మేము అధికారంలోకి వస్తే
విదేశాల్లోని ,స్వదేశంలోని నల్లధనం మొత్తం
వెలికి తీస్తాం - మోదీ ( ఎన్నికల సభల్లో)
ఈ వాగ్దానం ఎలా అమలయ్యిందో చూద్దాం !
# నల్లధనం అంటే ఏమిటి? ఎంత ఉంటుంది ? #
చట్టప్రకారం ఆదాయంపై పన్ను చెల్లించకపోతే అది నల్లధనమవుతుంది. అలాంటివారు శిక్షార్హులు. ఈ ధనాన్ని దేశ విదేశాల్లో దాచిపెడతారు. స్వదేశంలో పన్ను ఎగవేత సొమ్ముగా చలామణీ అవుతుంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదెంతో హానికరం. ప్రపంచం మొత్తం మీద నల్లధనం పరిమాణం ఎంత అన్నదాని మీద కచ్చితమైన అంచనాలు లేవు. కానీ అది హకు అందనంతగా 20 లక్షల కోట్ల డాలర్లకు పైగానే ఉండవచ్చునని కొన్ని అంతర్జాతీయ సంస్థల లెక్కల్లో తేలింది. భారత్లో ఎంత నల్లధనం ఉంది, భారతీయులు విదేశీ బ్యాంకుల్లో దాచుకొన్న నల్లధనం పరిమాణం ఎంత అన్నదాని మీదా స్పష్టత లేదు. భారతీయులు 50 వేల కోట్ల డాలర్ల మేరకు నల్లడబ్బును విదేశాల్లో అక్రమంగా దాచిపెట్టుకొన్నారని, మరే దేశంతో పోల్చినా ఇది ఎక్కువేనని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డైరెక్టర్ 2012 ఫిబ్రవరిలో ప్రకటించారు. 2011 జులైలో భారత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రమాణ పత్రంలోని అంచనాల ఆధారంగా సీబీఐ డైరెక్టరు ఆ ప్రకటన చేశారని, తరవాత 2012 మార్చిలో ప్రభుత్వం పార్లమెంటుకు వివరించింది. భారతీయులు విదేశాల్లో దాచిపెట్టుకొన్న నల్లధనం 70 లక్షల కోట్ల రూపాయలకు పైమాటేనని కొన్ని అంచనాలు తెలుపుతున్నాయి. భారతీయులు విదేశాలకు తరలించిన చట్ట వ్యతిరేక డబ్బు 46,200కోట్ల డాలర్ల వరకు ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. 2008లో స్విట్జర్లాండు బ్యాంకర్స్ అసోసియేషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆ ఏడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న డబ్బు 1.45లక్షల కోట్ల డాలర్లు. దీన్నిబట్టి ఈ సమస్య ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు.
# నల్ల ధనం కుబేరుల ప్రతినిధులే కేంద్ర పాలకులు #
దేశంలోగల పెట్టుబడిదారులు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, కళాకారుల్లో అధికులు ఆదాయాన్ని దాచిపెట్టి పన్నుల బారినుంచి తప్పించుకోడానికి చేసే ప్రయత్నాలు నల్లధనం పోగవడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి అక్రమార్కులకు ఆడిటర్ల నుంచి సలహాలు లభిస్తుంటాయి. లావాదేవీలను తక్కువ శాతం బ్యాంకుల ద్వారా, ఎక్కువ శాతం నగదు రూపంలో జరుపుతుంటారు. కనీసం 50 శాతం లావాదేవీలను బ్యాంకుల ద్వారా జరిపితే వాటికి అధిక ఆదాయం వస్తుంది. నల్లకుబేరుల అక్రమాలకు దన్నుగా కొన్ని ప్రైవేటు బ్యాంకులు రెండు రకాల ఖాతాలు నిర్వహిస్తాయన్న అనుమానాలూ లేకపోలేదు. ఒకటి తెల్లదనం లావాదేవీలు, రెండోది నల్లధనం లావాదేవీలు. దేశంలోని కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు తమ పలుకుబడిని ఉపయోగించి బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగవేస్తుంటారు. సంస్థలు దివాళా తీస్తున్నాయి గాని వ్యక్తులు దివాళా తీయడం లేదు. వారు మాత్రం సంఘంలో పెద్దమనుషులుగానే చలామణీ అవుతుంటారు. ఫలితంగా ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. సామాన్యుడు అలాగే మిగిలిపోతున్నాడు. స్వీయరక్షణ కోసం ఈ పెద్దలు రాజకీయాల్లోకి ప్రవేశించి, నీతులు వల్లిస్తుంటారు. బ్యాంకుల్లో పెద్దమొత్తాల్లో అప్పు తీసుకొని ఎగ్గొట్టడం బడా బాబులకు రివాజుగా మారితే, వేల రూపాయల చిన్న మొత్తాలు తీసుకునే సామాన్య రైతులు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఏటా 1.30లక్షల కోట్లు నల్లధనం దేశం దాటిపోతుంటే చూస్తూ కూర్చోవడమే పనిగా మిగిలింది’ అని నాటి కేంద్ర నిఘా సంఘం అధిపతి ప్రత్యూష్ సిన్హా గతంలో వాపోయారు.
# నల్లధనం ఎక్కడ ఉంది ? ఎవరి వద్ద ఉంది ? #
మనదేశంలో పన్ను రిటర్నులు దాఖలు చేసేవారు మూడు శాతం కన్నా తక్కువే. కాబట్టి పన్ను అసలు చెల్లించనివారిని పన్ను పరిధిలోకి తీసుకురావాలి. తక్కువ ఆదాయం చూపిస్తున్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. 2015-16లో దేశ జనాభాలో ఒక్క శాతమే (1.30కోట్ల మంది) ఆదాయ పన్ను చెల్లించారు. వీరిలో అధికులు ఉద్యోగులు. మిగతావారు ఆదాయాన్ని దాచిపెట్టి అతి తక్కువ మొత్తానికే పన్ను చెల్లిస్తున్నారు. నగదు ద్వారా కాకుండా పెద్ద మొత్తాల లావాదేవీలు బ్యాంకుల ద్వారా జరిగేలా చేయడం దీనికి విరుగుడు.
# నల్లధనం - పారిశ్రామిక పెట్టుబడులు #
నల్లకుబేరులు తమ అక్రమ సంపాదనలో అధిక భాగాన్ని ‘ఆదాయంపై పన్నులు వసూలు చేయని’ దేశాలకు తరలిస్తారు. వీటిలో కొన్ని దేశాలతో భారత్ ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు దేశాల్లోనూ తరలించిన అక్రమ సంపాదనపై పన్నులు చెల్లించకుండా ఉండేందుకు వారికి ఇది ఒక వరంగా మారింది. పన్నుల బాదరబందీ లేని దేశానికి చేరిన తరవాత నల్లధనం తెల్లధనంగా మారి, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల రూపంలో తిరిగి మనదేశంలోకి ప్రవేశిస్తోంది. ఈ పెట్టుబడులకు రాయితీలు కూడా ఉంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు నల్లధనం క్యాన్సర్ వంటిది. దేశ ఆర్థిక వ్యవస్థను అన్ని విధాలా ఇది కుంగదీస్తుంది. ఎన్నికల రంగాన్ని, తద్వారా దేశ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తోంది. విద్యావేత్తలు, వైద్యులు, సంఘ సంస్కర్తలు ఒకప్పుడు ఎన్నికల్లో పోటీచేసి పైసా ఖర్చు చేయకుండా గెలిచేవారు. నేడు కోట్లల్లో డబ్బు గుమ్మరించేవారే ఎన్నికల్లో గెలుస్తున్నారు. నల్లధనాన్ని విదేశాల్లో దాచినవారిలో 20మంది పేర్లను ఇదివరకు వికీలిక్స్ బయటపెట్టింది. కేంద్రం అందులో కొందరి పేర్లనే బహిర్గతం చేయడంతో ఆగ్రహం చెందిన సుప్రీంకోర్టు, ఆ జాబితా మొత్తాన్ని తనకు ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల్ని సర్కారు ఖాతరు చేయకపోవడంతో, అక్రమార్కులను రక్షించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ నిగ్గదీసింది. -బి.రామకృష్ణారావు ( ఈనాడు)

No comments:
Post a Comment