Monday, 21 November 2016

|| పెద్ద నోట్లపై మెరుపు దాడి -బీదల బతుకుపై బాంబు దాడి ||


‘మా దగ్గర నేల వుంది 
మా దగ్గర నీళ్ళూ వున్నాయి 
మేం బురద తయారు చేస్తాం’ 
- ఇవాన్‌ కులెకోవ్‌ 

నవంబరు 8వ తేదీ రాత్రి 500, 1000 నోట్ల రద్దుపై ప్రధానమంత్రి ప్రకటన, ఆ తర్వాత రోజుల్లో ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటనలు భారత ఆర్థిక, రాజకీయ చరిత్రలో ముఖ్యమైనవిగా నిలిచిపోతాయి. బ్యాంకుల ముందు బారులు తీరి నిలబడడమే దేశభక్తియని కొంతమంది వాదించినా, క్రమంగా అలసట, అసహనంతో స్వరం మారుతున్నది. తొలినాళ్ళలో ఈ చర్య చాలా గొప్ప సాహసోపేత నిర్ణయమని ఆహ్వానించిన వాళ్ళలో కొందరు, తర్వాతి రోజులలో ‘నిర్ణయం మంచిదే, అయితే అమలుమాత్రం సరిగా లేద’ని మాట్లాడుతున్నారు.
ప్రభుత్వ చర్య వెనుక కారణాలు, పర్యవసానాల గురించి ఊహాగానాలు, చర్చలు వారి వారి దృక్పథాన్ని బట్టి, విశ్వాసాలను బట్టి ఉంటాయి. అయితే, వొక నిర్దిష్టమైన అంచనాకి వచ్చేముందు, దానికి నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రకటనల్లోని నిజానిజాలని పర్యవసానాలు, వాస్తవ పరిస్థితులని బట్టి బేరీజు వేసుకోవాలి.
    
ప్రస్తుత ప్రభుత్వ చర్య ద్వారా బ్యాంకులకి డిపాజిట్ల రూపంలో డబ్బులు చేరుతున్నాయి. మొదటి మూడు రోజుల్లోనే రూ.3లక్షల కోట్లు జమయ్యాయి. వివిధ రాష్ర్టాలలో జరగనున్న ఎన్నికలలో ప్రత్యర్థి పార్టీలని దెబ్బతీయడం, సరిహద్దులలో ఉద్రిక్తతల పేరిట దేశభక్తి పేరిట ప్రశ్నించే వాతావరణం లేకుండా చేయడం వంటి రాజకీయ ప్రయోజనాలతో పాటు, బడా పారిశ్రామికవేత్తల, కోటీశ్వరుల రుణాలని ‘మొండి బకాయిల’ పేరిట రద్దు చేయడంతో బ్యాంకులకి తలెత్తిన చిక్కు సమస్యకి ప్రభుత్వం ఎంచుకున్న పరిష్కారం ఇది.

               ప్రస్తుత ప్రభుత్వ చర్యను ‘నల్లధనం’పై మెరుపుదాడిగా, ఉగ్రవాదంపై తిరుగులేని దాడిగా ప్రకటిస్తున్న వారున్నారు, నిజమని నమ్ముతున్న వారూ వున్నారు. ఇందులో నిజమెంత? బడా పారిశ్రామిక వేత్తలు, కోటీశ్వరుల రుణాలని తేలికగా ‘మాఫీ’ చేస్తున్న ప్రభుత్వం, వాళ్ళ నల్లధనంపై మెరుపుదాడి చేస్తుందంటే నమ్మవచ్చా?
                  కొన్ని వాస్తవాలు చూద్దాం. నవంబరు ప్రభుత్వ ప్రకటనకి ముందు సెప్టెం బరు, అక్టోబరు నెలలో బ్యాంకు డిపాజిట్లు, నగదు ఉపసంహరణ (విత్‌డ్రాయల్స్‌) అసాధారణ స్థాయిలో జరిగాయని రిజర్వ్‌ బ్యాంకు వివరాలు చెబుతు న్నాయి. డిపాజిట్ల విషయం తీసుకుంటే, 2016 సెప్టెంబరు 16-30 తేదీల మధ్య బ్యాంకు డిపాజిట్లు అనూహ్యంగా రూ.3,55,570కోట్లు (మునుపటి పక్షంతో పోల్చితే) పెరిగాయి. అక్టోబరు నెలలోనూ అదే ధోరణి కొనసాగింది. ఆర్థిక మంత్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఎరియర్స్‌ కారణం చెబుతున్నారు. చిత్రమేమిటంటే, ఈ ఎరియర్స్‌ రూ.35,000కోట్లు దాటవు!
                  అలాగే, ప్రభుత్వ ప్రకటనకి ముందురోజుల్లో నగదు ఉపసంహరణలు విపరీతంగా పెరిగాయి. గడిచిన ఐదు సంవత్సరాలతో పోల్చితే, 2016 అక్టోబరు 28 నాటికి, నగదు ఉపసంహరణలు రెండింతలకి పైగా పెరిగాయి. గడిచిన ఐదు సంవత్సరాల సగటు మొత్తం రూ.1.16 లక్షల కోట్లు వుండగా, 2016 అక్టోబరులో రూ.2.56 లక్షల కోట్ల నగదు ఉపసంహరణ జరిగింది. అంటే, ఈ నగదు ఇతరత్రా ఆస్తుల కొనుగోలు, బ్యాంకుల నుంచి ముందే ఉపసంహరించిన ఆదాయంగా చూపి తిరిగి నవంబరు 8 తర్వాత జమచేసే కమిషన్‌ వ్యాపారం దీనిద్వారా పెద్ద ఎత్తున జరిగిందని అర్థం చేసుకోవచ్చు! అంటే నల్లధనంపై దాడి పేరుతో, నవంబరు 8 నాటికి పెద్ద ఎత్తున మరింత నల్లధనం సృష్టించే పథకం అమలు జరిగింది!

                  ఇక ‘నల్లధనం’ సంగతి చూద్దాం. అది కేవలం గోనెసంచుల్లో డబ్బుకట్టల రూపంలో మాత్రమే ఉంటుందనుకోవడం అమాయకత్వమని ఆర్థిక శాస్త్రవే త్తలు అందరూ చెప్పేమాట. ఇటు ఉత్పత్తి, అటు చెలామణి రెండు రంగాలలోనూ అది సృష్టి అవుతూ వుంటుంది. 2012 మేలో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రచురించిన శ్వేత పత్రం, ‘సృష్టించే సమయంలోగానీ, అనుభవించే సమయంలోగానీ ప్రభుత్వ అధికారులకి లెక్క నివేదించని ఆదాయం లేదా వనరుల’నే నల్లధనం అనుకోవచ్చని నిర్వచించింది. ఇంకా, అది చట్టవిరుద్ధంగానూ, చట్టబద్ధంగానూ పన్నుల పరిధిలోకి రాకుండా దాచిన ఆదాయమని పేర్కొంది. లెక్కల చిట్టాలలో చూపించని ఆదాయమే గాక, తప్పుడు లెక్కలరూపంలో (అమ్మకాలు, రశీదులో తప్పుడు లెక్కలు, ఖర్చుల్లో తప్పుడు లెక్కలు, విదేశీ సంస్థల పేరిట తప్పుడు ఖర్చులు, పెట్టుబడినీ, పెట్టుబడి వ్యయాన్నీ తప్పుగా మార్చి చూపించడం వంటి పద్ధతులలో) ‘నల్లధనం’ ఉనికిలోకి వస్తుందని చెప్పింది. నల్లధనానికి మూలాలు రాజకీయార్థిక వ్యవస్థలో, ప్రభుత్వాలు అనుసరించే విధానాలలో చూడాలి. 1990లలో విస్తృతంగా అమలుజరిగిన ప్రైవేటీకరణ పెద్దఎత్తున నల్లధనాన్ని సృష్టించింది. నగదు రూపంలో మాత్రమే కాదు, స్థిర, చరాస్తుల రూపంలోనూ నల్లధనం వుంటుంది. ఏటా 5,000 కోట్ల డాలర్లు (రూ.3.30లక్షల కోట్లు) విదేశాలకి అక్రమంగా తరలిపోతుందని ఒక వాషింగ్టన్‌ సంస్థ లెక్కవేసింది.

                  ‘నల్లధనం’లో 72శాతం అక్రమ విదేశీ ఆస్తుల రూపంలో ఉండొచ్చని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. కాగా, మొత్తం ‘నల్లధనం’లో నగదు రూపంలో వుండేది 6శాతానికి మించదని కొన్ని అంచనాలు వున్నాయి.
    
                  ప్రస్తుత చర్య-విదేశాలకి తరలిపోయిన, పోతున్న నల్లధనాన్ని తాకేది కాదు. ప్రస్తుత ప్రభుత్వం 2014 జూన్‌, 2015 ఫిబ్రవరి నెలలలో వ్యక్తులు విదేశీ మారకద్రవ్య రూపంలో తరలించగలిగే మొత్తాన్ని 75,000 డాలర్ల నుంచి 1,25,000 డాలర్లకీ, ఆ తర్వాత 2,50,000 డాలర్లకీ పెంచింది. లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీం కింద గత సంవత్సరం రూ.26,000కోట్లు (4 బిలియన్‌ డాలర్లు) తరలిపోయాయని రిజర్వ్‌ బ్యాంకు తెలిపింది. ఈ పథకంలో భాగంగా విదేశాలలో స్థిర ఆస్తుల కొనుగోలుని కూడా అనుమతించారు. విద్యార్థుల రుణాల వంటివి ఇందులో వున్నా (అవి దాదాపు నాలుగోవంతు ఉంటాయని అంచనా), గతంతో పోల్చితే, ఈ తరలింపు 3.5 రెట్లు పెరిగింది. విదేశాలలో డిపాజిట్లు, కానుకలు, ప్రయాణాలు, సమీప బంధువుల ఖర్చులు, స్థిరాస్తుల కొనుగోలు, ఈక్విటీ పెట్టుబడుల వంటి రూపంలో ఈ తరలింపు గత రెండేళ్ళలో రెండింతల నుంచి అరవై రెట్ల దాకా పెరిగిపోయింది. తరలించుకోగలిగిన వారికి తరలించుకున్నంత! మరీ ముఖ్యులకి మెరుపుదాడి గురించి ఏడాది కన్నా ముందే తెలుసన్నమాట! మూల్యం చెల్లించేదేవరు?ప్రస్తుతం స్వల్పకాల దృష్ట్యా కొంచెం ఇబ్బందులు ఎదురైనా, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని ఊరిస్తున్నారు. అసంఘటిత రంగంపైన, వినిమయ ఆధారిత రంగాలపైన పడే ప్రతికూల ప్రభావం గురించి, రాష్ర్టాల ఆదాయంలో తరుగుదల గురించీ ఇప్పటికే పలు విశ్లేషణలు వచ్చాయి. చెలామణిలో వున్న నోట్ల అవసరాన్ని, కొరతని తీర్చడానికి కనీసం ఒక ఏడాది పట్టవచ్చని చెబుతున్నారు.

                  గ్రామాలు, వ్యవసాయరంగంపైన దీని ప్రభావం చాలా విస్తృతంగా ఉండనుంది. బ్యాంకింగ్‌ సేవలు అత్యధిక భాగం పట్టణాలు, నగరాలకి పరిమితమైనాయి. సహకార రంగంలోని బ్యాంకులు కుదించుకుపోతున్నాయి. రైతాంగం వడ్డీవ్యాపారుల చేతుల్లో చిక్కుకున్నారు. ప్రధాన స్రవంతి బ్యాంకులు, గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళకుండా, ‘పేమెంట్‌ బ్యాంకులు’, ‘చిన్న బ్యాంకుల’కి లైసెన్సు పేరిట రిజర్వు బ్యాంకు చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ఈ ‘పేమెంట్‌ బ్యాంకులు’, ‘చిన్న బ్యాంకుల’కి వచ్చిన ప్రతిస్పందన పేలవంగా వుంది.

                  మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వ వాటాని 52శాతానికి తగ్గించాలని ప్రభుత్వం డిసెంబరు 2014లోనే ప్రకటించింది. దేశంలోని బ్రాంచీలు, డిపాజిట్లలో 70శాతం 27 ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధీనంలో వున్నాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాల మూలంగా ఇప్పటికే నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలలో పరపతి సంక్షోభం మరింత తీవ్రం కాబోతుంది. ‘మెరుపుదాడి’ ఫలితంగా వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలలో రైతాంగం మరింతగా చిక్కుకోనున్నారు. గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, పేదప్రజలు ప్రభుత్వ విధానాల దాడికి బలికానున్నారు, మరింతగా సమస్యల వలయంలో చిక్కుకోనున్నారు. రాష్ర్టాలలో జరిగే ఎన్నికల ఫలితాలు అనుకున్నట్టుగా రాకపోతే, 2019 సాధారణ ఎన్నికల కోసం మరోసారి సరిహద్దులలో యుద్ధ వాతావరణంతో దేశభక్తి పేరిట ప్రశ్నించలేని ప్రమాదకరమైన, నిరంకుశ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు ముమ్మరమౌతాయి. 
 -సుధా కిరణ్‌  (ఆంధ్ర జ్యోతి)

No comments:

Post a Comment