నరేంద్ర మోడీ, చంద్రబాబు ప్రభుత్వంలో స్త్రీలపై అత్యా చారాలు విపరీతంగా పెరుగు తున్నాయి. దీనికి స్త్రీలలోని మూఢాచారాలు ఒక కారణం కాగా ప్రభుత్వాలు పితృస్వామ్య భావంతో పురుషుని పక్షాన ఉండటం మరో అంశం. వీరిపై మన పురాణ ధర్మశాస్త్రాల ప్రభావం ఉండటం కూడా మరో కారణం అవుతుంది. హిందూతత్వం, కులతత్వం పెరగడం వల్ల స్త్రీలలో గృహ హింస, సామాజిక హింస పెరిగిపోతోంది.
కారణం ప్రభుత్వాలు మతోన్మాదంతో కూడుకొన్నవి కావడమే. మత, కుల వాదాలను రెచ్చగొట్టడం వల్లనే రాష్ట్రంలో బాల్య వివాహాలు, కట్నకానుకలు ఇచ్చే పద్ధతులు, కులం, అస్పృశ్యభావాలు మరితంగా పెరుగుతున్నాయ నేది స్పష్టం. గ్రామాల్లో పరిస్థితి ఇలా ఉంటే అత్యంత ఉన్నతమైన విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీలో ఒక పెత్తందారి వర్గ విద్యార్థి సునీత అనే దళిత విద్యార్థిని ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన మోసగించడంతో ఆమె ఆత్మహత్య ఘటన మన కళ్ళలో మెదులుతుంది.పెత్తందారీ వర్గాల విద్యార్థులు ఇలా ఎందరిని మోస గించారో, ఎన్ని గర్భాలను చిదిపారో అంతులేదు. అన్ని స్థాయిల్లోనూ ఈ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. పొలాల్లో, చావిళ్ళలో, గుడిలో, బడిలో, చివరికి విశ్వవిద్యాలయాల్లో కూడా దళిత స్త్రీ హత్యలే. విశ్వవిద్యాలయాల్లోని ఆత్మహత్యల వెనుక ఎంత అంతర్మథనం ఉందో, వేదన ఉందో మనకర్థమవుతుంది. ఇంతేకాక మధ్యతరగతి ఉద్యోగస్తుల ఇళ్ళలోను, పొలం, పుట్ర ఉన్నవాళ్ళ ఇళ్ళలోను 8-10 ఏండ్ల వరకు ఉన్న దళిత బాలికలను పనికి పెడుతున్నారు. వాళ్ళు అక్కడే రజస్వలౌతారు. ఆ తరువాత ఇంటి యజమానులు అనేక సందర్భాల్లో ఒంటరిగాటున్న అమ్మాయిలపై అఘాయిత్యం చేస్తున్నారు. ఆ మూగజీవులు చెప్పుకోలేక ఎటో వెళ్లిపోవడమో, ఆత్మహత్య చేసుకోవడమో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఒకపక్క విద్యావంతులై, చైతన్యవంతులై, పారిశ్రామికవేత్తలై, పరిపాలకులుగా ముందుకెళ్తున్న దశలో భారతదేశంలో స్త్రీలు గృహహింసకు నిరంతరం గురవడానికి కారణం సుమారు నలభై శాతం మందికి చదువు రాకపోవడం. చదువుకున్న స్త్రీలలో కూడా మూఢాచారాల భావాలు ఎక్కువగా ఉండటం. అత్తలు కోడళ్ళను హింసించటం ప్రబలుతోంది. అందుకే గృహ హింస చట్టం నామమాత్రమైంది. భారత్‌లోనూ గృహహింస నిరోధక చట్టం-2006 రూపుదాల్చింది. ఆ చట్టం అమలులోకి వచ్చి నేటికి సరిగ్గా పదేళ్ళు. చట్టం అమలులోకి వచ్చిన ఆరేళ్ల తరువాత వెలువడిన బిబిసి నివేదిక ప్రకారం భారత్‌లో మహిళలపై 3,09,546 నేరాల కేసులు నమోదైతే అందులో 1,18,866 గృహహింసకు సంబంధించినవే. దేశంలో మహిళలపై రెండు నిమిషాలకో నేరం జరుగుతోందని జాతీయ నేర రికార్డుల బ్యూరో-2015 నివేదిక తేల్చి చెప్పింది. పదేళ్లలో 22.4 లక్షల కేసులు నమోదయ్యాయి. వీటిలో సెక్షన్ 498-ఎ కిందకు వచ్చే నేరాలు అధికం. ఆ కేసులు గంటకు పది చొప్పున నమోదవుతాయి. గడిచిన పదేళ్ళలో మహిళలపై జరిగిన నేరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో పదేళ్ళ క్రితం పోరాడి సాధించుకున్న కొత్త చట్టం ఏం చేస్తోందన్న సందేహం కలగకమానదు. దేశంలో నిరంతరం పెరుగుతున్న గృహ హింసను ఒకసారి పరిశీలిస్తే 2006ఓ 63,128 కేసులు, 2007లో 75,930 కేసులు, 2008లో 81,344 కేసులు, 2009లో 89,546 కేసులు, 2010లో 94,041 కేసులు, 2011లో 99,135 కేసులు, 2012లో 1,06,527 కేసులు, 2013లో 1,18,866 కేసులు, 2014లో 1,22,877 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల్లో ఎక్కువ వీగిపోతున్నాయి. గృహహింస మాత్రం నిరంతరం జరుగుతూనే ఉంది. ప్రతి పెళ్ళిలో కట్నం తీసుకుంటున్నారని తెలుసు. కానీ పెళ్ళికొడుకును అరెస్ట్ చేయరు. కోట్లకు కోట్లు కట్నాలు తీసుకుంటున్న పెళ్ళిళ్ళకు పోలీసులే కాపలా కాస్తారు. మరోపక్క పెళ్ళయిన తర్వాత రత్న వైఢూర్యాల కోసం, పొలాల కోసం, ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం, వాహనాలు కొనిపించుకోవడం కోసం అమ్మాయిలను వేధిస్తారు. ఆంధ్రదేశంలో ద్విచక్ర వాహనాల్లో పెక్కు శాతం అత్తగారు కొనిపెట్టినవేనని ఒక నానుడి. ఇక కార్లు, డబుల్‌కాట్ మంచాలు, బీరువాలు, సూట్లు, బూట్లు దగ్గర నుంచి అన్నీ అత్తవారే కొనిపెట్టాలనే ఆచారాలు కొనసాగుతున్నాయి. చివరకు కాన్పులు కూడా తల్లిదండ్రులే చేయించాలని అనటంతో ఆడపిల్లల్ని కనడం ఒక భారంగా భావించి కొందరు భ్రూణ హత్యలకు సిద్ధపడుతున్నారు. అత్తగారే అన్నీ ఇవ్వాలని ఆలోచనలు గృహహింసకు మూలమవుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి ఒక్కటవటం, అత్తలు, బావలు, భర్త సమూహం ఎక్కువవడం వల్ల గ్యాస్‌స్టవ్‌లు ముట్టించి, గొంతు నులిమి చంపిన ఘటనల్లో కూడా సాక్ష్యాలు దొరకటం లేదు. ప్రతి పండుగకు బట్టలు పెట్టాలి, నగలు పెట్టాలనే ఆచారాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అత్తలను సీరియల్స్ గయ్యాళులుగా తయారుచేస్తున్నాయి. క్రౌర్య భావాలను రెచ్చగొడుతున్నాయి. కోడళ్ళు కూడా వస్తువ్యామోహితులు అవడం, అత్తమామలను సరిగ్గా చూడకపోవడం, షాపింగ్ పిచ్చితో భర్తలను అప్పుల్లో ముంచటం, ఇంట్లో అన్నం వండకుండా హోటళ్ళ నుంచి తీసుకురమ్మని బలవంతం చేయటం, పిల్లల ఆలనాపాలనా చూడకుండా శారీరక అంశాల మీద, సౌందర్య పోషణ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వంటి లోపాలు పెరిగిపోతున్నాయి. దాంతో ఉత్పత్తి క్రమంలోకి అత్తలు, కోడళ్ళు ఇద్దరూ రాకుండా ఉన్నది తినటం లేదా భర్తను అవినీతికి ప్రోత్సహించటం వంటి రుగ్మతలు వస్తున్నాయి. ఒకపక్క మధ్యతరగతి స్త్రీలు స్త్రీ హింసకు పాల్పడుతుంటే, మరోపక్క దళిత స్త్రీలు సామాజిక హింసను ఎదుర్కొంటున్నారు.
మరోపక్క దళిత స్త్రీలు అన్ని రంగాల్లో అణగద్రొక్కబడుతున్నారు. ఎక్కడ విన్నా దళిత స్త్రీ ఆక్రందనే. ఎక్కడ చూసినా దళిత స్త్రీ పీడనే. అది సాంఘికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లోనూ సాగుతోంది. మామూలు స్త్రీలు కేవలం పితృస్వామ్య పీడనలో మగ్గిపోతుంటే దళిత స్త్రీలు కుల, మత, లింగ, వివక్షలన్నింటికీ గురవుతున్నారు. వారి శ్రమతో పండి పులకిస్తున్న భూమి ఒడిలోనే వారి మానప్రాణాలు హతమైపోతున్నాయి. దళితుల మీద జరుగుతున్న దాడులను పరిశీలిస్తే అవి దళిత స్త్రీల మీదే ఎక్కువగా జరుగుతున్నాయి. 1986లో దళితుల (ఎస్సి) మీద 91,097 దాడులు, ఎస్సీల మీద 23,958 దాడి కేసులు రిజిష్టరయ్యాయి. 1994లో 14,938 కేసులు, 1995లో 12,313 (ఎస్సి) కేసులు నమోదయ్యాయి. ప్రతి సంవత్సరం సుమారు 13 వేల నుంచి 14 వేల దాకా దాడి కేసులు రికార్డు అవుతున్నాయి. 1995లో జరిగిన దాడులను పరిశీలిస్తే వాటిల్లో 513 హత్యలు, 4,000 తీవ్రగాయాలు, 439 లూటీలు, గృహదహనాలు, 787 రేప్ కేసులు ఉన్నాయి. 1981-91 డేటా చూస్తే ఏటా 500 మంది చంపబడ్డారు, 4,000 మంది గాయపడ్డారు, 10,000 మంది ఇతరత్రా బాధలకు గురయ్యారు. ఈ మొత్తం దాడులలో దళిత స్త్రీ ప్రధాన బాధితురాలు. సగటున ప్రతి సంవత్సరం 513 మంది దళితులు హతం అవుతున్నారు. వారి భార్య లేక తల్లి ప్రధానంగా బాధితురాలవుతోంది. దళితుల ఇల్లు తగలబడినప్పుడు ఆ తల్లి రోదిస్తుంది. బిడ్డ చనిపోయినా, భర్త చనిపోయినా ఆమె సంక్షుభిత అవుతుంది. ఈ విషాదమంతటికీ దళిత స్త్రీపై ఉన్న అస్పృశ్యత ఒక ప్రధాన కారణం. 1995 తరువాత నుంచి ఇప్పటివరకు ఈ దాడులు మరింతగా పెరుగుతున్నాయి. అస్పృశ్యత గ్రామాల్లో ఇంకా బలంగానే తాండవిస్తున్నది. దీన్ని మొదట ఎదుర్కొంటున్నది దళిత స్త్రీలే. అస్పృశ్యత ఈనాడు సామాజిక కూడిక ఉన్న ప్రాంతాల్లో 70.2 శాతం, హోటళ్ళలో 80.5 శాతం, గుళ్ళలో 77.2 శాతం, మతపరమైన ఊరేగింపులలో 77.2 శాతం, చెరువు నీటిలో 68.4 శాతం, కుళాయి నీటిలో 77.2 శాతం, ఆర్థిక కార్యక్రమాల్లో 56.0 శాతం, రాజకీయ కార్యక్రమాలలో 29.8 శాతం నెలకొంది. (ది హిందూ రిపోర్టు) ఈ శాతాలను బట్టి చూస్తే అస్పృశ్యత అనేది స్త్రీలపై చూపుతున్న వివక్షలో, జరుగుతున్న దాడుల్లో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆమె మామూలుగా తాకరానిది. కానీ, అత్యాచారం చేయడానికి మాత్రం ఎటువంటి అంటూలేదు. ఆమెకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అండ లేదు. అందుకే ఆమెను అనుభవించడం, ఆ నేరం బయటకు రాకుండా ఆమెను చంపటం అతనికి సులభకార్యమయ్యింది. ప్రభుత్వ అంగాలైన పోలీసులు, ప్రభుత్వ అధికార కార్యాలయాలు ఆమె కేసును నమోదు చేసుకోవు. ఒకవేళ చేసుకొన్నా నిందితుడికి బాధ కలగకుండా చూసుకొంటాయి. ఇలాగే ప్రకాశం జిల్లా టంగుటూరులోని ఒక దళిత స్త్రీ ఇందిర. ఎంతో అందంగా ఉండేది. ఆమె అత్తకు ఒక అగ్రకులపు వ్యక్తితో అక్రమ సంబంధముంది. వాడు అత్తలేని సమయం చూసి ఇందిరకు గుండు గొరిగి, మీద బ్రాందీ పోసి నిప్పు అంటించాడు. దహిస్తున్న మంటల్లో ఇందిర రక్షించమని అరుచుకొంటూ రోడ్డు వెంబడి పరుగెత్తి కాలిపోయింది. ఆ దృశ్యం ఇంకా మన కళ్ళ ముందు ఉంది. ఈ సంఘటనపై దళితులు తీవ్రమైన ఉద్యమం నడిపారు. అదే జిల్లాలో చీమకుర్తిలో నలుగురు దళిత స్త్రీలను క్వారీ కాంట్రాక్టర్లు ఆదివారం పనుందని పిలిపించి బలవంతంగా కట్టేసి, అత్యాచారం చేసి, నోట్లో గుడ్డలదిమి, రాడ్లతో కొట్టి కాలువలో తొక్కారు. ఆ శవాలను ఒడ్డున పడేసి కాలుజారి గొయ్యిలో పడ్డారని పోలీసుల చేత చెప్పించారు. తరువాత దళిత ఉద్యమం (దళిత మహాసభ) ఆ సమస్యలోకి జొరబడి దళిత స్త్రీలను కాంట్రాక్టర్లు చంపగా చూసిన సాక్షులను బయటకులాగి ఇది సామూహిక అత్యాచారం, హత్యలు అని నిరూపించటం జరిగింది. ప్రభుత్వం, భూస్వాములు హరితవిప్లవం తరువాత బలిసిపోయి పచ్చని పొలాల మీద నెత్తుటి చారలు కట్టిస్తున్నారు. ఈ ఘటనలన్నీ చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈ వరుసలోనే నల్గొండ జిల్లాలో సమాజాన్ని కుదిపేసిన ఒక ఉందంతం జరిగింది. ముత్తమ్మ అనే దళిత స్త్రీని వివస్త్రను చేసి ఊరేగించారు. మొత్తం భారతం విస్తుపోయింది. ఎక్కువగా ఈ అత్యాచారాలు, వివస్త్రా ఊరేగింపులు చేసి స్త్రీలను హింసించేది అగ్రకులాలే. భూములేగాక రాజ్యాధికారం కూడా వీరి చేతుల్లోనే ఉంది. రాజ్యాధికారం ఉన్నవారి చేతుల్లోనే పోలీసులు, ప్రభుత్వాధికారులు ఉంటారు. అందుకే పోలీసులు, డాక్టర్లు, అధికారులు, ఇతర ఉద్యోగస్తులు అంతా ఈ సంఘటనలలో భూస్వాముల పక్షానే వ్యవహరించారు. ఇదేవిధంగా ఒక సంఘటనను మాఫీజేసి మరోసంఘటన జరగడానికి వీరంతా పునాదులేస్తారు. ఈ అంశాలను పరిశీలిస్తే కులాధిపత్యం మీద, అస్పృశ్యత మీద తీవ్రమైన పోరాటం చేయవలసిన బాధ్యత అందరి మీదా ఉంది. స్త్రీ హింసలో కులం పాత్ర, అస్పృశ్యత పాత్ర బలంగా ఉంది. సమస్య గృహంలో ఎంత తీవ్రంగా ఉందో, సమాజంలోనూ అంతే తీవ్రంగా ఉంది. హిందూ భావజాలం ఉన్న స్త్రీలలో కూడా తప్పక ఆ భావజాలాన్ని తాత్వికంగా పోగొట్టవలసిందే. పేదలు మధ్యతరగతిగా మారుతున్న క్రమంలో మతాచారాలు, కులాచారాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మహాత్మాఫూలే, అంబేద్కర్ ఆలోచనలు చాలా అవసరం. అందుకే అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును తెచ్చారు. పురుషులతో పాటు స్త్రీకి సమానమైన హక్కులు కావాలని ఆయన చెప్తూనే సమాజంలో కులం, అస్పృశ్యత పోయే వరకూ సామాజిక హింస పోదని కూడా చెప్పారు. మార్క్సిస్టులు, అంబేద్కరైట్లు ఈనాడు కలిసి కులాధిపత్య వాదాన్ని ఎదిరించటమేకాక హిందూత్వ భావజాలాన్ని రూపుమాపాలి. క్రైస్తవులు, బౌద్ధులు, ముస్లింలు కూడా పేరుకు మతం తీసుకున్నా స్త్రీ హింస విషయంలో అందరూ ఒకటిగానే ఉన్నారు. ముందు స్త్రీ మతోన్మాదం నుంచి, కులోన్మాదం నుంచి బయటపడాలి. సాంస్కృతిక విప్లవంలో భాగస్వామ్యం కావాలి. విజ్ఞానవంతురాలు కావాలి. సాటి స్త్రీని మనిషిగా చూడగలగాలి. కుల, మత భేదాలు లేకుండా స్త్రీలందరూ తమ హక్కుల కోసం పోరాడే క్రమంలో ఐక్యశక్తిగా రూపొందాలి. స్త్రీ విముక్తి పోరాటం ఈనాటి భారతీయ సామాజిక విప్లవానికి ఆయువు. స్త్రీలు లౌకికవాద, సామ్యవాద పార్టీలకు ఓటు వేసి గెలిపించడం ఒక రాజకీయ బాధ్యతగా గుర్తించాలి. ఆనాడే స్త్రీ అణచివేతకు చరమగీతం. ఆనాడే అంబేద్కర్ ఆశయాలకు సాఫల్యం. ఆ దిశగా అందరం పయనిద్దాం.. - డాక్టర్ కత్తి పద్మారావు

No comments:
Post a Comment