చరిత్రలో మంచి వ్యక్తిగా, రాజకీయంగా సరైన వైఖరి తీసుకున్నవాడిగా ఉండిపోవాలని కాస్ట్రో అనుకున్నాడు. ప్రపంచీకరణను, అమెరికాను తుదకంటా రాజీలేకుండా వ్యతిరేకించిన వ్యక్తిగా చరిత్ర తనను గుర్తించాలన్నది ఆయన తపన. ఆ కోరికే, అటువంటి నిబద్ధతే అతన్ని అంతర్జాతీయస్థాయి చారిత్రక వ్యక్తిగా నిలిపింది.
క్యూబా రాజధాని హవానాలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల్లోనూ ఆయా దేశాల పతాకాలు అవనతమై ఉన్నాయి, ఈ మధ్యే దౌత్యసంబంధాలు పునరుద్ధరించుకున్న అమెరికన్ పతాకం మాత్రమే సంతాపాన్ని ధిక్కరిస్తూ ఎగురుతోంది. మరో సందర్భంలో అయితే ఒబామా కొంత చొరవ తీసుకుని స్పందించేవాడేమో కానీ, ఎన్నికలు జరిగి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికై నిరీక్షిస్తున్న సమయంలో ఆచితూచి వ్యవహరించక తప్పడం లేదు. కాస్ట్రో ప్రభావాన్ని భవిష్యత్తు నిర్ణయిస్తుందని తటస్థ అనధికార ప్రకటన చేసిన ఒబామా, అంత్యక్రియలకు కూడా అనధికార ప్రతినిధి బృందాన్నే పంపుతున్నాడు. పాశ్చాత్యప్రపంచంలో పెరిగిపోతున్న మితవాద ఉన్మాదాన్ని ప్రతిఫలిస్తూ, కాస్ట్రో మరణాన్ని వేడుకగా జరుపుకోవడం, ఆయన వ్యక్తిత్వాన్ని దూషించడం తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. కాస్ట్రో ను చెప్పుకోదగ్గ నాయకుడని అన్నందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను సోషల్ మీడియాలో విపరీతంగా దూషిస్తున్నారు. తన తండ్రి అంత్యక్రియలకు కాస్ట్రో హాజరైనందున మర్యాద కోసమైనా హవానా వెళ్లవలసి ఉన్న ట్రూడో ఆ దెబ్బతో తన ప్రతినిధిని మాత్రమే పంపుతున్నాడు.
ప్రేమించవలసిన వాళ్లు ప్రేమించడమే కాదు, ద్వేషించవలసిన వాళ్లు ద్వేషించినప్పుడే మనిషికి విలువ. కాస్ట్రో ను ఎవరు ద్వేషించడం సబబో వారందరూ ద్వేషిస్తున్నారు. అకారణంగా కాదు, ద్వేషించవలసిన కారణానికే ద్వేషిస్తున్నారు. క్రూర నియంత, దుర్మార్గుడు అని నిందిస్తున్నవాళ్లందరూ, నియంతలను సమర్థించడమే పనిగా పెట్టుకున్న అమెరికాను ప్రేమించడమే విచిత్రం. నిజానికి, అమెరికా బంటుగా క్యూబన్లను పీడించిన బటిస్టా రాజ్యాన్నీ కాస్ట్రో కూలదోశాడు. కానీ, వాళ్ళ దృష్టిలో బటిస్టా పాలనలో క్యూబా అభివృద్ధి పథంలో సాగిందట. కాస్ట్రో హయాంలో ఆ దేశం అట్టడుగుకు దిగజారిందట. ఇప్పుడు మళ్లీ క్యూబాను స్వర్ణయుగంలోకి తీసుకువెళ్లే అవకాశం వచ్చిందట. హవానా ఆకాశం మీద ఎన్ని రాబందులు ఎగురుతున్నాయో లెక్కలేదు.
క్యూబా విప్లవం జరిగిన నాటికి కాస్ట్రో కమ్యూనిస్టు పార్టీలో లేడు. 1961 దాకా కాస్ట్రో తనను తాను కమ్యూనిస్టుగా చెప్పుకోనేలేదు. విప్లవం జరిగిన తరువాతే క్యూబా సోషలిస్టు ఆదర్శాన్ని స్వీకరించింది. విప్లవానంతర క్యూబా నిర్మాణంలో కొన్ని సోషలిస్టు పద్ధతులను అనుసరించింది, తన సొంత రాజకీయార్థిక వ్యవస్థను నిర్మించే క్రమంలో అనేక జాతీయవాద, ప్రాంతీయ వాద విలువలను తన ఆచరణలో భాగం చేసుకున్నది. ప్రధానంగా అమెరికన్ సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని వ్యతిరేకించింది. ఐఎమ్‌ఎఫ్, ప్రపంచబ్యాంకులను తన దరిదాపులకు రాకుండా జాగ్రత్తపడింది. అమెరికా దిగ్బంధాన్ని తట్టుకోవడానికి సోవియట్ యూనియన్‌కు సన్నిహితమైంది. ఆ మైత్రిలో భాగంగా అనేక చోట్ల పోరాటాలకు సాయపడింది.
మరికొన్ని చోట్ల చేయకూడని సాయాలూ చేసింది. క్యూబన్‌సమాజాన్ని రాజకీయంగా ఉత్తేజితం చేసి, నిత్యం వారి భాగస్వామ్యంతో కొనసాగుతూ వచ్చిందా అన్నది సందేహమే. అమెరికా చూపిన ఎడతెగని శత్రుత్వమే క్యూబన్‌లలో తీవ్రజాతీయభావాన్ని,కాస్ట్రో విధానాలపై నిబద్ధతను కలిగిస్తూ వచ్చాయి. అన్నిటికి మించి, నిరంకుశ పాలనలో, దోపిడిలో అణగారిపోయిన విశాల ప్రజాశ్రేణుల జీవితాన్ని మెరుగుపరచడానికి కాస్ట్రో చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలే అతనిని ప్రేమాస్పదుడిని చేశాయి.
క్యూబా అధికారపీఠాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో కాస్ట్రో విదేశీ పెట్టుబడులతో, కంపెనీలతో, అమెరికాతో వైరం పెట్టుకోవాలనుకోలేదు. వారికి రాయితీలూ రక్షణలూ ఇద్దామనే అనుకున్నాడు. అయితే, భూసంస్కరణలను సీరియ్‌సగా చేపట్టి, ప్రజలకు మేలుచేయాలనే దేశీయ విధానాలను కాస్ట్రో ఒక్కొక్కొటిగా అమలుచేస్తుండడం అమెరికాకు రుచించలేదు. ఉత్తర, దక్షిణ ఖండాలలో తనకు ఎదురు ఉండకూడదనే అహంకారంతో ఉన్న అమెరికాకు కాస్ట్రో స్వతంత్ర వ్యవహారసరళి నచ్చలేదు. ఆంక్షలు ప్రారంభించింది. ఆ తరువాతే కాస్ట్రో అమెరికన్ కంపెనీల జాతీయీకరణ చేశాడు. క్యూబాను ఏ మార్గంలో నడిపించాలి అని ఆచరణాత్మక రీతిలో, స్వతంత్రంగా నిర్ణయించుకునే అవకాశం క్యూబాకు దక్కలేదు. దాని ప్రయాణమంతా, అమెరికా వేధింపులు, దౌర్జన్యాలు, ఆంక్షల నేపథ్యంలో రూపుదిద్దుకుంటూ వచ్చింది. దక్షిణ అమెరికాలో తన మిత్రులను వెదుక్కోవడం కూడా ఆ ప్రయాణంలో భాగమే. ఇతర లాటిన్ అమెరికన్ దేశాల్లో తమ తరహా విప్లవాలు సాధ్యమైతే అందుకు సాయపడాలన్న ధోరణీ ఆ పరిస్థితుల నుంచి కలిగిన ఆలోచనే. అలీనోద్యమం, సోవియట్ యూనియన్‌తో మైత్రి, తరువాత చైనా నుంచి సాయం, చివరకు వెనిజులాతో సహకారం- అన్నీ క్యూబా మనుగడ పోరాటంలో మజిలీలే.
ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి తాను నిర్మించిన ప్రభుత్వఆధారిత సోషలిజాన్ని సడలించడానికి కూడా కాస్ట్రో వెనుకాడలేదు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి సాయం నిలిచిపోవడం క్యూబాకు పెద్ద దెబ్బ. ఆ తరువాత 1995లోనే పరిమితంగా విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. కానీ అమెరికా వైఖరి కానీ, అమెరికాపై కాస్ట్రో వైఖరి కానీ మారకుండా విదేశీ పెట్టుబడులు ఎక్కడినుంచి వస్తాయి? సంక్షేమాన్ని, సబ్సిడీలను పక్కనబెడితే కానీ కార్పొరేట్లు కనికరించవు కదా? సోవియట్ సహకారం సమృద్ధిగా ఉన్న కాలంలో కూడా క్యూబా తన సొంత అభివృద్ధి రంగాలను ఎంచుకున్నది. సంక్షేమంలో భాగంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తున్న క్రమమే, దేశంలో అక్షరాస్యతను దాదాపుగా సంపూర్ణం చేసింది, వైద్యుల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచింది. క్యూబా వైద్యులు ఆ దేశానికి ఒక ఆస్తి. ఇతర దేశాలకు సేవలను ఎగుమతి చేసి, బదులుగా సరుకులను దిగుమతి చేసుకోవడానికి వైద్యరంగమే పనికివచ్చింది. పైగా, క్యూబా వైద్యులంతా బడుగు, బీద దేశాల్లోనే సేవలందిస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తులకు తీవ్రమయిన కొరత ఏర్పడిన సమయంలో, చైనా నుంచి లక్షలాది సైకిళ్లను తెప్పించుకుని, మోటారు వాహనాల వాడకాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకున్నారు. చెరుకు ఉత్పత్తులకు మార్కెట్ కోసం ఇతరులపై ఆధారపడడం, తరచు దెబ్బతినడం కారణంగా- మరో రంగాన్ని ఎంచుకోవాలనుకుని చివరకు పర్యాటకాన్ని ఆశ్రయించారు. పర్యాటకుల కోసం విడిగా ఒక కరెన్సీని ప్రవేశపెట్టి, డాలర్లతో మారకం చేసుకున్నారు. దిగ్బంధ పరిస్థితుల్లో ఎట్లా బతికి బట్టకట్టాలో కాస్ట్రో నుంచి సద్దాం హుస్సేన్ నుంచి నేర్చుకోవచ్చు.
వైద్య పరిశోధన రంగంలో కూడా క్యూబా అసాధారణమైన ముందంజ వేసింది. అభివృద్ధి చెందిన ఏ దేశానికీ సాధ్యపడని కేన్సర్ వేక్సిన్ క్యూబా కనుగొన్నది. ఊపిరితిత్తుల కేన్సర్‌లో సర్వసాధారణమైన ఒక రకానికి క్యూబా పరిశోధనాసంస్థ వేక్సిన్ కనుగొన్నది. దానికి ఇప్పుడు అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్రసూతి మరణాల్లో అమెరికా కంటె మెరుగైన గణాంకాలు క్యూబావి. అట్లాగే, తల్లినుంచి బిడ్డకు హెచ్‌ఐవీ సోకకుండా నిరోధించిన మొదటి దేశం క్యూబా. ప్రజాస్వామ్యదేశమూ, ఏ దిగ్బంధాలూ లేని దేశమూ కదా భారతదేశం? విద్య, వైద్యరంగాలలో మన విజయమెంత? అంతరిక్షానికి ఎదుగుతున్నాము కానీ, ప్రజలకు కనీస సేవలు అందిస్తున్నామా?
చరిత్రలో మంచి వ్యక్తిగా, రాజకీయంగా సరైన వైఖరి తీసుకున్నవాడిగా ఉండిపోవాలని కాస్ట్రో అనుకున్నాడు. ప్రపంచీకరణను, అమెరికాను తుదకంటా రాజీలేకుండా వ్యతిరేకించిన వ్యక్తిగా చరిత్ర తనను గుర్తించాలన్నది ఆయన తపన. ఆ కోరికే, అటువంటి నిబద్ధతే అతన్ని అంతర్జాతీయస్థాయి చారిత్రక వ్యక్తిగా నిలిపింది. -కె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి)

No comments:
Post a Comment