Saturday, 19 November 2016

|| ఘరానాలు క్షేమం- గరీబులే బలిహారం ||


                        నోట్ల రద్దు నిర్ణయం ఫలితంగా ప్రజలు తీవ్ర పరిస్థితుల్లో ఉన్నారని, అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని సుప్రీం కోర్టు చేసిన హెచ్చరిక మోడీ ప్రభుత్వానికి పెద్ద అభిశంసనే. మీడియా నివేదిస్తున్నా.. ప్రతిపక్షాలు ఘోషిస్తున్నా పట్టించుకోకుండా అభినవ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం అదే రోజు ప్రజలు విత్‌డ్రా చేసుకునే మొత్తాన్ని 2,500 నుంచి 2,000లకు తగ్గించింది.
వయోవృద్ధులు మినహా తక్కిన వారికి బ్యాంకుల తలుపులు మూసేసింది. మరోవైపున ప్రభుత్వ రంగ బ్యాంకులకు విజరుమాల్యా వంటివారు ఇవ్వాల్సిన వేల కోట్ల బాకీలను మాఫీ రాసేసింది! ఈ విషయంలోనూ వారి వివరాలు బహిర్గతపర్చకుండా ఎందుకు కాపాడుతున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. పార్లమెంటు ఉభయ సభలూ ఈ అంశంపైనే దద్దరిల్లిపోతున్నాయి. అసాధారణమైన రీతిలో ఈ నోట్ల దాడి ప్రకటించిన మోడీ పార్లమెంటుకు సమాధానం చెప్పడానికి వెనుకాడుతున్నారు. మోడీ దివ్యదృష్టికి దేశంలో పేదలు ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నదట!? పైగా అదే ప్రజలు బ్యాంకుల నుంచి పదే పదే చిల్లర మార్చుకుంటున్నారని ప్రభుత్వం ఎన్నికలలో వలె చేతికి ఇంకు పూయాలని నిర్ణయించింది. దీనిపై ఎన్నికల సంఘం కూడా అభ్యంతరం తెలపవలసి వచ్చింది. ఇవన్నీ కలిపి చూస్తే పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థమవుతుంది. మొత్తానికి దేశ ప్రజలపై దాడికి నోట్లు కూడా ఆయుధాలవుతాయని నిరూపించారు మోడీ. ఆయన ప్రయోగించిన ఆయుధంతో 90 శాతంపైగా భారతీయులు రోడ్లపాలైనారు. నలభై మందికి పైగా ప్రాణాలే కోల్పోయారు. పెళ్లిళ్లు, వ్యాపారాలు, చదవులు, ఒప్పందాలు, చెల్లింపులు, రుణాలు, ప్రయాణాలు, సమస్త రంగాలూ అతలాకుతలమైనాయి. ఈ నరకం మరో యాభై రోజులు భరించాలని ప్రధాని అభ్యర్థనలాంటి ఆదేశం జారీ చేశారు. రెక్కాడితేగాని డొక్కాడని బక్కప్రాణులు, పైసాపైసా చూసుకుంటూ బతుకులీడ్చే బడుగులు, ఏటికి ఎదురీదుతున్నట్టు సేద్యం చేసే రైతులు, ఏ పూట సాపాటు ఆ పూటే అనుకునే మహిళలు, వీరంతా యాభై రోజులు ఇంతటి దుర్భరంగా ఎలా బతుకుతారు? నిపుణులు, ప్రముఖ మీడియా సంస్థలూ నోట్ల జారీకి ఇంకా ఆరు నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి మోడీ చెప్పే ప్రకారం దేశ ప్రజలు మరో ఆరునెలలు ఆనందంలో ఓలలాడవచ్చన్న మాట. ఈ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను బతకనివ్వరు అని మోడీ ఎవరిని ఉద్దేశించి అన్నారో గానీ కుబేరులకు కొంప మునిగిందేమీ లేదు. సర్జికల్‌ స్ట్రయిక్‌-2తో సామాన్యులను ఇంతగా చితగ్గొట్టిన సర్కారు భారీ బకాయిలను మాఫీ చేసి కానుక ఇచ్చినందుకు బడాబాబులు ధన్యవాదాలు చెబుతుంటారు. మాఫీ కాదు, ఖాతా మార్పిడి మాత్రమేనని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రాజ్యసభలో ఇచ్చిన వివరణ వంచనాత్మకమైంది. 
ఆర్థిక వేత్తలు స్పష్టంగా చెబుతున్నది నల్లడబ్బు శివాజీ చిత్రంలో లాగా గుట్టలు పోసి ఉండదు. బ్యాంకులలోనూ, స్థిరాస్తులలోనూ, బంగారం రూపంలోనూ ఉంటుంది. అందులో కొంత నగదుగా పెద్ద నోట్లలో ఉండొచ్చు. ఒక లెక్క ప్రకారం నగదులో ఆరు శాతం నల్లధనం ఉండొచ్చు. నల్లడబ్బు అంటే లెక్క సరిగా చూపనిదే. రహస్య లావాదేవీలు, పద్దులు తక్కువ చూపడం, బినామీ వ్యవహారాలు, విదేశాల్లో భద్రపర్చడం ఇవన్నీ ఉంటాయి. ఈ పదిరోజుల్లో కూడా అలాంటి వ్యవహరాలు జరిగిపోతూనే ఉంటాయి. ఎంతసొమ్మయినా డిపాజిట్టు చేసుకోవచ్చని, ఆన్‌లైన్‌ లావాదేవీలు జరపొచ్చని అనుమతిస్తున్నారు. ఇక నల్లధనం వేటాడిందెక్కడీ రేపు ఏదైనా నోటీసులు వస్తే దానికి విరుగుడు కూడా వారికి అందుబాటులో ఉంటుంది. అసలు ఇప్పుడు నోట్ల మార్పిడి కింద అయిదు వందలకు నాలుగు, లక్షకు వెయ్చి చొప్పున తీసుకుని ఇస్తున్నారంటే దాంతోనూ నల్లడబ్బు పుడుతున్నట్టే.
ఎన్నికల ప్రచారంలో మోడీయే 90 శాతం అక్రమ ధనం విదేశాల్లో ఉందని చెప్పారు. రెండున్నరేళ్లలో దాన్ని అంటుకోనైనా లేదు. వాటికి సంబంధించి 600 పేర్లు బయిటకు వస్తే ప్రజల ముందుంచలేదు. బ్యాంకులకు టోపీ పెట్టిన వారిని తన మంత్రివర్గంలోనే చేర్చుకున్నారు. ఇలాటి ప్రధాని హఠాత్తుగా ప్రజల నోట్లు రద్దు చేయడం ఆరునెలల సాము చేసి అవ్వను కొట్టిన చందంగా ఉంది. ఈ ప్రక్రియలో అసలైన ఆసాములు ఎలాగూ సురక్షితమే. బ్యాంకుల్లోని భారీ ఖాతాలకు వారే కొత్త నోట్లు ఇస్తారు. ఇదేగాక రకరకాల పద్ధతుల్లో తమ అక్రమ ధనాన్ని వీలైన మేరకు మార్చుకుంటారు. అందుకు ప్రభుత్వ వ్యవస్థలనూ వాడుకుంటారు. పెద్ద చేపలను పట్టుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమైతే అప్పుడు కనీస పరిమితికి దిగువన ఉన్నవారికి వెసులు బాటు కల్పించవలసింది. లేదా ఆ పరిమితిపైన వారికి కఠిన నిబంధనలు పెట్టవలసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా అందరినీ కలిపి బాదడం వల్ల చితికిపోయింది చిన్నవారైతే తట్టుకోగలిగేది మహా సంపన్నులే. వారి బ్యాంకు నిల్వలు ఇప్పుడు 2,000 నోట్లలో సురక్షితంగా ఉండిపోతాయి. మామూలు వాళ్లకు పెద్దనోటు అక్కరకు రాదు. మార్చుకోవడానికి చిల్లర దొరకదు. ఇది రెండు విధాలా వారికి శిక్షే. ప్రస్తుతం సుప్రీం కోర్టు వాదనల్లో వచ్చినట్టు సెక్షన్‌ 26(3) ఒక సీరిస్‌ నోట్ల రద్దుకు అవకాశమిస్తుందే గాని మొత్తం ఒక సంఖ్యగల వాటన్నింటిని మొత్తంగా ఎత్తివేసే వీల్లేదు. రెండవది బ్యాంకులు అడిగనప్పుడు తిరిగిస్తామనే వాగ్దానంతోనే డిపాజిట్లు సేకరిస్తాయి. కాబట్టి ఇప్పుడు మదుపరులు ఇంతే తీసుకోవాలని నిర్దేశించడం కూడా చెల్లదు. వీటిపై సుప్రీం కోర్టు ఏం చెబుతుందో చూడాలి.
నల్లధనం నిరోధానికి ఇది మార్గమే కాదని ప్రభాత్‌ పట్నాయక్‌, రఘురాం రాజన్‌, పి.చిదంబరం వంటివారంతా ప్రకటించారు. బిజెపి ఆరెస్సెస్‌ పరివార్‌లోనే గుజరాత్‌ ఎంపి వినరు సహస్రాబ్ది, సుబ్రహ్మణ్యస్వామి, అరుణ్‌శౌరి వంటివారు అభ్యంతరాలు తెలిపారు, వెంకయ్య నాయుడు మాత్రం షరామామూలుగా ఈ నిర్ణయంతో మోడీ ప్రపంచ(లోక) నాయకుడై పోయారని పొగిడి పరవశిస్తున్నారు. కేరళ ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు కూడా తీవ్రంగానే స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఘనంగా స్వాగతించగా, తెలంగాణ ముఖ్యమంత్రి పరోక్షంగా స్పందన వెల్లడించి ప్రత్యక్షంగా సామరస్యం పాటిస్తున్నారు. కెసిఆర్‌ను ప్రధాని చర్చలకు పిలవడంతో చంద్రబాబు కూడా అదే రోజున ఒక లేఖ రాశారు. రాష్ట్రాల ఆదాయం తగ్గడం అటుంచి వాటి అధీనంలోని సహకార బ్యాంకులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. పినరాయి విజయన్‌ వంటివారు ఆ అంశంనొక్కి చెబుతుంటే ఎపి, తెలంగాణ అధినేతలు సన్నాయి నొక్కులతో సరిపెడుతున్నారు. రాష్ట్రాల హక్కుల కోసం పోరాడిన వారసత్వం నీరుగార్చి వేస్తున్నారు. అసలు ఇంత కీలక నిర్ణయం తీసుకునే ముందు కేంద్రం ఆఖరి క్షణంలోనైనా ముఖ్యమంత్రులను విశ్వాసంలోకి తీసుకోకుండా నాటకీయ ప్రచారానికే పాకులాడింది. 
మీ భార్యను కొట్టడం మానేశారా అన్న కుటిల ప్రశ్నలాగే ఈ విషయంలో ఎలాంటి విమర్శలు చేసినా నల్లడబ్బును సాగనివ్వాలా అని తప్పుగా చిత్రించే కుట్ర జరుగుతున్నది. అసలైన చర్యలు మానేసి అనవసరంగా అమాయకులను బాధపెట్టి, ఆర్థికంగా అనర్థం తెచ్చిపెడుతున్నారనేది ఇక్కడ కీలకాంశం. ఈ హడావుడిలో అశాస్త్రీయత, అవకాశవాదం, ఆర్భాటం అలా ఉంచి అమలు జరిపిన తీరు అసమర్థతకు నిదర్శనం. పెద్ద నోట్లు రద్దు చేయాలనే ఆలోచన ఉంటే చిన్న నోట్లను ముందే ఎక్కువ నిష్పత్తిలో ముద్రించి మామూలు పద్ధతిలోనే పంపించవలసింది. అలా ఎందుకు చేయలేదని సుప్రీం కోర్టు అడిగింది. దొంగనోట్ల చలామణి 0.028 శాతానికి లోపుగా ఉంటే 89 శాతం నోట్లను రద్దుచేయడం దానికి పరిష్కారమెలా అవుతుంది? పైగా కొత్త 2,000 నోటు విడుదల కాకముందే బయటకు వచ్చేసిందంటే ఇంకేం గోప్యత? అందుకే ఇది ఆలోచనా రహితమైన, బాధ్యతా రహితమైన, ప్రణాళికా రహితమైన ఏకపక్ష ఏకవ్యక్తి చర్య. సీతారాం ఏచూరి రాజ్యసభలో అన్నట్టు, తలుచుకుంటే మీ జీవితాలే తలకిందులు చేయగలనని చెప్పాలనుకున్న ఒక ప్రధాని చేసిన అధికార ప్రదర్శన. ఈ ప్రచారం రేపు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల్లో లాభమని బిజెపి ఆశ. యుపి గ్రామసీమల్లో ఏదో దీనికి అనుకూలత ఉందని మీడియాలో కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. ఇంకోవైపున ఈ నిర్ణయం ఎన్నడూ లేనంత వ్యతిరేకత పెంచిందని మరికొన్ని పరిశీలనలు చెబుతున్నాయి. ఏమైనా ఈ ఎన్నికలతో పాటు రెండేళ్ల తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రజల తీర్పుపై ప్రభావం చూపిస్తుంది.
నేటి ధరలు ద్రవ్యోల్బణంలో 500 పెద్ద నోటు కానేకాదు. అవి మూడో నాలుగో మార్చుకునేవారి దగ్గర నల్లధనం ఉండదు. వాస్తవంగా జనాభాలో 1 శాతం మంది దగ్గర యాభై శాతం సంపద ఉంది. అలాంటి ఘరానాబాబులంతా పాలక పార్టీల ఖుద్దునే ఉంటారు. వారికి ఈ సమాచారం ఎలాగూ చేరిపోయింది గనకే బిజెపి తరఫున ఒక్క కోల్‌కతాలోనే మూడు కోట్లు ముందురోజే జమ చేయగలిగారు. మహారాష్ట్ర మంత్రివర్యులే దాదాపు కోటి రూపాయాల పాత నోట్ల అక్రమ రవాణాలో దొరికిపోయారు. అంబానీ, అదానీ వంటి వారికి ఈ విషయం ముందే తెలుసని మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ ఎంఎల్‌ఎ బాహాటంగా వ్యాఖ్యానించారు. మోడీ సర్కారు మేడిపండు రూపం తెలిసిపోయింది. ఈ స్థితిలో ఎన్నికలు, రాజకీయాలు అలావుంచి తక్షణ ఉపశమనం కోసం పేదలను దృష్టిలో పెట్టుకుని కింది స్థాయిలో మరికొంత కాలం పాత నోట్లను అనుమతించడం అవసరం. తెలుగు ముఖ్యమంత్రులు కూడా బిజెపితో సఖ్యత కన్నా ప్రజల బాధల పరిష్కారం కోసం ఆలోచించడం ప్రధానం. లేకపోతే సుప్రీం కోర్టు చెప్పినట్టు నిరసనలు ప్రజ్వరిల్లడం అనివార్యం. ఇప్పటికే కొన్నిచోట్ల బ్యాంకులపై దాడులు జరగడం అందుకు తొలి హెచ్చరిక. - తెలకపల్లి రవి

No comments:

Post a Comment