Monday, 14 November 2016

|| మోడీ నాటకాలు - మొసలి కన్నీళ్లు ||




           సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం చేసిన 'నోట్ల' సర్జికల్‌ దాడితో దేశం అల్లకల్లోలమౌతున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కన్నీళ్లు పెట్టడం హాస్యాస్పదం! దేశ ప్రజలు పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న కడగళ్లు చూసి ఈ కన్నీళ్లు పెట్టారా అంటే అది కాదు! సోత్కర్షలో భాగంగానే ఆయన కళ్లు చెమర్చాయి. గొంతు బొంగురు పోయింది. దేశం కోసం కుటుంబాన్నీ, జీవితాన్ని త్యాగం చేశానని చెప్పుకున్న ఆయన, కొన్ని శక్తులు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని, తనను బతకనీయక పోవచ్చని కూడా అన్నారు.
అయితే, మోడీ కన్నీళ్లను చూసి కరిగిపోయే పరిస్థితుల్లో దేశం ప్రస్తుతం లేదు. దేశ వ్యాప్తంగా ప్రజానీకం గత కొద్ది రోజులుగా నిత్యం చస్తూ బతుకుతూ ఉండటమే కారణం. నల్లధనం, నకిలీ నోట్లపై యుద్ధమంటూ మోడీ ప్రకటించిన సర్జికల్‌ స్ట్రైక్‌ సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. రేపటిపై ఏమాత్రమూ పూచీ లేని స్థితికి వారిని దిగజార్చింది. వేల కోట్ల రూపాయలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న కోట్లాది మంది మానవ వనరులను నిస్తేజం, నిర్వీర్యం చేసి బ్యాంకులు, ఏటిఎంల చుట్టూ తిరిగే దుస్థితికి తీసుకు వచ్చింది. ఇలా తిరుగుతున్న వారంతా ప్రధానమంత్రి దృష్టికి నల్ల కుబేరుల్లా కనిపించడమే బాధాకరమైన విషయం. లేని పక్షంలో రోజు కూలీలు, పేదలు, ఉద్యోగులు, చిన్న తరహా వ్యాపారులు కుటుంబాలతో సహా తరలివచ్చి బ్యాంకుల ముందు అన్న పానీయాలు లేకుండా దిగాలు పడుతుంటే కుంభకోణల్లో బొక్కిన వారు క్యూలు కడుతున్నారన్నడానికి ఆయనకు నోరెలా వస్తుంది?
సమస్యలకు పరిష్కారం వెతకాల్సిన వేళ కన్నీళ్లు పెట్టడం అంటే దాన్ని చేతకాని తనమనాలి లేక నాటకమనైనా అనాలి. దేశంలో పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి 'తాంబూలాలిచ్చేశాను... తన్నుకు చావండి' అంటూ ప్రధాని విదేశాలకు చెక్కేశారు. ప్రజలు బ్యాంకుల వద్ద పడిగాపులు గాస్తుంటే, వర్తక, వాణిజ్యాలు దిగజారి అలో.. లక్ష్మణా అంటుంటే 125 కోట్ల మంది ప్రజలు తన చర్యను ఆహ్వానిస్తూన్నారంటూ వ్యంగ్య బాణాలు విసిరారు. దేశానికి తిరిగి వచ్చాకా ప్రజల నుండి వ్యతిరేకతను చూసి కన్నీళ్లు పెడుతున్నారు. నిజానికి వేదికలపై ఇటువంటి టక్కుటమార విద్యలు ప్రదర్శించడం నరేంద్రమోడీకి కొత్తేమీ కాదు. జాతి నుదిటిపై నెత్తుటి మరకగా మారిన గుజరాత్‌ మారణకాండ ఉదంతం నుండి ఆయన ఈ తరహా విద్యలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయం పరిశోధన విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య అనంతర పరిణామాల నేపథ్యంలో 'దళితులను కాదు.. నన్ను కాల్చండి' అంటూ ఇంతే ఉద్విగ భరితంగా ఆయన చేసిన ప్రసంగాన్ని ఇప్పుడప్పుడే మరచిపోలేం! అంతకు ముందు రోహిత్‌ వేముల ఉదంతం గురించి గానీ, దేశంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యాకాండ గురించి కానీ నిమ్మకునీరెత్తని వ్యక్తి ఒక్కసారిగా ఈ నాటకీయ వ్యాఖ్యలు చేయడం పరిశీలకులకు విస్తు పరిచింది. ఆ నేతే ఇప్పుడు తనను బతకనీయరంటూ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రజలను మభ్యపెట్టడమే! 
నల్లధనాన్ని అరికట్టడానికే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ఒకవైపు చెబుతూ 2 వేల నోట్లకు ఎందుకు అనుమతిచ్చారన్న ప్రశ్నకు ఇంత వరకు సమాధానం లేదు. నోట్ల రద్దు తరువాత సామాన్యులు మినహా బడా బాబులెవ్వరూ బ్యాంకుల ముందు బారులెందుకు తీయలేదన్న ప్రశ్నకు దాట వేతే జవాబు. నెలల తరబడి కసరత్తు చేసినా నోట్ల కొరత తప్పని స్థితి ఎందుకన్న సందేహానికీ స్పందన శూన్యం. నోట్ల రద్దు ప్రకటన సందర్భంగా ఈ నెల 8న వారం రోజుల్లో నల ధనం అంతు చూస్తానని బీరాలు పలికిన ప్రధాని, ఇప్పుడు డిసెంబర్‌ నెలాఖరంటూ నీళ్లు ఎందుకు నమిలారని అడిగినా, అప్పటిదాకా సామాన్యులకు కష్టాలు తప్పవా అని ప్రశ్నించినా ఎదురుదాడికి దిగడమే పాలక పక్షానికి మార్గంగా మారింది. విదేశాల నుండి నల్లధనాన్ని తరలించి తీరుతామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని నిలదీసినా ఉలుకూ పలుకూ లేని స్థితి నెలకొంది. ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా, ప్రజల కష్టాలు తీర్చకుండా ప్రధాని కార్చే కన్నీళ్లు ఇప్పటికే నిరాశకు, నిస్పృహకు గురై ఒత్తిడికి లోనవుతూ తీవ్ర వేదనలో ఉన్న దేశ ప్రజలకు ఏమాత్రమూ ఓదార్పునియ్యవు. పైగా ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని దెబ్బ తీస్తాయి. ఉప్పు కొరత ముంచుకొస్తోందంటూ వచ్చిన వదంతులకు దేశ ప్రజానీకం స్పందించిన తీరు ప్రభుత్వంపై ఇప్పటికే కోల్పోయిన విశ్వాసానికి నిదర్శనం. ప్రధానికి ఈ దేశంలోని సాధారణ ప్రజల కష్టాలపై ఏమాత్రం సానుభూతి ఉన్నా బేషజాలకు పోకుండా జరిగిన తప్పిదానికి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రత్యామ్నాయం చూపే వరకు పాత నోట్లను కొనసాగించాలి. హడావిడి నిర్ణయం ఫలితంగా ఉత్పన్నమైన పరిస్థితులను తక్షణ ప్రాతిపదికన సరిదిద్దాలి. లేని పక్షంలో మోడీ కన్నీళ్లను మొసలి కన్నీళ్లు గానే జాతి గుర్తుంచుకుంటుంది.  -(ప్రజాశక్తి)

No comments:

Post a Comment