అసలు సమస్య అభివృద్ధి దిశే అయినప్పుడు క్యూలో గంటల తరబడి నిలబడ్డ ప్రజలకు అంతిమంగా మిగిలేది ఫలితం లేని శ్రమే. సమస్య చాలా సంక్లిష్టమయ్యింది. ప్రజలు అనుభవిస్తున్న సంక్షోభానికి నల్లధనం కారణం కాదు, పరిష్కారం కాదు.
ఒక ఆంగ్ల సినిమాలో ఒక గజదొంగల ముఠా అతి సంపన్నుడి ఇంట్లో దొంగతనానికి తలపడ్డపుడు ఒకవైపు కట్టలుకట్టలు కరెన్సీ నోట్లు మరోవైపు టన్నుల కొద్దీ బంగారాన్ని చూసి ముఠా నాయకుడు తమ దగ్గరి గోనెసంచులలో కరెన్సీ అయితే ఎక్కువ తీసుకపోవచ్చు అని అన్నపుడు ముఠాలోని ఒక మహిళ కరెన్సీ కేవలం చిత్తు కాయితాలని బంగారం దొంగిలించడమే ఉత్తమమని సలహా ఇస్తుంది. మానవ శ్రమ సంపదగా మారే క్రమంలో దాన్ని బంగారు, వెండి రూపంలో మార్చి దాచుకోవడం ఒక కీలకమైన పరిణామం. అన్ని నాగరికతలలో బంగారం, వెండి లేదా రాగి నాణేలు ఉండేవి. మనిషి కాగితం, ప్రింటింగ్ యంత్రం కనుక్కున్న తర్వాత కరెన్సీ చలామణిలోకి వచ్చింది. కరెన్సీ కేవలం కాగితమే కావడం వలన చలామణిలో ఉన్న కరెన్సీ వెనక తగినంత బంగారం నిలువ ఉంటే తప్ప కరెన్సీకి విలువ ఉండదనేది అన్ని దేశాలు అంగీకరించిన ప్రమాణం. పెట్టుబడి వస్తువుల రూపంలో, ఆస్తి రూపంలో భౌతికంగా ఉంటే తప్ప బంగారానికి కూడా విలువ లేదు. వస్తు ఉత్పత్తి, ఆస్తి విలువ మానవ శ్రమతో ముడిపడి ఉంటుంది. శ్రమ అదనపు విలువే - లాభాలు అనండి, దాచుకొ నడం అనండి, దోచుకొనడం అనండి - మానవ సమాజ పరిణామ క్రమాన్ని నిర్దేశిస్తూ వచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థ శ్రమను కరెన్సీ రూపంలోకి మార్చడం పరిణామ క్రమంలో మరొక కీలకమైన మలుపు.
పెట్టుబడిదారీ వ్యవస్థ ద్రవ్య పెట్టుబడి కింద (Finance Capital) మారి ప్రపంచంలోని నిజమైన సంపద కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కరెన్సీని చలామణిలో పెట్టడంతో ఏర్పడిన ఆర్థిక వ్యవస్థ నిరంతరంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది. శ్రమ బంగారం లేదా కరెన్సీ రూపంలో మారడంతో శ్రమైక మానవ సంబంధాలన్నీ డబ్బు రూపంలోకి మారడంతో కరెన్సీవిలువ పెరిగి మనిషి, మనిషి శ్రమ విలువ తగ్గడంతో మనుషుల మధ్య ఉండే మానవీయ విలువలు ధ్వంసం కావడం గమనించిన మార్క్స్ ఇలాంటి సమాజంలో మనిషి జీవించడం సాధ్యం కాదని, ఈ దశ దాటి శ్రమ కేంద్రంగా, ఒక మనిషి అందరి కొరకు అందరు మను షులు ఒకరికొకరు జీవించే సమిష్టి సమాజంవైపు అనివార్యంగా మానవాళి ప్రయాణిస్తుందని సూత్రీకరించాడు. ఇప్పుడు మార్క్స్ గురించి ప్రస్తావించడం చాలామందికి అప్రస్తుతం అనిపించవచ్చుకానీ ఎందుకో ఉమాభారతి (గంగానది ప్రక్షాళన మంత్రి) ఎకనామిక్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీని మార్క్స్‌తో పోలుస్తూ, మోదీ మార్క్స్లా అసమానతల తగ్గింపు వైపు ఆలోచిస్తున్నారని అన్నారు.
మన దేశంలో ఒక ఐదు, ఆరు దశాబ్దాల క్రితం దాకా గ్రామంలో శ్రామికులు, రైతులు, కూలీలు శ్రమ ఫలితాన్నే పంచుకునేవారు. రైతు పంట పండుతూనే పొలం దగ్గర ధాన్యం కుప్పలో నుండి వ్యవసాయానికి, లేదా ఇతర సేవలు అందించిన వారందరికీ - కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, చివరకు ఆయుర్వేద వైద్యుడు - ధాన్యంలో కొంత వాటా ఇచ్చేవారు. ఆ వాటా ఎలా నిర్ణయించే వారో నాకు అవగాహన అయ్యేది కాదు. ఆ రోజుల్లో కరెన్సీ పాత్ర ఎంత తక్కువో నా చిన్నప్పటి అనుభవం ఒకటి ఉదహరించవచ్చు. ఒక ఆదివారం ఉదయం నాకు, స్నేహితుడు కిషనరావ్ దేశపాండేకి ఒకరూపాయి నోటు దొరికితే ఆ ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి రోజంతా కష్టపడ్డాం. సాధారణంగా ఇంట్లో ఉండని బాదాం, క్యాషు నట్స్ లాంటి వాటిని కొని తిన్నాం. హోటల్‌కు వెళ్ళి పాల మీగడ తిన్నాం. ఆరు గంటలు సైకిల్ కిరాయికి తీసుకుని తొక్కాం. అయినా సాయంత్రం ఎనిమిది అణాలు మిగిలాయి. ఇద్దరం నాలుగు, నాలుగు అణాలు పంచుకున్నాం. ఈ రూపాయికి కొనే వస్తువులు చాలా తక్కువుండేవి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో క్రమక్రమంగా కరెన్సీ ప్రవేశం పెరిగి, నవ్య ఆర్థిక విధాన అమలు తర్వాత మన దేశం కూడా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిలో భాగం కావడంతో గ్రామీణ వ్యవసాయక సంబంధాలలో గణనీయమైన మార్పు వచ్చింది.
1980లలో ప్రపంచబ్యాంకు ప్రేరేపిత నమూనాను అమలుచేసిన మరు సంవ త్సరం నుంచి ‘స్కాం’ల లాంటి అవినీతి రూపాలు ముందుకు రావడంతో అప్పటికి క్లీన ప్రధానమంత్రి అని పిలవబడ్డ రాజీవ్ గాంధీ బోఫోర్స్ స్కాంలో ఇరుక్కున్నాడు. ఆ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులు ఏదో ఒక స్కాంలో ఇరుక్కుంటున్నారు. ఒక దశాబ్ద కాలం (2004 నుంచి 2014 వరకు) అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగినన్ని స్కాంలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇదే కాలంలో 1960లలో చర్చకు వచ్చిన అవినీతి విపరీతంగా పెరిగింది. అంటే నవ్య ఆర్థిక విధానం ఎంత వేగంగా అమలు జరిగిందో అంతే వేగంగా అవినీతి పెరిగింది.
ముఖ్యంగా సహజ వనరులను బహుళజాతి కంపెనీలకు అమ్మడంతో అది తారాస్థాయికి చేరుకుంది. ఈ మొత్తం అవినీతి, అధికారంలో ఉండే వారికి, పారి శ్రామిక వేత్తలకు ముఖ్యంగా రియల్ఎస్టేట్ భూ కామందులకు, అలాగే సినిమా,మీడియా, విద్య, వైద్య రంగాలకు విస్తరించింది. ఇక ఐదేళ్ళకొకసారి జరిగే ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ డబ్బు ప్రమేయం లేకుండా గెలిచే ప్రసక్తే లేదు. రాజకీయ పార్టీలకు వచ్చే డబ్బును సమాచార హక్కు క్రింద చేర్చడాన్ని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఇందులో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అని విస్తృత ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. అలా కరెన్సీ నోట్ల ప్రభావం గ్రామీణ జీవితం నుంచి పార్లమెంటు ఎన్నికల దాకా - ఏ రంగాన్నీ వదిలిపెట్టకుండా - పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే నల్లధనాన్ని గురించిన చర్చ జరగాలి.
నల్లధనం అంటే ఒక వ్యక్తి సంపాదనలో, లాభాలలో, ఆదాయంలో ప్రభుత్వం ప్రతి ఏటా నిర్ణయించే శాతంలో ట్యాక్స్ కట్టాలి. ఎంత మేరకు టాక్స్ కడతాడో అది తెల్లధనంగా, ట్యాక్స్ కట్టని ధనాన్ని నల్లధనంగా పరిగణిస్తారు. ఉదాహరణకు రియల్ఎస్టేట్ వ్యాపారంలో భూమినో, ఇల్లునో కోటి రూపాయలకు అమ్మితే అందులో ఇరవై శాతం ట్యాక్స్ అంటే రూ.20 లక్షలు కట్టాలి. ఈ అమ్మకాన్ని కోటి రూపాయల బదులు రూ.50లక్షలు అని చూపించి పది లక్షల ట్యాక్స్ కడితే మిగతా అరవై లక్షల డబ్బును నల్లధనం అంటారు. అంటే పది లక్షలను దాచుకోవడానికి ఈ తతంగం చేస్తుంటారు. ఈ ప్రక్రియను అరికడతామని చెబుతూ ట్యాక్స్ తగ్గిస్తే ఎక్కువ డబ్బు తెల్లధనం అవుతుందని ట్యాక్స్ రేటును ప్రభుత్వాలు విపరీతంగా తగ్గిస్తూ వచ్చాయి. ఆదాయంపై ట్యాక్స్ కాక కొన్ని ఇతర ట్యాక్స్‌లు కూడా ఉంటాయి. ప్రభుత్వాలకు కూడా ట్యాక్స్ ద్వారా డబ్బును ఎక్కువ తీసుకోవాలనే ఆసక్తేమీ లేదు. అయితే 2009-2014 మధ్య జరిగిన అవినీతి లావాదేవీలలో ఈ నల్లడబ్బు శాతం విపరీతంగా పెరిగి 2జీ స్కాంలో నష్టం దాదాపు ఒక లక్షా డెబ్బై వేల కోట్లు అని కంప్ర్టోలర్ ఆడిటర్ జనరల్ తేల్చినపుడు, దేశ ప్రజలు నిర్ఘాంతపోయారు.
ఈ సమస్యపై తీవ్ర చర్చ జరుగుతున్న దశలో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడ్డప్పుడు అవినీతివ్యతిరేక ఉద్యమాలు ఒకటి అన్నాహజారే నాయకత్వంలో మరొకటి రాందేవ్ బాబా నాయకత్వంలో ముందుకువచ్చాయి. కార్పొరేట్ మీడియా (ఇది నల్లధనం బయటేమీ లేదు) రాత్రికి రాత్రి ఉద్యమానికి విపరీత ప్రచారం కల్పించడంతో నరేంద్ర మోదీ నాయతక్వంలో బీజేపీ ఈ సమస్యను 2014 ఎన్నికలలో ప్రధాన అంశంగా చేర్చింది. నిజానికి దేశంలో నల్లధనం కంటే తీవ్రమైన పేదరికం, అసమానతలు, నిరుద్యోగం, విద్య, వైద్యం లాంటి సమస్యలను పక్కకు పెట్టి నల్లధనం బయటికి వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మోదీ ప్రచారం చేసారు. ఇక్కడ ఆగక ఈ నల్లధనం విదేశాలలో ముఖ్యంగా స్విస్ బ్యాంకులో పెద్ద ఎత్తున ఉన్నదని ఆ ధనాన్ని రాబడితే ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు పంచవచ్చని అనడంతో ప్రజలు ఇవన్నీ నమ్మినా నమ్మకున్నా ఈ ప్రసంగాలు మిగతా పార్టీల ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల కంటే ఎక్కువ ఆకర్షించాయి. ఎన్నికల ప్రచారంలో చేసినంత సులభంగా సమస్యలు పరిష్కారం కావు. మోదీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావచ్చింది, ఇంతలో మోదీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన ఉత్తరప్రదేశలో ఎన్నికలు రానే వచ్చాయి. స్విస్ బ్యాంక్ నల్లధనం తేవడమేమయ్యిందో కానీ రోజువారీ జీవితం మరింత సంక్షోభంలో పడింది. వృద్ధిరేటు చూసి మురిసిపోవాలో లేక సామాజిక ఆర్థిక సంక్షోభంచూసి వెరచిపోవాలో అనే సందిగ్ధంలో, నల్లధనం అనే సమస్యను ముందుకు తీసుకొచ్చి, ఏ సమగ్ర వ్యూహం లేకుండా కేబినెట్ మంత్రులెవ్వరికీ తెలియకుండా అర్ధరాత్రి పెద్ద కరెన్సీని రద్దు చేయడంతో గత రెండు వారాలుగా దేశమంతా క్యూలో నిలబడి తమ దగ్గర ఉన్న చిన్న చిన్న సేవింగ్స్ కొత్త కరెన్సీలోకి మార్చుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఒక టీవీ చానెల్ యాంకర్ ‘అగాథమౌ జలనిధి లోనా ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే’ అని అంటే అనుకోకుండానే నాకు ‘జగమేమాయ, బ్రతుకే మాయ’ అనే పాటలో ‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’ స్ఫురించింది.
చాలామంది విధానం మంచిదే కాని అమలే సరిగా లేదు అని ప్రధానమంత్రిని అభినందిస్తూ ఇతరుల మీద ఆడిపోసుకుంటున్నారు. అమలుకాని ఏ విధానమైనా మంచి నిర్ణయమెలా అవుతుందో నాకు అర్థంకాదు. విధానశాస్త్రంPublic policy) బోధిస్తున్న నేను క్లాసులో విద్యార్థులకి ఒక ఉపమానం చెబుతుంటాను. ‘రెండు ఎలుకలు కోతి దగ్గరకు వెళ్ళి పిల్లి తమను బాధిస్తున్నదని, ఏదైనా పరిష్కారం చెప్పమంటే, మీరు కుక్కలై పిల్లిని భయపెట్టండి అని సలహా ఇస్తే, ఎలుకలు మేం ఎలా కుక్కలుగా మారగలం అంటే, కోతి విధాననిర్ణయం నాది అమలు బాధ్యత మీది’ అని అన్నట్లు వినడానికి విధానాలు బాగానే అనిపిస్తాయి నిజానికి మంచి పాలసీకి ప్రమాణం అమలు మాత్రమే. అన్నింటిని మించి దేశంలో ఏదో అద్భుతం జరిగి కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం పెరిగిందనే భావిద్దాం. ఈ లక్షలతో ప్రభుత్వం ఏం చేయబోతున్నది అనేది ప్రశ్న. దేశ సంపద పెరిగింది అని అందరూ అంగీకరిస్తారు కానీ సంపద పెరిగితే సంక్షేమం మీద విద్య, వైద్యం, రవాణా, ఉపాధి లాంటి రంగాలకు కేటాయింపులు ఎందుకు తగ్గుతున్నట్లు? రోజురోజుకీ జాతిసంపదలో తన వాటాను కోల్పోతున్న కుంటుపడ్డ గ్రామీణ వ్యవ సాయం ఎలా పునరుజ్జీవం పొందుతుంది? సామ్రాజ్యవాద ప్రేరేపిత అభివృద్ధిలో సంక్షేమరాజ్యానికీ, న్యాయానికీ స్థానం లేదు. అసలు సమస్య అభివృద్ధి దిశే అయినప్పుడు క్యూలో గంటల తరబడి నిలబడ్డ ప్రజలకు అంతిమంగా మిగిలేది ఫలితం లేని శ్రమే. సమస్య చాలా సంక్లిష్టమయ్యింది. ప్రజలు అనుభవిస్తున్న సంక్షోభానికి నల్లధనం కారణం కాదు, పరిష్కారం కాదు. - జి. హరగోపాల్ (ఆంధ్రజ్యోతి)

No comments:
Post a Comment