Wednesday, 23 November 2016

|| ఒంటెత్తు పోకడతో ఒంటరౌతున్న బిజెపి ||



           పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు అంశంపై ఆందోళనలు మిన్నంటాయి. ఉభయ సభలు స్తంభించాయి. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు తుడిచి పెట్టుకు పోతున్నాయి. విపక్షాలన్నీ ఉమ్మడిగా పోరు సాగిస్తున్నాయి. ప్రభుత్వం సమాధానమివ్వడానికి సిద్ధపడటం లేదు. ప్రధాన మంత్రి పార్లమెంటుకు ముఖం చాటేస్తున్నారు. సీనియర్‌ మంత్రు లు సమస్యను పక్క దారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.


|| నిర్మాణాత్మక చర్యలు శూన్యం ||

విపక్షాలు పార్లమెంటులో ఆందోళన చేస్తున్నాయి. కోట్లాది ప్రజల సమస్యను పార్లమెంటు వేదికగా లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దీనికి ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రపు సమావేశాలకు పరిమితమైంది. పార్లమెంటులో ప్రధాని మోడీ అధ్యక్షతన సీనియర్‌ మంత్రుల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రజల కష్టాల గురించి, వారెదు ర్కొంటున్న ఇబ్బందులు గురించి చర్చ నామమాత్రపు స్థాయిలోనే జరిగింది. పార్లమెంటు ఉభయ సభల్లో చర్చల్లో పాల్గొనే మంత్రులు ప్రభుత్వం తరపు గళాన్ని గట్టిగా వినిపించాలని, ప్రతిపక్షాలపై పైచేయిగా ఉండాలని మోడీ హితబోధ చేశారు. అంతే తప్ప ఆయన మాత్రం సమాధానమివ్వరని స్పష్టం చేశారు. ప్రతి పక్షాలు లేవనెత్తిన అంశాలకు ఈ సమావేశాలు నిర్మాణాత్మక చర్యలను చూప లేదు. మరోవైపు ప్రతిపక్షాలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఎంత సేపూ తాను తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని చెప్పుకొంటోందే తప్ప, ప్రజల సమస్యలపైనా, వారు పడుతున్న ఇబ్బందులపైనా ఏమాత్రం కనికరం లేదు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తాత్కాలికమైనవే అనే రీతిలో కొత్త భాష్యాలను ప్రచారం చేస్తోంది. నోట్ల రద్దును వ్యతిరేకించిన కేరళలో సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం డిసెంబర్‌ 30 వరకు పాత నోట్లనే చెలామణికి పెట్టినట్లు తీసుకున్న సాహసో పేతమైన నిర్ణయం దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వానికి సూచన వచ్చి నప్పటికీ దాన్ని పక్కన పెట్టింది. ఇలాంటి ప్రజానుకూల చర్యలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని పార్లమెంటులో పలువురు సభ్యులు లేవనెత్తారు. కానీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

# పార్లమెంటులో ఏం జరుగుతోంది? #

నోట్ల రద్దుపై పార్లమెంటులో రగడ నడుస్తోంది. విపక్షాలు తమ ఆందోళనలతో ప్రజా సమస్యపై పట్టుబడుతున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. నోట్ల రద్దు ప్రకటన చేసిన ప్రధాని మోడీయే పార్లమెంటులో సమాధానమివ్వాలని పట్టుబడుతున్నాయి. పార్లమెంటులో మంత్రులతో మాటా ్లడించి చేతులు దులుపుకునేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. పెద్ద నోట్ల రద్దుపై చర్చతో పాటు ఓటింగ్‌కూ, జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణకూ పట్టుపడుతున్నాయి. చర్చ, ఓటింగ్‌కు సంబంధించిన పార్లమెంటు రూల్‌ 56ను ప్రస్తావిస్తున్నాయి. ఇది చాలా ప్రాధాన్యతతో కూడిన అంశం. కోట్లాది మంది ప్రజల జీవన విధానానికి అటంకంగా మారిన చాలా తీవ్రమైన సమస్య కనుక అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకొని ఓటింగ్‌ జరపాల్సిందేనని పట్టబడుతున్నాయి. ప్రతిపక్షాలు లెవనెత్తిన జెపిసి, చర్చ, ఓటింగ్‌కు ప్రభుత్వం సాహసించలేదు. చర్చకు మాత్రమే సిద్ధమని ప్రకటనలు చేస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రులు కూడా ఇదే ప్రకటన చేస్తూ మొండిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో భాగస్వామి కాని బిజూ జనతా దళ్‌(బిజెడి), తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌) తప్ప మిగతా విపక్ష పార్టీలన్నీ పార్లమెంటు వేదికగా పోరు బాట పట్టాయి. శివసేన, శిరోమణి అకాలీ దళ్‌(ఎస్‌ఎడి) వంటి ప్రభుత్వంలో భాగస్వామి పార్టీలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతి రేకి స్తు న్నాయి. తెలుగు దేశం పార్టీ(టిడిపి) వంటి కొన్ని భాగస్వామ్య పార్టీలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయి. మరికొన్ని భాగస్వామ్య పార్టీలు బహిరంగంగా వ్యతిరేకించకపోయినా, అంతర్గతంగా కుమిలి పోతున్నాయి.

|| నోట్ల రద్దుపై ఉమ్మడి పోరు ||

నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా పోరు నడుస్తోంది. పలు రాష్ట్రాల్లో ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చాయి. ముగ్గురు ముఖ్యమంత్రులు ఏకంగా రిజర్వ్‌ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంటు లోపలా, వెలుపలా ఉద్యమాలు జరుగుతున్నాయి. పార్లమెంటులో కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ, టిఎంసి, అన్నా డిఎంకె, డిఎంకె, ఎస్పీ, బిఎస్పీ, ఆర్‌జెడి, ఎన్‌సిపి, ఆమ్‌ఆద్మీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు ఉమ్మడిగా ఉద్య మి స్తున్నాయి. జెడియు పోరుకు సిద్ధ పడకుండా, ప్రభుత్వంపై వ్యతిరేక గళం విప్పింది. పార్లమెంటును మొత్తంగా స్తంభింపజేశారు. పార్లమెంటు వెలుపల కూడా అదే స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయి. 
ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, కేరళ ముఖ్య మంత్రులు ప్రజలతో కలసి ఉద్యమిస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఏకంగా తన మంత్రివర్గ సహచరులతో కలిసి రిజర్వ్‌ బ్యాంక్‌ ఎదుట ధర్నా చేపట్టారు. సిపిఎం నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లో ఉద్యమం సాగుతోంది. తమిళ నాడులో డిఎంకె ఉద్యమానికి పిలుపిచ్చింది. మరోవైపు ఆయా రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వినతులు కూడా అందాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి, ఆర్థిక శాఖ మంత్రి థామస్‌లు కేంద్ర ఆర్థిక మంత్రికి మెమోరాండం అందజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రధాని మోడీని కలిసి నోట్ల రద్దుపై కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విపక్షాలు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీ చేసి, రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించాయి. ఈ ర్యాలీలో ఎన్డీ యే భాగస్వామి శివసేన కూడా పాల్గొంది. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పిలుపించుకొని నోట్ల రద్దుపై చర్చించారు.

|| బిజెపిలో పెద్ద నోట్ల రగడ ||

పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లుతున్న నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన పాలకపక్ష బిజెపి పార్లమెంటు సభ్యుల సమావేశాన్ని పార్టీ అధిష్ఠానం రెండుసార్లు అర్ధాంతరంగా వాయిదావేసింది. అందుకు కారణాలు వెల్లడించలేదు. పార్లమెంటు లోపల, బయట నోట్ల వ్యవహారం దుమారం రేపుతున్న నేపథ్యంలో ఎంపిల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే అందులో కూడా పార్టీ ఎంపిలు ఈ నిర్ణయంపై అసంతప్తి వ్యక్తంచేసే అవకాశం ఉందని గ్రహించి రద్దు చేశారని ఇద్దరు బిజెపి సభ్యులే చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే బిజెపి ఎంపిల సమావేశాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఏర్పాటు చేశారు. ఈ నెల 16 రాత్రి ఏడు గంటలకు సమావేశం ఉందంటూ పార్టీ ఎంపిలందరికీ ఆ రోజు నాలుగు గంటలకు కబురు పంపారు. ఆ తర్వాత కారణం చెప్పకుండా సమావేశం వాయిదా పడిందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని, రైతులు తీవ్రంగా నష్టపోతారని బిజెపి పోర్‌బందర్‌ ఎంపి విఠల్‌ రాడాడియా, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరో బిజెపి ఎంపి శత్రుఘ్న సిన్హా బహిరంగంగా విమర్శించిన నేపథ్యంలో ఎంపిల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మరికొందరు విమర్శించే అవకాశం ఉందని పార్టీ అధిష్ఠానం భావించింది. ఆ తర్వాత శుక్రవారం పార్లమెంటు సమావేశాలకు ముందే పార్టీ ఎంపిల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాల ఎదురుదాడిని ఎలా తిప్పికొట్టాలో, సభ లోపల పరస్పర సహకారం ఎలా ఉండాలో వివరించేందుకు, సరైన వ్యూహాన్ని నిర్దేశించేందుకు పార్టీ ఈ సమావేశానికి పిలుపునిచ్చింది.
'పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి, వాటి వెనక నున్న ఉద్దేశాల గురించి వివరించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కూడా ఉంటుందని చెప్పారు' అని బిజెపి లోక్‌సభ సభ్యుడొకరు తెలిపారు. ఆ తర్వాత సమావేశం రద్దయిందని కబురు పంపారుగానీ, కారణం వివరించలేదని ఆయన చెప్పారు. సమావేశంలో విమర్శలు వస్తే ప్రభుత్వానికి ఇబ్బందనే ఉద్దేశంతోనే సమావేశాన్ని రద్దు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే వారం జరుగుతుందని తనకు చెప్పినట్లు మరో బిజెపి ఎంపి తెలిపారు. మరోవైపు బిజెపి సీనియర్‌ నేత అద్వానీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంటు ప్రారంభం రోజు అద్వానీ వద్దకు ప్రధాని మోడీ వెళ్లి ప్రతిపక్షాలకు మీరే ధీటైన సమాధానం ఇవ్వాలని కోరితే, అద్వానీ దాన్ని తిరస్కరించారు. 'ఇంత పెద్ద నిర్ణయాన్ని సీనియర్లతో సంప్రదించకుండా, ఏకపక్షంగా తీసుకున్నారు. అప్పుడు మేము గుర్తుకు రాలేదా? మీ నిర్ణయం వల్ల పార్టీ(బిజెపి)కి ఏ నష్టం వచ్చినా బాధ్యత మీదే' అని బదులిచ్చారని సమాచారం. తొలిరోజు పార్లమెంటులో చర్చపై ఓటింగ్‌ జరిపే అవకాశం లేకపోయినా బిజెపి అధిష్ఠానం తన ఎంపిలందరూ పార్లమెంటుకు రావాలంటూ విప్‌ జారీ చేసింది. ఇప్పుడు కూడా ఈనెల 21, 22, 23 తేదీల్లో కూడా పార్లమెంటుకు హాజరు కావాలని విప్‌ జారీ చేసింది. అంటే ప్రభుత్వంలో కూడా పెద్ద నోట్ల భయం పెరిగింది.  - జె జగదీష్‌ 

No comments:

Post a Comment