Saturday, 19 November 2016

|| నోట్ల రద్దు వెనుక అసలు రాజకీయం ||




                  విధానపరమైన అంశాలను ప్రకటిం చే టప్పుడు లోతుల్లోకి వెళ్ళి వివరాలను రూపొందించటం ద్వారా దానిని జయప్రదం చేసే చర్యల కన్నా, ప్రచార ఉప్పెన ద్వారా ప్రజలలో సంచలనం సృష్టించటం, వారి దృష్టిని మళ్ళించటంలో మోడీ ప్రభుత్వానిది అందెవేసిన చెయ్యి. ఈ మధ్య ప్రకటించిన అధిక విలువగల నోట్ల రద్దు 'ప్రజల్ని ఆశ్చర్యం, ఆందోళనలో ముంచివేసే' చర్యలలో ఒకటి.
ఒకవైపు నల్లధనాన్ని నిర్మూలించటానికి ప్రభుత్వ దృఢనిశ్చయానికి సాక్ష్యంగా దీన్ని చూపుతుండగా, మరోవైపు ప్రజలకు, ముఖ్యంగా పేదలకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కలిగించే విధంగా దీన్ని అమలు జరుపుతున్నారు. వాస్తవానికి ఇది నల్లధనం సమస్యను తాకదు. మనం చూస్తున్నట్లు గా నోట్లను రద్దుచేయటం సమస్య కాదు. వాస్తవంలో నకిలీ నోట్లను అరికట్టటానికి, డబ్బుపై ఆధారపడిన చట్ట విరుద్ధమైన లావాదేవీలను నివారించటానికి అది భారతదేశంలోనూ, ప్రపం చంలోనూ నిర్దిష్ట సమయాలలో అమలు జరుగుతుంటుంది. వీటిని తగ్గించటానికి దోహదం చేసే వరకు దీన్ని ఆహ్వానించవలసిందే. గతంలో దీన్ని భారత్‌లోగానీ, ఇతర దేశాలలో గానీ అమలు చేసినప్పుడు ఆర్థిక కార్య కలాపాలు తీవ్రంగా విచ్ఛిన్నం కాకుండా, ప్రజలు తమ వద్ద ఉన్న పాతనోట్లను కొత్తనోట్లుగా మార్చుకోవటానికి అవసరమైనంత సమయం ఇచ్చి క్రమపద్ధతిలో చేశారు. వాటికి భిన్నంగా ప్రస్తుతం రాత్రికి రాత్రి ఇచ్చిన ఈ షాక్‌ ప్రజలలో అత్యధిక భాగానికి నష్టం కలిగిస్తూ, తీవ్రమైన అస్థిరతకు గురిచేస్తున్నది. నల్లధనంపై పరి మితమైన ప్రభావం మాత్రమే చూపుతోంది. కానీ సామాన్య ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. వారి జీవితాలు ఇప్పటికే తీవ్రంగా విచ్ఛిన్నమయ్యాయి. నోట్ల రద్దు విషయాన్ని రహస్యంగా ఉంచటం, వేగంగా అమలు చేయటం లక్ష్యం సాధించటానికి అవసరమని ప్రభుత్వ ప్రతినిధులు వాదిస్తున్నారు. ఎక్కువ సమయమిస్తే నల్లధనులు ఇతర ఆస్తులను కొనటం ద్వారా దాన్ని తెల్లగా మార్చు కుంటారని చెబుతున్నారు. ఈ వాదనలు పూర్తిగా అర్థరహితం. ఉదాహరణకు 2016, డిసెంబరు 1 నుంచి పాతనోట్లు చెల్లవని ప్రభుత్వం ప్రక టిం చిం దను కుం దాం. అప్పటి నుంచి ప్రభుత్వం పెద్ద అమ్మకాలు, కొనుగోళ్ళను(బంగారం, భూములు, ఇళ్ళు), విదేశీ మారకద్రవ్య లావాదేవీలను, అవి నిర్వహిస్తున్న వారిని పరిశీలిస్తుంది. చట్టబద్ధంగా వ్యవహరిస్తున్న సాధారణ పౌరుడు దీనికి ఏ మాత్రం మూల్యం చెల్లించాల్సిన పనిలేదు. చట్ట ప్రకారం పన్నులు చెల్లించాల్సిన వారి పూర్తి సమాచారం ప్రభుత్వానికి అందుతుంది. ప్రభుత్వానికి భారీ సంస్కరణల పట్ల ఉన్న సహజమైన ప్రేమ ప్రజలను షాక్‌కు గురిచేసే విధంగా ప్రకటన చేయటానికి దారి తీసిందనిపిస్తున్నది. మీడియాను-వాస్తవానికి మొత్తం సమాజాన్ని దారి మళ్ళించటం, ప్రజాస్వామికంగా వ్యక్తంచేసే వివిధ రకాలైన భిన్నాభిప్రాయాలను ఈ మధ్యకాలంలో మరింతగా అణచివేయటానికి ప్రభుత్వం పూనుకోవటం తీవ్రమైన ఆందోళనకు కారణమవటం, రెండు ముఖ్యమైన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ లలో ఎన్నికలు రానున్న తరుణంలో ఈ ప్రకటనతో ప్రతిపక్షాలను తప్పు దారి పట్టిం చవచ్చునని, ఎన్నికల ముందు బిజెపి తలెత్తుకుని నిలబడటానికి ఇది దోహదం చేస్తుందని ఈ చర్య తీసుకున్న సమయంపై వివరణలు ఇస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో బిజెపి సభ్యులకు చెందిన కొన్ని ఎకౌంట్లు ఈ నాటకీయ ప్రకటన కు నెల ముందు హఠాత్తుగా పెద్ద నోట్లతో నిండిపోయాయని, పాలక పార్టీ సభ్యులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటానికి వీలుగా వారికి ముందుగానే నోట్ల రద్దు విషయం చెప్పారని ఆరోపణలు వస్తున్నాయి.
ఏమైనప్పటికీ ఈ పథకం ప్రణాళిక, అమలు ఆదర్శానికి దూరంగా ఉన్నది. ప్రణాళిక రహస్యంగా ఉంచి, హఠాత్తుగా ప్రకటించటంతో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్లు ఇప్పటికే చెప్పుకున్నాం. రూ.500 నోటును మధ్యతరగతి, పేద ప్రజలు వినియోగించని అధిక విలువగల నోటుగా భావిం చడ మంటే గత అనేక సంవత్సరాల నుంచి ధరలు విపరీతంగా పెరిగాయనే విషయాన్ని అర్థం చేసుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని స్పష్టమౌతున్నది. ఆహార పదార్థాలు, మందులు లాంటి వాటికి పెరిగిన ధరలను (ఉదాహరణకు పప్పుల లాంటివి కిలో రూ.200 అమ్ముతున్నాయి) పరిగణనలోకి తీసుకుంటే రూ.500 నోటును ధనికులు, నల్లధనం ఉన్నవారే వాడతారనుకోవటం అసంబద్ధమని స్పష్ట మౌతున్నది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లలో రూ.500 నోట్లు మూడింట రెండువంతులున్నాయి. వాటిని ఒక్కసారిగా రద్దుచేయటం దేశవ్యాప్తంగా చెల్లింపులు, మార్కెట్లు, ఉత్పత్తి, వినియోగంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. వాస్తవానికి మొరార్జీదేశారు ప్రభుత్వం 1978లో అధిక విలువగల నోట్లను రద్దు చేసినప్పుడు రూ.1,000, అంతకన్నా ఎక్కువ విలువగల నోట్లనే రద్దు చేసింది. ఆ రోజు రూ.1,000 ఈరోజు రూ.25,000 సమానం. అప్పుడు ఆ నోట్లకు అంత ఎక్కువ విలువ ఉండేది. చెలామణిలో ఉన్న నోట్లలో అవి 0.6 శాతం మాత్రమే ఉన్నాయి కాబట్టి 1978లో జరిగిన నోట్ల రద్దు సాధారణ ప్రజలపై ఎక్కువ దుష్ప్ర భావం చూపలేదు. నల్లధనం ఎక్కువగా ఉన్నవారు తక్కువగా మాత్రమే డబ్బు రూపంలో ఉంచుకుంటారని, కాబట్టి ఇటువంటి చర్యలు అరుదుగా మాత్రమే సత్ప Ûలితాలిస్తాయని అప్పుడు రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా ఉన్న ఐజి పటేల్‌ చెప్పారు. నల్ల ధనంగాని, సంపదగాని నోట్ల రూపంలో ఉండి సూట్‌కేసుల్లోనో, దిండు కవర్లలోనో దాచిపెట్టబడి ఉంటుందని భావించటమే అమాయకత్వం. ఏమై నప్ప టికీ పెద్ద మొత్తంలో నల్లధనం ఉన్నవారు వివిధ రకాలైన చిన్నచిన్న మారకాల ద్వారా పాతనోట్లను మార్చుకోవటానికి ఏజెంట్లను చూసుకుంటారు. ప్రభుత్వం ఎక్కువ పని, తక్కువ ఫలితం వచ్చే ఆలోచన చేసి, దానికై పట్టుబట్టింది. ఆర్థికవేత్తలు బ్రహ్మానంద, వకీల్‌ ఇటువంటి చర్యలు రాజకీయపరమైనవని, ఆర్థిక లక్ష్యాలను సాధించలేవని చెప్పారు.
ప్రస్తుత కార్యక్రమాన్ని కూడా ఇదే నిర్దేశించినట్లయితే నిర్వహణాపరమైన కష్టాలను, సాధారణ ప్రజలకు జరిగే హానిని ప్రభుత్వం సహించటాన్ని అర్థం చేసుకోవటం సులభంగా ఉంటుంది. ప్రణాళిక కన్నా అమలుకు సంబంధించి చూసినట్లయితే ఇటువంటి ప్రధాన కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఏ మాత్రం సన్నద్ధం కాకపోవటం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. విషయాన్ని రహస్యంగా ఉంచాలన్న అంశాన్ని మరోసారి ముందుకు తెస్తున్నారు. అది అసంబద్ధమైనది. ఏమాత్రం పొసగనిది. ప్రకటించిన వారం తర్వాత కూడా బ్యాంకులు, ఎటియంలలో తగినన్ని నోట్లు లభ్యం కాకపోవటం వల్ల అనిశ్చితి నెలకొనటం మాత్రమే కాదు, నోట్లు మార్చుకోవటానికి ఏర్పడుతుందని భావించిన రద్దీని తట్టుకోవటానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయలేదు. చెలామణిలో ఉన్న నోట్లలో 86 శాతాన్ని ఒక్కదెబ్బతో రద్దుచేయటం పెద్ద చర్య. అది చెల్లింపుల వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కొత్తనోట్లు వెంటనే అందటం సాధ్యంకాని దేశంలోని ఇతర ప్రాంతాలలో చెల్లింపులు స్తంభించటానికి కూడా అవకాశం ఉంది. అత్యంత త్వరితంగా ఈ నోట్లను భర్తీచేసుకోలేకపోతే అత్యధికంగా నగదు లావాదేవీలపై ఆధారపడిన భారత్‌ లాంటి ఆర్థికవ్యవస్థ ప్రభావితం కాదని భావించటం మూర్ఖత్వం అవుతుంది. రూ.500 నోటు కన్నా ముందుగా కొత్త రూ.2000 నోటును విడుదల చేయటం మరింత ఆశ్చర్యకరంగా ఉన్నది. రూ.500 నోటుకు ఇదేమాత్రం ప్రత్యామ్నాయం కాదు. రూ.2000 నోటుకు తమకు ఎవరూ చిల్లర ఇవ్వటం లేదని పేదలు ఫిర్యాదు చేస్తున్నారని ప్రభుత్వ ప్రతినిధులు ఆశ్చర్యపడుతున్నారు. అధిక విలువ కలిగిన కొత్తనోట్లను విడుదల చేసినప్పుడు ఇతర తక్కువ విలువ కలిగిన నోట్లకు కొరత ఏర్పడటం అనివార్యం అవుతుందని ఊహించి ఉండాల్సింది. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఏదేమైనప్పటికీ నల్లధనాన్ని రూపుమాపటమే ఆలోచన అయితే అప్రకటిత ఆదాయాన్ని మరింత సులభంగా దాచుకొనేలా, మరింత ఎక్కువ విలువ కలిగిన నోట్లను ప్రవేశపెట్టటం ఏ మాత్రం వాంఛనీయం కాదు. ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, తొమ్మిది నెలలుగా ప్రణాళిక రూపొందిస్తున్నామని ప్రధాని చెబుతున్నదే నిజమైతే ఇంత తక్కువ సన్నద్ధత నమ్మశక్యం కాకుండా ఉంది. అమలుకు సంబంధించిన సమస్యలను గురించి అధికారులకు కొద్దిపాటి అవగాహన మాత్రమే ఉంది. సమస్యను కొద్దిరోజుల్లో పరిష్కరిస్తామని ప్రకటనతో ప్రారంభించిన ప్రభుత్వం తర్వాత వారాలు, 50 రోజులు పడుతుందని చెప్పింది. దేశ ప్రజలు అప్పటి వరకు తనతో పాటు వీటిని భరించాలని ప్రధానమంత్రి చెబుతున్నారు. రద్దుచేసిన నోట్ల స్థానంలో ప్రవేశపెట్టటానికి ఆర్‌బిఐ వద్ద తగినన్ని కొత్తనోట్లు ఉండకపోవటం, ఈ పనిచేయటానికి ముందు ఎటియంలు కొత్తనోట్లకు అనుగుణంగా పనిచేసేలా చూసుకోకపోవటం, తదితర చిన్న విషయాలకు సంబంధించి చూస్తే ఇది అత్యాశగా ఉంటుంది. ఇవన్నీ సరైనవే అనుకున్నప్పటికీ ఈ చర్య దేశంలో నల్లధనాన్ని నిర్మూలించటానికి ఉపయోగపడుతుందా?
''నల్లధనం'' స్వభావం
''నల్లధనం'' అంటే కచ్చితంగా ఏమిటి? డబ్బును పెద్ద మొత్తంలో నిల్వ ఉంచడం లేదా ఆస్తులను కూడబెట్టడంగా దాన్ని చూడటం మొదటి తప్పు. ఎందుకంటే అది ఏమాత్రం కుప్పలుగా నిల్వ ఉండటం లేదు. పన్నులు ఎడవేసేందుకు, వివిధ రకాల ఇతర నియంత్రణల నుంచి తప్పించుకునేందుకు అధికారుల నుంచి దాచి ఉంచి లేదా తక్కువగా చూపి దాన్ని చెలామణిలో ఉంచడం లేదా లావాదేవీలు జరపడం చేస్తారు. లంచాలివ్వడం, ఇతర రకాల అవినీతి పనులకు ఉపయోగించడం దీని ఒక రూపం మాత్రమే. అయితే అన్ని రకాల కంపెనీలూ తక్కువ ఇన్వాయిలస్‌లు, ఎక్కువ ఇన్వాయిస్‌లు చూపడం, వ్యక్తిగతంగా సరఫరా చేసేవారు తాము అమ్మే వస్తువులు, సేవల విలువను తక్కువగా చూపడం, తప్పుడు లేదా అసలు జరగని లావాదేవీలను చూపడం, వివిధ రకాల నేర చర్యలు వంటి ఇంకా అనేక రూపాల్లో ఇది ఉంటుంది. వీటిలో అత్యధిక భాగాన్ని తప్పని సరిగా డబ్బు బదలీల్లోనే చేయనవసరం లేదు. వీటన్నింటినీ ఎలక్ట్రానిక్‌ సాధనాల ద్వారానూ, విభిన్న రూపాల్లో ఖాతాల నిర్వహణ ద్వారా చేపట్టవచ్చు. ఇంకా డబ్బు ఒక ప్రత్యేకమైన రంగును సంతరించుకొని నిల్వ చేయబడదు. అది అనేక రకాల లావాదేవీల ద్వారా ప్రవహిస్తుంది. ఈ అన్ని కారణాల రీత్యా ఒక వ్యవస్థలో ఒక పరి మిత కాలానికి కచ్చితంగా ''నల్లధనం' ఎంత ఉందో అంచనా వేయడం కష్టం. ఒక ప్రయివేటు సంస్థ తన తాజా అంచనాలో నల్లధనం మొత్తం స్థూల జాతీయో త్పత్తి(జిడిపి)లో 20 శాతం లేదా రికార్డయిన జిడిపిలో 25 శాతం ఉంటుందని పేర్కొంది. అయితే ఇది ప్రపంచంలో ఇప్పటికే ఉన్నదానికంటే చాలా తక్కువ. భారత్‌లో ఉన్న నల్లధనానికి సంబంధించి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ(ఎన్‌ఐపిఎఫ్‌పి) ఒక నివేదికను తయారు చేసింది. దాన్ని 2013 డిసెంబర్‌లో ప్రభుత్వానికి అందజేసింది. అయితే దాన్ని బహిరంగపరచడం గానీ లేదా పార్లమెంటు ముందుంచడంగానీ జరగలేదు. ఆ సంస్థ నమోదైన జిడిపిలో నల్లధనం 75 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. అందులో అత్యధిక భాగం స్థానిక కరెన్సీ రూపంలో లేదు, కచ్చితంగా ఉండే అవకాశమూ లేదు. అలాంటి నిధులను పొందినవారు చాలా వేగంగా దాన్ని ఇతర ఆస్తుల రూపంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తారు. నేడది భారత్‌లో అత్యధిక భాగం భూమి, ఇతర రియల్‌ ఎస్టేట్‌ ఆస్తి, బంగారం, ఆభరణాలు, బ్యాంకుల్లో బినామీ ఖాతాలు, డాలర్లు, ఇతర ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీలు, పార్టిసిపేటరీ నోట్స్‌ ద్వారా స్టాక్స్‌, షేర్ల రూపంలో ఉంది. వీటన్నింటినీ మించి అత్యధిక భాగం వివిధ రూపాల్లో విదేశాలకు పంపబడింది.
ఈ కొత్త చర్య ద్వారా ప్రస్తుతం చెలామణిలో ఉన్న డబ్బులో ఎంత పరిమాణంలో నల్లడబ్లు వెలికి వస్తుందో అంచనా వేసేందుకు ప్రయత్నిద్దాం. పైన పేర్కొన్నట్లు నల్లధనం దేశ జిడిపిలో 25-75 శాతం మధ్య ఉంది. కాగా ప్రస్తుతం చెలామణిలో ఉన్న కరెన్సీ మొత్తం జిడిపిలో 12 శాతం ఉంటుంది. అందులో 86 శాతం రూ.500, రూ.1000 నోట్ల రూపంలో ఉంది. మన జిడిపిలో పెద్ద మొత్తం అంటే దాదాపు సగం సుమారు 85 శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్న అసంఘటిత రంగం నుంచి వస్తున్నట్లు ప్రస్తుత సిఎస్‌ఒ అంచనాలను బట్టి మనకు తెలుసు. జిడిపిలో అంచనా వేసినప్పటికీ ఇదంతా రికార్డు కానీ ఆదాయం. అయితే ఇది ప్రధానం ''నల్లధనం'' కాదు. ఎందుకంటే ఇది చాలా చిన్న మొత్తాల్లో ఉంటుంది. ఇది ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి రాదు. 
ఇది వివిధ రకాల పరోక్ష పన్నుల పరిధిలో ఉంటుంది. వాస్తవానికి రైతుల (వారిపై పన్నులుండవు) ఆదాయాలు, చిన్న వర్తకులు, వ్యాపారవేత్తల ఆదాయాలు, రోజువారీ వేతన కార్మికుల ఆదాయాలు, చిన్నపాటి సేవలు అందించేవారి ఆదాయాలు, ఇంకా అలాంటి అనేక రకాల ఆదాయాలను నమోదు చేయనప్పటికీ, ఎలాంటి ఆర్థిక అధికారులకు తెలపనప్పటికీ ఈ ఆదాయాలను 'తెల్ల' లావాదేవీలుగానే పరిగణిస్తారు. పూర్తిగా కానప్పటికీ భారతదేశంలో అనధికార ఆర్థికవ్యవస్థ డబ్బుపై ఆధాపడి ఉంది. అత్యధిక భాగం అసంఘటిత రంగం ఉన్నందున భారత్‌లో 90 శాతానికి పైగా లావాదేవీలను నగదులోనే ఇంకా అంచనావేస్తున్నారు. అందువల్ల అంచనావేసిన అసంఘటిత రంగ జిడిపి మొత్తంలో సగానికి పైగా నగదు లావాదేవీల రూపంలో ఉన్నదని భావించడం అహేతుకం ఏమీ కాదు. నగదు నిల్వలు జిడిపిలో 12 శాతం ఉన్నట్లు అంచనా వేసినందున జిడిపిలో 3 నుంచి 6 శాతం మధ్య అసంఘటిత రంగ కార్యకలాపాలున్నాయి. అవన్నీ పూర్తిగా చట్టబద్ధమైన ఆదాయాలే అవుతాయి. రూ.500, వెయ్యి రూపాయల నోట్ల రద్దు వల్ల డబ్బు రూపంలో ఉన్న మేరకు మాత్రమే నల్లధనం వెలికి వస్తుంది. అది జిడిపిలో 2.3-5.2 శాతం మధ్య ఉంటుంది. అందువల్ల ఈ చర్య వల్ల చాలా తక్కువ మొత్తంలో మాత్రమే నల్లధనాన్ని పట్టుకోవడానికి వీలుకలుగుతుంది.  - జయతీ ఘోష్‌

No comments:

Post a Comment