బిజెపి వారి అసలు ఎజెండా అమలు ఆరంభమైంది. వారి ''గురూజీ'' గోల్వాల్కర్ ఆదేశాలను పాటించడం ద్వారా ప్రజావంచనకు తెరతీయడం ప్రారంభమైంది. ఇంతకూ వారి అసలు ఎజెండా ఏమిటి? వారి ''గురూజీ'' ఏం ఆదేశించారు? పరిశీలిద్దాం. బిజెపి వారి ''గురూజీ'' చేసిన ఉపన్యాసాలను తెలుగులో ''పాంచజన్యం'' అనే పేరుతో ఒక పుస్తకంగా సంఘపరివార్ ప్రచురించింది. దానిలో గోల్వాల్కర్ ఏమేం చెప్పారో తెలుసుకుందాం.
కోరికలను గూర్చి గోల్వాల్కర్ మాట్లాడుతూ ''శారీరక సుఖానికై యత్నించిన కొలదీ దాని ఆకలి మరింత తీవ్రతరమౌతుంది. ఇది మన అనుభవమే. అలా మానవుడెన్నడూ సంతృప్తిని పొందలేడు. కోరికలను సంతృప్తి పరచేందుకు ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంత అధికంగా అసంతృప్తి పెరుగుతుంది. ఆ విధంగా, భోగసామగ్రిని ఎంత అధికంగా కూడబెట్టుకుంటే అంత అధికమైన అసంతృప్తి ఎదురవుతుంది (పాంచజన్యం పేజీ 19) అన్నారు. అంతేకాదు. ''మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే వ్యక్తి ఆనందం అనుభవిస్తాడు. మనస్సు అట్టి ప్రశాంతమైన నిశ్చలస్థితిని పొందాలంటే రకరకాల కోరికలు మన మనస్సులో తల ఎత్తకుండా చేయడం అవసరం'' అని కూడా చెప్పారు. (అదే పుస్తకం పేజీ 21). మరి ఒక వ్యక్తి కోరికల వెంట పరుగెత్తి భోగసామగ్రిని కూడబెట్టుకుంటే ఏం చేయాలి? దానికి సమాధానంగా ఇలా చెప్పారు. ''ఇతరులు సుఖ సమృద్ధులు కలిగి ఉంటే, వారిని చూచి అసూయచెందక సంతోషించాలనీ, వారిని అభినందించాలనీ పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో ఉపదేశించాడు'' అని కూడా గోల్వాల్కర్ చెప్పారు. (అదే పుస్తకం పేజీ 22). కానీ భౌతిక సుఖ సమృద్ధులు కేవలం కష్టపడితేనే అందుకోలేరనీ, దోపిడీ ద్వారా మాత్రమే అవి సాధ్యమనీ చరిత్ర నిరూపించింది. మేధో కష్టజీవి అయినా తిండి, బట్ట, నివాసం, పిల్లల బాధ్యతలు తీరేంత వరకే సంపాదించగలరని నేటి సమాజం నిరూపించింది. మరి సుఖ సమృద్ధి ఎలా సాధ్యం? దోపిడీ ద్వారా మాత్రమే. అలా సమృద్ధిని సాధించినవారిని చూసి అసూయవద్దని ఎంత తేలికగా చెబుతున్నారీ గురూజీ? ఈ అంశానికి పరాకాష్టగా ఆయన ఏమంటున్నారంటే ''తోటి వ్యక్తి పాపం చేస్తున్నప్పుడు మనం సహజంగా జాలి చూపాలి అని కూడా పతంజలి మహర్షి ఉపదేశించాడు'' అని సెలవిచ్చారు గురూజీ (పై పుస్తకం పేజీ 23). అదీ అసలు విషయం! మనం కనీస సుఖాలు ఆశించకూడదు. అలా సమృద్ధిని ఎవరైనా సాధిస్తే అసూయ పడకూడదు. అతడు పాపం చేసి ఆ ''సమృద్ధిని'' సాధించినా ఆ పాపాత్ముడినైనా చూసి జాలిపడాలి గాని అతనిని ద్వేషించకూడదు! ఇదీ గురూజీ సిద్ధాంతం! ఇదే బిజెపివారి ఆదర్శం!
ఇలా ఎన్ని నీతివాక్యాలు చెప్పినా ప్రజలు దోపిడీదారుల్నీ, వారి సమృద్ధినీ ద్వేషించకమానరు. అందువల్ల వారి ఆలోచనలు వేరే దోవకు మళ్లించాలి. ఈ విషయాన్ని గురించి గురూజీ ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి! ''సామాన్య ప్రజానీకానికి ఉన్నత జీవన స్థాయిని గురించి పదేపదే (ఇతరులు) వాగ్దానాలు చేస్తున్నారు. ఉన్నత జీవనస్థాయి కలగజేయలేనప్పుడు దాన్ని గురించి పదేపదే వాగ్దానం చేయడం వల్ల ప్రజల్లో నిస్పృహ కల్గి కల్లోలానికి దారి తీస్తుంది. శీలం, జ్ఞానం, దేశభక్తి వంటి ఉన్నత భావాలను గూర్చిగాని, సాంస్కృతిక, మానసిక, నైతికాభివృద్ధులను గూర్చిగాని ఎవరూ మాట్లాడడం లేదు'' అని అన్నారు (పాంచజన్యం పేజా 285). సామాన్య జనానికి ఉన్నత జీవన స్థాయిని గురించి వాగ్దానం చేయకూడదట! అది తాము కలగజేయలేమని ఆయనకు తెలుసు. అందుకు పదేపదే వాగ్దానం చేయడం వల్ల ప్రజల్లో నిస్పృహ కలిగి కల్లోలానికి దారితీస్తుందని గురూజీ చాలా సరైన అవగాహనకు వచ్చారు. అందువల్ల ఉన్నత జీవన స్థాయిని గూర్చి ప్రజలకు ఆలోచనలు రానీయకుండా ఏం చేయాలో ఆయన సెలవిస్తున్నారు. ఏమని? శీలం, దేశభక్తి, సాంస్కృతికాభివృద్ధి మొదలైనవాటిని గూర్చే మాట్లాడాలట! ఇదీ గురూజీ ఉపదేశం. అందుకే ఆయన అనుచరులు దేశభక్తిని గూర్చి విపరీత ప్రచారం చేస్తున్నారు. ఆ అంశంపై రాద్ధాంతం సృష్టిస్తున్నారు. ''జై హిందూస్తాన్'' అన్న ఎమ్మెల్యేను దేశభక్తుడుగా అంగీకరించ బోమనీ, ''భారత్ మాతాకీ జై'' అంటేనే దేశభక్తుడుగా గుర్తిస్తామనీ రాద్ధాంతం చేసి ఎమ్మెల్యేను మహారాష్ట్ర శాసనసభ నుంచి బహిష్కరించారు. ఇదీ వారు దేశభక్తిని ప్రదర్శించే తీరు! ఈ ప్రచారం కూడా చాలదనీ, ప్రజలను యుద్ధోన్మాదులను చేయాలనీ, అప్పుడు ఆ భావోద్వేగాలలో ఉన్నత స్థాయి జీవన విధానాన్ని గూర్చి మాట్లాడేవారి మాటలు కొట్టుకుపోతాయనీ గురూజీ ఆలోచన. దీనిని ఎంత స్పష్టంగా ఆయన బైటపెట్టాడంటే ''నేటి ఈ పరిమిత యుద్ధం (1965లో పాకిస్తాన్తో యుద్ధం) కాక సంపూర్ణ సంగ్రామమే వచ్చి ఉన్నట్లయితే అది మనదేశంలోని ప్రతి వ్యక్తినీ, సర్వాంగీణ యుద్ధ కృషిలో నిమగ్నుణ్ణి చేసి ఉండేది. జాతికి పట్టిన బుద్ధి జాడ్యాన్ని వదిలించి ఉండేది. దీర్ఘకాలిక యుద్ధాగ్నిలో బలహీనతలన్నీ భస్మీపటలమైపోయి సమైక్యం, పరాక్రమోపేతమైన జాతీయతా సువర్ణం మిలమిల లాడి ఉండేది. కనుక తాత్కాలిక కష్టాలకు మనం గురైనప్పటికీ ఒక మహాయుద్ధం నేడు వాంఛనీయం. మనం యుద్ధోన్మాదులం కానప్పటికీ, నిజంగా అట్టి మహా యుద్ధం కోసం హృదయపూర్వకంగా ప్రార్థించాలి.'' అదీ గురూజీ ఆదేశం! దానిని అమలులో పెట్టాలని శిష్యగణం ఉవ్విళ్లూరుతున్నది. తమ విధానాల వల్ల ప్రజల జీవనస్థాయి రోజురోజుకూ దిగజారుతుంటే, వారి నిస్పృహ కల్లోలానికి దారితీయకుండా ఉండాలంటే దేశభక్తి పేరు మీద దేశ దురభిమానాన్ని, పేట్రియాటిజానికి బదులు హేట్రియాటిజాన్ని, యుద్ధోన్మాదాన్ని తీవ్ర స్థాయిలో పెంచుతున్నారు. ఆకలిపై యుద్ధం, నిరుద్యోగంపై యుద్ధం, దారిద్య్రంపై యుద్ధం వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చి పొరుగు దేశాలపై యుద్ధమెక్కటే యుద్ధం అనే మానసిక స్థితికి ప్రజలను తెస్తున్నారు. యువకుల మనస్సుల్లో దారిద్య్రంపై యుద్ధం చేయమని కోరడం దేశభక్తి రహితమనే భావనను నింపుతున్నారు. దేశభక్తులైనవారు ఈ విషయాన్ని గుర్తెరిగి దారిద్య్రంపై యుద్ధమే అసలైన యుద్ధమనీ, ప్రజల జీవనస్థాయిని మెరుగు పరచడమే పాలకుల అసలైన కర్తవ్యమనీ, తమ మానసిక స్థితిని అందుకనుగుణంగా మరల్చుకోవాలనీ కోరుతున్నాను. - కెఎల్ కాంతారావు

No comments:
Post a Comment