కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరు 8వ తేదీ సాయంత్రం భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జాతినుద్దేశించి కూడా ప్రసంగించారు. కుడీఎడంగా అదే సమయంలో ఆర్థిక శాఖ ఒక పత్రికా ప్రకటన జారీ చేసింది. ''దేశంలో కరెన్సీ నోట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పెరిగిన నోట్లు ఉగ్రవాదులకు ఉపయోగ పడుతున్నాయి. స్మగ్లింగ్, దొంగ నోట్ల చెలామణి, ఆయుధ వ్యాపారం, మాదకద్రవ్యాల వ్యాపారం పెరిగిపోతోంది. భారత ఆర్థిక వ్యవస్థలో నల్లధనం పోగుపడేందుకు ఇవన్నీ సాధనాలుగా ఉపయోగ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పైన ప్రస్తావించిన పనులకు ప్రోత్సాహక వనరులుగా ఉన్న రిజర్వుబ్యాంకు ముద్రించిన రూ.500, రూ.1,000 నోట్లను మార్కెట్ నుంచి పూర్తిగా ఉపసంహరించాలి'' అని ఆర్థిక శాఖ నిర్ణయం వెనక ఉన్న సారాంశం. అంతేకాదు. ఎందుకంటే ''ఆర్థిక వ్యవస్థలోని ఇతర రూపాయి నోట్ల కంటే రూ.500, రూ.1,000 నోట్ల మోతాదు బాగా ఎక్కువగా ఉంది. ఎక్కువ మొత్తం విలువ కలిగిన నోట్లు అందుబాటులోకి వచ్చాక నల్లధనం మోతాదు పెరిగింది. ఈ చర్య నల్లధనాన్ని వెలికి తీసేందుకు దోహదం చేస్తుంది'' అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన సారాంశం.
ఎక్కువ విలువ కలిగిన రూ.500, రూ.1,000 నోట్లకు బదులు రూ.2,000 నోట్లు మార్కెట్లోకి ఈ నవంబరులోనే విడుదల చేయనున్నట్లు కూడా ఈ ప్రకటన వెల్లడిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న వాదనలో పస లేదని ఈ విషయాలు వెల్లడిస్తున్నాయి. వెయ్యి రూపాయల నోట్ల కారణంగా పెరిగిన నల్లధనం 2,000 రూపాయల నోట్లు చెలామణిలోకి వస్తే ఎలా తగ్గుతుందో ఆర్థిక శాఖకు, బిజెపి ప్రభుత్వానికే తెలియాలి. మార్కెట్లో రూ.500 నోట్లను వెనక్కు తీసుకోవటం ఇదే మొదటిసారి అయినట్లు వేయి తలల విషనాగు లాంటి బిజెపి బాకాలు ఈ నిర్ణయం వెనక దేశభక్తిని వెదుకుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారినందరినీ ఉగ్రవాద సమర్థకులుగానో లేదా దేశ ద్రోహులుగానో ముద్ర వేయటం ఈ ప్రచారం వెనక సారాంశం. దేశభక్తి, ఉగ్రవాదం పేరిట ప్రభుత్వం ఏ నిర్ణయమన్నా తీసుకోవచ్చన్నమాట. ఈ నిర్ణయాల సారాంశం ఏమిటి, ప్రజల జీవితాలపై వాటి ప్రభావం ఏమిటి అనే దాంతో వీరికి నిమిత్తం లేదు.
ఆర్థిక శాఖ ఇచ్చిన మూడు పేజీల ప్రకటనలో నవంబరు తొమ్మిదో తేదీన బ్యాంకులు పని చేయవని వెల్లడించింది. మరో వైపున తొమ్మిదో తేదీ నుంచి అన్ని బ్యాంకులు, రిజర్వుబ్యాంకు గుర్తింపు పొందిన అన్ని కరెన్సీ లావాదేవీ కేంద్రాల్లోనే ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను అందజేసి కొత్త నోట్లు పొందవచ్చు. ఈ పని చేయటానికి ముందు ప్రభుత్వం దేశంలో మొత్తంగా ఎంత విలువైన రూ.500, రూ.1,000 నోట్లు ఉన్నాయో అంచనా వేసి అంతే విలువకు తగ్గ ప్రత్యామ్నాయ నోట్లు మార్కెట్లో అందుబాటులోకి తెచ్చిందా అన్న ప్రశ్నకు ఈ కుహనా దేశభక్తుల వద్ద సమాధానం లేదు. అంతే కాదు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ మార్గం కూడా దేశంలో ఏ విధంగా నల్లధనాన్ని నిర్మూలిస్తుందో అన్న భేతాళ ప్రశ్న అలానే ఉంది. ఆర్థిక శాఖ ప్రకటనలో ప్రజలు తమ చేతుల్లో ఉన్న నోట్లను బ్యాంకు ద్వారానో, పోస్టాఫీసు ద్వారానో వేరే రూపంలోకి, నోట్లలోకి మార్చుకోవచ్చు అని వివరించింది. అంటే నా దగ్గర లక్ష రూపాయల విలువైన రూ.1,000 నోట్లు ఉంటే అంతే విలువైన 2,000 రూపాయల నోట్లు లేదా వంద రూపాయల నోట్లు నా చేతికొస్తాయి. మరి ఎవరి సొమ్ము విలువకు తగ్గ నోట్లు వారికి చేరుతున్నప్పుడు నల్లధనం తగ్గేది ఎలా? అంతేకాదు, ఎవరు ఎంత మొత్తంలోనైనా నోట్లు మార్చు కోవచ్చని అదే ప్రకటన వెల్లడిస్తోంది. నల్లధనంపై వేటు వేసే పేరుతో స్కూలు బిల్లులు, ఆస్పత్రి బిల్లులు, దైనందిన అవసరాల కోసం ఎటిఎం నుంచి డబ్బులు తీసుకునే చిన్న ఉద్యోగులు, దినసరి వేతన కార్మికులు, అసంఘటిత, వ్యవసాయ కార్మికులపై వేటు వేస్తోంది ప్రభుత్వం. లక్షాధికారులు, కోటీశ్వరులు మాత్రం తమ వద్ద ఉన్న ఎంత మొత్తమైనా బ్యాంకులో జమ వేయవచ్చు. వీళ్లు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చుకు ఎటువంటి సీలింగ్ లేదు. కానీ పేదలు మాత్రం బ్యాంకులో వారానికి రెండు వేల రూపాయలకు మించి సొమ్ము తీసుకోరాదు. ఈ రెండు చర్యల పర్యవసానం ఒక్కటే. బ్యాంకుల్లో రిజర్వు నిధులు పెంచుకోవటం. ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనం శతకోటీశ్వరుల కు అప్పుగా ఇచ్చి బ్యాంకులు ఖజానా ఖాళీ చేసుకున్నాయి. ఈ ఖజానాను నింపటానికి రానున్న ఐదేళ్లలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వం బ్యాంకు రీకాపిటలైజేషన్ పథకం ద్వారా ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం వద్ద అంత సొమ్ము ఉన్న పళంగా లేదు. కాబట్టి జన్‌ధన్ యోజన పేరుతో 37 వేల కోట్ల రూపాయలు సమీకరించాయి బ్యాంకులు. ఇవి కూడా చాలక రూ.500, రూ.1,000 నోట్ల రద్దు పేరుతో రానున్న రెండు మూడు నెల్లలలో మరో లక్ష కోట్ల వరకు ప్రజలే తమంతట తాము బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేలా ఒత్తిడి తేవటమే తప్ప ఈ చర్య మరోటి కాదు.
ఎక్కువ విలువ ఉన్న నోట్ల చెలామణితో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న మరో వాదనను బాకారాయుళ్ళయిన విశ్లేషకులు ముందుకు తెచ్చారు. గత రెండున్నర సంవత్సరాల తమ పాలనకు ఆర్థిక వ్యవస్థ మురిసిపోయి ద్రవ్యోల్బణం తగ్గించిందని ఇదే ప్రభుత్వం అటు పార్లమెంటులోనూ, ఇటు అంతర్జాతీయ ఆర్థిక వేదికల మీదా కబుర్లు చెప్పింది కదా... మరి ఇందులో ఏది నిజం అన్నది పాఠకులే తేల్చుకోవాలి. 2004లో ప్రజల చేతుల్లో చెలామణిలో ఉన్న వివిధ నోట్ల విలువ కేవలం రూ.4,23,124 కోట్లు. 2016 నాటికి ఇది రూ.15,93,80 కోట్లకు చేరింది. ఇదే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ అంగల పంగల మీద విస్తరించిందని అటు ప్రభుత్వం, ఇటు ప్రపంచ బ్యాంకు వంటి నయా ఉదారవాద మేధో ప్రపంచం ఘోషించింది. ప్రజల చేతుల్లోకి ఈ విధంగా చేరిన మొత్తం దొంగనోట్ల రూపంలో చేరితే ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ప్రచారం బోగస్ ప్రచారం అని ప్రభుత్వం అంగీకరిస్తుందా? 2006 నుంచి 2016 వరకు ఉన్న కరెన్సీ లెక్కలు పరిశీలిస్తే ప్రతి మూడు నాలుగేళ్లలో ప్రజల వద్దకు అదనంగా మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ చేరుతోంది. ఇందులో ఆందోళన చెందాల్సిన ధోరణి ఏమీ కనిపించటం లేదు.
నయా ఉదారవాద ఆర్థిక ప్రమాణాల ప్రకారం ప్రజల చేతుల్లో రొక్కం ఉండకూడదు. ఉన్న సొమ్మంతా బ్యాంకుల్లోనో, కరెన్సీ ఆధారిత ఆస్తుల్లోనో, ప్రభుత్వ సెక్యురిటీస్లోనో నిల్వ ఉండాలి. దీనికి భిన్నంగా ప్రజల చేతుల్లో రొక్కం పేరుకు పోవటం అంటే ప్రజలకు ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లటమే. ఈ నయా ఉదారవాద ప్రమాణాల మేరకే ప్రభుత్వం దేశీయ ఆర్థిక విధానాలు గత పాతికేళ్లుగా రూపొందిస్తోంది. అంటే గత రెండేళ్లలో ప్రజలకు బిజెపి సారథ్యంలోని ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లింది. ఈ విషయాన్ని నిజాయితీగా అంగీకరించటానికి సిద్ధపడని బిజెపి ప్రభుత్వం నల్లధనంపై కుహనా పోరాటం పేరుతో సామాన్య ప్రజలు కాయకష్టం చేసుకుని దాచుకున్న సొమ్మును కాజేయటానికి పూనుకొన్నది. దీని పర్యవసానమే తాజా చర్య. ఈ చర్య వల్ల ప్రజల కొనుగోలు శక్తికి చాలా పరిమితులు ఏర్పడనున్నాయి. కుటుంబ ఆర్థిక చట్రాలు కుప్పకూలనున్నాయి. ఇటువంటి తాత్కాలిక చర్యల ద్వారా ప్రజల సొమ్ము కాజేసేందుకు బదులుగా బిజెపి ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారం అయిన సాధారణ ప్రజల చేతుల్లో ఎక్కువ మొత్తం నిధులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కుతుంది.
- కొండూరి వీరయ్య

No comments:
Post a Comment