Wednesday, 2 November 2016

|| మేడిపండు అమెరికా ||



అమెరికావాళ్లు చిత్రమైనవాళ్లు. వాళ్ల అభివృద్ధిచూసి, వాళ్లకున్న స్వేచ్ఛ చూసి లోకమంతా కళ్లల్లో నిప్పులు పోసుకుంటుందని వాళ్లకు అనుమానం. అగ్రరాజ్యంగా తాము కొనసాగకపోతే, తమకే కాదు ప్రపంచానికే ప్రమాదం అని వాళ్లు గట్టిగా నమ్ముతారు. తమకు నాయకత్వం వహించేవారు గట్టివాడు, నిర్దాక్షిణ్యమైనవాడు కాకపోతే, తమ భద్రతకు ప్రమాదం అని భయపడుతుంటారు. అదే సమయంలో, తాము నమ్మే విలువలు ఉదాత్తమైనవని, తమ జీవనసరళి అత్యుత్తమ ప్రజాస్వామ్యమని గాఢంగా విశ్వసిస్తుంటారు. ఆధిక్యభావం వల్ల కలిగే అహంకారానికీ, ప్రపంచాధికారం వల్ల కలిగే ఆభిజాత్యానికీ, ఆదర్శంగా కనిపించాలన్న తాపత్రయానికీ మధ్య ఒక్కోసారి పొంతన కుదరదు. అన్నిటా ఎంతో ఎత్తులో ఉన్నామనుకోవడం వల్ల జ్ఞానంలో, అవగాహనల్లో కూడా తమదే పైచేయి అనుకుంటుంటారు. జ్ఞానమే అధికారం అన్నది మాటవరసకే కానీ, అధికారమే జ్ఞానం అన్నది వారి రహస్యాభిప్రాయం.

                   అమెరికా స్వాతంత్య్రం పొంది దాదాపు రెండున్నర శతాబ్దాలు అవుతుంటే, వందేళ్ల కిందటి దాకా అక్కడ ఆడవాళ్లకు ఓటుహక్కు లేదు. యాభై అరవై ఏళ్ల కిందటి దాకా కూడా బస్సుల్లో నల్లవాళ్లు వెనకసీట్లలోనే కూచోవాలి. భారతదేశం, శ్రీలంక, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, చివరకు పాకిస్థాన్‌ కూడా మహిళా దేశాధినేతలను ఎంచుకున్నాయి కానీ, అమెరికాకు ఇంకా మహిళా అధ్యక్షురాలు రావలసే ఉన్నది. అన్నిటికి మించి ఆశ్చర్యం కలిగించేది, ఇప్పటికీ, అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేస్తున్న ముఖ్య అంశాలలో గర్భస్రావ హక్కు ఒకటి. అనేక చిన్న చిన్న సమాజాలు కూడా ఈ విషయంలో స్త్రీలకు రక్షణలు కల్పించాయి. ప్రభుత్వం సంక్షేమబాధ్యతలు తీసుకోవడం అంటే సగటు అమెరికన్‌కు ఏమంత సదభిప్రాయం ఉండదు. పన్ను చెల్లింపుదారుల హక్కులే పౌరహక్కులుగా భావిస్తుంటారు.

                  వస్తు బాహుళ్యమూ, అవకాశాల బాహుళ్యమూ అందుబాటులో ఉండడమే స్వేచ్ఛ అనుకునే దేశంలో, రాజకీయ స్వేచ్ఛ మాత్రం రెండు పార్టీల మధ్య పెండ్యులమ్‌లా మారిపోయింది. వేరే పార్టీలు ఉండకూడదనీ కాదు లేవనీ కాదు కానీ, రిపబ్లికన్‌ పార్టీ, డెమొక్రటిక్‌ పార్టీ సుదీర్ఘకాలంగా అమెరికన్లకు అందుబాటులో ఉన్న ద్వంద్వంగా స్థిరపడిపోయాయి. రెంటి మధ్య తేడా ఎంత అంటే, చాలానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ, సారాంశంలో ఏమంత లేనట్టు తెలుస్తుంటుంది. అమెరికన్‌ అగ్రరాజ్య దురహంకారానికి, కర్కశత్వానికి రిపబ్లికన్‌ పార్టీ వేదికగా మారిపోయింది. మతపరంగానూ, కుటుంబ విలువల పరంగానూ సంప్రదాయవాదులంతా ఈ పార్టీనే ఆశ్రయిస్తారు. అమెరికన్‌ ప్రజాస్వామ్యం గొప్పగా చెప్పుకునే బాహుళ్య సంస్కృతికి కూడా వీరు ఏమంత సుముఖులు కారు. ఉపాధి కోసం అమెరికా నేల మీదికి వలస వస్తున్న వివిధ దేశాలవారు అమెరికన్‌ పవిత్రతను భంగపరుస్తున్నారని వారు భావిస్తారు. అవుట్‌సోర్సింగ్‌ అమెరికా ఆర్థిక వ్యవస్థ పుష్టికోసమే జరుగుతున్నా సరే, ఆర్థికంగా ఏమంత బలంగా లేని దేశాలు ఖర్చు పెట్టి తీర్చిదిద్దుకున్న బుద్ధిజీవులను, నిపుణులను కారుచవుకగా పొందుతున్నప్పటికీ, సరిహద్దుల అవతల నుంచి వస్తున్న మెక్సికన్లే ఇళ్లలో సహాయకులుగానూ, నిర్మాణ కార్యక్రమాల్లో కాయకష్టం చేసే కార్మికులుగానూ పనిచేస్తూ శ్రమను ధారపోస్తున్నా సరే, ఇమ్మిగ్రెంట్స్‌ అంటే రిపబ్లికన్లకు వ్యతిరేకత. ప్రపంచంలో ఎప్పుడూ ఎవరో ఒకరిని అదుపుచేస్తూ, ఏదో ఒకచోట యుద్ధరంగాన్ని నిర్వహిస్తుంటే తప్ప, అమెరికా నేల మీదికి ముప్పురాకుండా నివారించలేమన్నది రిపబ్లికన్లు బలంగా నమ్ముతారు.

                  యథాతథవాదానికి, మితవాదానికి, తీవ్ర అమెరికనిజానికి రిపబ్లికన్‌ పార్టీ గుర్తు అయితే, అందుకు కాస్త ఎడంగా ఉండే ఉదారవాద విలువలకు తాను వేదికనని డెమొక్రటిక్‌ పార్టీ భావిస్తుంది. అమెరికాలోని స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలు యథాతథ విలువలను వ్యతిరేకించే వ్యక్తులను, శక్తులను అనుమతిస్తాయి, ఉద్భవింపజేస్తాయి కాబట్టి, అక్కడ అభిప్రాయాల ఘర్షణ కూడా ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉంటుంది. మార్టిన్‌ లూథర్‌కింగ్‌, మాల్కమ్‌ ఎక్స్‌ వంటి సామాజిక పోరాటవాదులు, నోమ్‌చామ్‌స్కీ, హోవర్డ్‌ జిన్‌ వంటి మేధావులు, ట్రేసీ చాప్‌మాన్‌, బాబ్‌డిలాన్‌ వంటి కవిగాయకులూ, మహ్మదాలీ వంటి క్రీడాకారులూ - కూడా ఆ సమాజంలోనే నిలబడి మాట్లాడారు, మాట్లాడుతున్నారు. అమెరికన్‌ కర్కశ భావాలకు భిన్నంగా, ఉదారంగా వ్యవహరించే రకరకాల శ్రేణుల ప్రభావం, ప్రాబల్యం తక్కువదేమీ కాదు. నిజానికి అమెరికన్‌ ప్రజాస్వామ్యానికి లభించే నైతికతకు ఈ మోస్తరు భావాలే పునాది. ఈ భావాలకు డెమొక్రటిక్‌ పార్టీ ప్రతినిధి అనుకుంటే పొరపాటు.

                  రిపబ్లికనిజాన్ని వ్యతిరేకించే విశాల శ్రేణులందరికీ అది ఒక గత్యంతరం లేని వేదిక. డెమొక్రటిక్‌ పార్టీని మధ్యేవాద పార్టీ అని అనుకునే వారుంటారు, వామపక్షపార్టీ అని విమర్శించేవారూ ఉన్నారు. నిజానికి అది ఒక ఉదార మితవాదపార్టీ మాత్రమే. ఇంకో రకంగా చెప్పాలంటే, అమెరికన్లకు ఒక ప్రత్యామ్నాయాన్ని అభినయించి, తద్వారా ప్రజాస్వామ్య సంతృప్తిని కలిగించే పార్టీ మాత్రమే.

                  ఇద్దరూ ఇద్దరే అని మనం దూరం నుంచి అనుకుంటున్న రిపబ్లికన్‌-డెమొక్రాటిక్‌ ద్వయం మధ్య నిజానికి ఎంత దూరం ఉండగలదో ఇప్పుడు జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు నిరూపించాయి. కుడివైపున మరింత కుడిగా ఉండేది రిపబ్లికన్లు అనుకుంటే, ఆ కుడితనాన్ని మరింత లాగి కొసకు తీసుకువెళ్లినవాడు రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌. హిట్లర్‌ ఇంత మొరటుగా మాట్లాడేవాడో లేదో మనకు తెలియదు. కానీ రిపబ్లికన్‌ భావజాలం కప్పుకునే మేలిముసుగులు ఏవైనా ఉంటే వాటిని అతడు విసిరికొట్టాడు. అతని ప్రచార ప్రసంగాలు చూసి సభ్య అమెరికన్లు కించపడ్డారు. అతను హిల్లరీతో కలసి చేసిన పోటీ ప్రసంగంలోని అధికప్రసంగాలను చూసి, అమెరికన్‌ ప్రజాస్వామ్యం దిగజారిపోయిందని లోకమంతా బాధపడింది. అమెరికన్‌ సమాజంలో ఉండిన తీవ్ర మితవాదులను ఉద్దేశించి మాట్లాడడం కాదు, తన వాచాలత్వానికి ద్వేషభాషిత్వానికి తగిన నియోజకవర్గాన్ని రూపొందించుకుంటూ ప్రచారం సాగించాడు. ఒకే ఆధిపత్యజాతి, సమస్త మైనారిటీలను తొక్కిపట్టి చేయగలిగేదే సత్పరిపాలన- అన్న ఫాసిస్టు నీతిని ట్రంప్‌ నిర్మొహమాటంగా ఆశ్రయించాడు. అందువల్లనే, అమెరికాలోని ప్రవాసులు, బలహీనులు, భిన్నాభిప్రాయాలవారు అందరూ భవిష్యత్తుపై భయంతో, నిస్సహాయతతో హిల్లరీ విజయం సాధించాలని కోరుకునే పరిస్థితి వచ్చింది.

                  మతోన్మాదమో, జాతీయోన్మాదమో, అగ్రవాదమో- గాలిబుడగలా వచ్చి పోయేవి కావు. వాటిని పెంచి పోషించే వేదికలు దొరికినప్పుడు సమాజం మొత్తం ఆ భావాలతో విషపూరితం అవుతుంది. సమాజం, వ్యవస్థ నరనరాన, మూలమూలలా ఆ భావాల ప్రతినిధులు పనిచేస్తుంటారు. అమెరికా కేంద్ర నేరపరిశోధనా సంస్థ ఎఫ్‌బీఐ- కీలకమయిన ఈ ఎన్నికల సమయంలో రిపబ్లికన్‌లకు అనుకూలంగా పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని వస్తున్న ఆరోపణలు తీవ్రమైనవి. ఎఫ్‌బీఐ స్వయంగా శ్వేతజాతి అహంకారులతోను, ఛాందసవాదులతోను నిండి ఉన్నదని, సమయం వచ్చినప్పుడు వారు ట్రంప్‌ లాంటి వారి అవతరణకు తమవంతు సాయం చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. డెమొక్రాటిక్‌ పార్టీ అటువంటి నెట్‌వర్క్‌ను, భావజాల వ్యాప్తిని కలిగి ఉండడం ఊహించలేము. సగటు అమెరికన్‌లో ఉండే రిపబ్లికనిజం- జాతీయ అమెరికనిజం- ట్రంప్‌ వంటి వారికి అనాయాస ఆదరణ ఇస్తున్నది. ట్రంప్‌వైపే గాలి మళ్లినట్టయితే, భవిష్యత్తు ఊహించలేనంత భయానకం. ప్రపంచపటంలో అమెరికాకు కొత్త సవాళ్లు ఎదురవుతున్న దశలో 1930ల నాటి జర్మనీని అతను ఆవాహన చేయగలడు. అతను వాచాలుడే తప్ప ఏమీ చేయలేడని, పరస్పరాధారితమైన ప్రపంచంలో అతను ఎవరినీ వెలివేయలేడని, ఏ కొత్త యుద్ధాలూ రచింపలేడని ఆశావాదులు అంటున్నారు కానీ, మితవాదపు తీవ్రవాదం- కేవలం మాటలకే పరిమితం కాబోదు. భారతదేశమే అందుకు ఉదాహరణ.    - కే. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి)

No comments:

Post a Comment