Saturday, 19 November 2016

|| ఆధునిక దృష్టి .. ఆయన అడుగుజాడ ||



                            కాలం కంటే ఎంతో ముందుచూపు గురజాడది. ఆయన ఆధునికుల్లో ఆధునికుడు. క్రాంతదర్శి. నవయుగ వైతాళికుడు. గురజాడ అప్పారావు జన్మించి ఇప్పటికి 150 ఏళ్ల పైన అవుతోంది. గతించి వందేళ్లు దాటుతోంది. అయినా, ఆయన అభిప్రాయాల్లో వ్యక్తం చేసిన, ఆశించిన సమాజం మనకు ఇంకా చాలా దూరంలోనే ఉంది.

'స్త్రీలు చదువుకోవాలి, మేల్కోవాలి. అన్యాయాన్ని ఎదిరించాలి. ఆధునిక మహిళ మానవ చరిత్రను తిరిగి రచించాలన్నారు ఆయన. గురజాడ ఆశించినట్టు స్త్రీలు ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు. ఉన్నతోద్యోగాలలో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. ఎంత చదువుకున్నా, ఎన్ని నేర్చినా స్త్రీలు ఇంకా అన్యాయాలకు, ఆసమానతలకు, అభద్రతకు గురవుతూనే ఉన్నారు. సమాజంలో స్త్రీకి రక్షణ కరువైంది. స్త్రీలు తమ సమస్యలను తెలివిగా, సమయస్ఫూర్తితో ఎలా పరిష్కరించుకోవాలో వారి రచనలు తెలియజేస్తాయి. స్వయంగా తామే ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవటానికి గురజాడ రచనలు స్ఫూర్తినిస్తాయి.
'ఎల్లలోకము ఒక్క ఇల్లై, వర్ణభేదములే లేని సమాజాన్ని వారు కాంక్షించారు. వారి దృష్టిలో మంచి, చెడు రెండే కులాలు, మరి సమాజంలో నానాటికీ కులభేదాలొక్కటే ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయో అందరికీ తెలుసు. మత విద్వేషాలతో దేశం ఎంత రగులుతుందో తెలుసు. కులమత భేదాలతో అతలాకుతలమైపోతున్న నేటి సమాజానికి గురజాడ కవితలు ఎంతో ప్రేరణనిస్తాయి. 
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా, వ్యాపార బంధాలుగా మారిపోతున్న నేటి సమాజానికి గురజాడ రచనల అవసరం ఉంది. మానవ సంబంధాలకు స్నేహం ప్రాతిపదిక కావాలని వారి రచనలన్నింటిలో చెప్పారు. స్త్రీ, పురుష సంబంధాలను గురించి వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంతో ఉదాత్తమైనవి. ఆ కాలానికి చాలా కొత్తవి. నేటితరానికి ఇవి ఎంతో అవసరమైనవి.
'ప్రేమనిచ్చిన ప్రేమవచ్చును' ఎంత గొప్ప భావన ఇది నిజంగా! ప్రేమతో, స్నేహంతో ఎటువంటి వారిలోనైనా మార్పు తేవచ్చు. 'భర్త దేవుడనే మాట పాత మాట. భర్తను ప్రాణమిత్రుడిగా భావించాలన్నారు ఆయన. ఇవి ఆనాటికి చాలా కొత్త భావాలు. సమాజంలో మానవుల మధ్యగాని, స్త్రీ, పురుషుల మధ్యగాని ప్రేమ అనే భావన సహజంగా ఉంటే అది అన్ని అసమానతలను పోగొడుతుందని గురజాడ విశ్వాసం. అవసరానికి మనుషులను ఉపయోగించుకోవటం, తర్వాత దూరంగా ఉంచడం అన్నది స్నేహం కానే కాదు. నిజమైన స్నేహం కోసం అవసరమైతే ప్రాణత్యాగమైనా చెయ్యాలి. స్నేహ మాధుర్యాన్ని చాటి చెప్పే గురజాడ వారి విశిష్ట రచన డామన్‌ - పితిమస్‌.
గురజాడ మహిళలు పురుషాధిక్యతకు తల వంచకుండా తాము ఎన్నుకున్న మార్గంలో తమ మాట నెగ్గించుకుని ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడం కన్పిస్తుంది. వీరు సూచించిన పరిష్కారాలు ఆచరణకి అసాధ్యమైనవి కావు. ఇలాంటివి స్త్రీలకు సహజమే ఆ పరిస్థితుల్లో అంతకన్నా వేరు పరిష్కార మార్గం లేదనిపించేటంత వాస్తవంగా ఉన్నాయి. 'దిద్దుబాటు' కథలో కమలిని తన భర్త తప్పుదారి పడుతున్నాడని గ్రహించి ఒక చిన్న లేఖ ద్వారా చక్కదిద్దుకోవటం ఆమె తెలివితేటలకు నిదర్శనం. నాటి సంస్కర్తలందరూ స్త్రీ విద్య ద్వారా ఆశించిన ప్రయోజనమిదే. చదువనేది స్త్రీకి జ్ఞానాన్నివ్వాలని, తమను తాము బాగుచేసుకునేందుకు దోహదం చేయాలని వారు ఆశించారు. గురజాడ స్త్రీ పాత్రలు తమకున్న పరిమితుల్లో ఎటువంటి హడావిడి చేయకుండా, పరిస్థితులతో రాజీపడకుండా పరిస్థితులపై గెలుపు సాధించారు. ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం అంటారు. కానీ దానికి చాలా ధైర్యసాహసాలు కావాలి. ఆ కాలపు స్త్రీ పాత్రలు ఆత్మాహుతినే పరిష్కారంగా ఎన్నుకుని ఆత్మగౌరవాన్ని నిలుపుకున్నాయి. పూర్ణమ్మ, కన్యక ఇటువంటి పాత్రలే!
భారతదేశానికి ఆర్థిక, సాంఘిక ప్రణాళిక నిచ్చింది గురజాడ దేశభక్తి గేయం. నిజమైన దేశభక్తి అంటే ఏమిటో నిర్వచించిందీ గేయం. 'దేశమంటే మట్టికాదోరు, దేశమంటే మనుషులోరు' అని గురజాడ రచించిన ఈ ఫంక్తులు ఎంత ప్రసిద్ధి పొందాయంటే దీని రచన జరిగి వందేళ్లు పైబడినా ఇప్పటికీ కవులు, రాజకీయ నాయకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు తమ ప్రసంగాల్లో సందర్భోచితంగా ఉటంకించకుండా ఉండరు.
దేశాన్ని గౌరవించటమంటే ఏమిటో ఈ గేయంలో గురజాడ కొత్త దృక్కోణంలో చెప్పారు. మానవులు దేశానికి ఉపయోగపడే గట్టి మేలును చేయాలి. పాడిపంటలు పండించటానికి శ్రమించాలని, కళలెల్ల నేర్చుకుని దేశి సరుకులను ఉత్పత్తి చేయాలని చెప్పారు.
డబ్బు లేని మనిషికి సమాజంలో గౌరవం లేదు. ధనమే అన్నింటికీ మూలం. భారతదేశం అన్ని దేశాలనూ మించి పోవాలంటే దేశీయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని, సంపదతోనే నరులకు కీర్తి, సంపదలు రెండూ ఉండవని చెప్పారు.
మనుషులందరూ కలిసి మెలిసి ఉంటే అది మంచి దేశం. దేశమంటే నదులు, పర్వతాలు, మట్టి, భౌగోళిక ప్రాంతాలే కాదు. దేశమంటే మనుషులు. మరి, అటువంటి దేశం ఎలా ఉండాలి? ఐకమత్యానికి ఆలవాలంగా ఉండాలి. ఐకమత్యం ఎలా వస్తుంది? మనుషులు సొంతలాభం కొంత మానుకుని స్వార్థం కొంచెం విడిచిపెట్టి, పొరుగువాడికి సహాయపడే మనస్తత్వం ఉండాలి. అన్నదమ్ముల్లా జనులందరూ మెలగాలి. అప్పుడే భారతదేశంలో ఐకమత్యం సాధ్యమవుతుంది. భారతదేశం ఒక పెద్ద వృక్షమైతే, దానికి ప్రేమ అనే పూలు పూయాలి. ఎల్లలోకం ఒక ఇల్లుగా ఉండాలనే గురజాడ ఆశయం వారి వసుధైక భావనను వ్యక్తం చేస్తుంది. సమకాలిక విద్యావిధానాన్ని విద్యారంగాన్ని ఎంతో లోతుగా పరిశీలించి గురజాడ వ్యక్తం చేసిన అభిప్రాయాలు కొన్ని నాటికే కాదు నేటికీ వర్తిస్తాయి.
'విద్యావిధానమే దుష్టము, లోపభూయిష్టము. అభిరుచి అన్నదే కలిగించటం లేదు. దీనికి నాయకత్వం వహించు వ్యక్తులు లేకపోవడం, దీనికి తోడు ఇంగ్లీషుతో పోటీ' ఇది సమకాలిక విద్యావిధానంపై గురజాడ విమర్శ. తెలుగు భాషాధ్యయనంలో అభివృద్ధి సుతారం కన్పించట్లేదని గురజాడ వ్యధ చెందారు. ప్రజలందరినీ విద్యావంతులను చేయటమనేది మాతృభాషల అభివృద్ధి, ఉత్పన్నమౌతున్న సారసత్వం మీద ఆధారపడి ఉంటుంది. మాతృభాషలను బోధించేవారి భుజస్కంధాలపై మహత్తర బాధ్యత ఉందని వారు భావించారు. నేడు పాఠశాలల్లో, కళాశాలల్లో మాతృభాషల స్థితి ఏమిటో అందరికీ తెలుసు. వీరు నాడు చేసిన సూచనలు నేటికీ అవసరమే! 
పాఠ్యపుస్తకాల నిర్ణయ సంఘంలో కంఠతా పట్టడం వల్ల వ్యాకరణ జ్ఞానం రాదు. భాషా పరిశీలన వల్ల వ్యాకరణ జ్ఞానం కలుగుతుంది. అందుకోసం విద్యార్థులు దోషాలు లేని పాఠ్యపుస్తకాలు చదవాలి' ఇదెంత నిజం! పాఠ్యపుస్తకాలలో నేడు ఎన్ని భాషాదోషాలుంటున్నాయో, ముద్రణ దోషాలుంటున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అప్పటికీ, ఇప్పటికీ విద్యార్థులు వ్యాకరణ సూత్రాలను కంఠస్థం చేస్తూనే, పరీక్షలలో మార్కులు సాధిస్తున్నారు. సూత్రాలు కంఠస్థం చేయించటమనే అర్థంలోనే బోధన సాగుతోంది. వాడుక భాషకు ప్రత్యేక నిఘంటువు తయారుకావాలని చెప్పటంలోనే గురజాడ శాస్త్రీయ దృష్టి ఎంత లోతైనదో తెలుస్తుంది. శిష్టవ్యవహారిక భాషకు నిఘంటువు తయారు కావలసిన అవసరాన్ని నాడే గుర్తించారు. వారు ఈ నిఘంటువు తెలుగు వారికే కాక తెలుగు నేర్చుకునే విదేశీయులకు కూడా ఉపకరిస్తుందని భావించారు.
ఉపాధ్యాయులు ఆదర్శప్రాయంగా ఉండాలి. మహోన్నత శీలము, వ్యక్తిత్వం, గుణసంపద అవసరం అన్నారు గురజాడ ఉపాధ్యాయులు గురించి ఇదెంత నిజం! ఉపాధ్యాయులు వ్యక్తిత్వం ఉన్నతమైనదైతే, విద్యార్థులు వారిననుసరిస్తూ తమ వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోగలరు. భావిభారత పౌరులు కాగలరు. ఆరోగ్యకరమైన, ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర.
గురజాడ కఠోర పరిశ్రమకు, విస్తృత అధ్యయనానికి, నిశిత పరిశీలన దృష్టికి విశ్లేషణా శక్తికి నిలువెత్తు నిదర్శనం. డిసెంట్‌పత్రం. మద్రాసు యూనివర్సిటీ 1914లో విద్యార్థుల వ్యాసరచనలో ఉపయోగించవలసిన ప్రాచీన, వర్తమాన రూపాలను తయారు చేయమని ఆదేశించినప్పుడు అందులో సభ్యులుగా ఉన్న గురజాడ అప్పారావు, ఉపసంఘం వారు తయారుచేసిన పదపట్టికలకు సంబంధించి వారితో భేదాభిప్రాయాలు వచ్చి తన అసమ్మతిని వ్యక్తం చేస్తూ తనవాదాన్ని సమర్థిస్తూ డిసెంట్‌పత్రాన్ని సమర్పించారు. గిడుగు వివిధ ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి వ్యవహారిక భాషా ప్రాచుర్యాన్ని ప్రజలకు తెలియజేస్తే, గురజాడ తన రచనల ద్వారా వాడుక భాషను ప్రచారంలోకి తెచ్చారు.
గురజాడ దూరదృష్టి అసాధారణం. స్త్రీల సమస్యలను నూతన దృక్పథంతో పరిశీలించి వారి జీవితం వంటపనికే అంకితమైపోతుందని వ్యథ చెందారు. 'సౌధామిని' అనే వారి అసంపూర్ణ నవలలో స్త్రీలకు వంట చాకిరీ నుంచి విముక్తి కావాలని చెప్పారు. స్త్రీలు పాశవిక శక్తిని ఎదుర్కోవటానికి ఖడ్గవిద్యను నేర్చుకోవాలని చెప్పారిందులో. ఈ భావాలు నాటికి చాలా కొత్తవి. ఎవరికీ ఊహల్లోకి కూడా రానివి.
నిరంతర పరిశీలనా శీలి, పఠనశీలి గురజాడ అప్పారావు. ఇటువంటి గొప్పవ్యక్తులు క్షణాన్ని కూడా వృథా చెయ్యరు. కాలం విలువ వారికి తెలిసినట్లు మరెవరికీ తెలియదు. అనారోగ్యం బాధిస్తున్నా వారి సాహిత్య కృషి ఆగలేదు. ఎప్పుడూ ఏదో చదువుతూ రాస్తూ సాహిత్య చర్చలు చేస్తూనే ఉండేవారు. గురజాడ రచనలు రాసిలో తక్కువైతేనేం, వాసిలో తెలుగు సాహిత్యమున్నంతవరకూ చిరస్థాయిగా ఉండిపోతాయి.

(ఈనెల 30న గురజాడ వర్థంతి) 
- చెంగల్వ బొడ్డపాటి రామలక్ష్మి

No comments:

Post a Comment