మోడీ సర్కారు అనాలోచితంగా తీసుకున్న పెద్దనోట్ల రద్దు చర్య, అనంతరం నెలకొన్న పరిస్థితులపై సామాన్యుల్లో నెలకొన్న ఆగ్రహానికి సోమవారం నాడు దేశవ్యాప్తంగా వ్యక్తమయిన నిరసన అద్దం పట్టింది. వామపక్షాలతో పాటు, ప్రతిపక్షాలు ఇచ్చిన ఈ నిరసన కార్యక్రమాలు వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో వ్యక్తమైనాయి. కొన్ని రాష్ట్రాల్లో బంద్‌తో జన జీవనం పూర్తిగా స్తంభించగా, కొన్ని రాష్ట్రాల్లో హర్తాళ్ జరిగింది.
ఎన్డీఎ పక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా జనం పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం విశేషం. ప్రతిపక్షాల నిరసన పిలుపును విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర సర్కారు, సంఘ పరివారం వేసిన ఎత్తులను ప్రజానీకం ఐక్యంగా తిప్పి కొట్టిన తీరు హర్షణీయం. ప్రతిపక్షాల వద్దే నల్లధనం కుప్పలు తెప్పలుగా పేరుకు పోయిందని అందుకే నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నాయనే స్థాయికి సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగజారారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఏ రూపంలో నిరసన తెలిపినా దేశ ద్రోహమనే విధంగా సంఫ్‌ు పరివారీయులు ప్రచారం చేశారు. అయితే, ఈ గోబెల్స్ ప్రచారాన్నీ, అర్థం పర్థం లేని ఆరోపణలనూ ప్రజలు తిరస్కరించారని, ముందుచూపు లేని సర్కారు చర్య పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమయిన తీరు స్పష్టం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంతో పాటు, కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ తదితర ప్రతపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రజలు సంపూర్ణంగా, ముక్తకంఠంతో నిరసన తెలిపారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన ప్రజా జీవనం ఈ రాష్ట్రాల్లో స్తంభించింది.
బీహార్‌లో అధికార జెడియు వ్యతిరేకించినప్పటికీ ప్రజానీకం స్వచ్ఛందంగా స్పందించింది. పాట్నా, జహనాబాద్, గయ, భోజ్‌పూర్ తదితర నగరాల్లో రైళ్లను సైతం నిలిపివేశారు. రవాణా వ్యవస్థ నిలిచి పోవడంతో బీహార్‌లో బంద్ వాతావరణం నెలకొంది. బిజెపి, దాని మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాల పిలుపు ప్రభావం కనిపించింది. పాలక పక్షాల అణచివేత చర్యలను బేఖాతరు చేస్తూ ఈ రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనల హోరు కొనసాగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయ్యింది. పోలీసులు అణచివేత చర్యలకు, అరెస్ట్‌లకు దిగినా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ కేంద్ర సర్కారు వైఖరిపై నిరసన వ్యక్తమైంది. భారీ ప్రదర్శనలు జరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో జరిగిన ప్రదర్శనల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక సమస్యపై దేశ వ్యాప్తంగా ప్రజానీకం రోడ్ల మీదకు రావడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ రెండు సమ్మె జరిగినప్పటికీ అది ప్రధానంగా ఉద్యోగ, కార్మిక డిమాండ్ల్లకు సంబంధించినది. తాజా నోట్ల రద్దు అంశం దానికి భిన్నంగా అన్ని రంగాలకు చెందిన ప్రజలు, వారి దైనందిన జీవితానికి సంబంధించినది. దీని విస్తృతి, ప్రభావం కూడా ఎక్కువే! దీనిని దృష్టిలో ఉంచుకునే వామపక్షాలు సోమవారం నాడు దేశ వ్యాప్త నిరసన దినంకు పిలుపునిచ్చాయి. దీనికి తగినట్టుగానే వివిధ రాష్ట్రాల్లో, వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్యపై ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేసింది. వీధుల్లోకి వచ్చింది. ప్రదర్శనలు నిర్వహించింది. దేశ వ్యాప్తంగా వ్యక్తమయిన ఈ ఆగ్రహాన్ని తక్కువ చేసి చూపడానికి వెంకయ్యనాయుడుతో పాటు ఇతర కేంద్ర మంత్రులు ప్రయత్నిస్తున్న తీరు హాస్యాస్పదం.
ఈనెల నెల 8వ తేదీన అనూహ్యంగా నోట్ల రద్దు ప్రకటన చేసిన ప్రధాన మంత్రి రెండు, మూడు రోజులు సమస్యలు ఉంటాయన్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఈ గడువు పెరుగుతూ పోతోంది. తాజాగా ఆర్థికశాఖ మంత్రి 50 రోజుల పాటు తిప్పలు తప్పవన్నట్లు మాట్లాడుతున్నారు. ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్న సమాచారం ప్రకారం కనీసం ఐదారు, నెలలు సామాన్య ప్రజలను చిల్లర కష్టాలు వెంటాడనున్నాయి. అదే జరిగితే ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన జన జీవనం మరింత గందరగోళంగా మారనుంది. చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య వర్గాలు, వారిపై ఆధారపడి జీవన సమరం సాగిస్తున్న కోట్లాది మంది బడుగు జీవుల బతుకులు గందరగోళంగా మారనున్నాయి.
డిసెంబర్ ఒకటో తేదీన జీతాలు అందుకున్న ఉద్యోగులు బ్యాంకుల ముందు బారులు తీరితే సమస్య మరింత తీవ్రమౌతుంది. ఇప్పటికే ఈ విషయమై బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నోట్ల రద్దు ప్రకటన అనూహ్యంగా వెలువడటం వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణలూ బిజెపి నేతలను చుట్టుముడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీకి, ఆయన మంత్రివర్గ సహచరులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణకు సిద్ధపడాలి. ప్రజల చిల్లర కష్టాలు తీరేంత వరకు రద్దు చేసిన నోట్లను సాధారణ చలామణికి అనుమతించాలి. దీనికి భిన్నంగా మొండిగా వ్యవహరిస్తే ఇప్పుడు వ్యక్తమయిన నిరసన మరింతగా భగ్గుమనడం ఖాయం.

No comments:
Post a Comment