోగిస్తున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఓ సందర్భంలో వాదోపవాదాల సమయంలో జనతా దళ్‌(యు) నాయకుడు శరద్‌యాదవ్‌ 'కురచ జుట్టు మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు?' అంటూ పార్లమెంటు సాక్షిగా స్త్రీలను అవమానించాడు. ఇక ములాయం సింగ్‌ యాదవ్‌ అయితే, ఈ మధ్య కాలంలోనే స్త్రీలపై అత్యాచారాలు పెట్రేగిపోతున్న సందర్భంలో 'మగ పిల్లలు పొరపాట్లు చేయటం సహజం. అంత మాత్రాన వారిని ఉరితీయమని స్త్రీలు ఉద్యమాలు చేయ టం ఏం న్యాయం' అంటూ న్యాయ ప్రస్తావన చేయటం. అంటే, స్త్రీని కాపాడుకుందాం అనటం అన్యాయం అయినట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉండటం ఎంత హేయం.
మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌లో పెద్ద నాయకుడైన దిగ్విజరు సింగ్‌ 2013లో కాంగ్రెస్‌ ఎంపి మీనాక్షీ నటరాజన్‌ను ఉద్దేశించి 'స్త్రీలు నూరు శాతం ఉపయోగించుకోవాల్సిన వస్తువులు' అంటూ పార్లమెంటులోనే వ్యాఖ్యానించటం అప్పట్లో కలకలం రేగింది. అప్పట్లో పార్లమెంటులో పెద్ద దుమారం రేగింది. ఆ వెంటనే సదరు ఎంపీని దిగ్విజరు సింగ్‌ 'సింపుల్‌ అండ్‌ హానెస్ట్‌ పర్సన్‌' అనటంతో వివాదం ముగిసిపోయింది. పార్లమెంటులో మీనాక్షీ నటరాజన్‌ కన్నీళ్లు ఎవ్వరినీ కరిగించలేకపోయాయి. మగవాళ్లు ఒక ఫ్రస్ట్రేషన్‌తో, కోపంతో, అసహనంతో ఇట్లా చట్టసభల్లోనే మహిళా ప్రతినిధులను అవమానిస్తుంటే కనీసం కంటి తుడుపు చర్యలు కూడా లేకపోవటం చట్టసభలో పేరుకుపోతున్న అరాశిక్య పరిస్థితులకు నిర్వచనంగా కనిపిస్తున్నది.
ఇక, బిజెపి ఎంపీల సంగతైతే చెప్పనవసరం లేదు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అయితే హర్యానా ఎన్నికల సందర్భంలో 'యువతులు సక్రమంగా దుస్తులు ధరిస్తే అబ్బాయిలు వాళ్లను ఎందుకు అవమానిస్తారు?' అంటూ తిరిగి స్త్రీలనే ప్రశ్నించాడు. దీనికి కొనసాగింపుగా 'మగ పిల్లలు స్వేచ్ఛగా తమ భావాలను ప్రకటించుకోవటానికి అవకాశం లేదా?' అంటూ గాయానికి మరింత కారం పూస్తున్నాడు. ఇటువంటి వ్యంగ్యం వెనుక మహిళల కనీస అభివృద్ధిని అడ్డుకునే కసి దాగివుంది. 'మీకు స్వేచ్ఛ ఉందని నగంగా ఊరేగుతారా?' అంటూ జుగుస్పా కరంగా వ్యాఖ్యానిస్తాడు. 'స్త్రీలు చిన్నచిన్న స్కర్టులు వేసుకుని విదేశీ వ్యామోహంలో కొట్టుకుపోతున్నారు. భారతీయ సంస్కృతిని మహిళలు కించపరుస్తున్నారు' అనటం ద్వారా ఆయన చదువుకున్న స్త్రీలను టార్గెట్‌ చేయటం ద్వారా మొత్తం స్త్రీ సమాజ ఉనికిని ప్రమాదంలో పడేశాడు. ఇక సంస్కృతి పేరుతో కాషాయ మూకలు కాస్త ఆధునికంగా కనిపించే మహిళలను వేధించటం, స్త్రీలు స్కర్టులు వేసుకుంటే వారిని కించపరుస్తూ మాట్లాడటం, మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో మార్గదర్శకాలు విధించటం జరుగుతోంది. సంప్రదాయం, సంస్కృతుల పేరుతో మనం చట్టసభలను మహిళా సమాజం మీద అక్కసు వెళ్లగక్కడానికి వాడుకుంటూ, మహిళా రిజర్వేషన్‌లను వ్యతిరేకిస్తూ ఏం సాధిస్తున్నట్టు? స్త్రీలను అవమానిస్తున్న వీళ్లంతా తల్లి బిడ్డలు కాదా అన్నంత సందేహాలు ముసురుతున్నాయి. ఇట్లాంటి వారంతా ఇంట్లో తల్లి, అక్కచెల్లెళ్ల స్వేచ్ఛకు అడ్డుపడేవారే. ఇప్పుడు ఏకంగా చట్టసభల్లో స్త్రీల స్వేచ్ఛకు పాతర వేసే ధోరణులకు పునాదులేసి భవంతులు కడుతున్నాడు. ఈ పురుషాధిక్య పునాదులను తవ్విపోసే దిశగా మనందరమూ ఆలోచించాల్సిన అత్యవసర సమయం ఇది.    - డాక్టర్‌ నూకతోటి రవికుమార్‌

No comments:

Post a Comment