పెద్దనోట్ల రద్దు వెనుక మతలబు అర్థం చేసుకోవాలంటే ముందు బ్యాంకులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. బ్యాంకు డబ్బు అప్పుతీసుకునే సంస్థ లాంటిది. అది ఏ వడ్డీలేకుండానూ (కరెంట్ అకౌంట్), తక్కువ వడ్డీకీ (సేవింగ్స్ అకౌంట్- 4%), లేదా తగుమాత్రమైన వడ్డీరేటుకీ (టెర్మ్ డిపాజిట్స్) డబ్బును అప్పుగా తీసుకుని, రుణగ్రహీతలకు ఎక్కువ వడ్డీ రేట్లకు తిరిగి అప్పుగా ఇస్తుంది.
ఒక బ్యాంకుకు 80 - 90% దాకా తన ఖాతాదారుల డిపాజిట్ల ద్వారానే (కరెంట్, సేవింగ్స్, లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్లోనికి) నిధులు సమకూరుతాయి. వీటిలో 50% వరకూ సి.ఎ.ఎ్‌స.ఎ (కరెంట్ అకౌంట్-సేవింగ్స్ అకౌంట్)లోనే ఉంటుంది. తక్కిన నిధులు షేర్‌హోల్డర్ల నుంచీ, సెంట్రల్ బ్యాంకు నుంచీ, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచీ లభిస్తాయి. సి.ఎ.ఎ్‌స.ఎ నిష్పత్తి ఎక్కువగా ఉంటే అది బ్యాంకుకు మంచిది. ఎందుకంటే బ్యాంకుకు తక్కువ వ్యయంతో డబ్బు సమకూరుతుంది. తక్కిన మార్గాల్లో వచ్చే డబ్బు ఎక్కువ వడ్డీరేట్లకు వస్తుంది కాబట్టి అది బ్యాంకుకు బలం కాదు.
బ్యాంకులు తమ వద్ద డిపాజిట్‌గా ఉన్న మొత్తం డబ్బును రుణగ్రహీతలకు అప్పుగా ఇవ్వలేవు. అదే జరిగితే ఖాతాదారులు తమ డబ్బును వితడ్రా చేసుకోవాలనుకున్నప్పుడు వారికి ఇవ్వడానికి ఏమీ ఉండదు. కాబట్టి బ్యాంకులు తమ డిపాజిట్లలో నిర్దేశిత శాతాన్ని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచాలి. దీన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. అంతేగాక తమ డిపాజిట్లలో నిర్ణీత భాగాన్ని నగదు, బంగారం, లేదా పూచీకత్తుల రూపంలో ఉంచాలి. దీన్ని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్.ఎల్.ఆర్) అంటారు. ఇవిపోగా, మిగతా డబ్బునే బ్యాంకులు రుణాలుగా ఇస్తాయి. బ్యాంకులు తాము సమీకరించిన డిపాజిట్లలో ఎంత శాతాన్ని బయటకు రుణాలుగా ఇస్తున్నాయో తెలిపే నిష్పత్తే క్రెడిట్ డిపాజిట్ రేషియో. దీని ద్వారా బ్యాంకులు మూల నిధుల్లో ఎంత శాతాన్ని రుణాలుగా ఇస్తున్నాయో తెలుస్తుంది. ఈ క్రెడిట్ డిపాజిట్ రేషియో 70శాతాన్ని దాటిందంటే బ్యాంకు మీద ఒత్తిడి పడుతున్నట్టే. ఎందుకంటే అవి అప్పటికే తమ నిధుల్లో కాష్ రిజర్వ్ రేషియోగా 4శాతాన్నీ, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోగా 21శాతాన్నీ తప్పనిసరిగా పక్కకుతీసి వుంచాలి. క్రెడిట్ డిపాజిట్ రేషియో మరీ ఎక్కువ ఉండటం పెట్టుబడిలోటుకు కూడా సూచన. ఫలితంగా మరింత పెట్టుబడి సమీకరించాల్సిన ఒత్తిడి బ్యాంకులపై పడుతుంది.
ఈ బేసిక్స్ అర్థం అయ్యాయి కనుక, ఇప్పుడు ఆట ఎలా ఆడుతున్నారో చూద్దాం. ఆర్థిక విపణిలో 70% ప్రభుత్వ రంగ బ్యాంకులదే. కార్పొరేట్లు ఈ బ్యాంకుల నుంచి డబ్బులు రుణంగా తీసుకుంటున్నాయి, తిరిగి చెల్లించటం లేదు. 90 రోజులపాటు వడ్డీ చెల్లింపు/ వాయిదాల చెల్లింపు జరగకపోతే ఆ రుణాన్ని నిరర్థక ఆస్తి (ఎన్.పి.ఎ- నాన్ ఫెర్మార్మింగ్ అసెట్)గా పరిగణిస్తారు. ఒక కంపెనీపై ఈ ముద్రపడితే ఇక దానికి బ్యాంకుల నుంచి రుణం దొరకటం కష్టమవుతుంది. కానీ బ్యాంకుల అలవాటేమిటంటే- రుణం వెనక్కు రావటంలో సమస్య కనపడిన వెంటనే దాన్ని ‘రీస్ట్రక్చర్డ్ లోన్స్’ అనే బుట్టలో పడేస్తాయి. అంటే, రుణ గ్రహీతలకు అనుకూలంగా ఉండేలా వడ్డీ రేట్లు, నిబంధనల్లో వెసులుబాటు కల్పిస్తూ రుణ ఒప్పందాన్ని పునర్వవస్థీకరించటం. ఇది ఇటు బ్యాంకుల సౌలభ్యం కోసమూ, అటు ఆశ్రిత పెట్టుబడిదారుల కోసమూ జరిగే ఒక సాంకేతిక సర్దుబాటు. దీనివల్ల పెట్టుబడిదారులు బ్యాంకు నుంచి మరింత రుణాన్ని తీసుకోగలుగుతారు. దీనివల్ల బ్యాంకులకు ఏం ప్రయోజనం? బ్యాంకులు మొండి బకాయిల్ని దాచేసి, అసలు బాలెన్స్ షీటు కన్నా ఆరోగ్యవంతమైన బాలెన్స్ షీటును చూపించగలుగుతాయి. వనరులు సంకట స్థితిలో పడ్డాయన్న విషయం తెలిస్తే డిపాజిటర్ల విశ్వాసం సడలుతుంది, వెంటనే నగదు ఉపసంహరణలు మొదలవుతాయి, బ్యాంకు దివాలా తీస్తుంది.
బ్యాంకులపై రాజ్యం ఒత్తిడి కూడా ఉంటుంది. రుణాల్ని సక్రమంగా తీర్చక అపఖ్యాతిపాలైన కంపెనీలకు మరలా రుణాలిచ్చేలా అది ఒత్తిడి తెస్తూం టుంది. ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ (క్రోనీ కాపిటలిజం) అలాగే పనిచేస్తుంది. ఈ కంపెనీలు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారానికి నిధులిస్తాయి, అధికారంలోకి వచ్చాక సదరు పార్టీ బ్యాంకుల నుంచి భారీ రుణాలిప్పించటం రూపేణా ఆ కంపెనీ రుణాన్ని తీర్చుకుంటుంది. ఇక్కడితో ఆగదు, ప్రభుత్వం ఈ కంపెనీలు అంతకుముందు తీసుకున్న రుణాలను మాఫీకూడా చేయిస్తుంది. 2013- 15 సంవత్సరాల మధ్య 20 ప్రభుత్వరంగ బ్యాంకులు మొత్తం లక్షా 14వేల కోట్ల రూపాయల మొండి బకాయిల్ని మాఫీ చేశాయి. ఈ మాఫీలు చేయమని ఆ బ్యాంకుల చేతుల్ని మెలితిప్పింది ఎవరు? ఇంకెవరు, ప్రభుత్వమే. ఇంతే అనుకున్నారా, ప్రభుత్వం ఈ ఆశ్రిత పెట్టుబడిదారులు చెల్లించాల్సిన పన్నులను కూడా (కార్పొరేట్ ఆదాయ పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీస్) మాఫీ చేస్తుంది. ఎంతనుకుంటున్నారు? ఒక్క ఆదాయపన్నునే తీసుకున్నా రోజుకు రూ.168కోట్లు. ఇవి నా లెక్కలు కావు. ప్రతీ ఏటా బడ్జెట్ పత్రంలో పేర్కొనే లెక్కలు. బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారం 2013-14 సంవత్సరానికి ప్రభుత్వం మొత్తం 5లక్షల 32వేలకోట్ల రూపాయల కార్పొరేట్ పన్నును మాఫీ చేసింది. ఇది యూపీఏ పాలనలో.
బీజేపీ అధికారంలోకి వచ్చాక 2014-15లో మాఫీ అయిన కార్పొరేట్ పన్ను 5లక్షల 89వేల కోట్ల రూపాయలకు పెరిగింది. గత 10ఏళ్లలో మాఫీ అయిన కార్పొరేట్ పన్నులన్నీ కూడుకుంటే మొత్తం 42లక్షల కోట్ల రూపాయలకు చేరుతుంది- అంటే రోజుకు రూ.1,110కోట్లు! అవును, ప్రతి రోజూ కార్పొరేట్లు అంత మొత్తాన్ని దోచుకుంటున్నాయి! మీరు మాత్రం పన్నులు కడుతూనే ఉంటారు, బ్యాంకుల ముందు వితడ్రాయల్స్ క్యూలు కడుతూనే ఉంటారు, అది కూడా ఒకమారుకి రూ.2500 పరిమితితో!
రఘురామ్ రాజన్ రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా నియమితులైనపుడు ఆయన ఈ మొండి బకాయిల సమస్యని త్వరలోనే గ్రహించారు. అప్పుడు దొర్లిపడ్డాయి అటకమీంచి కపాలాలు! కేవలం ఒక్క త్రైమాసికంలోనే (జనవరి-మార్చి 2016) ఏకంగా రూ.2లక్షల కోట్ల స్థూల నిరర్థక ఆస్తులు (జి.ఎన్.పి.ఎ) లెక్కతేలాయి. ఫలితంగా మార్చి2016 నాటికి బ్యాంకుల మొత్తం జి.ఎన్.పి.ఎ రూ.5,94,929కోట్లకు చేరింది. అంటే 6లక్షల కోట్ల మొండి బకాయిలు. వీటిలో 90% బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకులవే. తక్షణ చికిత్స చేయకుంటే వీటి యజమాని అయిన ప్రభుత్వం తీవ్ర పెట్టుబడిలోటును ఎదుర్కొంటుంది. రాజన్ బ్యాంకులకు తమ బాలెన్స్ షీట్స్‌ను శుద్ధి చేసుకొనేందుకూ, మొండి బకాయిల మొత్తం వివరాలు వెల్లడించేందుకూ మార్చి 2017ను గడువుగా విధించారు.
సమస్యకు రెండు కోణాలున్నాయని రాజన్ అర్థం చేసుకున్నారు. మొదటిది- బ్యాంకులు గోళ్లుగిల్లుకుంటూ నిరర్థక ఆస్తులను సాంకేతికంగా ‘రీస్ట్రక్చర్డ్ లోన్స్’ అనే బుట్టలోకి పడేయటం. రెండోది- ఆశ్రిత పెట్టుబడిదారులకు రుణాలిచ్చేలా రాజకీయ నాయకులు బ్యాంకులపై ఒత్తిడి తేవటం. ఈ రెండో సమస్య రాజన్ అధికార పరిధిలోకి రాదు. కాబట్టి ఆయన మొదటిదానిపై దృష్టిపెట్టారు. మొండి బకాయిలపై విధించే ప్రతిబంధకాలనే రీస్ట్రక్చర్డ్ లోన్స్‌పై కూడా విధించేట్టు, మొండి బకాయిలు మరలా రీస్ట్రక్చరింగ్ వైపు వెళ్లే పక్షంలో రుణమొత్తంలో 15శాతాన్ని పక్కకు తీసివుంచేట్టు బ్యాంకులను ఆదేశించారు. అంతకుముందు బ్యాంకులు సమస్యాత్మకమైన రుణాల్ని (ముఖ్యంగా నిర్మాణ రంగానికి సంబంధించినవి) రీస్ట్రక్చర్డ్ రుణాల విభాగంలోకి నెట్టేసేవి. కానీ రాజన్ కళ్లాలు చేపట్టాకా అది ఇక సాధ్యం కాలేదు. ఇది ఆశ్రిత పెట్టుబడిదారులకు కంటగింపయ్యింది. ఈ సమస్యకు పరిష్కారం తెలిసిన వ్యక్తిని వ్యవస్థ నుంచి గెంటివేశారు. అదీ వారి శక్తి. బ్యాంకులు తమ సొరుగుల్ని తగినంతపెట్టుబడితో నింపుకోలేకపోతే, దివాలా తీయడమే దిక్కు.
మరి ఇంత డబ్బు ఎక్కడ్నించి వస్తుంది? 70 శాతానికి పైగా ప్రభుత్వాధీనంలోనే ఉన్న బ్యాంకులకు పెట్టుబడి సమకూర్చడమనేది నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందున్న పెద్ద సమస్య. కృశిస్తున్న బ్యాంకుల ఈ పెట్టుబడి సమస్యను ఎలాగైనా తీర్చాలన్న కంగారులో ప్రభుత్వం ఒక పెద్ద పొరబాటు నిర్ణయం తీసుకుంది. మీడియా దాన్నే ‘మాస్ట్రర్ స్ట్రోక్’ అని కొనియాడుతోంది. సామాన్యుల్లో గందరగోళం రేపుతూ కరెన్సీ నోట్ల రద్దును అమల్లోకి తెచ్చింది. బ్యాంకుల్లో డిపాజిట్లు వెల్లువెత్తాయి. 4 రోజుల్లోనే 3లక్షల కోట్లు డిపాజిట్ అయ్యాయి. అయితే, ఈ డిమానెటైజేషన్ అనేది లోతైన సమస్యకు ఉపరితల పరిష్కారం మాత్రమే. ఈ డిపాజిట్లు సి.ఎ.ఎ్‌స.ఎ విభాగంలోకి వెళతాయి. డబ్బును డిపాజిటర్ ఎప్పుడు కావాలన్నా వెనక్కు తీసుకోగలడు. ప్రస్తుతానికి వితడ్రాయల్స్ మీద పరిమితి విధించటం ద్వారా ప్రభుత్వం డబ్బును నిలబెట్టుకుంటున్నది. అది లేనప్పుడు ప్రజలు తమ డబ్బును వెనక్కు తీసేసుకుంటారు, సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఇప్పుడు అడగాల్సిన అసలు ప్రశ్న- ఎన్నాళ్ల దాకా ప్రభుత్వం వితడ్రాయల్స్ మీద ఈ పరిమితిని కొనసాగిస్తుంది? దాని వల్ల ద్రవ్యకొరత పెరిగిపోదా? ప్రజలు ఉన్న కొద్దిమాత్రపు డబ్బునూ నెలసరి వెచ్చాలకు మాత్రమే వినియోగిస్తూ, మొబైల్స్, టీవీలు, కార్లు మరే ఇతర ఉత్పత్తులనూ కొనరు కాబట్టి- ఆర్థిక సంక్షోభానికి దారితీయదా? ఏ హేతుబద్ధపైన ప్రణాళికా లేకుండా అమల్లోకి తెచ్చిన ఈ నిర్ణయం ఉత్పత్తి రంగానికి భారీ దెబ్బ కాదా? దీనివల్ల ఉత్పత్తి రంగం నుంచి వెల్లువెత్తే పింక్ స్లిప్పుల కారణంగా నిరుద్యోగం పెరగదా? ఈ పరిస్థితి 50 రోజుల్లో చక్కబడుతుందని ప్రభుత్వం అంటోంది. ఎలా? ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం అక్టోబర్ నెలాఖరునాటికి మొత్తం రూ.17,50,000కోట్ల కరెన్సీ నోట్లు చెలామణీలో ఉన్నాయి. ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసి మార్కెట్లో ఉన్న 14 లక్షల యాభైవేల కోట్ల రూపాయలను (84%) చెల్లకుండా చేసింది. కరెన్సీ సంక్షోభం ఏర్పడింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం మొదటి నాలుగు రోజుల్లోనూ రూ.50వేల కోట్లు వినియోగదారుల చేతుల్లోకి వెళ్లింది. ఇంకా 14లక్షల కోట్ల రూపాయల లోటు అలాగే ఉంది. ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో మొదలై, అక్టోబర్ 2016 నాటికి ఆర్.బి.ఐ మొత్తం 480మిలియన్ల రూ.2000 కరెన్సీ నోట్లనూ, అంతే సంఖ్యలో కొత్త 500 కరెన్సీ నోట్లనూ ముద్రించింది. ఈ నోట్ల మొత్తం విలువ= 96,000కోట్లు (2000 నోట్లు) +24,000కోట్లు (500నోట్లు)= లక్షా 20వేల కోట్లు. ఇవి ముద్రించడానికి పట్టిన కాలం రమారమి 50రోజులు. ఇదే పద్ధతిన కొనసాగితే, ఆర్థిక వ్యవస్థను నవంబరు 8కు పూర్వ స్థితికి తీసుకువెళ్లేందుకు కావాల్సిన, మిగిలిన 12లక్షల 80వేల కోట్లనూ ముద్రించేందుకు మొత్తం 500రోజుల (అంటే ఏడాదిన్నర) సమయం పడుతుంది. కానీ మన ప్రస్తుత కరెన్సీ లోటైన 14లక్షల కోట్లనూ వచ్చే 50 రోజుల్లోనే ముద్రించేస్తానని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. -ఫర్హాన్ రహ్మాన్ (ఆంధ్ర జ్యోతి)

No comments:
Post a Comment