ఈమధ్యకాలంలో 68 రోజులు కేవలం మంచినీరు తాగి ఉపవాసముండి మరణించిన ఆరాధన తల్లిదండ్రుల మీద కేసు పెట్టడం జరిగింది. ఆరాధన చనిపోవటానికి దారితీసిన కారణాల పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రానప్పటికీ 13 సంవత్సరాల అమ్మాయి 68 రోజులు ఉపవాసం చేస్తే ఏ కారణం వల్ల చనిపోయి ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు.
పిల్లల్ని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినందుకు, అనవసరమైన బాధకు గురిచేసినందుకు గాను తల్లిదండ్రుల మీద జువైనెల్ జస్టిస్ యాక్ట్ 2016, సెక్షన్ 75 క్రింద కూడా కేసు బుక్ చేశారు. ఆరాధన తల్లిదండ్రులు, మత పెద్దలు, అక్కడి సమాజం ఆరాధన తన ఇష్టప్రకారమే 68 రోజుల ఉపవాసం చేసిందని, దీని మీద ఎవరి ఒత్తిడీ లేదని చెప్పడం ఆశ్చర్యం కల్గిస్తుంది. భరించలేని నొప్పితో బాధపడేవారికి సైతం కారణ్య మృత్యువు ప్రసాదించడానికి మన న్యాయ స్థానాలు సుముఖంగా లేని సమయంలో మతం, ఆచారాల పేరుతో ఒక 13 సంవత్సరాల బాలిక మృత్యుముఖంలోకి వెడుతుంటే సమాజం తెలిసి తెలిసి నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. శోభా యాత్రలు, బాల తపస్వి అనే బిరుదులిచ్చి ఇటువంటి ప్రాణాంతక ఆచారాలకు ప్రజామోదం పలికారు. ఆరాధనకు ఇటువంటి ఉపవాసాలు అలవాటేనని, ఆమె చనిపోతుందని ఊహించలేదని అంటున్నారు. సింహం బోనులోకి చిన్న పిల్లల్ని పంపి అది దాడి చేస్తుందని మేము ఊహించలేదన్నట్టు ఉంది వాళ్ళ మాటలు వింటే. కేవలం మంచినీరు తాగి 68 రోజులు ఉపవాసం చేస్తే పిల్లలు దాదాపు బతికే అవకాశం లేదనేది ఊహకు అందని విషయం కాదు. బాలల రక్షణకు అది కూడా బాలికల రక్షణకు ఎన్ని చట్టాలు ఉన్నా, మన బాలికలను బతికించుకోవడానికి అవి సహాయ పడలేకపోయాయి.
దారిలో పెట్టడానికనో, ఎవరి మీద కోపమో పిల్లల మీద తీర్చుకోవడానికనో, దేవుణ్ణి సంతోషపెట్టడానికనో లేక దెయ్యాన్ని పారద్రోలడానికనో, ఇలా అనేక కారణాల వల్ల పిల్లలు శోషణకు గురవుతున్నారు. ఆరాధన మృతి పట్ల ఈ ఆసాధరణ మౌనానికి వెనక రాజకీయ, మతపరమైన, సామాజిక కారణాలున్నాయి. కలుగజేసుకుంటే మతపరమైన సున్నితమైన అంశాలలో జోక్యం చేసుకున్నం దుకు ఆ సామాజిక వర్గం నుంచి పెద్దయెత్తున వ్యతిరేకత ఎదురవుతుందని భయం.
|| భారతదేశంలో శిశు శోషణ ||
బాల శోషణకు ఆరాధన సంఘటన ఒక పార్శ్యం మాత్రమే. మనం దాని ఉనికిని కూడా గుర్తించడానికి ఇష్టపడని విషయాలలో ఒకటి మన సమాజంలో ప్రతిచోటా కనిపించే బాల శోషణ. పిల్లల పట్ల ఎటువంటి హింసాత్మక చర్య అయినా సరే బాలల హక్కుల ధిక్కరణ క్రిందకు వస్తుంది. అది శారీరక హింస కావచ్చు లేదా లైంగిక, మానసిక హింస కావచ్చు. పిల్లల పట్ల నిర్లక్ష్యం కూడా పిల్లలపై శోషణ క్రిందకు వస్తుంది. పిల్లల అవసరాలను నిర్లక్ష్యం చేయడం, అరక్షిత ప్రాంతాలలో లేదా పరిస్థితులలో వారిని వంటరిగా వదిలేయడం, తిట్టడం, ఇతరులతో పోల్చి వారిని అవమాన పర్చడం, ఇవన్నీ కూడా బాల శోషణ క్రిందకు వస్తాయి. మన జనాభాలో పిల్లలు 39 శాతం ఉంటారు. జంతువులు, వృక్షాల తర్వాత వారి హక్కులను కాపాడుకోవడానికి ఇంకొకరి మీద ఆధారపడే ప్రాణులు శిశువులు మాత్రమే. స్త్రీశిశు సంక్షేమ విభాగం వారి గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఏదో ఒక విధమైన శోషణకు గురవుతున్నారు. 4-18 వయస్సు గల పిల్లల్లో 53 శాతం మంది పిల్లలు లైంగిక హింసకు గురవుతుండగా వీరిలో 50 శాతం కంటే ఎక్కువ మగపిల్లలు ఉండటం గమనార్హం. మగ పిల్లల్లో 5-12 ఏళ్ళలోపు పిల్లలే ఎక్కువ లైంగిక శోషణకు గురవుతున్నారు. వారి మీద ఆ చర్యకు పాల్పడే వారిలో 50 శాతం పైగా కేసుల్లో సొంత తండ్రులే. 60 శాతం మంది ఆడపిల్లలు 5-16 ఏళ్ళలోపు లైంగిక శోషణకు గురవుతుండగా 80 శాతం సందర్భాల్లో నేరస్తులు రక్తసంబంధీకులే. బాల శోషణ ఏదో ఒక రూపంలో కనిపిస్తున్నప్పటికీ చాలా తక్కువ కేసులు నమోదవుతు న్నాయి. లైంగిక శోషణను అరికట్టడానికి చట్టాలున్నాయి. అలాగే విద్యాసంస్థలలో శారీరక శోషణను ఎదుర్కోవటానికి కూడా చట్టాలున్నాయి. కానీ నాలుగు గోడల మధ్య సొంత ఇంట్లో పిల్లల మీద జరిగే వివిధ రకాల శోషణను అడ్డుకోవడానికి చట్టాలు లేవు. ఇంట్లో పిల్లల మీద జరిగే హింసను హింసగా గుర్తించడానికి కూడా మన సమాజం ఇష్టపడదు. ఇటువంటి శోషణకు గురైన పిల్లలు వారి ఎదుగుదలలో చాలా సమస్యలను ఎదుర్కొంటుంటారు. మెదడు అభివృద్ధి దెబ్బ తింటుంది. చదువులో వెనకబడతారు. సహజంగా ఉండే పోటీతత్వం, జిజ్ఞాస తగ్గడంవల్ల జీవితంలో సరిగ్గా స్థిరపడలేరు.
|| రాజ్యాంగంలో బాలల హక్కులు ||
బాలల హక్కులను కాపాడటానికి రాజ్యాంగం ప్రత్యేకమైన అవకాశాలను వారికి కల్పించింది. రాజ్యాంగంలోని 14, 15, 15(ఎ), 19(10)(ఎ), 21, 21(డి), 23, 24, 39(బి), 39(డి) అధికరణలు ప్రతి పౌరుడికీ స్వేచ్ఛగా, సురక్షితంగా, ఆరోగ్యంగా జీవించే హక్కును కల్పిస్తున్నాయి. ఇవి బాలలకు కూడా లభిస్తాయి. ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల తీర్మానాన్ని భారతదేశం కూడా 1992లో ఆమోదించింది. దీని ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలను బట్టి బాలల హక్కులను సంరక్షించేందుకు భారతదేశం కట్టుబడి ఉంది. పిల్లలను లైంగిక నేరాల నుంచి కాపాడటానికి ఉద్దేశించబడిని ''ది ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్'' 2012 నవంబరు 14 నుంచి అమలులోకి వచ్చింది. లైంగిక వేధింపులు, పిల్ల మీద లైంగిక దాడులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలుంటాయి. వారి చుట్టుపక్కల పిల్లల మీద లైంగిక వేధింపులు జరిగితే దాన్ని కచ్చితంగా సంబంధిత అధికారులకు రిపోర్టు చెయ్యాలి. అలా రిపోర్టు చెయ్యలేని వారిపై ఈ చట్టంలోని సెక్షన్ 21(1) పరిధిలో చట్టపరమైన చర్యలు చేపట్టవచ్చు.
ఐక్యరాజ్యసమితి బాలలహక్కుల కమిటీ నిర్దేశాలను బట్టి ప్రతి దేశం పిల్లలకు హాని కలిగించే మతపరమైన ఆచారాలు, ఇతర సామాజిక దురాచారాల నుంచి వారిని కాపాడటానికి ప్రత్యేకమైన చట్టాలను రూపొందించాలి. విద్యాసంస్థల్లో పిల్లల మీద శారీరక హింసకు పాల్పడిన వారికి రూ.50 వేలు జరిమానా, మూడు సంవత్సరాల కఠినమైన జైలు శిక్ష విధించవచ్చు. పిల్లలను అమ్మినవారు లక్ష రూపాయల జరిమానా, ఐదేళ్ళ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.
|| బాల శోషణ నివారణా చర్యలు ||
చట్టసభల్లో చట్టాలు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటి ప్రభావం పిల్లల మీద ఏ విధంగా పడుతుందో ఆలోచించాలి. ఈ రోజు చేసిన చట్టాలు రేపటి పౌరుల మీద ఎలాంటి ప్రభావం కలిగిస్తాయో చర్చించాలి. బాలల సంరక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలను చిత్తశుద్ధితో అమలు చెయ్యాలి. సామాన్య ప్రజలలో బాలల హక్కుల పట్ల అవగాహన కలిగించాలి. బాలల పట్ల హింస ఆమోదయోగ్యం కాదని అందరికీ తెలియజెయ్యాలి. విద్యాసంస్థల్లో కూడా బాలల హక్కుల పట్ల పిల్లల్లో అవగాహన కల్పించాలి. వారి మీద జరిగిన హింసను మౌనంగా సహించకుండా దాని గురించి తనకు అందుబాటులో ఉన్న అధ్యాపకులు లేదా పెద్దవారికి చెప్పుకునేటట్టు వారిని ప్రోత్సహించాలి. ఆర్థిక పరిస్థితుల వల్ల లేక ఇతర కారణాల వల్ల పిల్లలకు సరైన సంరక్షణ లభించక పోతే సమాజం, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఆ పిల్లల సరరక్షణ బాధ్యత తీసుకుని వారికి సురక్షితమైన బాల్యాన్ని అందించాలి. కొన్ని వందల ప్రభుత్వేతర సంస్థలు శిశు సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి. ఆ సంస్థలన్నీ తమ పనులను అనుసంధానం చేసుకుంటే శిశు సంక్షేమం కోసం ఉద్దేశించబడిన ప్రభుత్వ పథకాలు పిల్లలందరికీ చేరేటట్టు మెరుగైన చర్యలు తీసుకోవచ్చు.
''ఒక దేశ అభివృద్ధి ఆ దేశంలోని పిల్లల అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. బాలలందరికీ వారి శారీరక, మానసిక అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల అవకాశాలను కల్పించడం మన ప్రథమ కర్తవ్యం.'' - సంజీవనీ కుసుమ్

No comments:
Post a Comment