Saturday, 26 November 2016

|| మాములు కుటుంబం నుంచి మహానేతగా ఎదిగిన కాస్ట్రో ||


ఫైడల్‌ కాస్ట్రో అత్యున్నత నాయకుల్లో ఒకరు. ఆయన పేరే సామ్రాజ్యవాద వ్యతిరేక స్ఫూర్తికి, సాహసానికి సంకేతం. అమెరికాకు అతిదగ్గరగా ఉన్న అతి చిన్న దేశమైన క్యూబాను సోషలిస్టు పథంలో అంచెలంచెలుగా నడిపిం చించిన మహానేత ఆయన. 

ఫైడల్‌ కాస్ట్రో ఓరియంటే రాష్ట్రంగా పిలిచే ఉత్తర మధ్య క్యూబాకు చెందిన బిరాన్‌ అనే వ్యవసాయ క్షేత్రంలో 1926లో జన్మించారు. తండ్రి ఏంజెల్‌. వారిది మతపరమైన కుటుంబం. తల్లిదండ్రుల్లో తల్లిలో మత భావాలు మరింత గాఢంగా ఉండేవి. కాస్ట్రోకు మూడేళ్లు నిండే టప్పటికే తల్లిదండ్రులు బడిలో చేర్చారు. ఆ తరు వాత శాంటియాగో డి క్యూబాకు పంపారు. అక్కడి చదువుతో ఇబ్బందులనూ, కష్టాలనూ తట్టుకొని నిలబడటం, త్యాగాలకు సిద్ధపడటం వంటి లక్షణాలు అబ్బాయి. అక్కడ టీచర్లు, స్కూలు అధికారులు విద్యార్థులను తరచూ కొట్టేవారు. విద్యార్థులపై హింసాధోరణిని కాస్ట్రో అవగతం చేసుకున్నాడు. ఓ రోజు బ్రదర్‌ మానిటర్‌ బడిలో కాస్ట్రో రెండు చెంపలూ వాయించాడు. కాస్ట్రో.. మానిటర్‌ మీద తిరగబడ్డాడు. ఇద్దరూ కొట్టుకున్నారు. తరువాత ఆ స్కూల్లో చదవకూడదని కాస్ట్రో నిర్ణ యించుకున్నాడు. 

కాస్ట్రో 16 ఏళ్ల వయసులో క్రీడల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బాస్కెట్‌బాల్‌, సాకర్‌, బేస్‌బాల్‌, ట్రాక్‌ అండ్‌ ఫీల్డు వంటి అన్ని విభాగాల్లో పాల్గొనేవాడు. ఆయన అభిమాన అంశాలు క్రీడలతోపాటు అన్వేషణా యాత్రలు, పర్వతా రోహణ, శిబిరాల నిర్వహణల్లో అయన చురుగ్గా ఉండేవాడు. 1945లో ఆయన పట్టభద్రు డయ్యాడు. అంతకుకొద్ది సంవత్సరాల ముందు స్పెయిన్‌ అంతర్వ్యుద్ధం ముగి సింది. యుద్ధంలో భయానక గాథల గురించి, జాతీయవాదుల గురించి, ప్రీస్టుల ను కాల్చి చంపడం గురించి అక్కడ బాగా చర్చ జరిగింది. అయితే కాల్చివేసిన కమ్యూనిస్టుల గురించి మాట్లాడుకోలేదు. కమ్యూనిజం గురించి అప్పుడే ఆయన వినడం. ఈ నేపథ్యంలో కాస్ట్రో యూనివర్సిటీ రాజకీయ కార్యక్రమాలను ఆర్గనైజ్‌ చేయడం మొదలుపెట్టారు. విద్యార్థి యూనియన్‌ ఎన్నికల్లో కూడా పోటీచేశారు. స్టూడెంట్‌ ప్రతినిధిగా అత్యధిక మెజారిటీతో గెలిచారు. అదే సమయానికి గ్రావ్‌ ప్రభుత్వంతో విసిగిపోయిన బిచా అర్థోడాక్స్‌.. పార్టీలో చీలికతెచ్చి తన సారధ్యంలో కొత్త పార్టీ ఏర్పరిచాడు. దానిపేరు క్యూబన్‌ పార్టీ. అప్పటికే కాస్ట్రో బృందం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తోంది. ఆ సమయంలో యూనివర్సిటీ నాయకులు ప్రభుత్వ పదవుల్లో ఉన్నారు. యూనివర్సిటీలో మాఫియా ముఠాల అధీనంలోకి వెళ్లింది. కాస్ట్రో ఒంటరి అయ్యారు. తరువాత కాస్ట్రోను యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. 

తరువాత కేయో కన్‌ఫైట్స్‌ తిరుగుబాటు సంభవించింది. ఆ సమయంలో అధ్యక్ష భవనం వద్ద గ్రావ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతుండగా కాస్ట్రోను ఫొటో తీశారు. పరిస్థితులు దిగజారాయి. ఆర్ఫిలా మారణకాండ జరిగింది. కాస్ట్రో బృందం డొమినికన్‌ రిపబ్లిక్‌ వైపుగా వెళ్తుండగా చొరబాటు యత్నం విఫలమైంది. దాంతో వారిని వదిలివెళ్లేవారి సంఖ్య ఎక్కువైంది. అప్పటినుంచే కాస్ట్రో మదిలో గెరిల్లా యుద్ధం గురించి ఆలోచనలు రూపుదిద్దుకోసాగాయి. రాజకీయ శిక్షణ ఇవ్వడం, విప్లవకర చైతన్యాన్ని పెంచడం, యుద్ధం, స్వాతంత్య్రం అనే విషయాలపై గట్టి అభిప్రాయాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆర్థికాంశాల గురించీ, పెట్టుబడి దారీ విధానంలోగల అసంబద్ధతల గురించీ తెలుసుకోగలిగాడు. అందుకే మార్క్స్‌ సుప్రసిద్ధ రచన కమ్యూనిస్టు మానిఫెస్టోని చదివాడు. తరువాత అర్థోడాక్స్‌ పార్టీని స్థాపించగా అందులో చేరారు. తరువాత కాలంలో స్టోషలిస్టుగా మారారు. అర్థోడాక్స్‌ పార్టీలో సోషలిస్టులు ఒక వామపక్షం. 

1952 మార్చి 10న ఫుల్‌జెన్సియా బాటిస్టా సైనిక తిరుగుబాటు జరిగింది. అమెరికా మద్దతుతో కొనసాగుతున్న ఆ నియంతృత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసేందుకు విప్లవ సంస్థను నిర్మించడానికి కాస్ట్రో నడుంకట్టారు. 1953 జూలై 26న శాంటియాగో డి క్యూబాలోని కంకోడా సైనిక దుర్గంపై దాడికి నాయకత్వం వహించారు. ఆ దాడి విజయవంతంకాలేదు. కాస్ట్రోతోపాటు మరో 24 మందిని ప్రభుత్వం బంధించింది. దోషులుగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. మంకోడా దాడి సమయంలోనూ, ఆ తర్వాత బాటిస్టా సైనికులు 60 మంది విప్లవకారులను హత్య చేశారు. విచారణ సమయలో తాను నిర్దోషినని చరిత్ర రుజువు చేస్తుందని ప్రసంగించారు. జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రసంగాన్ని పుస్తక రూపంలో తెచ్చారు. అవి వేల సంఖ్యలో జనానికి చేరాయి. జులై 26 ఉద్యమానికి అదే కార్యక్రమం అయ్యింది. కాస్ట్రోకూ, ఆయన సహచరులకూ 15 ఏళ్ల జైలు శిక్ష పడినప్పటికీ ప్రజా ఒత్తిడి మూలంగా రెండేళ్లకే విడుదల చేయాల్సి వచ్చింది. 1955 జూలై 7న కాస్ట్రో మెక్సికో బయలు దేరారు. అక్కడ గ్రాన్మా అనే నౌకలో 81 మంది పోరాట యోధులతో 1956 డిసెంబర్‌ 2న క్యూబా చేరుకున్నారు. ఆయన సోదరుడు రావుల్‌, చేగువేరా, కామిల్లో సియన్‌ ఫూగస్‌, జావాన్‌ ఆల్‌మైడా, జీసన్‌ మొంటానే మొదలైనవారు కాస్ట్రోతోపాటు ఉన్నారు. జూలై 26 ఉద్యమానికి ప్రధాన నాయకునిగా ఉండటంతోపాటు ఆ తర్వాత రెండేళ్లపాటు కొనసాగిన ఎర్రసేన కార్యకలాపాలకు ఆయన నేతృత్వం వహించారు. తొలుత ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ ఆ తరువాత గెరిల్లా యోధులు తమ బలాన్ని పునర్నిర్మించుకున్నారు. సియర్రా మాయస్ట్రా పర్వతాల నుంచి 1958 చివరి నాటికి మొత్తం క్యూబా ద్వీపం అంతటికీ విస్తరించగలిగారు. 1959 జనవరి 1న బాటిస్టా క్యూబా వదిలి పారిపోయాడు. కాస్ట్రో పిలుపు మేరకు లక్షలాది మంది ప్రజలు సార్వత్రిక సమ్మె పోరాటంలో పాల్గొని విజయవంతం చేశారు. విప్లవం విజయవంతం కావడానికి ఆ సమ్మె దోహదపడింది. విజయం సాధించిన తిరుగుబాటు సైన్యం నేతగా కాస్ట్రో జనవరి 8న హవానాలో అడుగుపెట్టారు.

|| ఏకతాటిపైకి విప్లవ గ్రూపులు ||

నాడు క్యూబాలో చెల్లాచెదురుగా వున్న విప్లవ గ్రూపులను ఒక్కతాటిపైకి చేర్చేందుకు ప్రయత్నించిన ఫైడల్‌ కాస్ట్రో కొత్త క్యూబన్‌ కమ్యూనిస్టు పార్టీని అందుకు వేదికగా మల చారు. తొలి ప్రధాన కార్యదర్శిగా తానే సారధ్య బాధ్యతలను స్వీకరించారు. 60వ దశకంలో కాస్ట్రో క్యూబా విప్లవాన్ని లాటిన్‌ అమెరికా దేశాలకు విస్తరించారు. 70వ దశకంలో ఆఫ్రికా లో పశ్చిమదేశాల ఆధిపత్యాన్ని ఎదిరించేందుకు కాస్ట్రో క్యూబా దళాలను పంపారు. ఆ తరువాతి కాలంలో పేదలకు సేవలందించేందుకు ఆయన క్యూబా వైద్య నిపుణులను కూడా పంపారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు కూడా చల్లబడటంతో లాటిన్‌ అమెరికా, ఐరోపాకు చెందిన అనేక దేశా లు క్యూబాతో దౌత్య సంబంధాలను పునరుద్ధరిం చుకున్నాయి. 90వ దశకం ప్రధ మార్థంలో రెండో పోప్‌జాన్‌పాల్‌ అధికారికంగా క్యూబాలో పర్యటించారు. పర్యాట కాభివృద్ధి దన్నుతో క్యూబా ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకోవటంతో కాస్ట్రో ప్రభుత్వ నియంత్రణలను సడలించి కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం చేశారు. 

1959 ఫిబ్రవరి 10న ఆయన క్యూబా ప్రధాని అయ్యారు. ఆ పదవిలో 1976 వరకూ కొనసాగారు. ఆ తరువాత ఆయన దేశాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2008 వరకూ ఆ పదవిలో ఉండి వయసు మీద పడటంతో ఆ స్థానంలో ఆయన సోదరుడు, విప్లవ సహచరుడు రావుల్‌ కాస్ట్రో క్యూబా సారధ్య బాధ్యతలు స్వీకరించారు. ప్రజాజీవితంలో నిప్పు కణికలా కన్పించే కాస్ట్రో ప్రైవేటు జీవితాన్ని నిరాడంబరంగా గడిపేందుకు ప్రయత్నించారు. 1956లో తన మొదటి భార్య డయాజ్‌ బాలర్ట్‌తో విడాకులు తీసుకునే సమయానికి కాస్ట్రో దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ తరువాత దాదాపు నాలుగు దశాబ్దాలు డాలియా సోటో డెల్‌ వాలెతో సహజీవనం సాగించిన కాస్ట్రోకు ఐదుగురు కుమారులు జన్మించారు. 1980లో వివాహం చేసుకున్నారు.

No comments:

Post a Comment