Wednesday, 2 November 2016

# జన చైతన్యమా... వంచనా? #


రాష్ట్రంలో అధికార పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ జన చైతన్య యాత్రలను ప్రారంభించింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, తెలుగుదేశం పార్టీ నేతలు ఈ యాత్రల్లో పాల్గొంటు న్నారు. రాష్ట్ర ప్రజానీకం వీరిని నమ్మి పట్టం కట్టి రెండున్నరేళ్లు అయింది. ఈ కాలంలో కోటలు దాటే మాటలు తప్ప ప్రభుత్వం సాధించిందేమిటని ప్రశ్నిస్తే ఈ యాత్రల్లో పాల్గొనే నేతలకు చెప్పడానికి ఒక్క ఘన కార్యమూ దొరకదు. ఓటుకు నోటు కేసు తరువాత రాష్ట్ర ప్రయోజనాలు పెద్ద ఎత్తున విస్మరణకు గురవుతు న్నాయన్న విమర్శలూ తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. రాష్ట్ర పురోగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే సామెతను తలపిస్తోంది. ప్రజానీకం ఎదుర్కొం టున్న సమస్యలకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఇది చాలదన్నట్లు భూ సమీకరణ పేరుతో ఎక్కడికక్కడ కొత్త సమస్యలను సర్కారే సృష్టిస్తోంది. ఇక సమైక్య రాష్ట్ర విభజన సందర్భంగా పొందిన హామీలూ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. విభజన సందర్భంగా తలెత్తిన సమస్యల పరిష్కారం ఊసూ కనపడటం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేపట్టిన జనచైతన్య యాత్రలు ఎందుకోసమన్న ప్రశ్న సహజంగానే ముందుకు వస్తుంది.

రాష్ట్ర విభజన సందర్భంగా అత్యంత కీలకంగా మారిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తుంగలో తొక్కాయి. పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయించుకోవడంలో ఘోర వైఫల్యం పొందిన ఘనత చంద్రబాబుది! రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టడానికి బదులుగా ప్యాకేజీ పుచ్చుకుని సరిపుచ్చుకుంటా మంటూ ఆయన నీరు గారిన తీరు రాష్ట్ర ప్రజల కళ్లముందే ఉంది. పోనీ ఆ ప్యాకేజీకి, ప్యాకేజీలో భాగంగా విడుదల చేస్తామంటున్న నిధులకు చట్టబద్ధ ఏమన్నా ఉందా అంటే అదీ లేదు. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చినా ఆయన పట్టించుకున్న దాఖలాలేమీ లేవు. పైగా ఈ పర్యటనలో కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరూ వివాదాస్పదంగా మారింది. లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే వడ్డించేశామన్న కేంద్ర సర్కారు ప్రకటనలు తప్ప, నిజంగా వడ్డించారా? వడ్డిస్తే ప్రజలకెందుకు చేరలేదు, మధ్యలోనే ఎవరైనా భోం చేశారా అన్నదానికి లెక్కపక్కా లేని స్థితి!

నాలుగు లక్షల కోట్ల రూపాయలతో ఢిల్లీ నగరాన్ని తలదన్నేలా రాష్ట్ర రాజధానిని నిర్మించడానికి సహకరిస్తామని స్వయానా ప్రధాని చేసిన ప్రకటనకే ఇప్పటి వరకు దిక్కు మొక్కూ లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రత్యేకహోదా అంశం పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో లేదంటూ తమ వైఫల్యానికి సాకుగా చూపుతున్న, ఆ చట్టంలోనే విస్పష్టంగా పేర్కొన్న పోలవరం ప్రాజెక్టును సకాలంలో సాకారం చేసే చేవ లేకపోవడం విచిత్రమే! ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చేసిన వాగ్దానం ఏలికలకు ఎరిక లేకుండా పోయింది. కొత్త ఉద్యోగాలు లేకపోగా బాబు వచ్చాక వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. బాబు వస్తే జాబు వస్తుందన్న హామీ గాలికి ఎగిరిపోయింది. నిరుద్యోగ భృతి హామీకి అతీగతీ లేదు. అధికారంలోకి వస్తే అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు. అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఎన్నేళ్లు ఉద్యోగం చేసినా వారంతేనని వారిని రెగ్యులరైజ్‌ చేయలేమని ఇప్పుడు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పేశారు. వ్యవసాయానికి తదనుబంధ రంగాలను ముడివేసి రెండంకెలల వృద్ధిని చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా రాష్ట్రంలో సగటు రైతు నేటికీ రూ.1.50 లక్షల అప్పు భారంతో కుంగిపోయి ఉన్నాడని తాజా సర్వేలు, నివేదికలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. దాదాపు మూడేళ్ల పాలనలో వెలగపూడిలో ఐదంతస్తుల తాత్కాలిక సచివాలయ భవనం ఒక్కటే సాకారమైంది. అదికూడా అరకొర వసతులతోనే! ఈ వాస్తవాలను కప్పిపుచ్చి జన చైతన్య యాత్రల్లో తిమ్మిని బమ్మిని చేసే ప్రచారాన్ని చంద్రబాబు ప్రారంభించారు. పేదల వద్ద అంతోఇంతో ఉన్న భూమినీ కాజేసి కార్పొరేట్లకు అప్పగిస్తూ పేదరిక నిర్మూలనంటూ కొండంత రాగం తీయడం ప్రారంభించారు. ఎస్‌సి, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల కేటాయింపునకు బడ్జెట్‌లోనే చెల్లుచీటి చెబుతూ పదివేల రూపాయల కనీస ఆదాయం అంటూ మాయమాటలు చెబుతున్నారు. విద్య, వైద్యం, కొండెక్కికూర్చుంటే అందరికీ విద్య, ఆరోగ్యమనడం వంచన చేయడం కాక మరేమిటి? అందుకే .. ఇవి జన చైతన్య యాత్రలు కాదు. ప్రజలను మభ్య పెట్టే మాయదారి యాత్రలు!    (ప్రజాశక్తి)

No comments:

Post a Comment