అక్టోబరు 23-25 వరకు హైదరాబాద్ సమీపంలోని అన్నాజీగూడలో జరిగిన ఆర్‌యస్‌యస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం దేశంలో మతోన్మా దాన్ని పెంచటం, ఉమ్మడి పౌరస్మృతి పేరుతో మైనారి టీలపై దాడి లక్ష్యంగా జరిగింది. ఉమ్మడి పౌరస్మృతి పేరుతో మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం, గోరక్షణ పేరుతో దళితులను, ముస్లింలను హత్య చేస్తున్న గూండా గుంపు లను సమర్థించటం, వారికి రక్షణ కల్పించాలని కోరటం, కేరళలో ఆర్‌యస్‌యస్ కార్యకర్తలను సిపియం హత్యలు చేస్తున్నదని, బెంగాల్‌లో మైనారిటీలను సంతృప్తి పరిచేందుకు హిందువులపై దాడులు చేస్తున్నారని, కేసులు పెట్టినా నమోదు చేయటం లేదని, దళిత, గిరిజనులకు అధికారంలో భాగం కల్పిస్తామని, తదితరాలను గురించి చెప్పారు.
స్వాతంత్య్రానంతరం ఎన్నడూ ఎరుగనంతటి కల్లోలాన్ని ఎదుర్కొంటున్న కాశ్మీర్‌లో శాంతిని పునరుద్ధరించటం గురించి, గోరక్షకుల పేరుతో దళితులను, ముస్లింలను కొట్టి చంపుతున్న గూండా గుంపులను ఖండిస్తూ ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
ఉమ్మడి పౌరస్మృతిని గురించి బిజెపి చేస్తున్న వాదన కపటంతో కూడుకొని ఉన్నది. అన్ని అంశాలలోనూ ముస్లింలు, ఇతర మైనారిటీలకు ప్రత్యేక హక్కులు ఇచ్చారని, హిందువులకు మాత్రం ఎటువంటి హక్కులూ లేకుండా అణచివేస్తున్నారని ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దేశ రాజ్యాంగాన్ని రూపొందించటం, అమలు చేయటంలో ఆ విధమైన వివక్ష చూపించలేదు. ఇండియన్ క్రిమినల్ కోడ్‌లో మతం, జాతి, మరితర విధాలుగా ఏ విధమై వివక్షా లేదు. నేరం చేసినవారు ఎవరైనా ఒకే విధమైన సెక్షన్ల కింద కేసును నమోదు చేస్తారు. న్యాయవ్యవస్థ కూడా మతాల ఆధారంగా ఎటువంటి వివక్షా చూపదు. మతాలతో నిమిత్తం లేకుండా ఒకే విధమైన నేరం చేసిన వారికి ఒకే విధమైన శిక్ష విధిస్తారు. రాజ్యాంగంలోనే మతపరమైన ఆచారాలు, సంప్రదాయాల ప్రాతిపదికగా వివిధ మతాల వారికి పర్సనల్ లాలకు అవకాశం కల్పించారు. ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో చెప్పారు. సుప్రీంకోర్టు కూడా వివిధ సందర్భాలలో ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలని చెబుతున్నది. సమాజంలో విస్తృత చర్చ జరిగి, వివిధ మతాలను అనుసరించే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలి మినహా, ఆ పేరుతో మెజారిటీ మతం ఆచారాలను, సంప్రదాయాలను మైనారిటీలపై బలవంతంగా రుద్దటం సరికాదు.
హిందుమతంలోని సంప్రదాయాలు, ఆచారాల పట్ల ఆర్‌యస్‌యస్, బిజెపిలు వ్యవహరిస్తున్న తీరు ఉమ్మడి పౌరస్మృతి పట్ల వారి కపటత్వాన్ని వెల్లడిస్తుంది. అభ్యుదయకరమైన మార్పుల పట్ల అసహనాన్ని ప్రదర్శించేవారు ఉమ్మడి పౌరస్మృతిని గురించి చెప్పేదానికి అర్థం ఉంటుందా? తమకిష్టమైన సనాతన సంప్రదాయాలను, ఆచారాలను హిందూత్వ పేరుతో ఇతర మతాల వారిపై బలవంతంగా రుద్దటమే వారి దృష్టిలో ఉమ్మడి పౌరస్మృతి. పురుషులతో సమానంగా తమకు కూడా హక్కులు కావాలని హిందూ మహిళలు చేస్తున్న ఆందోళనలు, అంటరానితనానికి వ్యతిరేకంగా దళితులు చేస్తున్న పోరాటాలు వారికి పట్టవు. మనుస్మృతి, భగవద్గీతలో చెప్పిన వాటిని అమలు జరపాలని కోరేవారికి, మహిళలకు సమానహక్కులు కావాలని, దళితుల పట్ల అమలు చేస్తున్న వివక్ష పోవాలని పోరాడుతున్న వారితో ఎలా కుదురుతుంది? రెెండు నాల్కలతో మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతిని గురించి ప్రచారం చేయటం ఆర్‌యస్‌యస్ కపటత్వాన్ని వెల్లడిస్తున్నది.
కేరళలో సిపియం కార్యకర్తలు తమ కార్యకర్తలపై దాడులు చేసి హత్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేరళలో సంఫ్‌ు పరివార్ చేస్తున్న హత్యాకాండను కప్పిపుచ్చి, వాస్తవాలను తలక్రిందులుగా చూపటమే ఈ ఆరోపణల సారాంశం. కేరళలో సంఫ్‌ు పరివార్ కార్యకర్తలు సిపియం కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని హత్యాకాండను కొనసాగిస్తున్నారు. వారి చేతిలో హత్యకు గురైన కార్యకర్తల జాబితాను సిపియం కేరళ రాష్ట్ర కమిటీ విడుదల చేసింది. ఆర్‌యస్‌యస్ సమావేశం కేరళలో జరుగుతున్న హత్యాకాండపై చేసిన తీర్మానం మతపరంగా సున్నితమైన, వివిధ మతాల వారు గణనీయంగా ఉండి సామరస్యంగా జీవిస్తున్న రాష్ట్రంలో మతఘర్షణలు రెచ్చగొట్టటం, మతోన్మాదాన్ని పెంచటమే లక్ష్యంగా ఉన్నది. కేరళలో రాబోయే రోజుల్లో సంఫ్‌ు పరివార్ వ్యవహరించనున్న తీరును ఈ తీర్మానం స్పష్టం చేస్తున్నది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా ఒక లక్ష్యాన్ని ఎన్నుకుని, దానికి అబద్ధాలతో ముద్రవేసి, దాన్ని నిజం చేయటానికి ప్రయత్నించటమే సంఫ్‌ు పరివార్ ఆచరణ తీరు. ఖైరానాలో అదే చేసింది. దాన్ని ఉపయోగించుకుని రానున్న యుపి, పంజాబ్ ఎన్నికలలో లబ్ధి పొందటానికి ప్రయత్నం చేస్తున్నది. కేరళలో అదే ఎత్తుగడను అమలు చేయటానికి పూనుకున్నది. తప్పుడు ప్రచారం చేస్తూ కేరళలో మత సామరస్యాన్ని దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నది. ఇదే ఎత్తుగడలను పశ్చిమ బెంగాల్‌లో మరో విధంగా అమలు చేయటానికి పూనుకున్నారు. మైనారిటీలను సంతృప్తి పరిచే విధానాలను అమలు చేస్తున్నారని, మెజారిటీగా ఉన్న హిందువులపై దాడులు చేస్తున్నారని ప్రచారం చేస్తూ, హిందువులను రెచ్చగొట్టటానికి ప్రయత్నిస్తున్నారు. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మైనారిటీల గురించి అతిగా ప్రచారం చేసుకొంటూ మతపరమైన విభజనలు పెరగటానికి దోహదం చేస్తున్నది. ఈ విధంగా బిజెపి, టిఎంసిలు తోడుదొంగల్లా మత విభజనలను పెంచటానికి పూనుకోవటంతో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ విభజనలు వామపక్ష, అభ్యుదయ ఉద్యమాలకు నష్టం కలిగిస్తున్నాయి. సిపియం, కమ్యూనిస్టు, వామపక్ష ఉద్యమాలకు బలమైన ఈ రెండు రాష్ట్రాలలో ఆ ఉద్యమాలను దెబ్బతీయటమే లక్ష్యంగా సంఘ పరివార్ వ్యవహరిస్తున్నది.
ఆర్‌యస్‌యస్ కపటత్వం గోరక్షణ గురించి చెప్పినదానిలో మరింత స్పష్టంగా వెల్లడైంది. గోరక్షక దళాలలోని వారికి రక్షణ కల్పించాలని సమావేశంలో డిమాండ్ చేసి, ముస్లింలు, దళితులపై గోరక్షక దళాల ముసుగులో గూండాలు జరుపుతున్న దాడులకు పరోక్షంగా మద్దతు తెలిపారు. దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితికి, వీరి డిమాండ్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనేక చోట్ల పోలీసులు, అధికారులు గో గూండాలకు మద్దతు తెలపటం లేదా తటస్థంగా ఉంటున్నారు మినహా బాధితులకు రక్షణ కల్పించటం లేదు. కేంద్ర ప్రభుత్వం గో గూండాలకు మౌనంగా మద్దతు తెలుపుతున్నది. ప్రస్తుతం ఈ గూండాల దాడులు, హత్యాకాండ నుంచి దళితులు, ముస్లింలకు రక్షణ కల్పించాల్సి ఉండగా గో గూండాలకు రక్షణ కావాలని డిమాండ్ చేయటం దళితులు, ముస్లింలపై వారు దాడులు చేస్తున్నారని స్పష్టమౌతున్నది.
స్వాతంత్య్రానంతరం ఏనాడూ ఎరుగని తీవ్రమైన పరిస్థితులు జమ్మూ కాశ్మీర్‌లో నెలకొని ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలు, నిరుద్యోగం, ప్రజల జీవన పరిస్థితులు, తదితర సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. గతంలో ఏనాడూ లేనంత పెద్దసంఖ్యలో ప్రజలలోకి వేర్పాటువాద భావాలు చొచ్చుకుపోయాయి. నెలల తరబడి రాష్ట్రంలో కర్ఫ్యూను అమలు చేశారు. ఈనాటికీ సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆందోళనలు వ్యాపించాయి. ప్రతిపక్షాల ఒత్తిడితో కాశ్మీర్‌కు అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్ళినా, ఆ సానుకూల వాతావరణాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. తన ఎన్నికల వ్యూహంలో కాశ్మీర్‌ను ఒక సమిధగా వినియోగించుకోవటానికి బిజెపి ప్రయత్నిస్తున్నది. దళితులు, గిరిజనులపై సానుభూతిని చూపటం కాదని, వారికి అధికారంలో భాగం కల్పించాలని చెప్పారు. గతం నుంచి దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతులు సాధించుకున్న వాటిని వమ్ముచేయటానికి సంఫ్‌ు పరివార్ ఒక పథకం ప్రకారం ప్రయత్నం చేస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇద్దరు కేంద్ర మంత్రుల ప్రమేయంతో జరిగిన రోహిత్ వేముల సంస్థాగత హత్య, జెయన్‌యులో కన్నయ్యకుమార్, ఇతర అభ్యుదయ భావజాలంతో ఉన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయటం, అరెస్ట్‌లు చేయించటం, వివిధ యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలలో విద్యార్థి నాయకులను వేధించటం ఆర్‌యస్‌యస్ నిజస్వరూపాన్ని వెల్లడి చేస్తున్నాయి. దళిత, గిరిజన ఉప ప్రణాళికలకు దామాషా ప్రకారం నిధుల కేటాయింపు, కేటాయించిన మొత్తాన్ని ఖర్చుచేయటం లేదు. బిజెపి ప్రభుత్వం ప్రణాళికా విధానాన్నే రద్దుచేయటం ద్వారా ఉప ప్రణాళికలకు అవకాశం లేకుండా చేస్తున్నది. ఈ విధంగా సుభాషితాలు వల్లిస్తూ, మరోవైపు మైనారిటీలను, దళితులను, అభ్యుదయవాదులను అణచివేసేందుకు నయవంచనతో వ్యవహరి స్తున్న సంఫ్‌ు పరివార్ కుట్రలను ప్రజలు అప్రమత్తతతో గమనిస్తూ ఉండాలి.
- ఎ కోటిరెడ్డి

No comments:
Post a Comment