పూణేలోని అర్ధక్రాంతి అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన అనిల్ బొకిల్ ఓ ఆర్థికవేత్త. భారతదేశంలోని నల్లధనాన్ని వెలికితీయడానికి, రూపుమాపడానికి కొన్ని సూచనలు చేసినట్లుగా గత రెండు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వాటిలో ముఖ్యంగా రూ.1000, రూ.500, రూ. 100 నోట్లను పూర్తిగా తొలగించటం, ప్రభుత్వాలు వేసే రకరకాల పన్నులను తొలగించి లావాదేవీలు నగదు రూపంలో కాకుండా బ్యాంకులు, ఆన్లైన్ ద్వారా చేయడం ద్వారా అవినీతిని, అక్రమ సంపాదనను అరికట్టవచ్చని, ఇప్పటికే ఉన్న నల్లధనం కూడా ఇటువంటి చర్యల ద్వారా నిర్వీర్యమౌతుందని ఆయన సూచించారు.
సాధ్యా సాధ్యాలు ఎలా ఉన్నా అవినీతి కావాలనో, నల్లధనం పేరుకుపోవాలనో సామాన్యుడెవరూ కోరుకోరు కదా! అవినీతికి కేరాఫ్ అడ్రస్‌లు ప్రభుత్వాలకూ, కార్పొరేట్ సంస్థలకు మధ్యనున్న సంబంధాలే కదా! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో పోరాడలేక చేతులెత్తేసిన సామాన్య ప్రజానీకం వాస్తవాలను గుర్తించుకోలేక ఏవో భ్రమలలో ఏదో జరిగిపోతుందని మన సినిమాలలో సహజంగా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు హఠాత్తుగా కథానాయకుడు వచ్చి ఆదుకున్నట్టుగా ఎవరో ఒకరు మబ్బుల్లోంచి ఊడిపడి ఆదుకుంటారనో, ఆదుకోవాలనో కోరుకుంటుంటారు.
2014లో ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా మోడీ చేసిన ప్రకటనలు సరిగ్గా ఇలాంటి ఆలోచనలతో ఉన్నవారికి బాగా చేరుకున్నాయి. నల్లధనాన్ని విదేశాల నుంచి భారత్‌కు రప్పించటం, ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేయడం, దావూద్ ఇబ్రహీంను భారత్‌కు రప్పించటం లాంటి వాగ్దానాలు ఆయన సహజమైన హావభావాలతో బాగా పండించారు. గతానికి పూర్తి భిన్నంగా మోడీ చేసిన ప్రకటనలు సామాన్య ప్రజానీకంలో ఎన్నో ఆశలను రేకెత్తించాయి. అప్పటికే యుపిఎ అవినీతి, అసమర్థ పాలనతో విసిగిపోయిన భారత ప్రజానీకం మోడీని ఆదరించింది. నల్లధనం ఏమయింది, ఎంత రాబట్టగలిగారు, ఎంత మంది సాధారణ ప్రజల బ్యాంకు ఖాతాలలోకి డబ్బులు వచ్చాయి? ఏళ్ళు గడుస్తున్నాయి కానీ వాగ్దానాలు నెరవేరలేదు. ప్రధాన మంత్రి సామాన్య ప్రజలను బ్యాంకు శాతాలు తెరుచుకోండి అంటే స్పందించినంత వేగంగా నల్లధనాన్ని వెల్లడించండి అని ఐడియస్ ద్వారా సూచిస్తే నల్ల కుబేరులెవ్వరూ స్పందించలేదు. సెప్టెంబర్ 30తో ముగిసిన ఈ పథకానికి దాదాపు రూ.65,250 కోట్లు మాత్రమే వెల్లడించారు. ఇంచుమించు అదే సమయం నుంచి కర్ణాటకకు చెందిన బిజెపి నేత, సుష్మా స్వరాజ్‌కు విధేయుడిగా పేరొందిన గాలి జనార్దన రెడ్డి కుమార్తె వివాహం కోసం అలంకారాలు, ఆడంబరాలు, ఆహ్వానపత్రికలు లాంటి వాటికి విపరీతమైన ప్రచారం వచ్చింది. సినిమాలలో హీరో పాత్రలు వేసే వారి దగ్గర నుంచి ప్రధాన మంత్రి వరకు అందరికీ ఆహ్వాన పత్రికలు అందాయి. తమ పార్టీకి చెందిన నేత కాబట్టి ప్రధానమంత్రి కూడా ఆ కార్యక్రమానికి వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదనే ప్రచారం జరిగిపోయింది. అరెస్టులు, కేసులు, సిబిఐ విచారణలు, కారాగార శిక్షలు, న్యాయవ్యవస్థలను వెక్కిరించినట్లుగా, సవాల్ చేసినట్లుగా తన ధన విశ్వరూపం చూపించిన గాలివారికి మన వ్యవస్థ మీద సామాన్యుల కంటే ఎక్కువ నమ్మకమే ఉండి ఉండవచ్చు. ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తుందంటే ప్రభుత్వాలన్నా, వారి చర్యలన్నా భయపడేది సామాన్యులే కాని మాన్యులు కాదు అని తెలుసుకోవాలి.
2016 నవంబర్ 8 రాత్రి 8 గంటలకు రూ.500, వెయ్యి నోట్లకు కాలం చెల్లిందని, నగదు లావాదేవీలకు ఇక మీదట అంగీకరించబోమని, బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని, నల్లధనాన్ని, తీవ్రవాద సంస్థలకు తోడ్పాటునందిస్తున్న వారిని అరికట్టడానికి ఈ సాహసోపేతమైన చర్య తీసుకున్నామని ప్రధాని దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించగానే దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. వాస్తవానికి చాలామంది స్వాగతించారు. ఇందులో వ్యతిరేకించడానికి ఏముంది? జాతి హితం కోసం అందరూ తమ వంతుగా త్యాగం చేయక తప్పదని కరెన్సీ నోట్లు మార్చుకోవడానికి సన్నద్ధమయ్యారు. ఇదే అదనుగా మోడీ అభిమాన గణం బిజెపి వారు మీడియాలో చెలరేగిపోయారు. ఇదొక సర్జికల్ స్ట్రైక్ అన్నారు. నల్లధనంపై యుద్ధం అన్నారు. అప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అర్ధక్రాంతి సూచనలు అమలులోకి వచ్చేస్తున్నాయి. అమెరికా, భారత్ బ్లాక్ టు వైట్ అన్నారు. మోడీని యోధుడన్నారు.
అశ్వాలను అడవుల్లో వదిలి, ఆయుధాలను దాచిపెట్టి ప్రత్యర్థులకు ముందే సమాచారమిచ్చి ప్రజలారా సహకరించండి, సైనికులారా యుద్ధానికి వెళ్ళండి, వీరోచితంగా పోరాడండి, మీ ధైర్యం, సాహసం అపారం. నేను మాత్రం విహారయాత్రకు వెళ్ళొస్తాననే రాజుగారి నిజాయితీకి, చిత్తశుద్ధికి రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి ముందస్తు ఆలోచన లేకుండా ప్రస్తుతం ఉన్న ఎటియంలకు సరిపోని కొత్త నోట్లను తయారు చేయించి బ్యాంకుల్లో సరిపడా నగదు నిల్వలు లేకుండా ప్రజలపై సర్జికల్ స్ట్రైక్ చేసి అంబానీ, అదానీ లాంటి వాళ్లపై ఈగ వాలకుండా కాపాడుతూ, నల్ల వీరులపై కనీస చర్య కూడా చేపట్టకుండానే విదేశీయాత్రలకు వెళ్ళిన అభినవ యోధుడు మోడీగారికీ తేడా ఏమైనా మీకు కనిపిస్తోందా? అనుకున్నదొక్కటి, అవుతోంది మరొకటని అక్రమార్కులు, కేటుగాళ్లు ఇక్కట్ల పాలవుతారని ఇదంతా చాలా ముందస్తుగా, పకడ్బందీగా, అత్యంత రహస్యంగా ప్రభుత్వం తీసుకున్న చర్యగా భావించిన సామాన్యుల భావనలకు మబ్బులు తొలిగాయి. భ్రమలు వీడాయి. అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బడా బాబులు ముందే సర్దుకున్నారని, నోట్ల రద్దుకు ప్రకటన తప్ప ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చేయలేదని, పెళ్లిళ్లు, శుభకార్యాలకై డబ్బు సమకూర్చుకుని ఇంట్లో పెట్టుకున్నవాళ్లు, ప్రయాణాల్లో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు, దినసరి కూలీలు, అనేకులు బాధితులే ముద్దాయిలయ్యారు. మరికొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
రూ.2000 నోటు గురించి కూడా ఇలాంటి అతిశయాలే ప్రచారం చేశారు. నానో టెక్నాలజీతో తయారైందని, మైక్రో చిప్ ఉంటుందని, పాతాళంలో ఉన్నా కనిపెట్టేస్తుందని, నకిలీ చేయటం అసాధ్యమని ప్రపంచంలో ఇలాంటి నోటు లేదని చర్చల్లో ఊదరగొట్టారు. పత్రికల్లో కథనాలు రాశారు. తీరా చూస్తే కొత్త నోటు వచ్చిన రెండు రోజులకే నకిలీ నోటు వచ్చింది. చిత్తం చెప్పుల మీద, చూపులు శివుడి మీద ఉన్నట్టు ప్రజల్లో నల్లధనంపై పేరుకు పోయిన నైరాశ్యాన్ని ఏదో తాము తొలగిస్తున్నామనే భ్రమ కల్పించడానికి, మరీ ముఖ్యంగా త్వరలో రాబోయే ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లలో జరుగబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ప్రజలను పావులుగా చేసి, లేని భ్రమలు కల్పించి, ఆడిన వింత నాటకానికి సామాన్యులు సమిధలయ్యారు. గడిచిన ఆరు రోజుల నుంచి రోజువారీ కార్యకలాపాలు లేవు. వ్యాపారాలు లేవు. వ్యవస్థలు కూలబడ్డాయి. కనీసం ఎప్పటికి చక్కదిద్దుతారో చెప్పగల స్పష్టత ప్రభుత్వానికి లేదు. చక్కదిద్దే సామర్థ్యం యంత్రాంగానికి లేదు. అర శాతమో, ఒక శాతమో ఉన్న అక్రమార్కులను పట్టుకోవడానికి 99 శాతం మంది ప్రజలను పరుగులు పెట్టించిన చాణక్యనీతి ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టిన రీతిలో ఉంది. ఎప్పుడో ఏడాదికోసారి సమస్యలపై సమ్మె చేస్తే దేశానికి ఎంత నష్టం జరిగిందో గణాంకాలతో వివరించి గుండెలు బాదుకునే ప్రభుత్వాలు ఈ అసమర్థ తంతు మూలంగా పోయిన పని దినాల వల్ల జరిగిన నష్టం ఎంతో తెలుపగలవా? పరిహారం చెల్లించగలవా? నకిలీ నోట్లపై, నల్లధనంపై యుద్ధం అని భ్రమ పడిన ప్రజలకు అసలు యుద్ధమే నకిలీ అని అర్థమవుతోంది - నరసింహ ప్రసాద్ గొర్రెపాటి

No comments:
Post a Comment